Site icon Sanchika

సిరివెన్నెల పాట – నా మాట – 72 – తప్పు దోవలో నడవ వద్దని హెచ్చరించే పాట

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

నమ్మర నేస్తం

~

చిత్రం: సెల్యూట్ (2008)

సంగీతం: హేరీస్ జైరాజ్

సాహిత్యం: సిరివెన్నెల

గానం: హరిహరన్

~

పాట సాహిత్యం

నమ్మర నేస్తం.. ధర్మమేవ జయతే..
నీ ప్రతి యుద్ధం.. సత్యం కోసమైతే..
తొలి వేకువ ఇంకా రాదేమంటూ..
నడి రాతిరిలో చీకటి చూస్తూ..
కేకలు పెట్టకు అందరి నిద్ర చెడేలా..
ఆ దైవం తానే అవతారంగా..
దిగివచ్చే తగు తరుణం దాకా..
రక్కసి మూకల వికృత నాట్యం ఇంతేరా..
పోగాలం రానీరా ఈ లోగా కంగారా..
నమ్మర నేస్తం ధర్మమేవ జయతే..
నీ ప్రతి యుద్ధం సత్యం కోసమైతే..

చరణం:
నీలో ఉత్సాహం.. ఎక్కువైతే ఉన్మాదం..
దూకే ఆవేశం.. చేరనీదే ఏ గమ్యం..
ఆయుధాన్ని దండిస్తే ఆగడాలు ఆగేనా..
కాగడాగా వెలిగిస్తే మార్గం చూపించాలంతే..
కాపలాగా నియమిస్తే ఆ పని మాత్రం చెయ్యంతే..
కార్చిచ్చే రగిలిస్తావా, చేను మేసే కంచవుతావా..
నమ్మర నేస్తం ధర్మమేవ జయతే..
నీ ప్రతి యుద్ధం సత్యం కోసమైతే..

చరణం:
బాణం వస్తుంటే.. దానిపైనా నీ కోపం..
దాన్ని పంపించే.. శతృవేగా నీ లక్ష్యం..
వీరధర్మం పాటిస్తే.. పోరు కూడా పూజేగా..
కర్తవ్యంగా భావిస్తూ.. రక్షణ భారం మోస్తావో..
కక్ష సాధిస్తానంటూ.. హత్యానేరం చేస్తావో..
గమ్యం మాత్రం ఉంటే చాలదు..
తప్పుడు తోవలో వెళ్లకు ఎపుడూ..

నమ్మరా నేస్తం.. ధర్మమేవ జయతే..
నీ ప్రతి యుద్ధం సత్యం కోసమైతే..
తొలి వేకువ ఇంకా రాదేమంటూ..
నడి రాతిరిలో చీకటి చూస్తూ..
కేకలు పెట్టకు.. అందరి నిద్ర చెడేలా..
ఆ దైవం తానే అవతారంగా..
దిగివచ్చే తగు తరుణం దాకా..
రక్కసి మూకల వికృత నాట్యం ఇంతేరా..
పోగాలం రానీరా ఈ లోగా కంగారా..

‘అహింసా పరమో ధర్మః’, ‘సత్యమేవ జయతే’, వంటివి ధర్మభూమి, కర్మభూమి అయిన భారతావనిలో సనాతన ధర్మ సూత్రాలు.

‘సత్యమేవ జయతే’, అన్న నినాదం ముండకోపనిషత్తు మూడవ ముండకం మొదటి ఖండంలోని ఆరవ మంత్రం నుండి గ్రహించారు. ఆ మంత్రం ఇలా సాగుతుంది..

సత్యమేవ జయతే నానృతమ్
సత్యేన పంథా వితతో దేవయానః
యేనాక్రమంతి ఋషయో హి ఆప్తాకామా
యత్ర తత్సత్యస్య పరమం నిధానమ్॥

‘సత్యం ఒక్కటే జయిస్తుంది. దైవాన్ని చేరుకునేందుకు సత్యంతోనే మార్గం ఏర్పడుతుంది. నిష్కాములైన ఋషులంతా ఆ సత్యమార్గం ద్వారానే పరమాత్మను చేరుకుంటారు,’ అన్నదే పై శ్లోకంలోని భావం. ఇందులోని మొదటి పాదాన్ని పండిత మదన్మోహన్ మాలవీయ ప్రచారంలోకి తీసుకువచ్చారు. స్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిషర్లను ఎదిరించి ధైర్యంగా నిలిచేందుకు ఈ సూక్తి ఒక మంత్రంలా పనిచేసింది. తర్వాత ఇదే సూక్తిని జాతీయ నినాదంగా రూపొందించారు. మూడు సింహాల రాజముద్ర ఉన్న ప్రతి సందర్భంలోనూ ఈ నినాదాన్ని కూడా ప్రచురించి తీరాల్సిందే అని ప్రభుత్వం ఆదేశించింది. అహింసనే పరమాయుధంగా ఎంచుకున్న మహాత్ముడు కూడా, అహింసా పరమో ధర్మః, సూత్రానికి ప్రాణం పోశారు.

