Site icon Sanchika

సీత-12

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత్రి స్పందన అయాచితం – సంచిక పాఠకుల కోసం రచించిన ‘సీత‘ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]“మ[/dropcap]రి ఇప్పుడు నీ జీవితాశయం ఏమైంది? మనది ఎరేంజ్డ్ మ్యారేజ్ కదా!” నందిని కొంటెగా అడిగింది.

“నిన్ను చూసాక… అన్నీ ఆశయాలు మారిపోయాయి.”

నందిని తలదించుకుంది.

“ఇంతకు ముందు పెళ్ళిచూపు ఏమైనా…. జరిగాయా?” మొహమాటంగా అడిగింది.

“ఆఁ ఆఁ… ఒకటి… రెండు…. అంతే…”

“మరి ఏమైంది నీకు నచ్చలేదా…?”

వాళ్ళకే మనం నచ్చలేదు…. మనసులో గొనుకున్నా…

“ఛీ ఛీ అస్సలు నచ్చలేదు…! వాళ్ళు అమ్మాయిలా? కాదు కొరివి దయ్యాలు..”

నందిని మళ్ళీ గట్టిగా నవ్వింది.

నేను మాట్లాడుతున్నంత సేపూ…. నన్ను చూసి నవ్వుతూనే ఉంది.

“మరి లండన్లో ఎవ్వరు నచ్చలేదా?”

“నచ్చారు…. కాని ఏదీ సీరియస్ కాదు. ఒక అమ్మాయితో కొంచెం సీరియస్ అయ్యింది. పెళ్ళిచేసుకుందా మనుకున్నాను. ఆ అమ్మాయి పేరు రెబెక.”

“మరి ఏమైంది?”

“ఆ అమ్మాయి పైచదువుకని అమెరికా వెళ్ళిపోయింది. దూరమైనా… దగ్గరగా ఉందామని చెప్పింది…. కాని అలా జరగదు లేదు, నాకు అన్ని అబద్దాలు చెప్పింది. మొదట్లో ఒక నెలరోజులపాటు పొద్దున ఒక మెయిల్… మధ్యాహ్నం ఒక మెసేజ్….. రాత్రి ఒక ఫోను ….. ఇలా గడిచింది.”

“తరువాత…?” నందిని ఆగలేక అడిగింది.

“తరువాత… వారానికో ఈమెయిల్… రెండు రోజులకు ఒక ఫోను… అదీ పోయి రెండు వారాలకి ఫోను. అదీ కుదిరితేనే… చూస్తూ చూస్తూ…. మూడు నెలు అలా మాట్లాడకుండా గడిచిపోయింది. తను పనిలో బిజీ ఉంది అనుకున్నాను. ఇక ఒకరోజు…

రెబెకా దెగ్గర నుండి మెయిల్ వచ్చింది, అప్పుడు అర్థం అయ్యింది నేను మోసపోయానని. తను సింపుల్‌గా విడిపోదాం అని మెయిల్ పెట్టింది. కనీసం ఫోన్ కూడా చేయలేదు.”

“మరి బాధ అనిపించలేదా?”

“మర్చిపోవడానికి మూడేళ్లు పట్టింది.”

“అవును మర్చిపోవడం కష్ట్టం కదా” నందిని తల దించుకొని దిగులుగా అంది!

“హు!” అని భుజాలు ఎగరేశాను.

“మరి నీ సంగతి ఏంటి? నిన్ను ఎవరు ప్రేమించలేదా?”

“అలాంటివి ఏమీ లేవు..!” నందిని మళ్ళీ తల దించుకుంది.

“ఏంటీ…. ఏమీ లేవా? ఇంత అందంగా ఉన్నావ్… నీవెంట ఎవరూ పడలేదా? అబద్దాలు ఆడకు…” కొంటెగా అన్నాను.

నందిని చిన్నగా నవ్వింది…. కాని సమాధానం చెప్పలేదు.

“మరి నువ్వు ఎవరైనా ఇష్టపడ్డావా?”

నందిని మళ్ళీ ఇబ్బందిగా నవ్వింది..

