[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]
వచ్చింది కదా అవకాశం
~
చిత్రం : బ్రహ్మోత్సవం
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: మిక్కీ జె. మేయర్
గానం : అభయ్ జోద్పూర్కర్
~
పాట సాహిత్యం
పల్లవి:
వచ్చింది కదా అవకాశం ఓమంచి మాట అనుకుందాం ఎందుకు ఆలస్యం అందర్నీ రమ్మందాం
సంగీతంలో స ప స రాకపోతే ఏం లోటా
సంతోషంలో హైలెస్సా అంటే ఏదో పొరపాటా Attention everybody సరదాగా సై అనండి
ABCD చాలండి Anybody can dance అండి
॥ సంగీతంలో స ప స ॥
చరణం:
ఏ ఆనందమంటే పైనేదో లేదే మనలోనే దాగుంది చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది ఆట పాట hello అంటే ఆలోచిస్తూ ఎటో చూడకు సరేలే సరదా సాకులెందుకు
ఏ పూటంటే ఆ పూటే ఏ చోటంటే ఆ చోటే
Happyగా ఉండాలంటే ఉండాలనుకోవాలంతే
చరణం:
భూగోళమంతా మోసే పనేదో మన మీదనే ఉందా లోకాన ఉండే చికాకు మొత్తం మన కొరకే పుట్టిందా ఎవరికి వారే ఏదో మూల ఏకాంతంగా ఉంటారేంటలా పలుకే కరువై మూగ నోములా
అనుకుందేదో కాదంటే ఇంకేదో అవుతూ ఉంటే
కానీలే అన్నామంటే కష్టం ఇంకేం చేస్తుందే
Attention everybody సరదాగా సై అనండి
ABCD చాలండి Anybody can dance అండి
♠
ఆనందానికి మూలం, అంగీకారం. ‘Accept the things as they are’, is the first principle of Happy Living. మన స్వరూప స్వభావాలను, స్థితిగతులను, స్థాయిని, ఎదుటివారిని, సమాజాన్ని, పరిస్థితులను – ఉన్నది ఉన్నట్టు అంగీకరించగలిగితే, దానికి అనుగుణంగా మసలగలిగితే, జీవితం ఆనందమయంగా సాగుతుంది. అలా కాకుండా సత్యదూరంగా, సహజ స్వభావానికి భిన్నంగా జీవించాలని ప్రయత్నించినప్పుడే, మనిషి ఒత్తిడికి లోనవుతాడు. తనకంటూ తను ఒక పరిధి నిర్ణయించుకొని, ఆ పరిధిలోని గానుగెద్దులాగా తిరుగుతూ, తన సమస్యలు సంతోషాలు తనవే అనుకుంటూ.. గడిపితే, అలాంటి జీవితం నిస్సారంగా అనిపిస్తుంది. అందుకే ఎవరినైనా టెన్షన్ లేదా స్ట్రెస్‌లో చూసినప్పుడు, లైట్ తీసుకో, చిల్ బ్రో, కూల్.. కూల్.., pep up, cheer up.. అంటూ, అందరూ సలహా ఇచ్చేస్తుంటారు. అంటే జీవితాన్ని easy గా తీసుకోమని, ప్రశాంతంగా గడపమని, ఆ సూచన. Easement is an act or means of easing or relieving (as from discomfort) అని నిర్వచిస్తుంది ఆంగ్ల నిఘంటువు.
కాబట్టి జీవితాన్ని అలా సంతోషమయం చేసుకోవాలంటే, ఏం చేయాలో వందలాది పాటల ద్వారా, మనో వికాస గీతాల్లా పలికించారు సిరివెన్నెల. ‘మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా’, అనే పాటలో.. కస్సుమని కలహిస్తామా, ఉస్సురని విలపిస్తామా, రోజులతో రాజీ పడమా సర్లెమ్మని, సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం..’, అని బోధిస్తూ, నలుగురితో కలిసి సర్దుకుపోతూ, నలుగురితో కలిసి నడుస్తూ, ముందుకు సాగమంటారాయన.
