Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 60 – జీవిత సారాన్ని రంగరించిన పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

నిన్నయినా నేడైనా..

~

చిత్రం: మొదటి సినిమా

సంగీతం : స్వరాజ్

సాహిత్యం: సిరివెన్నెల

గానం: శంకర్ మహదేవన్

~

పాట సాహిత్యం

పల్లవి:
నిన్నయినా నేడైనా రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా
ఏ పూటకి ఆ పూటే బ్రతుకంతా సరికొత్తే
ఆ వింతను గమనించే వీలున్నది కాబట్టే
మన సొంతం కాదా ఈ క్షణమైనా॥ నిన్నయినా నేడైనా ॥

చరణం :
ఎటు నీ పయనమంటే నిలిచేదెక్కడంటే
మనలా బదులు పలికే శక్తి ఇంకే జీవికీ లేదే
ఎదలో ఆశ వెంటే ఎగసే వేగముంటే సమయం వెనుకబడదా ఊహ తనకన్నా ముందుంటే
మన చేతుల్లో ఏముంది అనే నిజం నిజమేనా
మనకే ఎందుకు పుట్టింది లేని పోని ఈ ప్రశ్న మనసుకున్న విలువ మరిచిపోతే శాపం కాదా వరమైనా ॥ నిన్న నేడైనా ॥

చరణం:
కసిరే వేసవైనా ముసిరే వర్షమైనా గొడుగే వేసుకుంటే వద్దని అడ్డం పడుతుందా
మసకే కమ్ముకున్నా ముసుగే కప్పుకున్నా కనులే కలలు కంటే నిద్దరేం కాదని అంటుందా
నిట్టూర్పు తరిమేస్తుంటే పారిపోదా సంతోషం
ఆయువు ఇంకా మిగిలుంటే మానిపోదా ప్రతి గాయం
నమ్మకాన్ని వదులుకున్న మనిషికి విషమవదా అమృతమైనా ॥ నిన్న నేడైనా ॥

Time is an infinite stream of possibilities.
Time is the school, in which we learn,
Time is the fire in which we burn..

కాలం ఒక ప్రవాహం. అది నిత్యం పరిగెడుతుంది.

మనకు ఎన్నో విలువైనవి బహుమతిగా అందించి తీయని గుర్తులను మిగులుస్తుంది. తనకు నచ్చినప్పుడు మనకు నచ్చిన వాటిని వెనక్కి లాక్కుని చేదు జ్ఞాపకాలను రగిలిస్తుంది. ఆ కాలమే నెమ్మదిగా ఆ గాయాలను మాన్పుతుంది. ఇది కాలం చేసే మాయాజాలం.

‘కాలాన్ని’, వస్తువుగా తీసుకొని, ఎందరో సినీ గేయ రచయితలు ఎన్నో స్ఫూర్తిదాయకమైన, పాటలు వ్రాశారు. సిరివెన్నెల గారే వీటి మీద ఎన్నో పాటలు వ్రాశారు. మచ్చుకు కొన్ని పాటలు ఇక్కడ ప్రస్తావించాను.

ఓ కాలమా.. ఇది నీ జాలమా.. అన్న పాటలో కాలానికి సంబంధించిన ఫిలాసఫీని పలికించారు.
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా.. అనే పాటలో కాల తత్వాన్ని ఆవిష్కరించారు.
…….
బతుకంటే బడి చదువా? అనుకుంటే అతిసులువా? పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా..
మట్టి లోకి తన చిట్టేలతో నిను తొక్కేయాలని తరుముకు వచ్చే… కాలాశ్వం పై స్వారి చెయ్..
-పరుగులు తీయ్.. (మర్యాద రామన్న)
…….
మధురానుభవమా ప్రేమ
మతి లేని తనమా ప్రేమ
బదులీయ గలవా కాలమా
బతికించు చలువ ప్రేమ
చితి పేర్చు శిలువ ప్రేమ
నువు తేల్చగలవా దైవమా
-(హ్యాపీ హ్యాపీగా)
…….
ఏ రోజైతే చూశానో నిన్ను ఆ రోజే నువ్వైపొయా నేను
కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినై నే జీవిస్తున్నాను (గులాబి)
…….
చెలియా చెలియా – వేరు చేసే “కాలమా” చేరువైతే నేరమా (మన్మధుడు )
…….
కాలన్నె కట్టి కూర్చో పెట్టా గుమ్మం ముందు-
అటెన్షన్ ఎవ్రి బడి (కూలి నెం.1)
…….
సమయం పై చిర కాలం చెరగని సంతకాన్ని పెట్టు…పద పద (వేదం)
…….
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా…కాలం ఇపుడే నను కనగా…
– Life of ram ..(జాను)
…….
కలసిరాని కాలమెంత కాటేస్తున్నా
చలి చిదిమేస్తున్నా
కూలిపోదు వేరుఉన్న తరువేదైనా
తనువే మోడైనా
…………
మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని
మరణాన్ని అడగకు (శ్రీకారం)
…….
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం.. (గాయం)

~

కాలం అనే సబ్జెక్ట్ పైన వచ్చిన ప్రైవేట్ సాంగ్స్ కూడా ఎంతో పాపులర్ అయ్యాయి. ఉదాహరణకు:

1.రెహమాన్ ఆల్బమ్ లోని ఒక పాట…’కాలం నా ప్రేయసిలే కలిసొచ్చే ఊర్వశిలే..’

