సిరివెన్నెల పాట – నా మాట – 64 – నాయకుడి అంతర్మథనాన్ని సూచించే పాట

0
2

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

చెప్పాలని ఉంది మనసు విప్పాలని ఉంది

~

చిత్రం : రుద్రవీణ

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: సిరివెన్నెల

గానం: ఎస్పీ బాలసుబ్రమణ్యం

~

పాట సాహిత్యం

సాకీ:
ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే గద గుండెబలం తెలిసేది?
దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది? మంచైనా చెడ్డైనా పంచుకోను నే లేనా
ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా
ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని అంతటి ఏకాంతమైన చింతలేమిటండీ?

పల్లవి:
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ॥2॥
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ॥2॥
గుండెల్లో సుడి తిరిగే కలత కథలు చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ॥2॥

చరణం:
కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని అయినవాళ్ళు వెలివేస్తే అయినా నేనే కాకిని చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ॥2॥
పాతబాట మారాలని చెప్పడమే నా నేరం
గూడు విడిచి పొమ్మన్నది సన్ను కన్న మమకారం వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచెవన్నెల విరితోట
బతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట ॥2॥
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ॥2॥ ॥వసంతాలు॥

చరణం:
ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం
ఏదీ మరి మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు
కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
మంచు వంచనకు మోడై గోడు పెట్టువాడొకడు వీరి గొంతులోన కేక వెనుక ఉన్నదే రాగం? అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం?
అని అడిగిన నా ప్రశ్నకు అలిగే మత్తకోకిల
కళ్ళు ఉన్న కబోదిలా, చెవులు ఉన్న బధిరుడిలా నూతిలోన కప్పలా బ్రతకమన్న శాసనం!!
కాదన్నందకు అక్కడ కరువాయెను నా స్థానం చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ||2||

చరణం:
అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగ ధ్వానం
నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు
దిక్కు మొక్కూ తెలియని దీనుల వ్యధార్త జీవన స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి, ఈ అపశృతి సరిచెయ్యాలి
జనగీతిని వద్దనుకుంటూ నాకు నేనే పెద్దనుకుంటూ
కలలో జీవించను నేను కలవరింత కోరను నేను –

నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను
నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను ॥2॥
సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించు దాకా
ప్రతీ మనిషికి జీవనంలో నందనం వికసించు దాకా
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను ॥2॥
నేను సైతం నేను సైతం నేను సైతం ॥2॥

సప్తవర్ణాల సమ్మేళనం లేకుండా ఇంద్రధనస్సు లేదు.. ఆరు రుచుల మిశ్రమం లేకుండా ఉగాది పచ్చడి లేదు.. ఆరు ఋతువుల సంగమం లేకుండా సంవత్సరం లేదు.. ఆరు కాలాలు, ఏడు తాళాల సమన్వయం లేకుండా సంగీతం లేదు.. సుఖదుఖాల కలయిక లేకుండా జీవితం లేదు!! కానీ గాలివాటు ప్రకారం జీవితం ఎక్కడికి కొట్టుకుపోతే అక్కడికి వెళ్లడమా? లేక మనము(మనసు) కోరుకున్న తీరం చేరే లాగా.. జీవితాన్ని మనతో తీసుకెళ్లడమా? అన్న నిర్ణయం మీదనే మన జీవితపు విలువ ఆధారపడి ఉంటుంది. ఏటికి ఎదురీదినవారే, విజయాలను సాధించి చరిత్ర సృష్టించారు. So, life is all about ‘decision making.’

కానీ జీవితంలో కఠినమైన మలుపులలో, సరియైన నిర్ణయం తీసుకోవాలంటే అంతర్మథనం జరగాలి. మనసులో జరిగే ఈ సంఘర్షణ conflicting mind ను, దానిలో జరిగే భావోద్వేగాల ఘర్షణను సూచిస్తుంది. దాన్ని డిక్షనరీ ఇలా నిర్వచిస్తుంది.

