శిశుపాల వధ – కురుక్షేత్ర యుద్ధానికి నాంది పలికిందా?

0
2

[శ్రీ పాలకుర్తి రామమూర్తి రచించిన ‘శిశుపాల వధ – కురుక్షేత్ర యుద్ధానికి నాంది పలికిందా?’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

[dropcap]ప్ర[/dropcap]పంచంలో కార్యకారణ సంబంధంలేని సంఘటనలు ఉండవు. రామాయణంలో మంథర పాత్ర చిన్నదే కాని రామాయణాన్ని ఒక మలుపు తిప్పింది. అలాగే మహాభారతంలో శిశుపాలుడు, శకుని పాత్రలు కూడా ఒక మలుపు తిప్పాయి. సున్నాలెన్ని పెట్టినా వాటికి విలువ లేదు.. కాని వాటి ప్రక్కకు ఒకటిని చేరిస్తే పెట్టిన ప్రతి సున్నాకూడా దాని విలువను పెంచుతాయి. విడిగా శిశుపాలుడు, శకుని, దుశ్శాసన లాంటి పాత్రలకు విలువ లేకపోయి ఉండవచ్చు.. కాని అవి ప్రధాన పాత్రలతో కలిసినప్పుడు వాటి ప్రాధాన్యతను పెంచాయి.. అంతేకాదు.. అవే మూల కథకు ప్రాణశక్తులుగా మారాయి.

శిశుపాలుడు ఛేది దేశానికి పాలకుడు. పాండవులకు పెదతల్లి కుమారుడు. ఇతని తల్లి సాత్వతి, తండ్రి దమఘోషుడు.. సాత్వతి వసుదేవుని చెల్లెలు.. కృష్ణునికి మేనత్త. ఇతడు జన్మించిన వేళ మూడు కన్నులు, నాలుగు చేతులతో పుట్టాడని చెపుతారు. ఆ వికృత రూపం ఎవరు ఎత్తుకున్నప్పుడు అదృశ్యమౌతుందో వారి చేతిలో అతను హతుడౌతాడని, మరెవ్వరూ అతనిని చంపలేరని అశరీరవాణి చెప్పినట్లుగా భారతం చెపుతుంది. ఒకనాడు కృష్ణుడు మేనత్త ఇంటికి వెళ్ళిన తరుణంలో ఆమె తన కుమారుని కృష్ణునికి ఇచ్చి ఎత్తుకోమనడం, కృష్ణుడు ఎత్తుకోగానే ఆ వికృత రూపం అదృశ్యమై సాధారణ రూపం రావడం జరుగుతుంది. దానికి ఆశ్చర్యపోయిన సాత్వతి కృష్ణుని.. శిశుపాలుడు చేసిన వంద తప్పులు కాయమని ప్రార్థిస్తుంది. దానికి సమ్మతిస్తాడు, కృష్ణుడు.

శిశుపాలుడు పెరిగి పెద్దవాడవుతున్నా కొద్దీ అకారణంగా కృష్ణునిపై ద్వేషం పెంచుకుంటాడు. అలాగే జరాసంధునితోనూ, రుక్మితోనూ స్నేహం కుదురుతుంది. రుక్మి తన స్నేహానికి గుర్తుగా తన చెల్లెలయిన రుక్మిణిని ఇచ్చి వివాహం చేస్తాననడం, దానికి శిశుపాలుడు సమ్మతించడం, తదనుగుణంగా వివాహానికి తరలి రావడం, ఆ సమయంలో రుక్మిణిచే ప్రార్థితుడై కృష్ణుడు ఆమెను రాక్షస వివాహపద్ధతిలో వివాహమాడడం జరుగుతుంది. ఆ సందర్భంగా జరిగిన యుద్ధంలో శిశుపాలుడు, రుక్మితో సహా జరాసంధుడూ ఓడిపోవడం.. జరాసంధుని సూచన మేరకు యుద్ధాన్ని విరమించి శిశుపాలుడు వెళ్లిపోవడం జరుగుతుంది.

తదుపరి శిశుపాలుని పాత్ర.. రాజసూయ యాగ సందర్భంలోనే కనిపిస్తుంది. ఒక యాగాన్ని ఆరంభించిన వేళ యాగానికి ప్రథమ పూజనీయునిగా ఒకరిని ఎన్నుకొని అతనిని అర్చించడం ఆచారం. సాధారణంగా, ఈ అగ్ర పూజను స్నాతకునికి గాని, ఋత్విజునికి గాని, గురువుకు గాని, దగ్గర సంబంధీకులకు గాని, ఒక మహారాజుకు గాని లేదా తనకు బాగా ఇష్టమైన వారికి గాని నిర్వహించడం సంప్రదాయం. ఆ సంప్రదాయానుసారంగా, ధర్మరాజు భీష్ముని సలహా మేరకు కృష్ణుని అర్చించడం.. దానికి శిశుపాలుడు ఆక్షేపించడం జరుగుతుంది.

