Site icon Sanchika

సీత -1

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత్రి స్పందన అయాచితం – సంచిక పాఠకుల కోసం రచించిన ‘సీత‘ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]గుం[/dropcap]డె లోతుల్లో బరువు!

కళ్ళ నిండా నీళ్ళు.

గొంతు కూరుకున్న దుఃఖంతో వణుకుతున్న వళ్ళు.

భారంగా నా అడుగు…

నా జీవితం ముగిసింది అన్న ఆవేదన…

నా ఆశ చెదిరింది అన్న నిస్పృహ….

నా భవిష్యత్తు ఇక లేదన్న నిరాశ…

ఒక మనిషికి ఇంతకన్నా సినిమా కష్టాలు ఏం ఉంటాయి? చెప్పండి…..

నా బ్యాగ్‌లో ఇన్ని ఎమోషన్స్ నా భుజం మీద వేసుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను.

ఇంతలోనే వినిపించింది ఒక అరుపు.

కొంచెం అప్రమత్తమై సరిగ్గా విన్నాను.

మళ్ళీ అరిచారు..

నా పేరే … రాజీవ్

స్లోమోషన్‌లో వెనక్కి తిరిగా…

ఎదురుగా అమ్మాయి. నేను ప్రేమించిన అమ్మాయి… పట్టుబట్టతో ఒంటినిండా నగలతో, తలనిండా పూలతో, ఏడ్చి వాచిపోయిన కళ్ళతో ఎదురుగా ఆ అమ్మాయి.

“వచ్చేసాను రాజీవ్, నీకోసం అన్ని వదిలేసి వచ్చేసాను. నాకు ఈ పెళ్ళి… ఈ డబ్బు… ఏమి వద్దు …. ఎవరు వద్దు.

నువ్వు కావాలి….

నువ్వే కావాలి…”

ఎక్కిళ్ళు పెడుతూ వచ్చి నన్ను వాటేసుకుంది.

“నేను నిన్ను వదిలి ఉండలేను” అంటూ నేను వాటేసుకున్నా..

“ఒరేయ్ లేరా”

“నువ్వు లేకపోతే బతకలేను”

“ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావు?? లేరా”

“నేను చచ్చిపోతాను”

“ఏంటి?”

“ఒరేయ్ …”

ఏంటి అపశ్రుతి?

ఏంటి చేతుల్లో అమ్మాయి ఇంత మెత్తగా ఉంది. కళ్ళు తెరిచా..

ఎదురుగా అమ్మ.. వింతగా నన్ను చూస్తూ…

చేతిలో దిండు…. నలిగిపోతూ…

చుట్టూ చూస్తూ నెమ్మదిగా లేచి కూర్చున్నాను.

“లేరా…! ఆఫీస్‌కి వెళ్ళవా?”

“ఏంటి కలా?? టైం ఎంతయిందో చూసావా??” అమ్మ వాచ్ చూపింది.

‘బాబోయ్ ఎనిమిది ….’

కల నుంచి బయటపడి, పీడకల లాంటి జీవితంలోకి వచ్చిపడ్డాను.

ఆ రోజు మొదలు పెట్టాను.

ఏమిటో తెలియదు, ప్రతీరోజు నా జీవితంలోని మొదటి సీన్, సినిమాలోని చివరి సీన్తో ప్రారంభమౌతుంది.

చిన్నప్పటినుంచి అంతే.

ఒక అమ్మాయిని లేపుకుపోయి పెళ్ళిచేసుకోవాలని నాకు తెగ పిచ్చి.

అందుకే నాకు ఇలాంటి కలలు కొత్తేమి కాదు. పడుకుంటేనే వచ్చేవి కల అంటే నేను కాదంటాను. ఎందుకంటే నేను పగలు కూడా ఇలాంటి కలలు కంటాను. దాని వెనుక ఓ కారణం ఉంది.

నేను విపరీతంగా తెలుగు సినిమాలు చూస్తాను.

విపరీతంగా అంటే ఎంత? అని మీ ఉద్దేశం.

నెల కొకటి?

వారాని కొకటి?

కాదండీ బాబు… రోజుకొకటి? …

అంతకన్నా కాదు పూట కొకటి.

నిజం, మీరు చదివింది నిజమే.

శని ఆదివారాల్లో కనీసం నాలుగు నుండి అయిదు సినిమాలు చూస్తాను.