Generally conflict delves into the raw emotions, complexities, and consequences of discord and confrontation. It explores the inherent tension and clash of opposing forces, whether on an individual, interpersonal, or societal level. It often conveys the turmoil, anger, and pain that arise from the mind.

మనసులో ఘర్షణ జరిగినప్పుడు, ఎలాంటి పరిస్థితి ఉంటుందో Wordforged Fool అనే కవి తన Conflicted అన్న కవితలో ఇలా నిర్వచిస్తాడు;

Conflicted, conflicted
My mind so encrypted
There is no escape, my memories inflicted Pouring through thoughts as my emotions drifted
Searching for absolution, through sands of sorrow I’ve sifted

Conflicted, conflicted
My spirit isn’t lifted
Entombed from mistakes wondering
what I did
Errors and consequences and a farewell I do bid

Conflicted, conflicted
Thoughts and emotions contradicted
Standing here hollowed, my heart
evicted
Still is the world, not much to be gifted

..

రుద్రవీణ చిత్రంలో నాయకుడి అంతర్మథనాన్ని సూచించే ఒక ప్రేరణాత్మక కవనాన్ని సిరివెన్నెల గారు ‘చెప్పాలని ఉంది’, అన్న పాట ద్వారా మనకు అందిస్తున్నారు. ఈ పాట సందర్భాన్ని అర్థం చేసుకుంటే గాని, దీని భావాన్ని సంపూర్ణంగా ఆస్వాదించలేము. విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు తండ్రి కొడుకుల కథ ఇది. సంప్రదాయ భావాలు గల తండ్రికి, అభ్యుదయ భావాలు గల కొడుక్కి మధ్య జరిగే సంఘర్షణ ఈ చిత్ర ఇతివృత్తం. తండ్రి శాస్త్రీయ సంగీత విద్వాంసుడు గణపతి శాస్త్రి. శాస్త్రీయ సంగీతం – ‘దాన్ని అర్థం చేసుకోగల అర్హత కలిగిన రసజ్ఞులకు మాత్రమే పరిమితమని, రసానందాన్ని కలిగించడమే దాని పరమావధి’ ఆయన అభిప్రాయం. కొడుకు సూర్యం కూడా సంగీత విద్వాంసుడే కానీ, ‘సంగీతానికి ఎల్లలు లేవని, అది ప్రజలందరికీ చేరాలని, సామాన్యుడికి అందుబాటులోకి రాని సంగీతానికి విలువ లేదు’ అనేది కథానాయకుడి సిద్ధాంతం. ఇదే విషయంపైన అతడు తండ్రితో ఎప్పుడూ విభేదిస్తూ ఉంటాడు. తండ్రి, గణపతిశాస్త్రితో గొడవపడి ఇంట్లోనుంచి వచ్చేసిన సూర్యం బాధ చూడలేని లలిత, సూర్యాన్ని ఎలా అయినా మాట్లాడించమని, అనే మౌనాన్ని వీడేలా చేయమని, ఆమె తండ్రి వరాలయ్యని కోరిన సందర్భం లోని పాట, ‘చెప్పాలని ఉంది..’

సాకీ..
ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే గద గుండెబలం తెలిసేది?
దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది? మంచైనా చెడ్డైనా పంచుకోను నే లేనా
ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా
ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని అంతటి ఏకాంతమైన చింతలేమిటండీ?

పాటకు ముందు వచ్చే సాకీ.. వరాలయ్య పాడినట్టుగా చిత్రీకరించబడింది. బ్రతుకు బరువునైనా ఒంటరిగా మోయగలమేమో కానీ, దిగులు బరువును మాత్రం ఒంటిగా మోయలేము. ఆ మాటే చెబుతూ, ఒంటరిగా దిగులు పడితే లాభమేంటి? మౌనం సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుందా? అని ప్రశ్నిస్తాడు వరాలయ్య సూర్యాన్ని. అంతేకాకుండా, కష్టం వస్తే కదా గుండె బలం తెలిసేది! అనే హితోక్తిని కూడా చెబుతూ.. దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది?, అని ప్రశ్నిస్తాడు. ఇక్కడ నాకు స్వామి వివేకానంద గారి ప్రార్థన, అచ్చంగా సిరివెన్నెల మాటల్లో సాక్షాత్కరించింది.