శిశుపాలుడు ఆ సమయంలో.. ధర్మరాజుతో.. “ధర్మజా! నీవు అవివేకియై మసలితనంతో మతి చలించిన భీష్ముని సలహాతో కృష్ణునికి అగ్రతాంబూలం ఇచ్చావు. ఈ సభలో ఇంతమంది రాజులు ఉన్నారు.. వారిని వదలి రాజరికంలేని యాదవుడైన కృష్ణుడుని పూజించావు. అలాగే వ్యాసుని లాంటి ఋత్విజులు ఉన్నారు.. వసుదేవుని లాంటి పెద్దవారు ఉన్నారు. కృపుడు, ద్రోణుడు లాంటి ఆచార్యులూ ఉన్నారు.. వారందరినీ కాదని అవివేకివై ఏ అర్హతా లేని కృష్ణుని పూజించి ఈ సభను అవమానించావు. నీవు ధర్మపరుడవని ఈ సభాసదులందరూ నీ ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. అందరినీ అవమానించావు. నిజంగా మీకు కృష్ణునిపై ప్రేమ ఉంటే అతనికి ధనాన్ని ఇవ్వండి.. లేదా ఆయనకు ఇష్టమైన కార్యాలు చేయండి అంతే కాని ఇంతమంది పెద్దలున్న సభలో అనర్హుడిని అందలం ఎక్కించడం ఆక్షేపనీయం కాదా.. ఒక నపుంసకునికి పెండ్లిచేయడం, చెవిటికి మధుర మంజులమైన పాటను వినిపించడం, గ్రుడ్డివానికి అందమైన రూపాన్ని చూపించడం ఎలాగో కృష్ణునికి అగ్రపూజను నిర్వహించడం అలాగే” అంటూ నిందిస్తాడు.

అగ్రపూజను భీష్ముడు ప్రతిపాదించాడు, ధర్మరాజు నిర్వహించాడు, కృష్ణుడు ఆ పూజను అంగీకరించాడు.. కాబట్టి ఈ ముగ్గురూ నిందితులేనని నిర్ణయించి సభాసదులందరి ముందూ ఆ ముగ్గురినీ నిందిస్తూ సపుత్ర బలుడై శిశుపాలుడు సభ నుండి వెళ్ళిపోతాడు.

అలా వెళ్లే శిశుపాలుని ప్రియ వచనాలతో బ్రతిమాలుతూ.. కార్యార్ధియైన ధర్మరాజు.. సద్గుణవంతులకు వాక్పారుష్యము తగదని, అది విషము కన్నా, అగ్ని కన్నా ప్రమాదకారి యని చెపుతూ.. “ఓ శిశుపాలా! నీవు ఒక రాజ్యానికి రాజువు, బాధ్యతగా ప్రవర్తించు.. నీకు అన్నీ మంచి గుణాలే ఉన్నాయి.. వాటికి గ్రహణం పట్టనీయకు.., ధీరునివి.. పండితునివి.. పండితుడు అంటే మంచి చెడు తెలిసి.. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేవాడు.. కాబట్టి దయచేసి సభా మర్యాదను గౌరవించి, కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి గావించే క్రమంలో నీ సహాయ సహకారాలను అందించము” అని అర్థిస్తాడు ధర్మరాజు. శిశుపాలుని మానసిక స్థితిని మార్చేవిధంగా బుజ్జగిస్తూ.. అనునయంగా బ్రతిమిలాడిన ధర్మరాజులో కార్యసాధకుని అపూర్వ వ్యక్తిత్వాన్ని చూడవచ్చు. అదే విధంగా కృష్ణుని పూజించమనడంలో భీష్ముని నిర్ణయంలోని ఔచిత్యాన్ని వివరిస్తాడు.

నిజానికి, కార్యార్థికి తన ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన అందరూ సమానమే.. ఎవరికి అసంతృప్తి కలిగినా వారిని అనునయిస్తూ తన దారికి తెచ్చుకోవడం అవసరం కూడా. వచ్చిన అందరి అతిథుల మనస్తత్వాలూ ఒకే విధంగా ఉండవు. దానికి ఉదాహరణయే.. కృష్ణుని అర్చించడంలో.. శిశుపాలుని నిరసన. నిజానికి ధర్మరాజు రాజసూయ యాగంలో అతని ఆహ్వానం మేరకు శిశుపాలుడు అతిథిగా వచ్చాడు. తనకు ఇష్టమైతే ఉండవచ్చు లేదంటే వెళ్ళిపోవచ్చు. కాని సభామర్యాదను ఉల్లంఘించడం సమంజసం కాదు. అయితే శిశుపాలునికి కృష్ణునిపై ఉన్న వ్యతిరిక్త భావన అలా కృష్ణుని పూజించడం అధర్మంగా భావించబడింది. అతనిని సమ్మతింపనీయ లేదు. అందుకే నిరసించాడు. ధర్మరాజుకు తన యాగం నిర్విఘ్నంగా సాగిపోవాలి. అందుకే శిశుపాలుని వెనుకనే వెళ్ళి అతనిని అనునయించాడు.