అమ్మ ‘నాకు పిచ్చిపట్టింది’ అంటుంది.

నేను ప్యాషన్ అంటాను. నాన్న మాత్రం అవసరం అంటారు.

అసలు అసలు నాకు ఈ పిచ్చి అంటించింది మా నాన్నే.

కాని ఆయన అన్నది అక్షరాల నిజం…

నాకు అవసరం.

ఎందుకంటే నేను పెరిగిందంతా లండన్‌లోనే.

నాకు ఎనిమిదేళ్లుప్పుడు కుటుంబం మొత్తం లండన్‌కి వచ్చి, ఇక్కడే స్థిరపడి పోయాం. మళ్ళీ ఇండియా వెళ్ళలేదు. పైగా మా అమ్మ బ్రిటిష్ అమ్మాయి.

పేరు….. సారా!

పాపం అమ్మ నాన్న కోసం ఎదో చిన్నచిన్నగా తెలుగు నేర్చుకొని తంటాలు పడుతుంది.

నాన్న ఉన్నప్పుడు నాతో తెలుగులో మాట్లాడుతుంది. కాని నాన్న మాయం, తెలుగు మాయం. ఇక లాభం లేదని నాన్న నాకు తెలుగు సినిమాలు అలవాటు చేసాడు.

చిన్నప్పుడు వారాని కొకటి తప్పకుండా చూసేవాళ్ళం. అంటే అప్పట్లో సి.డి.లు, డి.వి.డి.లు ఉండేవి. కాని ఇప్పుడు… సినిమాలు ఎక్కడ పడితే అక్కడ….

యూట్యూబ్‌లో, నెట్‌ఫ్లిక్స్‌లో, అమేజాన్‌లో – తెలుగు కోసం మొదలుపెట్టిన సినిమాలు ఇప్పుడు జీవితంలో ఒక భాగమయ్యాయి.

అయినా తప్పు నాది కాదు. మన తెలుగు సినిమాల సంగతే అంత. వాటి గురించి చెప్పుకోవటానికి ఒక పుస్తకం ఏం సరిపోతుంది?

అబ్బ పాటలు, ఫైట్లు, ట్విస్ట్లు, మసాలాలు …. లాస్ట్‌కి హీరో హీరోయిన్ను పెళ్ళి మండపంనుంచి లేపుకుపోయే సీన్…

అబ్బో సూపరోసూపర్….!

అందుకేనేమో అన్నీ సినిమాల్లో ఒకే సీన్ ఉంటుంది. ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్. లాస్ట్ సీన్లో హీరోయిన్‌కి విలన్‌తో పెళ్ళి. ఉన్నట్టుండి ట్విస్ట్, ఒక ఫైట్, హీరో వచ్చి, హీరోయిన్ను పెళ్ళి చేసుకుంటాడు.

చూస్తూ ఉండండి….. నేను కూడా హీరోలాగా ఏదో ఒక రోజు పెళ్ళి మండపంనుండి అమ్మాయిని లేపుకుపోతాను. అదే నా చిరకాల వాంఛ.

ఇదే నా డ్రీమ్‌లైఫ్. రీల్లైఫ్.

మరి రియల్ లైఫ్ అంటారా?

ఇక నా అసలు విషయాని కొస్తే…. నేను లాయర్ని…

లాయర్ డ్రస్స్ లాగా రియల్ లైఫ్ కూడా బ్లాక్ ఎండ్ వైట్‌లా బోరింగా ఉంటుంది.

సోమవారం నుండి శుక్రవారం వరకు ఆఫీస్. శని, ఆది వారాలు సినిమాలు, ఫ్రెండ్స్.

అంటే….!! ఆ….. నాకు మీ డౌట్ అర్థం అయింది.

గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఎవ్వరితో పెద్ద సెట్ కాలేదు.

మహా అయితే ఆర్నెల్లు అంతే.!..

చివరిది రెబెక అనే అమ్మాయి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ విడిపోయాం.

రెబెక వెళ్ళిపోయాక జీవితంలో డిప్రెషన్ వచ్చేసింది. తనంటే నాకు అంత ఇష్టం. వదిలేసి మూడు సంవత్సరాలు అయ్యింది. కాని బయటికి రాలేక పోతున్నా!