జీవితాన్ని సానుకూల దృక్పథంతో నడిపించే, ఉల్లాసాన్ని, ప్రేరణనిచ్చే, మోటివేషనల్ సాంగ్స్ సిరివెన్నెల కలం నుండి లెక్కకు మిక్కిలిగా జాలువారాయి. అలాంటి పాటల్లో బ్రహ్మోత్సవం చిత్రంలోని ‘వచ్చింది కదా అవకాశం’.. అనే పాట కూడా ఒకటి. సంబంధం బాంధవ్యాలు, కుటుంబ విలువల కాన్సెప్ట్ మీద తీసిన ఈ చిత్రంలో, ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం నేపథ్యంగా చిత్రీకరించిన పాట ఇది. జీవితాన్ని ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందభరితంగా గడపాలనే.. సందేశంతో సాగుతుంది ఈ పాట.
వచ్చింది కదా అవకాశం ఓమంచి మాట అనుకుందాం ఎందుకు ఆలస్యం అందర్నీ రమ్మందాం
సంగీతంలో స ప స రాకపోతే ఏం లోటా
సంతోషంలో హైలెస్సా అంటే ఏదో పొరపాటా Attention everybody సరదాగా సై అనండి
ABCD చాలండి Anybody can dance అండి
॥ సంగీతంలో స ప స ॥
ఎవరి జీవితంలోనైనా కొత్త ఉల్లాసాన్ని నింపుకోవాలంటే, ఒక recreation, ఒక relaxation కావాలి. నలుగురితో కలిసి సరదాగా ఆడి పాడేస్తే, మనలోని స్ట్రెస్, లేదా monotony చాలా దూరంగా పారిపోతాయి. అందుకనే, దొరికిన అవకాశాన్ని అంది పుచ్చుకొని, సరదాగా ఒక మంచి మాటను అనేసుకుందాం, అనే ఎత్తుగడతో ఈ పాటను ప్రారంభించారు. శాస్త్రీయంగా స.. ప.. స.. లతో మొదలెడితే మాత్రమే సంగీతం అవ్వదు. ఎవరికి తోచింది వాళ్ళు పాడితే కూడా సంగీతమే. ఎవరికి చేతనైనట్టు వాళ్ళు ఆడితే కూడా, నృత్యమే. నలుగురితో కలిసి వేసే చిందు, మనలో చెప్పలేనంత ఆనందాన్ని నింపుతుంది. దీనికి ఏ కొలమానాలు అక్కర్లేదు, ఏ వయసైనా ఫర్వాలేదు.. కేవలం, మనం కూడా పాల్గొని ఎంజాయ్ చేద్దాం, అనే ఒక్క ఆలోచన ఉంటే చాలు, అన్నది పల్లవిలోని సందేశం.
Paul Hayward అన్నట్లు, మనం ముడుచుకొని ఉంటే ఏదీ మన దగ్గరికి రాదు. ఆనందానికి ద్వారాలు మనమే తెరిచి, దాన్ని మనసారా స్వాగతించాలి.
Open your heart to happiness.
Let every pore absorb light.
Swim in the joy of the here and now,
And cast off the darkness of night..
ఏ ఆనందమంటే పైనేదో లేదే మనలోనే దాగుంది చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది ఆట పాట hello అంటే ఆలోచిస్తూ ఎటో చూడకు సరేలే సరదా సాకులెందుకు
ఏ పూటంటే ఆ పూటే ఏ చోటంటే ఆ చోటే
Happyగా ఉండాలంటే ఉండాలనుకోవాలంతే..