ఈ ఘట్టంలో ధర్మరాజు సమగ్ర వ్యక్తిత్వం ఆవిష్కృతమౌతుంది. నా ఇష్టమయ్యా.. నచ్చిన వారికి అగ్రపూజ చేసాను.. ఇష్టమైతే ఉండు లేడంటే వెళ్ళిపో అని చెప్పవచ్చు. కాని ధర్మరాజు శిశుపాలుని అనునయించిన విధానంలో అతని సమతామూర్తిమత్వం వెలుగు చూసింది. ఎదుటివారు నిందించిన సమయంలో నిగ్రహంగా ఉండడంలో భీష్ముని కన్నా ధర్మరాజు వ్యక్తిత్వం గొప్పగా కనిపిస్తుంది. కోపోద్రిక్తుడైన శిశుపాలుని ఒకవైపు అనునయిస్తూనే చెప్పవలసిన మాట కఠినంగానే చెప్పడం.. ధర్మరాజులో కనిపిస్తుంది.

ఆ సమయంలో భీష్ముడు.. ధర్మరాజును వారిస్తూ.. బాలుడు, అల్పజ్ఞుడు, ధర్మాధర్మ విచక్షణ లేని వాడునైన ఈ శిశుపాలుని బ్రతిమాలడం ఎందుకు? అంటూ.. శిశుపాలుని వ్యక్తిత్త్వంలోని అవినయ బుద్ధిని, వాక్పారుష్యాన్ని, అజ్ఞానాన్ని, ధర్మాధర్మ విచక్షణా శూవ్యతను.. సభాముఖంగా విశదం చేయడం కనిపిస్తుంది. తదుపరి.. శిశుపాలునితో.. పరాక్రమము కలిగిన క్షత్రియుడు, జ్ఞానం కలిగిన బ్రాహ్మణులు పూజనీయులు కదా.. ఈ సభలో ఉన్న రాజులను జరాసంధుడు బంధీలుగా చేస్తే ఈ కృష్ణుని దయచేతనే కదా వారంతా విడిపింపబడ్డారు, అంటాడు. దానికి తోడుగా కుక్కలు మొరిగినంత మాత్రాన సింహము యొక్క గౌరవం తగ్గదు కదా అంటూ అధిక్షేపిస్తాడు.

దానికి కోపగించిన శిశుపాలుడు భీష్ముని, కృష్ణుడిని, ధర్మరాజునూ నిందించడం, అదే సమయంలో శిశుపాలుని సైన్యాధ్యక్షుడు సునీధుడు అనే వాడు తమ పక్షంలోని వారందరినీ కూడగట్టి యుద్ధానికి సన్నద్ధం కావడం జరుగుతుంది.

ఆ సన్నివేశంలో.. జరుగుతున్న ప్రమాదాన్ని నివారించేందుకు కృష్ణుడు.. శిశుపాలుని వృత్తాంతాన్ని సభకు వివరించడమూ.. తన మేనత్తకు ఇచ్చిన మాట ప్రకారం తాను అతని వంద తప్పులు సైరించడమూ.. అకారణంగా తనను నిందించి యుద్ధ సన్నద్ధుడై యజ్ఞాన్ని భంగం కలిగించే విధంగా ప్రవర్తించడమూ వివరిస్తూ చక్రాయుధంతో శిశుపాలుని సంహరించడము జరుగుతుంది. దీనితో.. శిశుపాలుని కథ ముగుస్తుంది.. కాని ఇదే మహాభారత యుద్ధానికి నాంది పలికింది అనవచ్చు.

కృష్ణుని పట్ల శిశుపాలుడు చేసిన దురాగతాలు కొన్ని..

