సీత-10

0
2

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత్రి స్పందన అయాచితం – సంచిక పాఠకుల కోసం రచించిన ‘సీత‘ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]న్నయ్య తనని అర్థం చేసుకోవటం లేదన్న అసహనం స్పష్టంగా కనిపిస్తోంది.

శంకరం ఏదో సర్దిచెప్పాడు….. కాని మనసులో మాత్రం కొంచెం అనుమానంగా ఉంది.

“తరువాత ఏం జరిగింది బాబాయ్?” నేను ఆత్రుతతో అడిగాను.

“మీ సుందరం బాబాయ్ తనకు కెనడాకి వీసా వచ్చిన సంగతి దాచిపెట్టి, ఎవరితోనూ చెప్పకుండా పారిపోయాడు. అది తెలిసి, ఆ అమ్మాయి రెండోసారి కూడా తన పెళ్ళి చెడిపోయిందని ఆత్మహత్య చేసుకుంది. సుధకి రవీందర్ అనే అన్నయ్య ఉన్నాడు. దీనంతటికీ మీ నాన్నే కారణం అని…. రవీందర్ మీ నాన్న కనబడితే చంపేస్తాన్నని కోపంతో పెద్దపెద్దగా అరుస్తూ ఊరంతా తిరిగాడు. హైదరాబాద్ వస్తున్నాడని తెలిసి…. మీ కుటుంబమంతా రాత్రికి రాత్రి ముంబయ్‌లో ఉన్న మీ నాన్న స్నేహితుడి దగ్గర ఆశ్రయం తీసుకొని అక్కడ నుంచి లండన్‌కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇరవై ఏళ్ళ తరువాత…. ఇదిగో ఇలా…..”

‘అయ్యో అవునా? ఆ అమ్మాయి పాపం చనిపోయిందా?’ నా గుండెందుకో ఒక్కసారి బరువెక్కింది.

***

“అది సరే బాబాయ్. మరి మీతో నాన్న మాట్లాడటం ఎందుకు మానేశాడు?”

“మీ నాన్న, బాబాయ్ ఇద్దరు వెళ్ళిపోయారు. కాని మా నాన్నకి మీ తాతయ్యకు ఒక రోజు పెద్ద గొడవ జరిగింది. ‘మొత్తం డబ్బు శంకరం, సుందరం మీద ఖర్చు చేశావు. మా పిల్లల భవిష్యత్తు ఏంటి?’ అని నాన్న ఆస్తి వాట ఇచ్చేయమని గొడవపెట్టుకున్నాడు.  దానికి మీ తాతయ్య ఆస్తి అంతా తన తమ్ముడు అదే మా నాన్న పేరిట రాసి…. కొన్ని రోజుకు చనిపోయాడు. మీ తాతయ్య చనిపోయిన సంగతి మీ నాన్నకి చాలా రోజు తరవాత తెలిసింది. తప్పంతా మా నాన్నదే అని మాట్లాడటం మానేశాడు.”

***

“సరే…. ఈ గొడవన్నీ మా తరంతోనే ఆగిపోవాలని, పిల్లలెవ్వరికి ఈ విషయం చెప్పలేదు.”

“మరి ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు?”

“సుధకి ఒక అన్నయ్య ఉన్నాడన్నాను కదా. రవీందర్!”

“అవును?.”

“ఆయన కూతురే ఇప్పుడు చూడబోయే సంబంధం.”

“అవునా?” నేను ఒక్క అరుపు అరిచాను.

నా నెత్తిమీద బాంబు పడినంత పనైంది.

“చూస్తూ…. చూస్తూ…. ఆయన కూతురు ఏంటి బాబాయ్? నాన్నను చంపుతా అన్నవాడు, నన్ను వదిలేస్తాడా?”

“ఒరేయ్! అంత ఎక్స్‌ప్రెషన్ వద్దురా! రవీందర్ స్వయానా నా మేనబావే కదరా! నాకు అతని సంగతి పూర్తిగా తెలుసు. అప్పుడు రవీందర్ ఆవేశపరుడు. ఇప్పుడు రవీందర్ ఆడపిల్ల తండ్రి. చాలా తేడా ఉందిరా. అంతే కాదు రవీందర్ స్వయంగా మీ నాన్నతో మాట్లాడాడు. ఆ తరువాతే నీకు చెప్పాను. కావాలనుంటే మీ నాన్నకి ఫోన్ చేసి కనుక్కో. అయినా నువ్వేమీ పెళ్ళి చేసుకోవాని లేదు. అమ్మాయిని చూసి, నచ్చితేనే… నచ్చకపోతే, మంచిది.”

“కానీ నచ్చితే?”

