సిరివెన్నెల పాట – నా మాట – 62 – జీవిత కథను చెప్పే పాట

1
2

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

చివరకు మిగిలేది

~

చిత్రం: మహానటి

సంగీతం: మిక్కీ జె. మేయర్

సాహిత్యం : సిరివెన్నెల

గానం : సునీత & కోరస్

~

పాట సాహిత్యం

పల్లవి:
అనగా అనగా మొదలై కథలు
అటుగా ఇటుగా నదులై కదులు
అపుడో ఇపుడో దరిజేరునుగా
కడలో ఎదురై కడదేరునుగా
గడిచే కాలాన గతమేదైనా
స్మృతి మాత్రమే కదా
కోరస్: చివరకు మిగిలేది చివరకు మిగిలేది ॥2॥

చరణం:
ఎవరు ఎవరు ఎవరు నువ్వంటే
నీవు ధరించిన పాత్రలు అంతే
నీదని పిలిచే బ్రతుకేదంటే
తెరపై కదిలే చిత్రమే అంతే
ఈ జగమంతా నీ నర్తనశాలై
చెబుతున్న నీ కథే చివరకు మిగిలేది
విన్నావా మహానటి చెరగని చేవ్రాలిది
నీదేనే మహానటి చివరకు మిగిలేది
విన్నావా మహానటి మా చెంపల మీదుగా ప్రవహించే మహానది
కోరస్: మహానటి మహానటి ॥ 3॥

ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి।
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా॥

పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉండి, భౌతిక శక్తిచే తయారు చేయబడిన శరీరమనే యంత్రాన్ని అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణముగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.

ఈ భగవద్గీత శ్లోకం, జగన్నాటక సూత్రధారి ప్రకారమే, ఈ జగత్తు, అందులోని ప్రాణులు నడుచుకుంటారని మనకు తెలియజేస్తుంది. మానవ జీవితం సంపూర్ణంగా ఆ అంతర్యామి ఇచ్ఛానుసారమే నడుస్తుందన్నది నిర్వివాదాంశం. కాబట్టి జీవితం ఒక నాటకమే!

అందుకే, “కనపడనీ చెయ్యెదో ఆడుతోంది నాటకం/ ఆ నాటకాన నువ్వు నేను తోలుబొమ్మలం” అంటారు ఆత్రేయ, – తహశీల్దారు గారి అమ్మాయి చిత్రంలోని ఒక పాటలో.

“All the world’s a stage,

And all the men and women merely players;

They have their exits and their entrances..” అనే వాక్యాలు, మనందరికీ బాగా పరిచయమున్న Shakespeare యొక్క well known నాటకాల్లో ఒకటైన As You Like It,  నుండి Jaques speech లో..

~

‘తూర్పు పడమర’ చిత్రంలో.. డాక్టర్ సినారే గారు, తూర్పు పడమర ఎదురెదురు అన్న పాట ద్వారా, ఇలాంటి సందేశాన్ని మనకు అందజేస్తారు.

………….

వేయని నాటకరంగంపైన
వ్రాయని నాటక మాడుతున్నాము
సూత్రధారికి పాత్రధారులకు
తేడా తెలియక తిరుగుతున్నాము
నాటకమే ఒక జీవితమా?
జీవితమే ఒక నాటకమా?
ఈ ప్రశ్నకు బదులేది?
ఈ సృష్టికి మొదలేది?

~

మిథునం చిత్రంలో, తనికెళ్ల భరణి గారు రచించిన ‘ఆట కదరా శివ!’ చరణంలో, జగత్తు అంతా, పరమాత్ముడు ఆడించే ఆట అని ఎంతో చక్కగా వర్ణించారు.

ఆటగద జననాలు, ఆటగద మరణాలు
మధ్యలో ప్రణయాలు ఆట నీకు..
ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు
ఆటగద సొంతాలు ఆటగద పంతాలు
ఆటగద అంతాలు ఆట నీకు..
ఆటగదరా శివా.. ఆటగద కేశవా..