  1. జరాసంధుడు కృష్ణునిపై దండెత్తిన సమయంలో అకారణంగా అతనికి సాయమై కృష్ణుని పక్షాన్ని నష్టపరిచాడు
  2. కృష్ణుడు భగదత్తునిపై యుద్ధానికి వెళ్ళిన సమయంలో ద్వారకపై దండెత్తి వచ్చి ద్వారకా నగరాన్ని తగలపెట్టాడు
  3. యాదవులందరూ.. రైవతక పర్వతంపై తమ భార్యలతో ప్రమత్తులై సంబరాలు చేసుకుంటున్న ఆదమరచి ఉన్న సమయంలో వారిని అకారణంగా వధించాడు
  4. వసుదేవుడు అశ్వమేధయాగం చేసిన వేళ యాగాశ్వాన్ని హరించి యజ్ఞానికి విఘాతం కల్పించాడు
  5. భభ్రుడు అనే యాదవుని భార్యను అపహరించి తన భార్యగా చేసుకున్నాడు

ఇలా ఎన్నో సందర్భాలలో శిశుపాలుడు చేసిన ద్రోహాలను కృష్ణుడు సభలో చెప్పడం జరుగుతుంది.

ఈ సందర్భంగా కొన్ని అంశాలు విచారించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా పవిత్రమైన యాగ నిర్వహణ సమయంలో శిశుపాలుడు అనుచితంగా ప్రవర్తించినా అతనిని శాంతింపచేయాలే కాని సంహరించడం సమంజసమా? అంటే.. అక్కడ ఉన్న సందర్భం అలాంటిది..

  1. ధర్మరాజు బ్రతిమాలిన సమయంలో శిశుపాలుడు శాంతించాలి లేదా వెళ్లిపోవాలి కాని యుద్ధ సన్నద్ధుడై యాగానికి విఘ్నం కలిగించే విధంగా ప్రవర్తించడం సమంజసం కాదు. శిశుపాలుడు శాంతించని సమయంలో పాండవులకు అతనిని శిక్షించడం తప్ప మరొక మార్గం లేదు
  2. యుద్ధ సన్నద్ధుడై శిశుపాలుడు, అతనిని సమర్ధించే రాజులు ఒకవైపు, పాండవుల పక్షాన ఉన్నవారు మరొకవైపు కయ్యానికి కాలుదువ్వే సమయంలో యుద్ధమే జరిగితే రక్తపాతం జరగడమే కాక యజ్ఞ వేదిక అపవిత్రం అయి యాగం భగ్నం అవుతుంది.
  3. అంతేకాదు, యజ్ఞ దీక్షలో ఉన్న ధర్మరాజు శిశుపాలుని శిక్షించడం సమంజసం కాదు కాబట్టి ఆ బాధ్యత యజ్ఞ సంరక్షకునిగా కృష్ణుడు తీసుకున్నాడు
  4. అక్కడ.. జరుగుతున్న సంక్షోభం సమసిపోవాలి అంటే శిశుపాల వధ జరగాలి కాని పెద్దగా రక్తపాతం జరగ వద్దు. అందుకే చక్రప్రయోగం చేసాడు..
  5. ఆ వధను కూడా సభాసదులు ఆక్షేపణ చేయవచ్చు.. ఆ అవకాశం ఇవ్వవద్దు.. కాబట్టే శిశుపాలుని దురాగతాలను, తన పట్ల అనుచిత ప్రవర్తనను సభలో అందరికీ చెప్పాడు

ఇలా భారతంలో శిశుపాలుడు మరణించిన వేళ.. దుర్యోధనుడు తన మనసులో పాండవుల బలపరాక్రమాలను బేరీజు వేసుకోవడం ఆరంభించాడు. తన బలాబలాలు , పాండవుల బలాబలాలు ఎలాంటివో తెలుసుకోగలిగాడు. కృష్ణ సహాయులై, అజేయులైన పాండవులను తాను శక్తితో జయించలేనని గ్రహించాడు కాబట్టే శకుని చెప్పిన మాయోపాయానికి తలొగ్గాడు. దాని ఫలితమే.. దుర్ద్యూతం.. తదుపరి పరిణామాలు.. చివరగా మహాభారత యుద్ధం.

చివరగా.. ఈ ఘట్టం ఆధునిక సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే.. ఈ ఘట్టాన్ని లోతుగా చదివితే ఇందులో చెప్పబడిన భావ వ్యక్తీకరణ నైపుణ్యం, వినియోగదారుల మనస్తత్వాలు, వాటిని ఎలా గుర్తించి సమన్వయం చేసుకోవాలో చెప్పిన వైనం, కార్య నిర్వహణలో ఎదురయ్యే సంక్షోభాలు, వాటిని అధిగమించే విధానాలు, నాయకునిగా అందరినీ సమన్వయపరచడం, సహాయకులను బృందాలుగా ఏర్పరచడం, ఆ బృందాన్ని సమర్ధవంతంగా లక్ష్యం వైపు నడిపించడం, పరిణతి చెందిన మెంటార్ యొక్క మార్గదర్శన, ఇలాంటి ఆధునిక యాజమాన్య, నాయకత్వ లక్షణాలను ఎన్నింటినో చెప్పుకునే అవకాశం ఉన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here