Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 59 – కావ్యగీతం లాంటి పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

దివిదారివిడి – ఇల జారిపడి

~

చిత్రం: చాలా బాగుంది

సంగీతం : కోటి

సాహిత్యం : సిరివెన్నెల

గానం : బాలు, సంగీత, బృందం

~

పాట సాహిత్యం

పల్లవి:
అతడు: దివిదారి విడి ఇల జారిపడి సురగంగకు అందిన వరము ఇది
శివుడే పతిగా జత చేరుకొని కరుణించిన చల్లని తరుణమిది
కలుషాల తడి నిను తాకదని కలువమ్మను కోవెల పిలిచినది
మనసున్న ఉలి శిలచాటు చెలి మనువాడిన సుముహూర్తమ్ము ఇది
కల్యాణి రాగాలు వినమన్నది ॥ దివిదారి విడి ॥

చరణం:
అతడు: ఇది మంచిపని దీవించమని పదిమందిని పిలిచిన సందడిది
కథకాదు అని ప్రజలందరికి అనిపించిన పచ్చని సత్యమిది
ఆమె: కళకళలాడే కాంతుల ఏరై పొంగిన పందిరిది వెన్నెల సంద్రమిది
అతడు: గుండెలలో గుడిగంటలుగా వినిపించిన నవ్వుల మంత్రమిది
కనివిని ఎరుగని పరిణయమిదియని చాటించు సన్నాయి సంబరమిది ॥ దివిదారి విడి ॥

చరణం:
ఆమె: తలదించుకుని నిదురించకని ఎదకట్టిన పుస్తెల నేస్తమిది
అతడు: తడబాటుపడే పసి అడుగులకి నడకలు నేర్పినదీ సప్తపది
అలజడి చేసే అల్లరి గాలి మురళిని చేరినది- మృదువుగా పాడినది
ఆమె: కల్లలయే కలలన్నిటిని కను ముంగిటకట్టిన కొంగుముడి
అతడు: మమతల కొలువుగ నిలిచిన మనిషికి దేవతలే తలవొంచు సమయం ఇది ॥ దివిదారి విడి ॥

Adelana Victor 4h తన In your waters అనే కవితలో ..నీ కృపా జలధిలో ఓలలాడి, నా బాహ్య శరీరాన్ని కాకుండా, నా అంతరంగాన్ని శుద్ధి చేసుకుని, పవిత్రమై, పునర్జీవితమవ్వాలని, భగవంతునికి విన్నవించుకోవడం జరుగుతుంది.

Let me wash myself in the current of your gentle waters,

Where the caress of your waves cleanses not just my skin,

But the very essence of who I am, leaving me reborn.

……………

పవిత్రమైన వస్తువులన్నీ ఆరాధనీయాలే! భగవత్ నిలయాలే! పవిత్రమైన మనసే భగవంతుని ఆలయం. అందుకే కల్మషం ఎరుగని పసిపిల్లలలో, మనసుకు ఏ కలుషితాలు అంటించుకోని వారిలో, మనకు స్వచ్ఛత, సంతోషం, సృష్టి సౌందర్యం, భగవత్ కృప కనిపిస్తాయి. హిందూ ధర్మం పాటించే వారికైతే గంగా జలం, తులసీ దళం అత్యంత పవిత్రమైనవి.‌ విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన తులసి లేదా బృంద, మహాలక్ష్మి స్వరూపంగా కొలవబడుతుంది. తులసి తీర్థం, గంగా స్నానం, గంగా జల పానం విలువ వర్ణింపలేనిది. మనల్ని కరుణించడానికి దివిగంగ భువికి చేరింది. సురఝరియైన గంగ దివి చేరిన వైనాన్ని ఏనుగు లక్ష్మణ కవి, తన భర్తృహరి సుభాషితాలలో ఇలా వర్ణిస్తారు.

“ఆకాశంబుననుండి శంభుని శిరం బందుండిశీతాద్రి సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి భూలోకంబునందుండి య
స్తోకాంభోధి, బయోధినుండి పవనాంధోలోకముం జేరె గం
గాకూలంకష పెక్కుభంగులు వివేకభ్రష్టసంపాతముల్.”