“When I Asked God for Strength,

He Gave Me Difficult Situations to Face;

When I Asked God for Brain and Brawn

He Gave Me Puzzles in Life to Solve; ..

ఎవరితో పంచుకోలేని కష్టం ఏంటి? మంచైనా చెడైనా పంచుకోవడానికి నేను లేనా? ఆమాత్రం ఆత్మీయతకు కూడా నేను పనికిరానా? ఒంటరిగా నీవు దిగులుపడడంలో అర్థమే లేదు!! అన్న భావాన్ని, వరాలయ్య ముఖతా మనకు చెప్పిస్తారు సిరివెన్నెల. ఒక మనిషికి ఓదార్చవలసిన సమయంలో కావలసిన భాషను ఉపయోగిస్తూ, ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం! అనే సంబోధనతో, నన్ను నేస్తంలా చూడు.. నీ బాధను నాతో పంచుకో.. అనే సందేశాన్ని కూడా అందిస్తున్నారు సిరివెన్నెల. ఆ ఓదార్పుకు స్పందించిన సూర్యం, అతి కష్టంగా తన మనసులో దాచుకున్న బాధను బయటికి వెళ్ళగ్రక్కడమే.. మనకు తరువాత చరణాలలో కనిపిస్తుంది.

పల్లవి:
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ॥2॥ చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ॥2॥ గుండెల్లో సుడి తిరిగే కలత కథలు చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ॥2॥

తన గుండెల్లో గూడు కట్టుకున్న బాధని, తనలోని కలతనీ మనసు విప్పి, గొంతు విప్పి, మీకు చెప్పాలని ఉంది, నాలో నేనే కుమిలిపోతూ వుండలేరు,అన్న భావాన్ని వ్యక్తపరుస్తూ.. పాట ప్రారంభమవుతుంది. బాధను పంచుకోవడానికి నిజంగా సరైన వ్యక్తి మనకు లభించకపోతే, ఆ వేదన ఎంతో‌ భారంగానే ఉంటుంది.

చరణం:
కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని అయినవాళ్ళు వెలివేస్తే అయినా నేనేకాకిని చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ॥2॥ పాతబాట మారాలని చెప్పడమే నా నేరం
గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచెవన్నెల విరితోట
బతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట ॥2॥
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ॥2॥ ॥ వసంతాలు॥

అప్పుడు సూర్యం, తన మనసులోని బాధకు కారణాలను ఈ చరణంలో వివరిస్తాడు. సంగీతానికి అవధులు నిర్ణయించి, పాటించే సంప్రదాయపు కోకిలల కుటుంబంలో, ‘సంగీతం సర్వజనీనమనే’, సిద్ధాంతాన్ని నమ్మిన అభ్యుదయ భావాలు కలిగిన కాకిలాగా పుట్టానని భావించి, అయినవాళ్లు వెలివేస్తే, నేను ఏకాకిని అయ్యాను. తరతరాలుగా నమ్మిన పాత బాట నుండి, కొత్త బాటలోకి మారమన్నానన్న కోపంతో.. తన మమకారాన్ని మరుగున పెట్టి నా కన్నతండ్రి నన్ను ఇంటిలో నుండి బయటికి పంపేశాడని, సూర్యం వరాలయ్యకు తెలియజేస్తాడు. మా ఇంట్లో వీడు ‘చెడబుట్టాడు’, అనడం తెలుగువారి పలుకుబడి. సిరివెన్నెల ఎంతో చక్కగా ఆ పలుకుబడిని వాడడం భాషలోని సహజత్వానికి మరింత వన్నెలు దిద్దింది.

