Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 68 – బలమైన భరోసానిచ్చే పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

సరిగా పడనీ తొలి అడుగు

~

చిత్రం: హరే రామ్

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: మిక్కీ జె మేయర్

గానం: కార్తీక్

~

పాట సాహిత్యం

పల్లవి:
సరిగా పడనీ ఇపుడే తొలి అడుగు
సుడిలో పడవై ఎపుడూ తడబడకు
మాయలో మగతలో మరుపు ఇంకెన్నాళ్లు
వేకువై వెలగనీ తెరువిదే నీ కళ్లు
కన్న ఒడి వదలాల్సిందే నీలా నువు నిలవాలంటే మన్ను తడి తగలాల్సిందే మున్ముందుకు సాగాలంటే
కింద పడి లేవాల్సిందే కాలంతో గెలవాలంటే చలోచలో ॥ సరిగా పడనీ॥
చరణం:
నిన్నే చూపే అద్దం కూడా నువ్వా కాదా అనదా అచ్చం నీలా ఉండేదెవరా అంటూ లోకం ఉలికిపడదా
సూర్యుడిలో చిచ్చల్లే రగిలించే నీలో కోపం దీపంలా వెలిగిందా జనులందరిలో
చంద్రుడిల్లో మచ్చల్లే అనిపించే ఏదో లోపం కుందేలై అందంగా కనపడదా నీలా నవ్వే క్షణాలలో ॥ సరిగా పడనీ॥
చరణం:
చెక్కే ఉలితో నడిచావసుకో దక్కేవిలునే తెలిసి తొక్కే కాళ్ళే మొక్కే వాళ్ళై దైవం అనరా శిలను కొలిచి
అమృతమే నువు పొందు విషమైతే అది నా వంతు
అనగలిగే నీ మనసే ఆ శివుడిల్లు అందరికీ బతుకిచ్చే పోరాటంలో ముందుండు కైలాసం శిరసొంచి నీ ఎదలో ఒదిగే వరకు చలో చలో ॥ సరిగా పడనీ॥

బోయవాడిగా ఎదిగిన రత్నాకరుడు దారి దోపిడీదారుడిగా మారి, చివరకు వాల్మీకి మహర్షిగా పరిపూర్ణ పరివర్తన చెందాడు. పరివర్తన చెందడం అంటే, నడవడికలో, నడతలో, ప్రవర్తనలో, మానసిక ప్రవృత్తిలో ‘మార్పు’ రావడం. సాధారణంగా మంచి మార్పు వచ్చినపుడే ఈ ప్రయోగం వాడతారు.

Transformation is a marked change in form, nature, appearance or behavioural patterns.

ఈ పరివర్తన, ఏ క్షణమైనా, ఏ రూపంలో అయినా, ఏ ప్రేరణ వల్ల అయినా రావచ్చు. ఒక ఊరిలో జమీందారుకి అన్ని రకాల దుర్వ్యసనాలు ఉండేవి. ఎంతమంది, ఎన్ని రకాల సలహాలు ఇచ్చినా అతని చెవికి ఎక్కేది కాదు.‌ ఒకరోజు చీకటి పడుతున్న సమయంలో అతడు ఏదో ఊరు నుండి జట్కాలో వెళ్తూ ఉన్నాడట. అప్పుడు ఒక రైతు తన కూతురితో ఇలా చెబుతుండగా తను విన్నాడు.. ‘త్వరగా ఇంటికి పదమ్మా! చీకటి పడుతోంది, ఇంట్లో దీపం పెట్టాలి. చీకటి చిక్కబడితే దీపం కూడా ఎక్కడ ఉందో కనిపించదు!’ ఆ ఒక్క మాటతో, తన జీవితం కూడా చీకటి పడే దశకు చేరుకుందని, దీపం వెలిగించాల్సిన అవసరత వచ్చిందని అతడికి మనసులో అనిపించి, ఉన్నపాటుగా పరివర్తన చెంది.. తరువాత తరువాత ధర్మవర్తనతో మంచి పేరు తెచ్చుకున్నాడట! అలా పరివర్తనకు ఏది దారి తీస్తుందో ఎవరూ చెప్పలేరు. ఒక మనిషిలో పరివర్తన రావడానికి కారణాలు.. దిక్కుతోచని సందిగ్ధత స్థితి, స్వీయ పరిశీలన, స్వీయ పరిశీలన నుంచి నేర్చుకోవడం, కొత్త ప్రవర్తనల ఎంపిక, ప్రవర్తనల ఎంపికలను అమలు పరచడం- ఈ అన్ని దశల ద్వారా మానసిక ప్రవృత్తిలో మార్పు వస్తుంది.. అది మనం కోరుకున్న అన్ని మార్పులకు దారితీస్తుంది.

మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్న పాట, ‘హరే రామ్’ చిత్రంలో ఒక పరివర్తన దీపికలాగా సిరివెన్నెల గారు మన చేతికి అందించిన ఒక మధుర గీతం. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్-  ‘హరి, రామ్’,  పేర్లతో ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడు. అవిభక్త కవలల్లో ఒకరైన రామ్ మెదడులో ఏదో ఒక చిన్న తీవ్ర రసాయనిక చర్య కారణంగా అతడు తీవ్ర కోపోద్రిక్తుడై, ప్రాణాలు తీసే స్థాయి వరకు వెళ్తుంటాడు. తనకు మించిన తెలివైన వారిని అతడు మెదడు భరించలేక పోతుంది. ఆ కోపంలో అతడు చిన్నతనంలోనే, అన్న ఆయన హరిని చంపడానికి కూడా వెనుకాడడు. అటువంటి స్థితిలో, ఆ తల్లి తనను వెంటబెట్టుకొని దూరంగా తీసుకువెళ్లి పెంచుతుంది. అతని ప్రవర్తనలో మార్పులు తీసుకోవడానికి ఎంతో కృషి చేస్తుంది.

చివరగా ఒక కథానాయిక సహాయంతో ఒక మానసిక వికలాంగుల శరణాలయంలో, అతనిలో పరివర్తన మొదలవుతుంది. ఈ సందర్భంలో అతను జీవితంలో ఇంకా ఎలా ముందుకు సాగాలి, ఎలా ఎదగాలి అని సూచిస్తూ, సిరివెన్నెల గారు వ్యక్తీకరించిన అద్వితీయ సందేశాల సమాహారం ఈ పాట. కానీ సినీ నేపథ్యానికి ఏమాత్రం అనుసంధానం  చేయకుండా సార్వజనీనంగా తీసుకున్నా.. ఎంతో అమూల్యమైన సందేశాన్ని ప్రతివారికీ అందిస్తుంది ఈ గీతం.

పల్లవి:
సరిగా పడనీ ఇపుడే తొలి అడుగు
సుడిలో పడవై ఎపుడూ తడబడకు
మాయలో మగతలో మరుపు ఇంకెన్నాళ్లు
వేకువై వెలగనీ తెరువిదే నీ కళ్లు
కన్న ఒడి వదలాల్సిందే నీలా నువు నిలవాలంటే మన్ను తడి తగలాల్సిందే మున్ముందుకు సాగాలంటే
కింద పడి లేవాల్సిందే కాలంతో గెలవాలంటే చలోచలో ॥ సరిగా పడనీ॥

ఒక English writer చెప్పిన ఒక అంశం నాకు ఎన్నోసార్లు, చాలా సందర్భాల్లో గుర్తుకు వస్తుంది.

Man has learnt to fly like a bird,

Man has learnt to swim like a fish,

But.. man has not learnt to walk like a man..

ఎంతో కాలం తర్వాత మృగం నుండి మనిషిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో ప్రతి అడుగు ఎంత జాగ్రత్తగా వేయాలో, కథానాయకుడికి చెబుతున్నారు సిరివెన్నెల. సుడిగాలిలో చిక్కుకున్న పడవ లాగా,

అగమ్యగోచరంగా ఊగిసలాడకూడదని బలమైన హెచ్చరిక చేస్తున్నారు.‌ మాయలో చిక్కుకొని, మగత నిద్రలో ఉండిపోకుండా, కళ్ళు తెరిచి మేల్కొని, వెలుగులోకి పయనించమని అతనికి ప్రేరణనిస్తున్నారు.‌

తల్లిదండ్రుల రెక్కల చాటున ఉన్నంతకాలం, సొంత వ్యక్తిత్వం ఏర్పడడం, వ్యక్తిత్వ వికాసం కలగడం , మనదంటూ మన ముద్రను ఏర్పరచుకోవడం సాధ్యం కాదు. కష్టనష్టాలు, ఒడిదుడుకులు తెలియకుండా, ఏ మాత్రం శ్రమ పడకుండా, కాలంతో పోటీపడి గెలవడం సాధ్యం కాదు.. కాబట్టి సరైన ప్రణాళికతో, స్థిరమైన మొదటి అడుగుతో.. జీవన ప్రయాణం సాగించాలని సిరివెన్నెల మనకు హితోపదేశం చేస్తున్నారు.