..హిందూపురాణాలప్రకారము కపిలమహర్షి కోపానికి బూడిదయిన తన పూర్వీకులకు స్వర్గలోక ప్రాప్తి కొరకు పవిత్రగంగను తెచ్చి బూడిదమీద ప్రవహింపజేయుటకు భగీరథుడు గంగను ప్రార్థించి ఆమెను భూమికి తీసుకువచ్చి తన పూర్వీకులకు స్వర్గలోక ప్రాప్తి కలిగిస్తాడు. భగీరథుని కోరిక తీర్చబోయి గంగ పడిన ఇక్కట్లు ఈ పద్యములో ప్రస్తావించాడు.

గంగ ఒకేసారి దూకితే ఆ ధాటికి భూమి తట్టుకోలేదని చెబితే భగీరథుని తపస్సుకి మెచ్చిన శివుడు గంగను తన తల మీదకు దూకమని, తన జటాజూటములో బంధించి, ఆమె వేగాన్ని అదుపు చేస్తాడు. అక్కడ నుండి గంగ హిమాలయము మీదికి వురికి, హిమాలయముల నుండి భూమి మీదకు వచ్చి భగీరథుని కోరిక నెరవేర్చి, ప్రవహిస్తూ వెళ్ళి, సముద్రములో కలిసింది. అక్కడనుండి చివరకు నాగుల లోకమయిన పాతాళలోకము చేరింది.

సిరివెన్నెలగారి గంగావతరణం:

నాకలోకమది నీ పుట్టిన ఇల్లు నాగభూషణుడు చేపట్టినవాడు. లోకపావనీ, మందాకినీ, రసవాహినీ, స్వాగతం! జీవ రసధునీ స్వాగతం! సరసహృదయ సంభావిత కవితా కుసుమాంజలిదే ॥రస॥

అఘమీ భువి నిదాఘమై అర్కద్యుతి అమోఘమై సకల జగతి దాహతప్త సంక్షోభితమైననాడు దివివారిని భువిసీమకు తరలించగ దలచినట్టి భగీరథుని నిరీక్షణకు దీర్ఘతపస్సమీక్షణకు విరూపాక్ష కరుణాసంప్రోక్షణమీ రసవాహిని॥జీవరసధుని॥

నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా యుగయుగాల నిరీక్షణే నివాళి కాగా ప్రాంజలి ఘటియించి తనదు ప్రాంగణమున నిలిచినట్టి పిపాసార్త జగతి కొరకు నిటాలాక్షు జటాజూటి వియద్వాటి వేచెనదే! ॥2॥

గంగాకాన్నియ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగమోదమది నింగిని తాకగ పొంగులువారిన వినూత్న వినోద విలాసలాస్యము ప్రళయాభీల తరంగితలీల భయంకరహేల శివంకరు మ్రోల లయించగా, చేరగ అలలై, కలలై, వడిగా, జడిగా పిడుగుల అడుగుల తడబడు నడకల ఝళంఝళిత పదనూపూరఘోషల కలిత నాట్యఘటిత చకచ్చకిత తటిల్లతా తనూలతికద్యుతి సురఝరి జర్ఘరీనాద సందోహిత

దివివధూటి వచ్చెనదే నిటాలాక్షు జటాజూటి వియద్వాటి.. వేచెనదే!

పినాకపాణీ వేణీభరమే కరమై గ్రహించే సురగంగను తన నాయికగా ఉరుకుల పరుగుల ఉరుముతు వచ్చిన కన్నియ ఒదిగెను తలలో నాలుకగా ఆ సురగంగా ప్రళయహేల అది విషకంధరునకు ప్రణయలీలగా వియమ్మును తన విలాసమ్ముగా ఔదలదాల్చెను శంకరుడాభరణముగా ॥2॥

మందస్మిత సుందర వదనారవింద మందాకిని అలవోకగా నెలవంక మీదుగా చిరునవ్వుల కిరణమ్ముల జీవజ్యోత్స్న వర్షించెను, రసవాహిని ప్రభవించెను

శివగంగా కళ్యాణం అది దివి భువి సంధానం పిపాసులకు రసదానం ఈ స్వాగత గానం పిపాసులకు రసదానం ఇది స్వాగత గానం సరసహృదయ సంభావిత కవితా కుసుమాంజలిదే!

రసవాహినీ, స్వాగతం! జీవరసధునీ, స్వాగతం! జీవరసధునీ.. నీకు స్వాగతం.