ఇది ప్రపంచ రీతి. అందరూ ఒక పరిథిలో ఒదిగి వుండాలని భావిస్తుంది ప్రపంచం. తాను భావించినదానికి భిన్నంగా ఎవరయినావుంటే వారిని వంచి తనదారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. భిన్నంగావున్నవాడిని ఎన్నిరకాలుగా హింసించగలదో అన్నిరకాలుగా హింసిస్తుంది. కుదరకపోతే తానే అతనిదారిలోకి వస్తుంది. ప్రపంచం తనను అర్ధం చేసుకునేంతవరకూ తనదైన ప్రత్యేకపంథా పాటించే వ్యక్తి అనేక కష్టాలుపడతాడు. ఆత్మవిశ్వసమే ఈ సమయంలో అతనికి తోడు. ఈ పాట ఈ విషయాన్ని తాత్త్వికంగా ప్రదర్శిస్తుంది.

కొత్త కొత్త రంగులతో, పూల హంగులతో, తేనె విందులతో, అలరించే వసంతాల అందాన్ని మాత్రమే సంగీతం అందిస్తుందా? జీవితంలో ‘వసంత మాసం’ అనే, ఒక్క ఋతువు మాత్రమే ఉంటుందా? మనిషి నడిచే దారుల్లో పూల బాటలు తప్ప, ముళ్ళబాటలే ఉండవా? అని, తన తండ్రి తీరును నిరసిస్తూ, సూర్యం బాధపడతాడు. తన మనసులో ఉన్న ఈ భావన్నంతా.. తండ్రికి తెలియజేయాలని వుందనీ, .. చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది అంటాడు, సూర్యం. ఈ సందర్భంలో కథానాయకుడి మనస్తత్వాన్ని అద్దంలో చూపించినట్టు వ్యక్తీకరించారు సిరివెన్నెల.

చరణం:
ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం?
ఏదీ మరి మిగతా కాలాలకు తాళం?
నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు
కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
మంచు వంచనకు మోడై గోడు పెట్టువాడొకడు వీరి గొంతులోన కేక వెనుక ఉన్నదే రాగం? అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం?
అని అడిగిన నా ప్రశ్నకు అలిగే మత్తకోకిల
కళ్ళు ఉన్న కబోదిలా, చెవులు ఉన్న బధిరుడిలా నూతిలోన కప్పలా బ్రతకమన్న శాసనం!!
కాదన్నందకు అక్కడ కరువాయెను నా స్థానం.. చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ॥2॥

ఇక రెండవ చరణంలో సంగీత పరిభాషలో ఉపయోగించే కాలము, తాళము, శృతి, అనే పదాలను, సమయాన్ని సూచించే కాలంతో అనుసంధానం చేసి అతి గొప్ప ప్రయోగాన్ని చేశారు సిరివెన్నెల. కాలము పాటలోని వేగాన్ని లేదా లయను నియంత్రించే ఒక కొలమానం. ఇవి ఆరు కాలాలుగా వర్గీకరించబడి (షట్కాలాలు) ఒకటవ కాలం నుండి ఆరవకాలం లోపల క్రమక్రమంగా ఒక అక్షరం నుండి 32 అక్షరాల వరకు.. పెరుగుతూ వెళ్తాయి. ఇక తాళము అనేది పాటలోని వేగాన్ని మనకు తెలియజేసే ఒక ప్రక్రియ. సంగీత ప్రపంచంలో రాగాలకు సప్త స్వరములు ఎలా పునాదో, తాళములకు సప్త తాళములు అలాగే పునాది వంటివి. ఆ ఏడు తాళాలను ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశారు.

శ్లో॥ ధ్రువో మఠ్యో రూపకశ్చ ఝంపా త్రిపుట మేవచ అట తాళైక తాళశ్చ సప్త తాళ ప్రకీర్తతః॥

మానవుని చెవి గుర్తించే స్వర స్థాయి యొక్క చిన్న విరామాలను శృతి అంటారు.