~

పాట అనేది ఒకానొక సాహితీ ప్రక్రియ అనీ, ఆ పాట అనే సాధనం ద్వారా మనం ఆనందానుభూతుల్ని పొందుతామన్నదీ జగమెరిగిన సత్యం. అలాగే పాట ద్వారా సమాజానికి ఆరోగ్యకరమైన సందేశాన్ని అందిస్తూ సమస్యలనూ తీర్చుకోగలిగే విధంగా శిల్పంలా చెక్కటం కూడా సాధారణమే. అదే ఉపదేశం సినీ మాధ్యమం  ద్వారా అందించే నైపుణ్యం మన తెలుగు రచయితలకు వెన్నతో పెట్టిన విద్య.

‘అయ్యయో చేతిలో డబ్బులు పోయెనే’ వంటి హాస్యస్ఫోరకమైన పాటలనూ, ‘కృషి ఉంటే మనుషులు ఋషులౌతారూ’ వంటి మానసిక పరిణితి పెంచే పాఠాలనూ మనం సినీ సంగీత మాధ్యమం ద్వారా అందుకున్నాము.

ఆ రకంగా పాటను కేవలం ఆ సినిమా యొక్క కథ వరకే పరిమితం చేయకుండా, మన జీవితాన్ని, అందలి సారాన్నీ చాలా సులువుగా చెప్పేశారు, మన ‘సిరావెన్నెల’ గారు, ‘మహానటి’ చిత్రంలోని ‘చివరకు మిగెలేది’ పాటతో. అంటే పాటతో పాఠమే కాదు, పాటలో జీవితం సారమూ నింపవచ్చునని చాటి చెప్పారు.

మహానటి సావిత్రి గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఆమెను ‘నటనా కౌశలానికి ఒక  పాఠ్య గ్రంథమని, విజ్ఞాన సర్వస్వం’, వంటిదని వర్ణించవచ్చు. ఈ అభినయ సౌందర్యం గురించి ఎంత గొప్పగా వర్ణించినా తక్కువే అవుతుంది. ఆనాటి నుంచి నేటివరకు సగటు ప్రేక్షకుడి మదిలో ఒక అందాల, అపురూప అభినేత్రిగా నిలిచిపోయారు సావిత్రి. ఒక్కటేమిటి వెండితెరపై మహానటి అభినయం, ఆమె జ్ఞాపకాలన్నీ తీపి గురుతులే. తనకే సొంతం, తనకు మాత్రమే సాధ్యం అనే హావభావాలతో తెలుగు తెరపై ప్రకాశించి మన మధ్య లేకున్నా నేటికీ వెలుగులు జిమ్ముతోంది ఆ తెలుగు అందం. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకోవడంతో పాటు నేటి తారలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు సావిత్రి.

తన జీవితంలో ఎవరెస్టు ఎత్తులను.. పసిఫిక్ లోతులను.. రెండింటిని ఆమె చవి చూశారు. జీవితంలో అన్ని ఒడిదుడుకులను చూసిన సావిత్రి, చరమాంకంలో మానసిక బలహీనతలకు లోనయ్యారు. అయినా ఆమెలోని మానవత్వం, మంచితనం మసిబారలేదు. ఒక మహానటి.. అప్పట్లోనే లక్షలు చూసిన నటి.. హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న నటి, చైనా యుద్ధం అప్పుడు తన ఖరీదైన ఇంటిని అమ్మి ప్రధాని సహాయనిధికి ఇచ్చిన దేశభక్తురాలు, 1965లో ఢిల్లీలో తన ఒంటిపై ఉన్న అన్ని వారాల నగలను లాల్ బహదూర్ శాస్త్రి చేతిలో పెట్టిన తల్లి, తన ఇంటికి వచ్చినవారిని వట్టిచేతులతో పంపని దయాహృదయరాలు.. తన అనేవారు లేక, కరుణ చూపించేవారు లేక 1981 డిసెంబర్ 26న ఒక అనాథలా తనువు చాలించింది. ‘బ్రతుకు పూల బాటకాదు.. అది పరవశించి పాడుకునే పాట కాదు’ అనేది సావిత్రి జీవితంలో నిజమైంది.

అంతటి మహానటి జీవిత గాథను తనకెక్కించే సాహసం చేస్తూ, కీర్తి సురేష్ కథానాయికగా, మహానటి చలన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో అద్భుతమైన పాటలు ఉన్నాయి. అందులో దాదాపు మూడు పాటలను సిరివెన్నెల గారు వ్రాయడం జరిగింది. ఆ చిత్రంలోని ‘చివరకు మిగిలేది’, అన్న పాటను ఈ రోజు విశ్లేషించుకుందాం. ఒక పల్లవి ఒక చరణం మాత్రమే ఉన్న ఒక పాటలో ఎంత విషయాన్ని చెప్పవచ్చో ఈ పాటను చూసి ఈ తరం Lyricists అందరూ అర్థం చేసుకోవచ్చు.