ఈ గంగావతరణం కవితకు, కళాతపస్వి విశ్వనాథ్ గారి ద్వారా సీతారామశాస్త్రి గారి సినీ రంగ ప్రవేశానికి ఓ అత్యంత ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. తను వ్రాసిన ఖండకావ్యం లాంటి ఆ గేయాన్ని విశ్వనాథ్ గారి సభలో ఆలపించడానికి సిద్ధమై, తన సహజమైన బిడియంతో పాడకుండానే వెనుదిరిగారు. అయినా, సంకల్పబలం చేర్చవలసిన గమ్యాన్ని చేర్చనే చేర్చింది. ఈ గంగావతరణం పాటను ఒక స్నేహితుడి టేప్ రికార్డర్‌లో విన్న విశ్వనాథ్ గారు, దాదాపు పూర్తయిపోయిన బాలకృష్ణ సినిమాలో, క్లైమాక్స్ సన్నివేశంలో చిన్నపిల్లల చేత ఈ పాట పాడించారు. టైటిల్స్‌లో రచయిత పేరు చెంబోలు సీతారామశాస్త్రిగా వచ్చింది. ఇది 1984 లోని సంఘటన.‌ అంటే, సినీ వినీల వేదికపై సీతారామశాస్త్రి గారి అరంగేట్రం అప్పుడే జరిగిపోయింది.

ఆనాడు జరిగిన ఆ మేటి కలయిక, ఉధృత గంగలా ఉప్పొంగి, పరవళ్ళు తొక్కి, రసవాహినిగా సిరివెన్నెల కలం నుండి ప్రవహించింది. రసాస్వాదన కోసం, విలువలు ఉన్న సాహిత్యం కోసం, దాహార్తితో అలమటిస్తున్న ఎన్నో హృదయాలను తన ఉత్తుంగ సాహిత్య తరంగాలతో ముంచివేసింది.

ఈనాడు మనం చర్చించబోతున్న ‘చాలా బాగుంది’ చిత్రంలోని ‘దివిదారి విడి ఇల జారిపడి’.. అన్న పాట, సిరివెన్నెలగారి గంగావతరణంతో ఎంతో సారుప్యత కలిగివుంది. ఇది చిత్ర ఇతివృత్తానికి, ఆ కథాంశానికి పూర్తిగా నిర్దేశించిన పాట. ఈ చిత్రంలో ఇద్దరు నాయకులు, ఇద్దరు నాయికలు ఉంటారు. ఒక ఆగంతకుడి దారుణానికి బలై, శీలాన్ని పోగొట్టుకొని, మతిస్థిమితం తప్పిన గంగ అనే నాయికను(Flora Saini), హీరో వడ్డే నవీన్ మనస్ఫూర్తిగా స్వీకరించి, వివాహం చేసుకునే ఘట్టంలోనిది ఈ పాట. తాగిన మైకంలో (మాళవిక) సీత అనే మరొక హీరోయిన్‌పై, మానభంగానికి పాల్పడతాడు నవీన్. తను చేసిన తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా, పశ్చాత్తాపంతో, గంగను వివాహం చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంటాడు హీరో. తనకు జరిగిన అన్యాయంలో తన ప్రమేయం లేని గంగ, కలుషాలు అంటని గంగానది వంటిదన్న భావన ఈ పాటలో బలంగా వ్యక్తీకరించడం జరిగింది.

పల్లవి:
అతడు: దివిదారి విడి ఇల జారిపడి సురగంగకు అందిన వరము ఇది
శివుడే పతిగా జత చేరుకొని కరుణించిన చల్లని తరుణమిది
కలుషాల తడి నిను తాకదని కలువమ్మను కోవెల పిలిచినది
మనసున్న ఉలి శిలచాటు చెలి మనువాడిన సుముహూర్తమ్ము ఇది
కల్యాణి రాగాలు వినమన్నది ॥దివిదారి విడి॥