ఇలా తాము పాడే సంగీతంలో ఇన్ని, 6 కాలాలు, 7 తాళాలు, శృతులు ఉన్నట్టే, ఏడాదిలో ఆరు ఋతువులు కూడా, ఎన్నో వ్యత్యాసాలతో ఉన్నాయి కదా? అని ప్రశ్నిస్తాడు సూర్యం. /’ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం? ఏదీ మరి మిగతా కాలాలకు తాళం?’/సంవత్సరం పొడుగునా వసంత కాలం ఒకటే ఉంటే.. మిగతా ఋతువులకు ఏ తాళం వేస్తారు.. అని తండ్రిని సూటిగా ప్రశ్నించినట్టు ఉంటుంది, ఈ భావం.

‘నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు’.. జీవితంలోని కష్టాల వడగాలుల శృతిలో కొందరు (ఎండాకాలం),

‘కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు..’ దుఃఖపూరితమైన దాన్ని గడుపుతూ, కన్నీటి కుంభవృష్టిలో మునకలేసేవారు మరికొందరు (వర్షాకాలం)

‘మంచు వంచనకు మోడై గోడు పెట్టువాడొకడు,’ జీవితంలో ఏ ఆశ లేకుండా మంచు లాగా గడ్డకట్టిపోయి, ఆ మోడు బ్రతుకుల గోడును వినిపించేవారు కొందరు (శీతాకాలం)..

ఉన్నప్పుడు, వసంత ఋతువులోని అందాలను మాత్రమే వర్ణిస్తూ బ్రతికితే, /’వీరి గొంతులోన కేక వెనుక ఉన్నదే రాగం? అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం?/..పైన చెప్పుకున్న మిగిలిన వారి గొంతులో పలికే వేదనను, అది చూసినప్పుడు తనలో కలిగే ఆవేదనను, ఏ రాగంలో పలికించాలి? అంటారు సిరివెన్నెల, తన అపూర్వమైన బాణిలో!!

ఇలాంటి ప్రశ్నలు అడిగినందుకే, మత్తకోకిల వంటి సంప్రదాయపు మత్తులో జోగుతున్న నా తండ్రి, నన్ను కళ్ళు ఉన్న అంధుడిలా, చెవులు ఉన్న బధిరుడిలా, బావిలోని కప్పలాగా బ్రతకమని శాసించాడు, అంటాడు సూర్యం. ఇక్కడ ‘మత్తకోకిల’ అనేది ఎంత ప్రశస్తమైన పదప్రయోగమో ఒక్కసారి గమనించండి. వసంతకాలంలో లేలేత చిగుర్లను తిని, పాడే కోయిలను మత్తకోకిల అంటారు. కాబట్టి, సంగీతంలో ఆనందాన్ని పంచడం అనే ఒకే ఒక రుచిని తెలిసిన, హీరో తండ్రిని సూచించడానికి, ఆ పదం వాడారు సిరివెన్నెల. ఈ భాషా సౌందర్య పటిమను, దాని ప్రయోగంలోని మెలకువలను సిరివెన్నెల ఎంత కరతలామలకం చేసుకున్నారో, మనం అర్థం చేసుకోవాలి!

అలా బ్రతకలేను, అని తండ్రి పై తిరగబడినందుకే, మా ఇంట్లో స్థానాన్ని కోల్పోయాను.. అన్న వివరణను సూర్యం అందిస్తాడు. ఆ బాధనంతా మీతో పంచుకోవాలని ఉంది.. నా గొంతు విప్పాలని ఉంది.. అంటాడు.