పల్లవి:
అనగా అనగా మొదలై కథలు
అటుగా ఇటుగా నదులై కదులు
అపుడో ఇపుడో దరిజేరునుగా
కడలో ఎదురై కడదేరునుగా
గడిచే కాలాన గతమేదైనా
స్మృతి మాత్రమే కదా
కోరస్: చివరకు మిగిలేది చివరకు మిగిలేది ॥2॥

మనం కథలన్నీ  ‘అనగనగా’ అంటూనే మొదలవుతాయి. అంతే సహజమైన ధోరణిలో జీవిత కథను చెప్పే ఈ పాటలో ఆ వ్యక్తీకరణతోనే మొదలు పెట్టారు సిరివెన్నెల. అయితే ఆ మొదలైన జీవిత కథ నడకను కూడా కవితాత్మకంగానే కాదు, భావ స్పష్టతతో, ఓ జీవిత సత్యాన్ని తెలిపే విధంగా అల్లారు.

‘అటుగా ఇటుగా నదులై కదులు’ – అనే లోతైన భావంతో ఎంతో గంభీరమైన సత్యాన్ని పలికించారాయన. కాస్త అంతో ఎంతో తేడాతో, ప్రతి జీవితం ఒక నదిలా ముందుకు కదులుతుంది. కదిలిన తర్వాత?  కాస్త వెనకో ముందో, అటూ ఇటుగా – దాని గమ్యస్థానమైన సాగరాన్ని చేరాలి. అలా నది సాగిపోతూ ఉంటే, కడలో ఎదురై కడతేరునుగా.. అంటారు సిరివెన్నెల. ఇక్కడ కడ అనే పదం, చివరలో, అని ఒక అర్థం, (కడలి) సముద్రం అని మరో అర్థం. ఇలాంటి చక్కని శ్లేష ప్రయోగంతో, గంభీరమైన భావాన్ని ఆయన కూర్చారు. గమ్యం చేరలేము అని దిగులు ఎందుకు? ఏదో ఒక ఎండిన మోడయినా మనకు సహాయంగా వచ్చి దరిచేరుస్తుందిలే! అన్న ఓ భరోసా అందులో కనిపిస్తుంది.

‘గడిచే కాలానా గతమేదైనా స్మృతి మాత్రమే కదా చివరకు మిగిలేది’.. కాలం క్షణమైనా ఆగదు, తనను తానే చుట్టేసుకుంటూ, అభావంగా, తన విధానంగా ముందుకు బంతిలా దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ వెళ్ళి పోయిన క్షణాలలో మనం సాధించిన జయాపజయాలు కానీ, మనసుకు కలిగిన బాధైనా, ఆనందమైనా, ఆవేశమైనా, ఉద్వేగమైనా.. ఆశ్చర్యమైనా.. ఏమైనా కానీ.. అన్నీ ‘స్మృతులే’. అంటే చివరకు మిగిలేది స్మృతులే తప్పితే మరేమీ కావంటూ సున్నితంగా నిష్ఠుర సత్యాన్ని బోధించారు. ఎంత సాంద్రత కలిగిన పాఠం!

‘చివరకు మిగిలేది’, అన్న పదం వినగానే మనకు గుర్తొచ్చేది బుచ్చిబాబుగారి తాత్విక జిజ్ఞాస కలిగిన, ఒక మనో వైజ్ఞానిక నవల. జీవితానికి సంబంధించిన పలు మౌలికమైన ప్రశ్నలను రేకెత్తించే రచనగా పలువురు సాహిత్యవేత్తల ప్రశంసలు పొందిన ఈ నవల కూడా, ఇలాంటి జీవిత సారాన్ని మనకు అందిస్తుంది.