2.‘కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు’.. ఈ పాటని 2.6 కోట్ల మంది.. view చేశారు.

ఇవన్నీ చూస్తే అందరూ ఈ సబ్జెక్టుకి ఎంతగా influence అవుతున్నారో అర్థమవుతుంది. మనం ఈరోజు చర్చించబోతున్న అంశం కూడా ఈ సబ్జెక్ట్‌కి సంబంధించినదే. ‘మొదటి సినిమా’ చిత్రం నుండి సిరివెన్నెల వ్రాసిన ఒక మంచి motivational song ఈరోజు విశ్లేషించుకుందాం.

పల్లవి:
నిన్నయినా నేడైనా రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా
ఏ పూటకి ఆ పూటే బ్రతుకంతా సరికొత్తే
ఆ వింతను గమనించే వీలున్నది కాబట్టే
మన సొంతం కాదా ఈ క్షణమైనా ॥ నిన్నయినా నేడైనా॥

ప్రతిరోజు సూర్యోదయంతోనే ప్రారంభమవుతుంది. సూర్యోదయం అందంగానే ఉంటుంది. కానీ, నిన్న ఎలా గడిచిందో ఈరోజు అలాగే గడుస్తుందన్న నమ్మకం ఉందా?

ఒక్కొక్క రోజు ఒక్కొక్క మనిషికి, ఒక్కో రకమైన అనుభవాన్ని ఇస్తుంది. ఒకే మనిషికి కూడా, ఒక రోజు ఉన్న అనుభవం ఇంకో రోజు రాదు. ఆనందంగా ఉన్నప్పుడు గంటలు నిమిషాల్లా దొర్లిపోతాయి. టెన్షన్‌లో కానీ బాధలో కానీ ఉన్నప్పుడు నిమిషాలే గంటల్లా, యుగాల్లా, భారంగా, నెమ్మదిగా నడిచినట్టు అనిపిస్తుంది.

‘నిన్నయినా నేడైనా రోజన్నది ఎపుడైనా, ఒకలాగే మొదలైనా ఒకలాగే పూర్తయ్యేనా?’ ఈ ప్రశ్నల్లో ఎంతో లోతైన పరిశీలన ఉంది. సంతోషంగా మొదలైన రోజు, సంతోషంతోనే అంతమవుతుందన్న గ్యారెంటీ లేదు. అలాగని ఏదో బాధతో ఆవేదనతో మొదలైన రోజు, సంతోషంతో కూడా అంతమవ్వవచ్చు. కాబట్టి, ఎలా మొదలై ఎలా పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. మనం రుచి చూడని అపురూప వరాలు, వింతలు ఏమి జరుగుతాయో? అని మన బ్రతుకు పుస్తకంలోని ప్రతి పుటలో ఏం దాగుందో చదవడానికి మనం ఎదురు చూడాల్సిందే!

ధోని సినిమాలోని ‘గాయం తగిలి ఆరాటంతో తిరిగే మదికి’.. పాటలో కూడా ఇదే భావాన్ని మనసుకు హత్తుకునేలా పలికించారు సిరివెన్నెల.

‘ఏ పూటకి ఆ పూట తెరిపించే కొత్త పుట
అనుకున్నది తప్పందా వేరే మలుపును తిప్పిందా
చూడని సంగతులెన్నో కలవందా
కమ్ముకు వచ్చిన చీకటికే అవి తెలుసంట
కలలన్నీ తుంచిందా మెలుకువ రప్పించిందా
నడి రాతిరి లోనే ఎదురయ్యే ఈ ఉదయం?..’

జీవితంలో ప్రతిక్షణం ఏదో ఒక కొత్తదనం కనిపిస్తుంది, ఎన్నో వింతలు సృష్టిస్తుంది, ఆశ్చర్యాలలో ముంచెత్తుతుంది. అయితే ఆ వింతను గమనించడానికి మనం సంసిద్ధమైతే, ఆ క్షణాన్ని మనం అనుభవించి సొంతం చేసుకోవచ్చు, అనే అద్భుతమైన వికాస సూత్రాన్ని, జీవితంలో రసానందాన్ని పొంది మార్గాన్ని మనకు అందిస్తున్నారు సిరివెన్నెల. ఏ పూటకి ఆ పూటే బ్రతుకంతా సరికొత్తే, ఆ వింతను గమనించే వీలున్నది కాబట్టే, మన సొంతం కాదా ఈ క్షణమైనా.. అంటూ.. మనకు స్ఫూర్తినిస్తున్నారు.