“ఇన్నేళ్ళు విడిపోయిన కుటుంబాలు మళ్ళీ నీ వల్ల కలుస్తాయి. మీ నాన్న అంత బాధతో దూరమైన బంధాలు ఇప్పుడు ఆనందంగా దగ్గరౌతారు. వెళ్ళి చూసి రావడమే… కదా! ఆలోచించు….!”

కథంతా విన్నాక ఒప్పుకోక తప్పులేదు.

ఇందుకా….. నాన్న ఇన్నిరోజులు అందరికి దూరం అయ్యాడు.

సరే, ఒక వేళ పెళ్ళి కుదరకపోయినా ఫరవాలేదు. కానీ కనీసం ఆ కుటుంబాన్ని కలిసి, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పిరావచ్చు.

ఎంత కాదన్నా … నాన్న వల్ల ఆ కుటుంబానికి జరిగింది అన్యాయం అనే చెప్పుకోవాలి.

***

ముహూర్తాలు చూసుకొని, ఇంటిల్లిపాదీ అందరం బయలుదేరాం. పెట్టుకున్న ముహూర్తం పెంటలానే ఉంది. మధ్యలో కారు ఆగిపోయింది. ఎనిమిది గంటలు అవుతుందట రిపేర్ కావడానికి. అమ్మాయిల్ని, సామాన్లను మరో కారులో ఎక్కించాం. మేమంతా ఏడ్చుకుంటూ, ఏడ్చుకుంటూ దారిలో వచ్చిన బస్సు ఎక్కాం. ఆ తరువాత రైల్వే స్టేషన్లో దిగి, ట్రైన్ ఎక్కాం. ట్రైన్ ఫుల్ రష్‌గా ఉంది. అందరూ ఇరుక్కొని కూర్చున్నాం. ఎటు తిరిగినా చెమట కంపు. ఒక అరగంట నిలుచున్నాక… మాకు కూడా కూర్చోడానికి కొంచెం చోటు దొరికింది.

నేను అరవింద్ కొంచెం స్థిరపడ్డాం. చాలా అలసటగా ఉంది. రెండు గంటలే ప్రయాణం అంట. ఎలాగో కానిచ్చేయాలి.

***

ప్రయాణీకుడు 1.

ఏంటో అరగంటనుంచి ఒకతను నన్ను తెగ చూస్తున్నాడు. సుమారు అరవై ఏళ్ళుంటాయి.

కాసేపటికి “మీరు ఏమి చేస్తుంటారూ?” మెల్లగా మాట కలిపాడు.

“నేను లండన్‍లో ఉంటాను.”

“అవునా? మరి ఇక్కడ చూడటానికి వచ్చారా?”

వెంటనే అతను కొంచెం ముందుకి వంగి … మొఖంలో మొఖం పెట్టి … కళ్ళలో కళ్ళుపెట్టి చూస్తున్నాడు.

నేను తల ఇటు తిప్పితే ఇటు, అటు తిప్పితే అటు, పిల్లిలాగా చూస్తున్నాడు. ఇక లాభం లేదని, కొంచెం మొహమాటంగానే అవునని తల ఆడించాను.

“పెళ్ళైందా?” ముప్పైఆరు పళ్ళు కనిపించేలా ఇకిలించాడు.

ఏంటో ఇంత జరిగాకా… పెళ్ళి అనేది నన్ను దయ్యమై వెంటపడుతోందా? అన్న ఫీలింగ్ వచ్చింది. ఎక్కడికెళ్ళినా అదే విషయం.

‘‘లేదు.’’ అన్నాను.

“ఏం?”

“ఏం ఏంట్రా? నీ బొంద….” వాడి పీక పిసికేయాలన్నంత కోపం వచ్చింది.

అసలే మూడ్ఆఫ్‌లో ఉన్నా… దాని మీద కార్ రిపేర్… తొక్కలో ట్రైన్ జర్నీ …. ఆపైన ఈ చెత్త ప్రశ్నలు.

“పెళ్ళిచేసుకోవాలి బాబు…. ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి.”

ఇంకోమాట మాట్లాడింటే చంపేసుండేవాడిని… ఇక్కడి జనాలకి ఎదుటివాడితో పనిలేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు చెప్పాల్సింది చెప్పేస్తాడు. అంతే… వాడి అదృష్టం బాగున్నట్టుంది. వెంటనే వాడి స్టేషన్ వచ్చింది దిగిపోయాడు. అదే స్థానంలో మరొకడు వచ్చాడు.

***

ప్రయాణీకుడు 2.

వాడూ మొదలు పెట్టాడు.

“పెళ్ళైందా?” అదే ప్రశ్న.

ఓరి దేవుడో! ముప్పైఏళ్ళు వచ్చినా, పెళ్ళికాకపోతే ఏదో మహాపాపం చేసినట్టు… ఏదో జీవితంలో కోల్పోయినట్టు … ఇక అదే పనైనట్టు.