చరణం:
ఎవరు?ఎవరు?ఎవరు? నువ్వంటే
నీవు ధరించిన పాత్రలు అంతే!
నీదని పిలిచే బ్రతుకేదంటే?
తెరపై కదిలే చిత్రమే అంతే!
ఈ జగమంతా నీ నర్తనశాలై
చెబుతున్న నీ కథే చివరకు మిగిలేది!
విన్నావా మహానటి చెరగని చేవ్రాలిది!
నీదేనే మహానటి చివరకు మిగిలేది
విన్నావా మహానటి మా చెంపల మీదుగా ప్రవహించే మహానది
కోరస్: మహానటి మహానటి ॥ 3॥

చరణంలోకి వస్తే, పల్లవిలో లాగా ఒక అంశాన్ని ‘Generalized’ గా కాకుండా, ‘నువ్వు’ అంటూ Personalized గా వ్రాసినట్లు భావన కలుగుతుంది. కానీ, నిజానికి ఇక్కడ అందించిన భావం కూడా అందరికీ వర్తిస్తుంది. సిరివెన్నెల గారి జిమ్మిక్కే ఇది. ఒక భావం కథకు ఎంత రమ్యంగా ఒదిగిపోతుందో, అందరి జీవితాలకు అంతే సహజంగా అతికిపోతుంది. ఇటు చలన చిత్రానికి, అటు సామాన్య జీవన చిత్రానికి ఒకేసారి సందేశం ఇవ్వడం సిరివెన్నెల వంటి కవులకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. అదే సిరివెన్నెల మ్యాజిక్!

ఇక్కడ కాస్త సావిత్రిగారి జీవితంలో చోటు చేసుకున్న మలుపులను గురించి కాస్త మాట్లాడుకోవాలి. దేవదాసు, మాయాబజార్ వంటి తిరుగులేని చిత్రాలలో నటిస్తూ తన కెరియర్‌లో ఎంతో ఉన్నతంగా ముందుకు సాగుతున్న తరుణమది. అప్రతిహతంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఓ నిర్ణయం తన జీవిత గమనాన్నే మార్చివేసింది. తమిళ సినీపరిశ్రమలో అప్పటికే రెండు పెళ్ళిళ్ళు జరిగిన జెమినీ గణేషన్‌ను వివాహమాడింది. కొంతమంది వద్దని వారించినా వినలేదు. పెళ్లి తర్వాత సావిత్రి ఫైనాన్షియల్ విషయాలు జెమినీ చేతిలోకి వెళ్ళాయి. తెలుగులో అఖండవిజయం సాధించిన మూగమనసులు సినిమాను జెమినీ గణేషన్‌ను పెట్టి తమిళంలో పునర్నిర్మించగా అది ఆశించనంతంగా విజయవంతం కాలేదు. అంతే, ఉన్నపాటుగా ఆమె జీవితం అప్పుల ఊబిలో చిక్కుకుంది. జెమినీ గణేషన్, ఇద్దరు పిల్లలూ దూరమయ్యారు. అది తట్టుకోలేక మత్తుకి అలవాటుపడి, జీవితం ఛిన్నాభిన్నం కావడం మొదలైంది. ఆ నేపథ్యాన్ని చూపిస్తున్నప్పుడు, బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే పాట ఇది. ఆమె మనసుకు ఓదార్పుగా, సిరివెన్నెల గారు కూర్చిన కూర్పు ఇది.

తన ఉనికిగా దేన్ని పరిగణించాలని ఆలోచించకుండా.. ఎవరు నువంటే నీవు ధరించిన పాత్రలు అంతే! అని ఒక తీర్పు చేప్పారు మన సిరివెన్నెల – ప్రపంచం ఒక నాటక రంగం, మనమంతా అందులో పాత్రధారులం, అన్నారు కదా షేక్‌స్పియర్ గారు. ఈ పాదం చెప్పే సారం కూడా అదే. సహజంగా ఒక వ్యక్తిగా తన ఉనికిని కోల్పోయిన సావిత్రి నిజజీవితం కన్నా, తెరమీద జీవితమే తన ఉనికిగా పరిగణించాలని సిరివెన్నెల పలికిన హితోక్తిలాగా అనిపిస్తుంది నాకు ఆ వాక్యం. అందుకే దానికి కొనసాగింపుగా తరువాతి పాదంలో, ‘నీదని పిలిచే బ్రతుకేదంటే, తెరపై కదిలే చిత్రమే అంతే’ అంటారాయన. తెరపై వెలుగుతున్న జీవితమే నీదని భావించుకో! అన్న బుజ్జగింపు అది.