వారిద్దరి కళ్యాణ సుముహూర్తాన్ని- ‘ఇది’, అన్న సర్వనామంతో వర్ణిస్తూ, ప్రతి వాక్యం చివరలో దాన్ని పునరుక్తం చేస్తూ, వృత్త్యానుప్రాసాలంకారాన్ని ఉపయోగిస్తూ, మలచిన పాట ఇది. దివి నుండి భువికి జారిపడిన సురగంగకు ఒక వరంలా, శివుడే పతిగా లభించిన శుభ తరుణమిది అని వర్ణిస్తారు సిరివెన్నెల. శరీరానికి అంటిన మలినం అంతరాత్మకు అంటదని చెబుతూ, ఒక మనోహరమైన ఉపమానాన్ని ఉపయోగిస్తారాయన. బురదలో విరిసిన కలువను, ‘నీకు ఏ కలుషాలు అంటవు’ అని కోవెల ఆహ్వానం పలికినట్టుగా ఉందట, ఆ హీరో ఆమెని చేపట్టడం. శిలలాగా కరుడు గట్టిపోయిన గంగ హృదయంలోని చెలిని, చెలిమిని గుర్తించిందట నాయకుడైన ‘మనసున్న ఉలి’. ఆ మనసున్న ఉలికి,శిల చాటు చెలికి మనవు జరుగుతున్న శుభ తరుణమట అది.

ఆ సుముహూర్త సమయాన వారిద్దరి మధ్య వినిపిస్తున్న కళ్యాణి/కళ్యాణ రాగాలు వినమంటూ కవి మనందరికీ ఆహ్వానం అందిస్తున్నారు.

Purity గురించిన అందమైన నిర్వచనాన్ని అందిస్తున్నారు Esther Pang Hui Min. సిరివెన్నెల గారి భావానికి ఎంతో దగ్గరగా అనిపించిన, ఈ సాహిత్యాన్ని కూడా ఒకసారి చదవండి.

Purity is not just about virginity, It’s also about dignity,
Purity is not restricted to femininity, but requires the protection of chivalry, and regard for responsibility.
Purity is not innocence out of ignorance, It’s making a choice that’s different. Even when facing a challenge..
…………
even if it can be tough.
Purity is not just a state of being, It’s a state of knowing, valuing and protecting..

చరణం:
అతడు: ఇది మంచిపని దీవించమని పదిమందిని పిలిచిన సందడిది
కథకాదు అని ప్రజలందరికి అనిపించిన పచ్చని సత్యమిది
ఆమె: కళకళలాడే కాంతుల ఏరై పొంగిన పందిరిది వెన్నెల సంద్రమిది
అతడు: గుండెలలో గుడిగంటలుగా వినిపించిన నవ్వుల మంత్రమిది
కనివిని ఎరుగని పరిణయమిదియని చాటించు సన్నాయి సంబరమిది ॥దివిదారి విడి॥

అలా దగాపడ్డ ఒక అమ్మాయికి, మతిస్థిమితం తప్పిన అమాయకురాలికి, వివాహం జరుగుతోంది కాబట్టి, ఆ మంచి పనిని చూసి దీవించమని పదిమందికి ఆహ్వానం పలికే సందర్భం అది. ఇలాంటి విషయాలు కథల్లోనే కాదు, నిజ జీవితాల్లో కూడా జరుగుతాయని అందరికీ తెలియజేసిన సత్యం అది. కళకళలాడుతూ, నవ్వుల వెలుగుల్ని చిమ్ముతున్న, ఆనందం నిండిన అందరి హృదయాలనుండి ఏరులై పొంగిన, వెన్నెల వెల్లువట ఆ పందిరి.‌ వారి నవ్వులే మంత్రాలయ్యాయట! గుండెల్లో గుడి గంటలు మోగాయట! అంటే, దేవతల ఆశీస్సులు వారికి లభించాయట. కనీ విని ఎరుగని అలాంటి పెళ్లి గురించి నలుగురికి తెలిసేలాగా, సన్నాయి కూడా సంబరాలు చేస్తూ పాడుతోందట!