చరణం:
అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగ ధ్వానం
నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు
దిక్కు మొక్కూ తెలియని దీనుల వ్యధార్త జీవన స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి, ఈ అపశృతి సరిచెయ్యాలి
జనగీతిని వద్దనుకుంటూ నాకు నేనే పెద్దనుకుంటూ
కలలో జీవించను నేను కలవరింత కోరను నేను –

ఈ చరణం నుండి సిరివెన్నెల కలం, మానవ జీవితంలోని వేదనల పట్ల మరిగిపోతూ తన కవనాగ్నిని కురిపిస్తుంది. ‘అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగ ధ్వానం.. నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం.. ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు’ (బిడారు-డేరా/నివాసం).. చుట్టూ ఉన్న చీకటి బ్రతుకుల్లోని నిస్సహాయత, ఆర్తుల ఆరని శ్లోకం, నిత్యం చస్తూ బ్రతికే, గమ్యం దొరకని బాటసారుల్లాంటి ఎడారి జీవితం.. బాధల బిడారు.. తనను కలచి వేస్తున్నాయని సూర్యం ద్వారా వ్యక్తీకరించిన, సిరివెన్నెల మనసులోని ఉద్రేకానికి, ఉద్వేగానికి, వ్యథకు స్పష్టమైన ప్రతీక ఈ వ్యక్తీకరణ. మొదటి చరణం నుండి, చివరి చరణం వరకు.. మానవ జీవితాన్ని.. సంగీత ప్రపంచంతో.. అనుసంధానం చేయకుండా వదలలేదు సిరివెన్నెల. ఇక్కడ కూడా ‘హృదయ మృదంగ ధ్వానాన్ని’ పలికిచారాయన.

దిక్కు మొక్కూ తెలియని దీనుల వ్యథ, ఆర్తితో నిండిన జీవన స్వరాలు, నిలువునా తనను కమ్ముతున్నాయని, అశాంతితో తనను కలచి వేస్తున్నాయని చెప్పడమే కాక, ‘ఈ తీగలు సవరించాలి, ఈ అపశృతి సరిచెయ్యాలి..’ అంటాడు సూర్యం, మళ్ళీ సంగీత పరిభాషను ఉపయోగిస్తూ. ఒక వాయిద్యం సరైన రాగాలు వినిపించాలంటే, ముందుగా దాన్ని చక్కగా శృతి చేయాలి. ఎంత గొప్ప వాద్యమైనా, అప్పుడే అది అపశృతులు పలకకుండా, మధురమైన రాగాలు వినిపించగలరు. తన చుట్టూ సమాజంలో ఉన్న సమస్యలను తను చేతనైనంత వరకు సరిచేసి, ‘జీవనరాగాలని శృతి చేయాలని’ సూర్యం ఒక గట్టి నిర్ణయం తీసుకుంటాడు.

సిరివెన్నెలలో నిండివున్న సామ్యవాద ధోరణి కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది ఇక్కడ. నేను బాగుంటే చాలు, అనుకొని నా సుందరమైన భవిష్యత్తు గురించి కలలు కంటూ.. నేనే గొప్ప అని భావించుకుంటూ.. నా చుట్టూ ఉన్న జనాలతో, సమాజంతో, ప్రపంచంతో సంబంధం లేకుండా, జనగీతిని పాడకుండా.. నేను బ్రతకలేను!! అనే స్థిర నిర్ణయాన్ని ప్రకటిస్తాడు సూర్యం. సమాజ హితం, సాంఘిక సంక్షేమం.. అనే రాగాలతో.. జన గీతిక పాడాలన్నది, కథానాయకుడి ఆశయంగా, అభిలాషగా, సిరివెన్నెల ఇక్కడ అభివర్ణిస్తారు.

ఇలా స్థిర నిర్ణయం తీసుకున్న తర్వాత, తన కార్య ప్రణాళిక ఏంటో, కట్టలు తెంచుకున్న ఆవేశంతో ప్రకటిస్తాడు, సూర్యం.. సిరివెన్నెల మనసుకు ప్రతిబింబంగా!!

నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను
నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను ॥2॥
సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించు దాకా
ప్రతీ మనిషికి జీవనంలో నందనం వికసించు దాకా
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను ॥2॥
నేను సైతం నేను సైతం నేను సైతం ॥2॥

ఏదైనా ఒక రాగం లో రాగల స్వరముల ఆరోహణ, అవరోహణ లను కలిపి ‘మూర్ఛన’ అంటారు. మానవ దేహానికి ఆస్థి పంజరము ఎలా ఆధారభూతమో, అలా ఒక రాగానికి కూడా మూర్ఛన అలా అధారమవుతుంది. శ్రీశ్రీ కవిత్వంలోని అత్యంత ప్రేరణాత్మకమైన/‘నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను/నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను/నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను.. అనే వాక్యాలను యథాతథంగా తీసుకొని, జనజీవనంలో అపశృతులను తొలగించడానికి నా వంతు సాయం నేను కూడా చేస్తాను అనే నాయకుడి ఆవేశాన్ని మనకు చూపిస్తారు. విశ్వ వీణకు నేను కూడా ఒక తంత్రినవుతాను, విశ్వ ఘోషలో నేను కూడా శృతి కలుపుతాను, విశ్వ కమలానికి నేను కూడా ఒక రేకులాగా రూపొందుతాను.. అన్న వాక్యాలతో మొదలుపెట్టి.. తన దృఢ సంకల్పాన్ని తెలియజేస్తాడు, దాని కొనసాగింపుగా మళ్ళీ సిరివెన్నెల గారి భావజాలం సాగుతుంది.

ఎంతవరకు, ఎంతకాలం.. తను ఈ ప్రయాణాన్ని సాగిస్తాడు అంటే.. /సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించు దాకా/ప్రతీ మనిషికి జీవనంలో నందనం వికసించు దాకా/ .. అన్న సమాధానం మనకు వినిపిస్తుంది. సిరివెన్నెలలోని, విశ్వమానవుడిని, విశ్వాత్మను, మనం ఈ వాక్యాల్లో దర్శించుకోవచ్చు. సకల జగతిలో శాశ్వతంగా వసంతం ఉండిపోయేదాకా, అమర ఉద్యానవమైన నందనం భువిపై వికసించేదాకా..అంటే ‘భూలోక స్వర్గం’, సాకారమయ్యేదాకా.. తన ఆశయాల బాటను వీడిపోలేనని, పాత పాటలు పాడనని, కొత్త బాటను వదలననీ.. ఉద్వేగంగా ప్రకటిస్తాడు, తెరపై సూర్యం..దాని వెనుక సిరివెన్నెల కలం..

ఈ పాట వింటే, ‘మనిషి కవి’ సిరివెన్నెల అంతరంగాన్ని తానే ఇలా ఆవిష్కరించుకున్నారని మనకు అర్థమవుతుంది. ప్రతి పదాన్ని ఆచితూచి సాగిన సిరివెన్నెల సాహిత్యం, ప్రతి పదంలోని భావాన్ని, ఆవేశాన్ని, ఆవేదనను, ఉద్రేకాన్ని, ఉద్వేగాన్ని, అత్యద్భుతంగా పలికించిన బాలుగారి గళం, ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ సాగిన ఇళయరాజా అమృత సంగీతం, చిత్ర ఇతివృత్తం, తెరమీద చిరంజీవి గారి నటనా కౌశలం.. వీటన్నిటి మధురాతి మధురమైన సంగమం, ఈ పాటకు శాశ్వతత్వాన్ని తెచ్చిపెట్టాయి.

కవిలోని గొప్ప సంకల్పం వ్యక్తం చేసిన ఈ కవిత.. ఆగని కవనం తరంగాల నదియై ప్రవహిస్తూ.. ఆరని కవనాగ్నిని కురిపిస్తూ.. సిరివెన్నెల సాహితీ ప్రయాణంలో, ఒక మైలురాయిగా నిలిచి, మనందరికీ అంతులేని ఆనందాన్ని, రసానుభూతిని పంచి పెట్టింది, పెడుతూనే ఉంటుంది. సిరివెన్నెల గారి కవనానికి, మానవత్వం నిండిన ఆ కలానికి, నిత్య వసంతపు ఆ సాహితీ కోకిలకు.. ఇదే నా ఘన నివాళి.

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here