తన కోసం, కుటుంబం కోసం, పరుగులు పెట్టి పెట్టి అలసిపోయాక.. తీరిగ్గా మన జీవితాన్ని సింహావలోకనం (retrospect) చేసుకుంటే, మన ఉనికి మనకు కనిపించదు. మన ఆశలు, ఆశయాలు, విలువలు.. అన్నీ ఏదో ఒక అవసరం కోసం, ఏదో ఒక ఒత్తిడితో, పక్కకు నెట్టేసి ముందుకు వెళ్లి ఉంటాం. అలా సింహావలోకనం చేసినప్పుడు, మనకు identity crisis వస్తుంది.

నేనేంటి? అన్న ప్రశ్న మనల్ని ఎంతో వ్యథకు గురిచేస్తుంది. ఈ జీవిత పరుగులాటలో మనల్ని మనం కోల్పోయామని పూర్తిగా అర్థమవుతుంది.

అందుకే బంతి మన court లో ఉన్నప్పుడే, మనకు నచ్చినట్టుగా ఆడాలి.. అప్పుడే మనకు ఎలాంటి పశ్చాత్తాపమూ ఉండదు. ఇది నిజం జీవితంలో ప్రతి వారికి కావలసిన ఒక గొప్ప ఉపదేశం.

ఈ హితోక్తి, మీకు నాకు అందరికీ, అందేలా చేయడమే కదా సిరివెన్నెల ప్రతిభ! ఎవరైనా మనసుపెట్టి ఆలోచిస్తే, ‘నాది’ అని తెలిపే బ్రతుకు ఏమిటి?  మనం ఇక్కడ చేసిన కర్మలే కదా! బ్రతుకు అనే రంగస్థల తెరపై మనం కూడా కదలాడే చిత్రాలమే. ఇలా కథలోని పాత్రకూ నిజ జీవితానికీ అభేదంగా అన్వయిస్తూ, ఒకే ఒక్క ముక్కలో భావాన్ని చెప్పేయగల ఆ పటిమకు ఎన్ని జోహార్లు సరిపోతాయి!!??

పాత్రను (character) తన స్వంతం చేసేసుకుని, ఆ పాత్ర తప్ప, సావిత్రి మనకు మచ్చుకైనా కనపడని  నటనే ప్రతి చోటా ఆ మహానటిది. కనుక నర్తనశాల అన్నది ఆ ఒక్క చిత్రానికే పరిమితం చేయలేం. ‘ప్రపంచమే నీ నర్తనశాలై నీ కథలే చెప్పుకుంటున్నాయి’, అంటారు అందుకే. ఆవిడ హావభావ చాతుర్యాన్నీ, అంకితభావాన్నీ ఆవిడను కథలో ఇముడ్చుకున్న అన్ని చిత్రాలూ పొందాయి, అది నాయిక పాత్ర కాక పోయినా సరే. ఆ కథే కదా మిగిలేది చివరకు మరి! ఎందుకంటే, అదంతా ‘గతం’.. అంటే స్మృతి మాత్రమే.. అంటే నర్తనశాల చెబుతున్న గతించి పోయిన కథే చివరకు మిగిలేది. కన్నీరు తెప్పించే కఠినమైన వాస్తవం. ‘నీ కథ చరిత్రలాగా శాశ్వతంగా మిగిలిపోతుంది అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకో’, అంటారు సిరివెన్నెల.

నాటక రంగమే తన జీవితంగా మలుచుకున్న సావిత్రికి  బ్రతుకే  ఒక నర్తనశాల. అఖండమైన భారతీయ చిత్ర పరిశ్రమలో, మరి ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో తనదంటూ ఒక శాశ్వతముద్రను, అంటే తన చేవ్రాలును.. ఆమె స్మృతిగా మనకు అందించింది. ఇక్కడ సిరివెన్నెల గారు, ‘విన్నావా మహానటి చెరగని చేవ్రాలిది నీదేనే మహానటి’.. అంటారు.

పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండే చోటనో, బంధుగణం అంతా కలిసినప్పుడో.. పిల్లలందఱి లోకి మురిపెంగా చూసే ఆడపిల్లలను, ‘బంగారు తల్లీ’ అంటారు. ఈ సంపద అంతా ‘నీదేనే’, ఈ వెలుగంతా నీ వలననేగా అనే మాటలు పరిపాటి.