చరణం:
ఆమె: తలదించుకుని నిదురించకని ఎదకట్టిన పుస్తెల నేస్తమిది
అతడు: తడబాటుపడే పసి అడుగులకి నడకలు నేర్పినదీ సప్తపది
అలజడి చేసే అల్లరి గాలి మురళిని చేరినది- మృదువుగా పాడినది
ఆమె: కల్లలయే కలలన్నిటిని కను ముంగిటకట్టిన కొంగుముడి
అతడు: మమతల కొలువుగ నిలిచిన మనిషికి దేవతలే తలవొంచు సమయం ఇది ॥ దివిదారి విడి ॥

వారి వివాహ ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు జరిగే తంతును, దాని అంతరార్థాన్ని రెండవ చరణంలో వివరిస్తున్నారు సిరివెన్నెల. ఇంతకాలం ఆమెలో నిద్రాణమైన స్త్రీత్వాన్ని, తల ఎత్తి జీవించమని ఆశీర్వదిస్తూ, ఎదపై ‘పుస్తెలు’ అనే నేస్తాలు, ధైర్యం ఇస్తున్నాయట. సప్తపది జరుగుతున్నప్పుడు పసిపిల్లలా తప్పటడుగులు వేస్తూ నడుస్తుంటుంది గంగ. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని, ఇక జీవితంలో ఆ ఒడిదడుగులన్నిటినీ అధిగమించవచ్చుననీ, చేయూతనిచ్చి అడుగులు నేర్పుతున్నదట సప్తపది! చిన్నపిల్లల్లాగా అల్లరి చేస్తూ తిరిగిన గంగ, ‘వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి..’ అన్నట్టు, భర్త మనసు అనే మురళిలోకి నెమ్మదిగా ఒదిగిపోవాలని, మమేకమై పోయి, మధురమైన రాగాలు ఆలపించాలని symbolic గా తన భావాన్ని వ్యక్తీకరిస్తున్నారు సిరివెన్నెల.

షాక్‌కి గురైన గంగ అందర్నీ ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అమాయకంగా అడుగుతూ ఉంటుంది. ఆమె కలలు కల్లలుగానే మిగిలిపోతాయని, తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. అటువంటి తరుణంలో, కలలు తీర్చే కాలాన్ని కనుల ముందటికే తీసుకొచ్చిందట కొంగుముడి. ఆ జంటకు వేసిన కొంగుముడిలో వారి బంగారు భవిష్యత్తు కలలు ముడిపడి ఉన్నాయని అర్థం. నిజంగానే ఏ కన్నెపిల్ల అయినా, కోటి కలల కొంగుముడితోనే అత్తింట అడుగుపెడుతుంది! గొప్ప మనసుతో ఆ అమ్మాయికి పునర్జన్మను ప్రసాదించి మమతల కొలువుగా నిలిచిన, ఆ ‘మనిషికి’, ‘దేవతలే’ తలవంచే సమయం అట అది.

మనిషి దేవుడు ఎప్పుడు అవుతాడు? ఎలా అవుతాడు? అన్న గొప్ప సత్యాన్ని అలవోకగా అందరికీ తెలియ చెప్పారు సిరివెన్నెల. దేవతల ముందు అందరూ శిరస్సు వంచుతారు. కానీ, దైవ గుణాలు పెంపొందించుకున్న మనిషి ముందు దేవతలు కూడా తలవంచుతారన్న బలమైన సత్యాన్ని, ఈ పాట ద్వారా మనకు అందించారు సిరివెన్నెల. దైవ గుణాలతో పుట్టిన మనిషి, తనలోని దైవాన్ని, దైవత్వాన్ని వెలికి తీసే దారి ఏంటో, ఈ పాట ద్వారా మనకు ఆయన తెలియజేశారు. మన సహజమైన దైవీ ప్రకృతిలోకి

మనం మేలుకోవడమే! ఆ విషయాన్ని మనం మర్చిపోతే, బయటికి ఎగిరి పడడానికి రాక్షసుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు, తన అసుర గుణాలతో.

ఎంతో హృద్యమైన భావాలను కొత్త కోణంలో, ‘కలువమ్మను కోవెల పిలవడం, మనసున్న ఉలి, శిల చాటు చెలి, పచ్చని సత్యం, నవ్వుల మంత్రం, పుస్తెల నేస్తం, కొంగుముడిలో కట్టిన కలలు, దేవతలే తలవంచు సమయం..’ వంటి పద సమూహాలతో, వ్యక్తీకరణలతో ఒక కావ్యగీతంలా మలచారు సిరివెన్నెల ఈ పాటను.‌ ఆ మహా భావుక చక్రవర్తికి ఇదే నా అక్షరాంజలి.

Images Source: Internet

Exit mobile version