చరణంలో మరింత లోతుగా, ఆనందాన్ని నిర్వచిస్తున్నారు సిరివెన్నెల. దిగులు, చింత, దుఃఖం, విచారం వంటివి మనసుకు చీకటి కోణాలైతే, ఆనందం, సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం, మనసుకు వెలుగునిచ్చే కిరణాలు. ఆనందం బయట ఎక్కడో దొరుకుతుందని, రకరకాలుగా మానవులు ప్రయత్నిస్తూ అలసిపోతూ ఉంటారు. ఎందుకంటే, ఆనందం బయట ఎక్కడ లేదు కాబట్టి! అదే విషయాన్ని సిరివెన్నెల ఒక చిన్న మొట్టికాయ వేసి మరీ చెప్తున్నారు. ఆనందం నీలోనే దాగుంది అని తెలియాలంటే, ముందుగా ఒక చిన్న దీపాన్ని పెదవుల మీద వెలిగించి చూడు! అంటారాయన. అందరితో ఆడి పాడి ఆనందించే అవకాశం వచ్చినప్పుడు, ఆ అవకాశం నిన్ను తట్టి పలకరించినప్పుడు, బేషజాలకు పోకుండా, తిరస్కరించకుండా, సాకులు చెప్పకుండా, సరదాగా గడిపేయమంటారు. ఎప్పుడు దొరికితే అప్పుడు, ఎక్కడ దొరికితే అక్కడ, ఆనందాన్ని అందిపుచ్చుకోవాలట.
ఎంతో క్లిష్టమైన సమస్యకు, ఒక అనుభవశాలి అయిన మానసిక శాస్త్రవేత్తలా అత్యంత సులభమైన చిట్కాని అందిస్తున్నారు సిరివెన్నెల తరువాతి వాక్యాల్లో. ఎవరైనా జీవితంలో హ్యాపీగా ఉండాలనుకుంటే, ‘అలా ఉండాలి’, అని ముందుగా నిర్ణయించుకోవాలట!’ అదే ఆనందానికి మూల సూత్రం, అంటున్నారు.
What is Life అనే poem లో John Clare, ఇలా అంటారు.
And what is Life?
An hour-glass on the run,
A mist retreating from the morning sun,
A busy, bustling, still-repeated dream.
Its length?
A minute’s pause, a moment’s thought..
భూగోళమంతా మోసే పనేదో మన మీదనే ఉందా లోకాన ఉండే చికాకు మొత్తం మన కొరకే పుట్టిందా ఎవరికి వారే ఏదో మూల ఏకాంతంగా ఉంటారేంటలా పలుకే కరువై మూగ నోములా
అనుకుందేదో కాదంటే ఇంకేదో అవుతూ ఉంటే
కానీలే అన్నామంటే కష్టం ఇంకేం చేస్తుందే..
Attention everybody సరదాగా సై అనండి
ABCD చాలండి Anybody can dance అండి
ఆధునిక జీవనశైలి వల్ల అందరూ పడుతున్న ఒక బాధ, (ప్రశాంత జీవితాన్ని గడిపే అతి కొద్ది మందిని మినహాయించి), అందరి నోటా వినిపిస్తున్న ఒకే మాట నా life అంతా tensions అండీ, manage చేయలేక సతమతమైపోతున్నాననుకోండి! అసలు నాకు నన్ని సమస్యలు ఎవరికైనా ఉన్నాయా? నేను పడినంత టెన్షన్ ఇంకెవరైనా పడగలరా? అంటూ ఉంటారు. విద్యార్థులను అడిగినా, ఉద్యోగస్థులను అడిగినా, వ్యాపారస్థులను అడిగినా, గృహిణులను అడిగినా.. ఇదే మాట.. ఇదే పాట.
సిరివెన్నెల గారు అన్నట్టు, ఎవరికి వాళ్లు ఈ భూగోళం అంతా మోసేస్తున్నట్టు, అంత పెద్ద బాధ్యత తమకు మాత్రమే ఉన్నట్టు feel అయిపోతూ, టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక్క నిమిషం నేను లేకపోతే.. ఒక్క అరగంట రెస్ట్ తీసుకుందామంటే! అమ్మో ఇంకేమన్నా ఉందా? అని వాపోతుంటారు. ప్రపంచంలో చిరాకు అంత మనకోసమే పుట్టిన భావనకు లోనవుతూ ఉంటారు.