“ఏం పర్లేదు చెప్పు. ఇది మనిద్దరి మధ్య సీక్రెట్…. ఎవరికీ చెప్పను. నీ మీద ఒట్టు.” గుసగుసగా అన్నాను.

తను ఏం మాట్లాడలేదు.

“ఒకే…. ఏమైనా …. నైట్ టైమ్ ఫాంటసీస్…”

“అయ్యో ఛీ ఛీ, సిగ్గులేదా? అలా అడగటానికి….”

“ఛీ ఛీ నా? అంతలేదమ్మా. నేను బతికేదే వాటిమీదే.”

“అవునా?”

“మరి ఏంజిలీనా జోలి దగ్గరనుండి ఐశ్వర్య వరకు అందరూ నా డ్రీమ్ స్లేవ్స్.”

నందిని మళ్ళీ గట్టిగా నవ్వింది.

“ఇప్పుడు చెప్పు…! నీ గురించి… అబద్ధం మాత్రం చెప్పకు.”

“పెద్దగా ఏమీ లేవు… కానీ చిన్నది ఉంది. ముందు విను. నేనే ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. అదీ కాలేజీలో.. చాలా తెలివైనవాడు. కాలేజీలో తనే ఫస్ట్. ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు ఆగాను…. తను వచ్చి చెబుతాడని. అయితే ఎప్పుడు నాతో స్నేహంగా ఉండేవాడు… కానీ ఇష్టాన్ని బయటకు చెప్పేవాడు కాదు. చివరికి ఒకరోజు నేనే ధైర్యం చేసాను.”

“అవునా! తరువాత ఏమైంది?”

“అతను ఒకే అన్నాడు. తరువాత కొన్ని రోజులు గడిచాయి. కాలేజీ అయిపోయాక…. మా ఇంట్లో ఆ సంగతి చెప్పాను.”

“మరి ఏమన్నారు?” చాలా టెన్షన్‌గా అడిగాను.

“నాన్న సతీష్‌ని పిలిపించి. మాట్లాడాడు… అతని పేరు సతీష్.”

“సతీష్ అంటే… ఆరోజు షాప్లో పరిచయం చేసావ్…” సడన్‌గా గుర్తొచ్చింది.

“అవును అతనే…!”

నందిని కొంచెం భయపడిందేమో! అనిపించింది.

మొహమాటంగా తలదించుకుంది.

ఛీ ఛీ… చెత్త వెధవను… నోరు ఆగదే! నన్ను నేను తిట్టుకున్నా …

“తరువాత ఏమైంది?” ఏం జరగనట్టు మాటలు కలిపాను.

“ఏం లేదు? అతను మంచివాడు …. కాని చాలా పేదవాడు. సతీష్ తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి చాలా కష్టపడి పెంచింది. వాళ్ళకి ఇక ముందు వెనుక ఎవ్వరు లేరు. ఏమీలేదు. రెక్కాడితే కానీ డొక్కాడదు. అంటే ఏరోజు సంపాదన ఆరోజుకే.

నాన్నకు ఇష్టంలేదు….. మనకు తగని సంబంధం, మన పరువుకి పేరుకి సరిపోని సంబంధం అని చెప్పారు.

నేను ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. చివరికి, చచ్చి పోతాను అని చెప్పా. నువ్వు చచ్చిపోయిన  నాకు ఇష్టమే కానీ ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పారు. అందుకే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను.”

నందిని కిటికిలోనుండి బయటకు చూస్తూ…. ఏదో లోకంలో ఉన్నట్టు మాట్లాడుతోంది.

“అంతా బాగానే ఉంది కానీ ఈ పెళ్ళికి ఒప్పుకున్నా….” అని చివర్లో అంది. అదే కొంచెం నాకు ఇబ్బంది పెట్టింది.

“అంటే నాకు కూడా ఇష్టమే అనుకో…మన తల్లితండ్రులు ఏం చేసిన మన మంచికే కదా!”

నా మాడిన మొఖం నందిని అర్థం చేసుకుందనుకుంట. వెంటనే మాట మార్చేసింది. అయినా ఈ రోజుల్లో ఇది చాలా చిన్న విషయం అనుకున్నవన్నీ  కుదరవు కదా!