అందుకే జీవితంలో జరిగే ప్రతి సంఘటనను, జాగ్రత్తగా గమనిస్తూ, సరైన విధంగా స్పందిస్తూ,  జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవాలి.

Alfred Lord Tennyson తన ప్రఖ్యాతి చెందిన ‘Ulysses’ verse లో ఆ Ulysses స్వగతంలో ఇలా పలికిస్తారు. వృద్ధాప్యం మీద పడినా, జీవిత అనుభవాలను రుచి చూడడంలో తాను ఎక్కడా ఆగిపోనని, అతడు అంటూ.. I will drink life to the lees.. I can’t rest from travel అంటాడు. అతడు కాలాన్ని నిర్వచిస్తూ, నేను జీవితాన్ని చివరి చుక్క వరకు ఆస్వాదిస్తాను. కేవలం ఊపిరి తీసుకోవడం కోసం బ్రతకడం వృథా కదా? నా జీవితంలో సమయం నాకు కాస్తే మిగిలి ఉంది. అయినా తుది శ్వాస విడిచేలోగా ప్రతి గంటను నేను చాలా అపురూపంగా భావిస్తాను. కాలం ఎల్లప్పుడూ ‘a bringer of new things’ అని నిర్వచిస్తాడు. సిరివెన్నెల గారు అందించిన అదే అపూర్వమైన భావన, Tennyson సాహిత్యంలో కూడా మనకు కనిపిస్తూ మనల్ని అబ్బురపరుస్తుంది.

As though to breathe were life.
Life piled on life Were all too little,
and of one to me
Little remains; ‘but every hour is saved
From that eternal silence, something more,
A bringer of new things; ..’

చరణం:
ఎటు నీ పయనమంటే నిలిచేదెక్కడంటే
మనలా బదులు పలికే శక్తి ఇంకే జీవికీ లేదే
ఎదలో ఆశ వెంటే ఎగసే వేగముంటే సమయం వెనుకబడదా ఊహ తనకన్నా ముందుంటే
మన చేతుల్లో ఏముంది అనే నిజం నిజమేనా
మనకే ఎందుకు పుట్టింది లేని పోని ఈ ప్రశ్న మనసుకున్న విలువ మరిచిపోతే శాపం కాదా వరమైనా ॥ నిన్న నేడైనా॥

ఈ విశ్వంలో గమ్యం ఎరుగని పయనాలు లేనే లేవు. మొత్తం విశ్వమే ఒక నిర్ణీత గమ్యం వైపు సాగుతూ ఉంటుంది. మన గమనం ఏంటో, మన గమ్యం ఏంటో తెలుసుకొని మసలే జీవులు మానవులు మాత్రమే. నువ్వు ఏ గమ్యస్థానాన్ని చేరుకోవాలనుకుంటున్నావు? అని ఎవరైనా ప్రశ్నిస్తే, సమాధానం చెప్పగల శక్తి మానవులకు మాత్రమే ఉంది. ఏదో సాధించాలన్న తపన, ఆశలో ఉన్న వేగం మనసుకు కూడా ఉంటే, కాలం కన్నా ముందుగా ఊహ పరిగెడుతుంటే, కాలం వెనుకబడి పోదా? అంటున్నారు సిరివెన్నెల. మన చేతుల్లో ఏముంది అన్న కర్మ సిద్ధాంతం ఎంతవరకు నిజం? అని మనల్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారాయన. మనకే ఇలాంటి ప్రశ్న ఎందుకు పుడుతుంది? అని ప్రశ్నిస్తూ, మన చేతుల్లోనే అంతా ఉంది, అన్న సత్యాన్ని, బలంగా మన మనసులో నాటుతున్నారు! సంకల్ప బలానికి, మనోబలానికి ఉన్న ఆ విలువను మరిచిపోతే, మన వరమే మనకు శాపంగా మారుతుంది, జాగ్రత్త అని గట్టిగా హెచ్చరిస్తున్నారు, సిరివెన్నెల.

John Keats, తన ‘To Hope’‌ అనే famous piece of poetry లో ఇలాంటి perception మనకు ఇస్తున్నారు.

When by my solitary hearth I sit,
When no fair dreams before my ‘mind’s eye’ flit,
And the bare heath of life presents no bloom;
Sweet Hope, ethereal balm upon me shed,
And wave thy silver pinions o’er my head..

నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు, నా మనోఫలకంలో ఎటువంటి గొప్ప ఆశలు కనిపించినప్పుడు, sweet hope నాకు భగవంతుడిచ్చే ఓదార్పు లేపనం లాగా పనిచేస్తుంది.. అని, మనోశక్తికున్న బలాన్ని తెలియజేస్తున్నారు, కీట్స్.

చరణం:
కసిరే వేసవైనా ముసిరే వర్షమైనా గొడుగే వేసుకుంటే వద్దని అడ్డం పడుతుందా
మసకే కమ్ముకున్నా ముసుగే కప్పుకున్నా కనులే కలలు కంటే నిద్దరేం కాదని అంటుందా
నిట్టూర్పు తరిమేస్తుంటే పారిపోదా సంతోషం
ఆయువు ఇంకా మిగిలుంటే మానిపోదా ప్రతి గాయం
నమ్మకాన్ని వదులుకున్న మనిషికి విషమవదా అమృతమైనా ॥ నిన్నయినా నేడైనా॥

దృష్టిని పట్టే సృష్టి ఉంటుందన్నట్టు, మన జీవితం, మన perception, లేదా మన దృక్కోణం పై ఆధారపడి ఉంటుందని, రెండవ చరణంలో చాలా బలంగా సంకేతమిస్తున్నారు, మన motivation master. వర్షాన్ని, ఎండని గొడుగు సహాయంతో ఎలా భరించగలమో, కష్టాల్ని, ఇబ్బందుల్ని కూడా తగిన supports తో నేర్పుగా ఎదుర్కోవచ్చు కదా? కష్టాల్ని భరించే తీరాలని ఎక్కడా చట్టం లేదు కదా, అని మనల్ని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.

మనం ఎంత నెగటివ్ కండిషన్స్‌లో ఉన్నా, ఎలాంటి కష్టాలు ఊబిలో చిక్కుకొని ఉన్నా, భవిష్యత్తు గురించి మంచి ఊహలు తెచ్చుకోవడానికి, కలలు కనడానికి ఎవరైనా అడ్డుపడతారా? కష్టాల్లో ఉన్నప్పుడు మంచి కలలు కనకూడదు అని నిద్ర ఏమన్నా మనకు rules పెడుతుందా? అని, ఒక మాస్టారుల దండిస్తున్నారు.

మన జీవితంలోకి ప్రవేశించాలని అనుక్షణం ఎదురుచూసే సంతోషం, నిరాశ, నిస్పృహలలో నుంచి వచ్చే నిట్టూర్పులతో పారిపోతుంది,‌ కాబట్టి నమ్మకాన్ని కోల్పోయి అమృతాన్ని విషయంగా మార్చుకోకండి! తస్మాత్ జాగ్రత్త! అంటున్నారు, సిరివెన్నెల. మనకు భూమి మీద ఇంకా ఆయువు రాసిపెట్టి ఉంటే, ఆ కాలమే ఆ చేదు జ్ఞాపకాల గాయాలను తప్పక మాన్పుతుంది. కాబట్టి, మన జీవితాన్ని సరైన కోణంలో చూస్తూ, మనకు అందించబడిన వరాలను గుర్తించడం నేర్చుకోవాలి. చేతుల్లో అమృతాన్ని పట్టుకొని, అది విషమేమో అనుకుంటూ, నిరాశతో జీవితం గడిపితే అది ఎవరి తప్పు?

చివరగా,Wise Makafui Afun గారి I’m Blessed అనే poem ద్వారా మానవులకు అందించబడిన వరాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

Warmed up by the sun
Cooled down by the rain
Illuminated by the moon
Serenaded by the birds
Comforted by the breeze
Fed by the plants
Accompanied by the living
And reminded by the dead
…..
Even if nothing else works
Looking at all these things
I know I’m so blessed..

కాబట్టి ఈ అనంత విశ్వంలో మానవులుగా పుట్టడమన్న అతి గొప్ప వరాన్ని సొంతం చేసుకున్న మనం, ప్రకృతి చేత ప్రత్యేకంగా ఎంపిక కాబడిన ధన్య జీవులం. వరంగా అందిన జీవితాన్ని శాపంగా మార్చుకోవడం ఎంత తప్పో ఒక్కసారి ఆలోచించండి! అని, జీవిత సారాన్ని రంగరించి, తన కలంలో నింపి, ఆలోచనామృతాన్ని పాటల్లోకి ఒంపి, అడుగడుగునా మనకు పాఠాలు నేర్పుతున్నారు సిరివెన్నెల. మానవుల ఆలోచన విధానం మీద బలమైన సానుకూల ముద్రను వేసి, ఎలా ఆలోచించాలో నేర్పుతూ, వారి జీవితాలలో పరివర్తన తీసుకురావడానికి అనుక్షణం ఆరాటపడిన అపురూప కవి సిరివెన్నెల.

Images Source: Internet

Exit mobile version