సర్ శ్రీ అనే ఆధ్యాత్మిక గురువు (తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్ అనే ఆధ్యాత్మిక సంస్థ స్థాపకులు) శారీరక బరువు తగ్గించుకోవడానికి అందరూ నిరంతరంగా ప్రయత్నిస్తూ ఉన్నారు కదా? మరి మనసు మీద పెరిగిపోయిన, పేరుకుపోయిన బరువును ఎలా తగ్గించుకోవాలో ఎప్పుడైనా ఆలోచించారా? అని ప్రశ్నిస్తారు. Stress, tensions నుండి విముక్తి పొందాలంటే, మానసిక బరువును కూడా ఎలా తగ్గించుకోవాలో తగిన సూచనలు చేస్తారు. శారీరక బరువు మోయడం కంటే మానసిక బరువు మోయడం చాలా కష్టం కదా! ఈ ఆధునిక యుగంలో దానికోసమే మార్గాలు అన్వేషించాలి. అదే మార్గంలో మన ఆధ్యాత్మిక కవి సిరివెన్నెల కూడా మనకు టెన్షన్ రిలీఫ్ మార్గాలను సూచిస్తున్నారు.
ఎవరికి వారే ఒక పరిధిలో ఇరుక్కుని, మూగనోము పట్టిన వారిలా ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోకండి, అని బలమైన సందేశం ఇస్తారు సిరివెన్నెల. ‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని, అనుకోవడమే మనిషి పని..’ అని ఆచార్య ఆత్రేయ అన్నట్టు, సిరివెన్నెల కూడా ఒకటి మనం ఒక పని అనుకుంటే మరొకటి జరిగిందని కుమిలిపోవద్దు, జీవితాన్ని అక్కడే ఆపేయవద్దు! అని సూచిస్తున్నారు.
కష్టాన్ని కష్టంలా చూడకూడదు, అన్నది మనకు విజ్ఞులందరూ ఇచ్చే ఒక అద్భుతమైన సలహా. చూసే దృష్టి కోణం మారితేనే, పరిస్థితి మనకు భిన్నంగా కనిపిస్తుంది. సమస్యలా అనుకుంటేనే, అది సమస్య అవుతుంది. ‘చేసేయగలను’ అని నిర్ధారించుకుంటే, ఆ సమస్యను అధిగమించడం, ఒక విషయమే కాదు. అంతా మన భావనలోనే ఉంది. మనసును ఏ పరిమితులు విధించకుండా నిర్మలంగా పసిపిల్లల్లాగా, ఉంచుకుంటే, ఏ అంశాన్నైనా మనం విభిన్న కోణాల్లో చూడగలం. ఎవరన్నా పిల్లలని, ఏనుగుని ఫ్రిడ్జ్‌లో ఎలా పెడతావని అడిగితే, “డోర్ తీసి”.. అని సులభంగా సమాధానం చెప్పేస్తారు. మరి ఒంటెను ఫ్రిజ్లో ఎలా పెడతావు అని అడిగితే, “ఏనుగును బయటకు తీసి”, అంటారు. మనసును అంత ప్రశాంతంగా ఉంచుకోగలిగితే, మనం వర్తమానంలో జీవించగలిగితే, ఏ సమస్య అయినా.. మనకు ఇంతే సులభంగా దర్శనమిస్తుంది.
అందుకే సిరివెన్నెల అంటున్నారు, కానీలే అంటే కష్టం ఏం చేస్తుంది అని! కష్టానికి భయపడితేగా అది మనల్ని భయపెడుతుంది. అందుకే, మన పరిస్థితి మారాలంటే, కేవలం మన దృష్టి కోణం మారాలంతే. ఈ పాట ద్వారా ఇంత ఉత్తేజపూరితమైన సందేశాన్ని అందించిన సిరివెన్నెలగారికి మనమంతా ఎంతో రుణపడి ఉన్నాం. “నేను మూడు వేల పాటలు ఎక్కడ వ్రాశాను, ఒకే పాటను 3000 సార్లు వ్రాశాను”, అని తనే చెప్పుకున్నట్టు, అన్ని పాటల సారాంశం మానవ జీవితాన్ని ఆనందంగా ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ ఎలా గడపాలి అన్నదే. పాటల ద్వారా ఆయన సందేశం నిరంతరంగా మనకు అందుతూనే ఉంది. అటువంటి విజ్ఞుల, అనుభవజ్ఞుల, జ్ఞాన సారాన్ని ఆకళింపు చేసుకొని, ఆచరణలో పెట్టి, జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది!
Images Source: Internet