ఆ ‘నీదేనే’ అనే మాటలో.. లాలిత్యం, మమకారం, మాటలకందని మమత, అందఱి ఆప్యాయతా నీకు మాత్రమే స్వంతం.. అన్న ప్రశంస.. అన్నీ ఇమిడి ఉన్నాయి. దివికేగిన ఆ మహానటి చెరగని ఆనవాళ్ళు తరతరాలకు ఆమె కథను చెబుతూనే ఉంటాయి.

ఈ భావం స్ఫురణకు రాగానే ఆవిడ నటనను ఆస్వాదించే వారందఱికీ కంట నీరు ఆగదు.

ఆ భావానికి అక్షర రూపమే కదా, ‘మా చెంపల మీదుగా ప్రవహించే మహానది’.. అన్న హృద్యమైన వ్యక్తీకరణ! మహానటి జీవితం అనూహ్యమైన పతనానికి దారి తీసిన తీరు, పెట్టించే కన్నీరు కూడా, ఎడతెగని ‘మహా’ నదిలాగా సాగుతుందన్న సిరివెన్నెల ఉపమానం కూడా మహోపమానమే! ‘మహా’ అనే పదానికి మన భాషలో, సాహిత్యములో విశిష్టమైన గాంభీర్యం ఉంది. ఆవిడ‌ మన కంట నీరు తెప్పించి వెళ్ళి పోయినా, నిత్యం మన జ్ఞాపకాలలో  ప్రవహిస్తూ ఉండే మహానది ఆమె. A thing of beauty is a joy forever అని Keats అన్నట్లు, a thing of unparalleled talent is also a joy forever. మహానటి సావిత్రి అటువంటి మరపురాని ఒక కళాస్మృతి!

మానవుని జీవితం కూడా, గతమై, స్మృతియై, చరిత్ర పుటలలో నిలిచే నదీ ప్రవాహమై ఉంటుంది. ఎవరి జీవనం పయనమైనా, వర్తమానంలో నుండి గతానికి మారినప్పుడు ఒక స్మృతిగా, ఒక కథగా, మారుతుంది. ఆ కథలో అన్ని ఆవేశాలు, అనుభూతులు, మలుపులు, గెలుపులు, ఊహించని ఘటనలు; అన్నీ ఉంటాయి. అయితే ప్రతి కథలోనూ, వారి వారి చేవ్రాలు సుస్పష్టంగా కనిపిస్తుంది. ఎవరి కథలో వారే నాయకులు లేదా నాయికలు. మన కథని వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుంటే, చివరకు మిగిలేది వాటన్నిటి కలబోతల జ్ఞాపకాలే!

ఈ పాట భావం ప్రతివారికి వర్తిస్తుంది.  ప్రతీ పదంలోనూ అటు కథనూ, ఇటు సమాజాన్నీ అన్వయిస్తూ, మనకందించే సిరివెన్నెలగారికి హృదయపూర్వక నమస్సుమాంజలి. చివరగా సిరివెన్నెల గారి జీవితాన్ని, సాహిత్యాన్ని, భావితరాలకు అందించే అద్భుతమైన ‘నా ఉచ్ఛ్వాసం కవనం’, కార్యక్రమంలో  ఎంతో చక్కగా  సిరివెన్నెల సాహితీ గాంభీర్యతను అభివర్ణించిన దర్శకుడు క్రిష్ గారి మాటలతో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. “ఆయన ఒక సముద్రం, సముద్రం గురించి ఏమి చెప్పినా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.”

(ఈ వ్యాసంలోని పాట వ్యాఖ్యానంలో ప్రధాన భాగాన్ని నాకు అందించిన ఇరువింటి మాధురి దేవి (కలం పేరు నాగిని)కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పాట వ్యాఖ్యానాన్ని మాధురి దేవి నాతో పంచుకున్నప్పుడు, ఇంత చక్కటి సమీక్షను మీకు కూడా చేరవేయాలని అనిపించింది. అందుకే ఈ ప్రయోగం! నాగినికి పుట్టినరోజు శుభాకాంక్షలతో – శ్రీవాణి శర్మ.)

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here