‘‘ఒరేయ్ నేను నీకు అమ్మాయిని వెతకనా?’’ అమ్మ అడిగింది.

‘‘ఎరేంజ్డ్ మారేజ్? అంత సీన్ లేదు!!!’’ అన్నాను.

‘‘అంతా నా ఖర్మ….’’ అమ్మ మొఖం మాడ్చుకుంది.

నేనేం మాట్లాడలేదు. ఏం చేసినా తగ్గేది లేదు. డిసైడ్ అయ్యిపోయాను ….

‘‘ఒరేయ్! అసలు నీకు అమ్మాయిల్ని పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉందా? లేక అబ్బాయింటే ఇష్టమా? నిజం చెప్పు.’’ అంది అమ్మ.

‘‘అమ్మా! మ్మా… మ్మా…. మ్మ!? (రీసౌండ్).

ఎంత మాట అన్నావు? ఈ రొమాంటిక్ హీరోకి ఒక్క అమ్మాయితో కాదు. పది మంది అమ్మాయిల్తో పెళ్ళి అవుతుంది.’’ నా సమాధానం.

‘‘వద్దు నాయనా! నాకు ఒకటి చాలు. సరే! ఎలాగో మీరిద్దరు విడిపోయారు. ఇప్పుడైనా నీకు నచ్చిన ఒక ఇండియన్ అమ్మాయిని పెళ్ళి చేసుకోరా!!’’ అమ్మ బతిమాలింది.

‘‘అమ్మా! ఒకటి అడగనా? నువ్వు బ్రిటిష్ అమ్మాయివి కదా!! కానీ ఎప్పుడు తెలుగుమ్మాయిని పెళ్ళిచేసుకో అంటావ్ ఎందుకనీ??’’.

‘‘నేను పెళ్ళి అయిన కొత్తలో ఎనిమిదేళ్లు హైదరాబాద్‌లో ఉన్నాను. అప్పుడు తెలుసుకున్నాను. తెలుగమ్మాయిులు కుటుంబం కోసం, ప్రేమించినవాడి కోసం ఏదైనా చేస్తారు. ప్రాణాలైన ఇస్తారు. వాళ్ళ త్యాగం వేరు.’’ అమ్మ ఏదో పరవశంగా చెప్పుకుపోతుంది.

‘‘ఇలా రా…. నా పక్కన కూర్చో…!!’’

వెళ్ళి నేను అమ్మ పక్కన కూర్చున్నాను.

“ఒరేయ్ ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా అని ఎంతమందిని చూపించావురా? నేనేమన్నా అన్నానా?! సరే నీ అంతట నువ్వే తెలుసుకుంటావు అని వదిలేశాను.”

“అమ్మా! అవన్ని వేరు, ఇది వేరు…!”

“అలా అందరి అమ్మాయిల గురించి అదే చెప్పావు.”

“నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయితో అయినా ఈ మూడేళ్ళ నుంచి చనువుగా ఉన్నానా?”

“అప్పుడంటే చిన్న వయస్సు. ఇప్పుడు వేరు.”

“అమ్మా ప్లీజ్ …! రెబెకాని మరిచిపోలేకపోతున్నా. అయినా ఇప్పుడు అవన్నీ పాత విషయాలు అమ్మా.”

“సరే! ఇప్పుడేమంటావు? పోనీ ఎన్ని రోజులు ఇలా ఏడుస్తు కూర్చుంటావు?…”

“‘ఆ పిల్ల కాదు, ఈ పిల్ల …’ అని నువ్వు రోజుకో అమ్మాయిని తెస్తే ….. నోరు మూసుకోవాలి. కాని నేను చూడమన్నది ఒకే ఒక్క అమ్మాయిని చూడనంటావ్…. అంతే కదా!!’’

“అలా కాదు అమ్మా!”

“అంతే కదా?? అవునా? కాదా?” అమ్మ చాలా కోపంగా ఉంది.

‘బ్లాక్ మెయిల్’ మొదలు పెట్టెంది.

“సరే అమ్మా చూద్దాం…!!”

“అబ్బ థాంక్యు రా!! థాంక్యూ వెరీ వెరీ మచ్.”

ఇంత చిన్నదానికే అమ్మ ఇంతగా ఎoదుకు రిలాక్స్ అయ్యిందో ?! పాపం పిచ్చి అమ్మ.

(సశేషం)

Exit mobile version