ఈసారి ఆ ప్రశ్న నుంచి తప్పించుకోవాలి అనుకున్నా …

“పెళ్ళైందా మీకు?”

ఏదో ఆలోచిస్తున్న నన్ను మళ్ళీ అడిగాడు.

“ఆ …. అయ్యింది.”

పిల్లలు?

ఏంటో…. వీడు ప్రశ్న తరువాత ప్రశ్న లింక్ ముందే పెట్టుకున్నాడు.

“పిల్లలు ఉండాలి బాబు. పిల్లలు లేకపోతే జీవితమే లేదు.” ఓ రేంజ్లో క్లాస్ పీకాడు.

‘ఒరే! నాశనమైపోతార్రా… మీరంతా నాశనమైపోతారు.’ అనుకున్నాను.

***

ప్రయాణీకుడు 3.

“పెళ్ళైందా?”

“అయ్యింది.”

“పిల్లలు?”

“ఉన్నారు!.”

“ఎంత మంది?”

“ఒకరు!.”

“ఒక్కరేనా?”

ఏదో… ఎల్‌కేజి ఫెయిల్ అయ్యావా? అన్నంత ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు.

ఒక్క పిల్లోడితో కూడా ప్రాబ్లమేనా? ఒక ప్రశ్నతో ఆగిపోరా మీరు?

ఛీ ఛీ పైకి అనలేక లోలోపలే తిట్టుకున్నా.

“ఇద్దరు పిల్లలు ఉండాలి బాబు. ఒకరు అయితే ఎలా? ఒకరికి ఒకరు తోడుంటారు.”

మళ్ళీ క్లాసు.

లాభంలేదు…. తప్పించుకుందామని బాత్రూంకి వెళ్ళాను.

బాబోయ్! ఏంటది? బాత్రూమ్… ఆ కంపు ఏంటి?

దేవుడా! అడుగు ముందుకు వేద్దామన్నా… వెనక్కు వేద్దామన్నా… దరిద్రం. అబ్బో ఊపిరి ఆడలేదు. ప్రపంచంలో ఎంతమంది శాడిస్టులు ఉన్నారో ట్రైన్లోని బాత్రూమ్ చూసి చెప్పేయొచ్చు .

భళ్ళున భయటకి వచ్చాను…. లాభం లేదు.

ఈ పెంట కన్నా వాడి సోదే నయం… వచ్చి సీట్లో కూర్చున్న… బాబాయ్ పేపర్లో తలదూర్చేశారు. అరవింద్ పక్కోడి భుజంమీద హ్యాపీగా తలానించి పడుకున్నాడు.

***

ప్రయాణీకుడు 4.

మళ్ళీ మొదలుపెట్టాడు.

“పెళ్ళైందా?”

“కాలేదు. చేసుకోను.” తేల్చి చెప్పేశాను.

“ఎందుకనీ?” ఏదో శోధిస్తున్నట్టు అడిగాడు.

నా ముఖాన్ని కొంచెం ముందుకు వంచి, అతని చెవికి దగ్గరగా వచ్చాను.

“ఎందుకంటే… నేను అమ్మాయిల్ని ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని చెప్పి, తీసుకువెళ్ళి, దుబాయ్‌లో అమ్మేస్తుంటాను.” అని చెప్పి “ఆ అమ్మాయి మీ అమ్మాయా?” సీరియస్‌గా అతని పక్కనున్న కూతుర్ని చూస్తూ అన్నాను.

బాత్రూమ్ మీద పగంతా వాడిమీద చూపించాను.

అంతే! ఏదో సినిమాలో గ్రాఫిక్స్ చూపించినట్టు క్షణంలో మాయమయ్యాడు.

పెళ్ళంట….. పెళ్ళి… ఎదవకి.

***

ఇల్లు చేరుకునే సరికి బాగా చీకటి అయింది.

పిన్ని, అత్తయ్యవాళ్ళందరు ముందే చేరిపోయారు. మా కష్టాలతో…. అసలటతో ఏం సంబంధం లేకుండా… సీరియల్ మీద సీరియల్ చూస్తున్నారు. పెళ్ళికూతురువాళ్ళు ఎదురొచ్చి, బాగానే మర్యాదు చేసారు. ఇంత జరిగినా…. వాళ్ళంతా కంపరంగా ఉన్నా… వద్దు వద్దు అనుకుంటూనే ఆ అమ్మాయి కోసం తెలియకుండానే వెతికాను.

మనిషిని ఆశాజీవి అంటారు…. ఇదేనేమో. కానీ లాభం లేదు …. కనిపించలేదు.

అందుకే నేమో తానొటి తలస్తే… దైవమొకటి తలుస్తుంది అంటారు.