ఈ రోజు మనం చర్చించబోతున్న పాట తమిళ చిత్రానికి డబ్బింగ్‌గా వచ్చిన ‘సెల్యూట్’ అనే తెలుగు సినిమాలోనిది.

ఇందులో హీరో సబ్-ఇన్‌స్పెక్టర్. వృత్తి పట్ల అంకిత భావానికి అతను ఒక చిహ్నంలా పనిచేస్తుంటాడు. అనేక ఎత్తులు, పైఎత్తులతో ఎన్నో హత్యలకు కారణమైన ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడం కథాంశం. ఈ కథలో హీరో దూకుడుగా ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్. ఆవేశం హద్దుమీరితే ప్రమాదమని హెచ్చరించే పాట ఇది. డబ్బింగ్ సినిమా కోసం పాట వ్రాస్తూ కూడా ఎంతో కమిట్మెంట్‌తో సిరివెన్నెల గొప్ప న్యాయం చేసిన పాట ఇది. తన సహోద్యోగులు, పై అధికారి ఒక నాయకుడికి కొమ్ము కాస్తుండగా హీరో మాత్రం వారికి వ్యతిరేకంగా, ‘మనం మన యూనిఫామ్‌కే నిబద్ధులై ఉండాలి’, అని వారందరినీ హెచ్చరించి, ముక్కుసూటిగా తను కార్యరంగంలోకి దిగిన నేపథ్యంలో ఈ పాట వినిపిస్తుంది.

పల్లవి:
నమ్మర నేస్తం.. ధర్మమేవ జయతే..
నీ ప్రతి యుద్ధం.. సత్యం కోసమైతే..
తొలి వేకువ ఇంకా రాదేమంటూ..
నడి రాతిరిలో చీకటి చూస్తూ..
కేకలు పెట్టకు అందరి నిద్ర చెడేలా..
ఆ దైవం తానే అవతారంగా..
దిగివచ్చే తగు తరుణం దాకా..
రక్కసి మూకల వికృత నాట్యం ఇంతేరా..
పోగాలం రానీరా ఈ లోగా కంగారా..
నమ్మర నేస్తం ధర్మమేవ జయతే..
నీ ప్రతి యుద్ధం సత్యం కోసమైతే..

సత్యాన్ని వెలికి తీయడం కోసం హీరో చేసే పోరాటమే ఈ కథాంశం కాబట్టి, పల్లవిలోనే సిరివెన్నెల నాయకుడికి ఊతమిస్తూ, ‘నీవు చేసే యుద్ధం సత్యం కోసమే అయితే, ధర్మం తప్పకుండా జయిస్తుంది’, నీ కర్తవ్య నిర్వహణలో నువ్వు ముందుకు సాగిపో! అని సందేశమిస్తారు. అయితే సత్యం, ధర్మం జయిస్తాయని మనస్ఫూర్తిగా నమ్మాలనీ, అప్పుడే అనుకున్న ఫలితం సాధిస్తామని ఆయన ప్రతీకాత్మకంగా వివరిస్తున్నారు. నడి రాత్రిలో చీకటి చూస్తూ, అందరి నిద్ర చెడిపోయేలా గగ్గోలు పెట్టకు! ప్రతి నిశి రాత్రి తరువాత ఒక వేకువ వస్తుంది, అంతవరకు సహనంతో ఉండు! అన్న సందేశాన్ని మనకు అందిస్తున్నారు.

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత।
అభ్యుత్థానమధర్మస్య తదా తదాత్మానం సృజామ్యహమ్॥

(ఓ భరత వంశీయుడైన అర్జునా! ధర్మం నశించి, అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను.)

ఆ దైవం తానే, అవతరం దాల్చి దిగివచ్చే సమయం దాకా, రక్కసి మూకల విజృంభణ ఆగదని, పాపం పండితే కానీ, భగవంతుడు వారిని శిక్షించడనీ, అంతవరకు సహనంతో ఉండమనీ ఉద్బోధిస్తూ, భగవద్గీతలోని శ్లోకార్థాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నారు సిరివెన్నెల.