Man cannot reframe himself without suffering for he is both the marble and the sculptor.. అంటారు Alexis Carrell

చరణం:
నిన్ను చూపే అద్దం కూడా నువ్వా కాదా అనదా అచ్చం నీలా ఉండేదెవరా అంటూ లోకం ఉలికిపడదా
సూర్యుడిలో చిచ్చల్లే రగిలించే నీలో కోపం దీపంలా వెలిగిందా జనులందరిలో
చంద్రుడిల్లో మచ్చల్లే అనిపించే ఏదో లోపం కుందేలై అందంగా కనపడదా నీలా నవ్వే క్షణాలలో ॥ సరిగా పడనీ॥

ఒక మనిషి మానసిక స్థితిలో అనూహ్యమైన మార్పులు సంభవించినప్పుడు ..ఇది నేనేనా? అని మనల్ని చూసి మనమే ఆశ్చర్యపోతాం! ఏంట్రా వీడు ఇంతలా మారిపోయాడు? వీడు వాడేనా? అచ్చంగా వాడిలాగే ఉన్నాడే.. అని లోకం ఆశ్చర్యపోతుందట. ‘..సూర్యుడిలో చిచ్చల్లే రగిలించే నీలో కోపం దీపంలా వెలిగిందా జనులందరిలో..’ అంటారు ఇక్కడ సిరివెన్నెల.

అంటే తనలో రగిలి కోపం ఎంతోమంది జీవితాల్లో చిచ్చు రేపిందని చెబుతూ.. ఆ వేడిని మంచితనంతో దీపంలా వెలిగిస్తే జీవితం ఎంత బాగుంటుందో వివరిస్తారు ఆయన.

Transform అవ్వడం గురించి అందరూ మాట్లాడతారు కానీ, పుట్టుకతో మనందరం సరైన సహజ స్థితిలోనే, సంతులనతోనే ఉంటాము. ఆ స్థితిలో మనం ఆనందంగా, సంతోషంగా, నిశ్చలంగా ఉంటాము. అందుకే నా దృష్టిలో transformation అంటే reverting to our original state. సిరివెన్నెల గారు ఇంత చక్కటి ఉపమానాన్ని మనకందిస్తూ, నువ్వు నీలా మారి మనస్ఫూర్తిగా నవ్వే క్షణాలలో.. చంద్రుడిలో మచ్చ లాంటి నీ లోపాలు (negatives), అందమైన కుందేలులా (positives) గా కనిపిస్తాయి కాబట్టి.. నీవు ఎప్పుడూ నీలానే ఉండడానికి ప్రయత్నించు! అనే గట్టి పాఠాన్ని మనకు నేర్పుతున్నారు.

చెక్కే ఉలితో నడిచావసుకో దక్కేవిలునే తెలిసి తొక్కే కాళ్ళే మొక్కే వాళ్ళై దైవం అనరా శిలను కొలిచి
అమృతమే నువు పొందు విషమైతే అది నా వంతు
అనగలిగే నీ మనసే ఆ శివుడిల్లు
అందరికీ బతుకిచ్చే పోరాటంలో ముందుండు కైలాసం శిరసొంచి నీ ఎదలో ఒదిగే వరకు
చలో చలో ॥ సరిగా పడనీ ॥

ఇక రెండవ చరణంలో పరివర్తనకు కావాల్సిన పనిముట్లను కూడా సూచిస్తున్నారు సిరివెన్నెల.