మరుసటి రోజు పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తారట. అప్పుడే కనిపిస్తుందేమో?

పెళ్ళికూతురు తరఫు బంధువుతో …. ఎప్పుడో చిన్నప్పుడు సంతలో తప్పిపోయిన అన్నాతమ్ముళ్ళలా ….. బాబాయ్, మామయ్య కౌగిలించుకుంటున్నారు…. తెగ పలుకరించుకుంటున్నారు.

నాకు ఏం తోచలేదు. చుట్టూ చూస్తూ ….. సోఫాలో కూర్చున్నాను.

ఏదో పల్లెటూరు అంటే … పాతకాలం పెద్దఇల్లులా ఉంటుందనుకున్నా… కానీ అది మరీ పెల్లెటూరు కాదు, కాస్తా టౌను. ఇళ్లు కూడా కొత్త పద్ధతిలో ఉంది. మూడంతస్తుల పెద్ద ఇల్లు. పెద్దహాలు, పెద్ద వంటిల్లు, గెస్ట్ రూమ్ కిందే ఉన్నాయి. పైన ఎన్ని రూములు ఉన్నాయో తెలియదు.

వీళ్ళది కూడా ఉమ్మడి కుటుంబం కావచ్చు. చాలామందే ఉన్నారు. పెళ్ళికూతురు మాత్రం కనిపించలేదు. భోంచేసి పడుకున్నదట.

మేము కూడా తిని, మా రూమ్‌లోకి వెళ్లాం.

***

మరుసటిరోజు తయారై, టిఫిన్స్ చేయడానికి వచ్చాను.

అందరూ అప్పటికే తయారై, బ్రేక్‌ఫాస్ట్ చేయటానికి టేబిల్ దగ్గర కూర్చున్నారు.

నన్ను చూసి, “రండి … రండి …కూర్చోండి…” అంటూ మర్యాద చేసారు.

నేను వెళ్ళి కూర్చున్నాను.

ఏంటో…. ముందే పెళ్ళి వద్దనుకున్నాని కావచ్చు…. మావాళ్ళు ఎవ్వరు పెద్దగా నన్ను పట్టించుకోవటం లేదు. ఎవరి గొడవలో వారు బిజిబిజీగా ఉన్నారు. కబుర్లు చెబుకుంటూ ఇడ్లీలు, ఉప్మాలు తినేస్తున్నారు.

నా ముందు ఖాళీప్లేటు ఉంది.

వడ్డించుకోవడానికి మొహమాటమేసింది. ఎవరైనా తిను అంటారేమో అని…. ఎదురుచూస్తున్నా…

అందరూ లొట్టలేస్తున్నారే తప్ప … అడిగినవాడు ఒక్కడూ లేడు.

ఛీ ఛీ! సుత్తిలా ఉంది. ఇంకోసారి ఇండియాకు రాకూడదు.

పెళ్ళికూతురు రానీ … దాని పని పడతా…

నాతో ఏమన్న పిచ్చి పిచ్చి వేషాలు వేయాలి… దాని పీక పిసికి చంపేస్తా.

***

“మీరేం తింటారు?” తేనెలో బెల్లం వేసినట్టు… బెల్లంలో తేనె వేసినట్టు… తియ్యని మాటలు.

తల ఎత్తి పైకి చూసాను.

అబ్బ మీరు నమ్మరు. అచ్చం సినిమాలో చూపించినట్టు జరిగింది.

కళ్ళకి మిరుమిట్లు గొలిపినట్లు … ఏదో మెరుపు తళుక్కుమని మెరిసినట్లు… పెద్ద అల వచ్చి మొఖం మీద చెళ్ళున కొట్టినట్లు …

ఏం అందం అది? మతిపోయే అందం.

“మీరు ఏం తింటారు?” మైకంలో ఉన్న నన్ను మళ్ళీ అడిగింది.

“అది ఇ… ఇ… ఇడ్లీ…..” తబబడుతూ అన్నాను….

ఆ అమ్మాయి సరే అని తల ఊపుతూ, ఇడ్లి వడ్డించింది. ఒకవేళ ఈ అమ్మాయే పెళ్ళికూతురు అయితే…. ఇప్పుడే తాళి కట్టేస్తాను.

“బాబు ఎలా ఉన్నావు?” ఎవరో పెద్దాయన పలుకరించారు.

తల తిప్పి ఆయనవైపు చూసాను.

ఎంతదూరం అయినా స్పష్టంగా వినిపించే నిఖార్సయిన కంఠం, గంభీరమైన రూపం. ఆయన్ని ఎవరు చూసినా గౌరవిస్తారు. చేతులు కట్టుకుని నిలుచుంటారు. అందుకేనేమో… ఆయన్ని చూసి, నమస్కారం పెట్టి, లేవబోయాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here