ఎంత నీచమైన రాక్షస ప్రవృత్తి గలవారినైనా, వారి కర్మఫలం తెగేంతవరకు, శిశుపాలుడుని మన్నించినట్లు, భగవంతుడు కూడా సహనం వహిస్తాడని.. అందుకే అన్ని విషయాల్లో తొందరపాటు తగదని ఆయన హెచ్చరిస్తున్నారు.

చరణం:
నీలో ఉత్సాహం.. ఎక్కువైతే ఉన్మాదం..
దూకే ఆవేశం.. చేరనీదే ఏ గమ్యం..
ఆయుధాన్ని దండిస్తే ఆగడాలు ఆగేనా..
కాగడాగా వెలిగిస్తే మార్గం చూపించాలంతే..
కాపలాగా నియమిస్తే ఆ పని మాత్రం చెయ్యంతే..
కార్చిచ్చే రగిలిస్తావా, చేను మేసే కంచవుతావా..
॥నమ్మర నేస్తం ధర్మమేవ జయతే॥

హీరో దూకుడుకి కళ్లెం వేస్తూ, ఏదైనా పరిధిలోనే ఉండాలని హితవు పలుకుతున్నారు సిరివెన్నెల. ఏ పని చేయడంలో ఉత్సాహం ఉండాలి కానీ పరిధి దాటిన ఉత్సాహం ఉన్మాదంగా మారి, మనం తలపెట్టిన కార్యానికి వ్యతిరేక ఫలితాలను ఇవ్వగలదు. పెంచుకున్న ఆవేశం వల్ల, ఎటువంటి కార్యాలు సక్రమంగా పూర్తి కాకపోగా సమస్య మరింత జటిలం అవుతుంది.

ఎక్కడైనా ఒక తప్పు జరుగుతోందంటే, ఆ సమస్య మూలాలు తెలుసుకోవాలి. ఆ మూలాన్ని సరిదిద్దకపోతే ఆ సమస్య నిరంతరంగా తలెత్తుతూనే ఉంటుంది. ఉదాహరణకు ఒక ఇంటి కాంపౌండ్ వాల్ బయట ముళ్ళ చెట్టు పెరుగుతూ, కొమ్మలు ఈ కాంపౌండ్ లోపలికి చొచ్చుకొని వస్తున్నాయి, అనుకుందాం. ఎన్నిసార్లు ఆ కొమ్మలను నరికించినా, చెట్లను సమూలంగా తొలగించనంతవరకు, ఆ సమస్య పునరావృతం అవుతూనే ఉంటుంది. అందుకే సమస్యను ఎప్పుడు మూలాల నుండి తొలగించగలగాలి. అందుకే సిరివెన్నెల అంటారు, ‘ఆయుధాన్ని దండిస్తే ఆగడాలు ఆగేనా?’ అని.

తెర వెనుక ఉన్న బడా నాయకులు, పెద్ద పెద్ద క్రిమినల్స్ కొంతమంది వ్యక్తులను నకిలీలుగా, పావులుగా (ఆయుధాలుగా) ఉపయోగిస్తూ వాళ్ల పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఆ ఆయుధాన్ని దండించడం వల్ల, ఆ నేరాన్ని అరికట్టడం సాధ్యం కాదు. దీనికి ఉపమానాలుగా, నిన్ను కాపలాగా నియమిస్తే, ఆ పని మాత్రమే చేయాలి! అంతకుమించి చేస్తే, కుక్క పని గాడిద చేసినట్టు అవుతుంది! అందుకే మన బాధ్యత పట్ల సరియైన అవగాహనతో ఉండాలి, అన్నది ఈ చరణం సారాంశం. సినిమా నేపథ్యాన్ని చరణం చక్కగా ప్రతిఫలిస్తోంది!

నిన్ను ఒక కాగడాలాగా ఎవరైనా వెలిగిస్తే, మార్గం చూపడానికి మాత్రమే నువ్వు ఉపయోగపడాలి, అంతేకానీ కార్చిచ్చుగా మారి వినాశనానికి దారి తీయకూడదు, అలా చేస్తే ఏ చేనుకు నిన్ను కంచెలాగ కావలి పెట్టారో, ఆ చేనుని నీవే మేసినట్టు అవుతుంది, అంటున్నారు సిరివెన్నెల.

చరణం:
బాణం వస్తుంటే.. దానిపైనా నీ కోపం..
దాన్ని పంపించే.. శతృవేగా నీ లక్ష్యం..
వీరధర్మం పాటిస్తే.. పోరు కూడా పూజేగా..
కర్తవ్యంగా భావిస్తూ.. రక్షణ భారం మోస్తావో..
కక్ష సాధిస్తానంటూ.. హత్యానేరం చేస్తావో..
గమ్యం మాత్రం ఉంటే చాలదు..
తప్పుడు తోవలో వెళ్లకు ఎపుడూ..