మన దగ్గర శిలను చెక్కే వులి ఉండడమే కాదు, దాని విలువ తెలిసినప్పుడే సరిగ్గా ఉపయోగించుకొని శిలలాగా మనల్ని మనం మలుచుకోగలం. అలా మలుచుకున్నప్పుడే, కాలి కింద బండలాగా తొక్కిన కా/వాళ్లు, ఆ శిలను కొలిచి, దైవమంటూ పూజలు చేస్తారు. కాలి కింద తొక్కే శిలను మొక్కే దేవతా మూర్తిగా మలుచుకోవడం నీ చేతుల్లోనే ఉంది! అన్న గీతోపదేశం అది.

Sculptor అనే కవితలో Sylvia Plath ఇలా అంటారు..

To his house the bodiless
Come to barter endlessly
Vision, wisdom, for bodies
Palpable as his, and weighty.
Hands moving move priestlier
Than priest’s hands, invoke no vain Images of light and air
But sure stations in bronze, wood.. stone.

చాగిలదీసి రాళ్ళనొక జాలుగా వాగుగ తోగులాగునన్..
ఉలితో అమృతము చల్లి జీవములు పోసిపోయదవు..
బ్రహ్మవు! శిల్పి కులావతంసమా!!
……
ప్రతి వికారశిలయు ప్రతిమయై వెలుగొందు పడతివోలె కులికి వలపు రేపు;
నీ కరావలంబ నిభృతమైనపుడెల్ల
రాతిరాతిలోన నాతి తోచు!

అని శిల్పికి జేజేలు పలికారు దాశరథి..

అలా.. ఎలాంటి వికార శిలలైనా.. మనల్ని మనం మలచుకోగలిగితే.. అందమైన శిల్పాలుగా రాణించవచ్చు.

క్షీరసాగర మథనం సమయంలో ఆనందమైన అమృతాన్ని స్వీకరించడానికి ప్రతివారు ముందుకురాగా, హాలాహలాన్ని తనవంతుగా ఎంచుకున్న కరుణా సముద్రుడు పరమేశ్వరుడు.

అలా ఎదుటివారి కష్టాన్ని తమదిగా స్వీకరించగలిగే ప్రతి వారి హృదయము కైలాసమే అంటారు సిరివెన్నెల. ఎంత గొప్ప నిర్వచనం కదా! పదిమందికి మేలు చేసే పోరాటంలో, పదిమంది కోసం నీవు ముందడుగు వేస్తే, కైలాసమే శిరసొంచి నీ ఎదలో ఒదుగుతుందన్న బలమైన భరోసా ఇస్తున్నారు సిరివెన్నెల! అంతవరకు నీ పయనం ఆపకుండా ముందుకు వెళ్ళు! చలో.. చలో.. అంటున్నారు ఆయన..

ఒక మనిషిలో వచ్చే మార్పును వర్ణించడానికి, ఎంత చక్కటి ఉపమానాలు వాడారో, ఎంత రమ్యమైన భాషతో ఆ భావాలకు మెరుగులు దిద్దారో, అలా మనిషిలో పరివర్తన రావడానికి ఎన్ని ప్రేరణాత్మక వాక్యాలు పలికారో.. ఒక్క వ్యాసంలో చర్చించడానికి నిజంగా సాధ్యం కాదు!

ఇందులో మనల్ని మనకు చూపే అద్దం వచ్చింది, మాయ వచ్చింది, మరపు వచ్చింది, మగత వచ్చింది, మెలకువ వచ్చింది, మన్ను వచ్చింది, సూర్యుని చిచ్చు వచ్చింది, చంద్రునిలోని కుందేలు దిగి వచ్చింది, చిచ్చుని దీపంగా మార్చే కొత్త కోణం వచ్చింది, చంద్రుడిలోని మచ్చను కుందేలుగా మార్చే కళ వచ్చింది, ఉలి వచ్చింది శిల్పం వచ్చింది, తొక్కిన వాళ్లే మొక్కే మార్పు వచ్చింది, శివుడు వచ్చాడు.. కైలాసం వచ్చింది.. అసలు పాట ఏంటి? దాని మెసేజ్ ఏంటి? సినిమాలో కథానాయకుడు పాత్రకి అచ్చంగా పోత పోసిన ఆ భావం ఏంటి? ప్రతి వారి జీవితంలో.. ఎదుగుదలకు.. పరివర్తనకు దారి చూపే.. ఆ వెలుగేంటి?.. ఇదే కదా సిరివెన్నెల బాణి..!!!

Images Source: Internet

Exit mobile version