Hugo Sarvida Jr. ‘The Target’ అనే తన poemలో ఇలా అంటారు. ప్రాణం లేని ఆయుధానికి దాన్ని ఎలా ఆపాదిస్తారన్నది Hugo ప్రశ్న.

Hugh, listen How do you hit the target?
I don’t hit the target, The bullet does.
Hugh, but the bullet is a fool.
It is if you are a fool, And a big mouth too.

‘బాణం వస్తుంటే, దానిపైనా నీ కోపం, దాన్ని పంపించే శతృవేగా నీ లక్ష్యం’, అంటారు సిరివెన్నెల. నీకు ఎదురుగా బాణం వస్తుంటే, దానిమీద నీ ఆవేశాన్ని చూపించిన లాభం లేదు. ఆ బాణాన్ని సంధించిన శత్రువుని లక్ష్యంగా నిర్ణయించుకొని, వెంటాడి వేటాడాలి. లక్ష్యసాధన జరగాలంటే, ముందుగా సరైన లక్ష్య నిర్ణయం జరగాలి! వీరధర్మం పాటించి, ధర్మ యుద్ధం చేస్తుంటే.. మన యుద్ధం కూడా పూజ అవుతుంది అంటున్నారు. రక్షణ బాధ్యతలో ఉన్న నువ్వు, నీ కర్తవ్యాన్ని నిబద్ధతతో పాటిస్తావా? లేక పట్టరాని ఆవేశంతో హత్యలు చేసి హంతకుడిగా మారుతావా? అన్ని ప్రశ్నిస్తున్నారు సిరివెన్నెల. కర్తవ్య దీక్షలో ఉన్నప్పుడు కక్ష సాధింపు దిశగా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని కథానాయకుడిని హెచ్చరిస్తున్నారు.

Ends justify the means- గమ్యం మార్గాన్ని నిర్దేశిస్తుందని గాంధీ మహాత్ముడు నమ్మితే, Means justify the ends -మార్గాలు గమ్యానికి దారితీస్తాయని Machiavelli ప్రతిపాదించాడు. ఒక గమ్యాన్ని సాధించడానికి మార్గం ఏ విధంగా అయినా ఉండవచ్చు. కానీ, ధర్మ మార్గం అయితే దాని ఫలితం సర్వజన సమ్మతంగా ఉంటుంది. తప్పుడు దారిలో, ఆ గమ్యాన్ని సాధించాలని ప్రయత్నిస్తే, ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే, ‘తప్పుడు దోవలో ఎప్పుడూ వెళ్ళకు’, అన్న బలమైన పాఠాన్ని నేర్పుతున్నారు సిరివెన్నెల.

కాంతి వేగంతో అనుకున్నవన్నీ సాధించాలని, రాత్రికి రాత్రి అందలాలు ఎక్కేయాలని, అనూహ్యంగా ధనం సంపాదించాలనీ.. పదవులు సంపాదించాలని, అడ్డదారులు తొక్కుతూ.. ముందుకు దూకుతున్న వారెందరో సమాజంలో మన చుట్టూ కనిపిస్తుంటారు. అటువంటి వారందరికీ, బెత్తం పట్టుకుని, చెవులు మెలేసి, గుణపాఠం చెప్తున్నారు సిరివెన్నెల. ‘తప్పు దోవల నడచు వారిని, చప్పరించి మింగె శక్తులు.. చెప్పలేదంటనకపొయ్యేరు..’ అనే బ్రహ్మంగారి తత్వం లాగా, ముందస్తుగా తప్పు దోవలో నడవ వద్దని హెచ్చరిస్తున్నారు.

తనదాకా పాట వ్రాసే ఏ అవకాశం వచ్చినా, దాన్ని ఒక అవకాశంగా మలుచుకొని, తను చెప్పాలనుకున్నది ఆ పాట ద్వారా చెబుతూ, ఇటు ఆ చిత్ర సన్నివేశానికి, అటు సిరివెన్నెల పాటలోని సందేశాన్ని అందుకోవడం కోసం ఆత్రుతగా వేచి చూసే శ్రోతలకు – రెండు వైపులా న్యాయం చేస్తూ.. అనుభవ సారాన్నీ, జ్ఞాన సారాన్నీ పంచుకుంటూ వెళ్లడమే, సిరివెన్నెల గారికి వెన్నతో పెట్టిన విద్య!

Images Source: Internet

Exit mobile version