“పోనీలే అయిందేదో అయిపోయింది. ఇప్పుడు హాపీనే కదా?” నందిని అన్నమాట నాకు హాపీగా అనిపించింది. ధీమాతో అడిగాను.

నందిని నవ్వుతూ తల ఊపింది.

“నిజంగా? లేక ఏదో తప్పదు కదా.. ఎవడైతే ఏంటి అని చేసుకుంటున్నావా?”

“అయ్యో ఛీ ఛీ…. అలాంటిది ఏమీ లేదు.”

“నిజంగా అదంతా మరిచిపోయాను, లేకపోతే ఇవ్వన్నీ నీ దగ్గర దాచిపెట్టేదాన్ని కదా. .”

“నువ్వు నచ్చావు కాబట్టే…….” నందిని కంగారుగా చెప్పింది.

“హే! జోక్‌గా అన్నాను. దీన్ని సీరియస్‌గా తీసుకోకు.”

నందిని కంగారు చూసి నాకు పాపం అనిపించింది.

అంతే! ఆ నిమిషం నుంచి మేం మంచి స్నేహితులమయ్యాం. మాటల మధ్యలో సూటిగా చెప్పాను.

“నందిని! నాతో పెళ్ళయ్యాక నువ్వు ఏ బంధాలు తెంపుకోవద్దు. నీ పాత స్నేహితులతో స్నేహంగా ఉండొచ్చు. హాయిగా ఉండు…. అంతే!”

***

“ఏంటి? రచన విషయం….” నేనే ఫోన్ చేసి మాట్లాడాను.

“ఏ విషయం?”

“నువ్వు, ఎంగేజ్‌మెంట్‌కి రాకపోతే ఎలా?”

రచన ఏం మాట్లాడలేదు.

“ఇంకో రోజు ఆగితే నా ఎంగేజ్మెంట్. మీరు నా బెస్ట్ కపుల్…. నువ్వు, అరవింద్ గొడవపడితే పడ్డారా ఏంటి?”

“గొడవేమి కాదులే!” రచన నవ్వబోతూ వలవలా ఏడ్చేసింది.

“అయ్యో! ఏమైంది రచన?”

“నువ్వు నాతో చెప్పొచ్చు. నేను నీ ఫ్రెండ్ని కదా….”

“అదేం లేదు రాజీవ్. అలాంటిది ఏమీ లేదు. ఏదో చిన్న గొడవ అంతే! అరవింద్, నాది లవ్ మ్యారేజ్ కదా! నన్ను పెళ్ళి చేసుకున్నందువల్ల…..  మా అమ్మానాన్న అరవింద్‌ని కొత్తల్లో చాలా తిట్టారు. అప్పటినుంచి అరవింద్ వారితో మాట్లాడడు.

అరవింద్‌కు ఇష్టం లేదని… నేను కూడా మా అమ్మానాన్నతో మాట్లాడటం మానేశాను. మూడేళ్ళు అయ్యింది, మా నాన్నని చూసి. నాన్న అరవింద్‌కి సారీ చెప్పే ప్రయత్నం చాలా చేసాడు. అరవింద్ అస్సలు ఇష్టపడటం లేదు.

ఇదిగో…. ఇప్పుడు నీ ఎంగేజ్మెంట్‌కి వాళ్ళని పిలుస్తానని ఎంత బతిమాలినా ఒప్పుకోవటం లేదు. అందుకే ఈ గొడవ…” రచన గట్టిగా నిట్టూర్చింది.

“పోనీ అరవింద్‌తో నేను మాట్లాడనా?”

“వద్దు, వద్దు…. నీకు చెప్పానని తెలిస్తే బాధపడతాడు. అరవింద్ చాలా మంచోడు…. రాజీవ్. నన్ను కొంచెం కూడా ఇబ్బంది పెట్టడు. ఏది అడ్డుచెప్పడు. నీకు తెలుసు కదా! ఇదిగో మా అమ్మానాన్న విషయంలో మాత్రమే కాంప్రమైజ్ కాడు. అంతే!”

“కొంత సమయం అంతే, అన్ని సర్దుకుంటాయిలే”

రచన నవ్వింది.

***

మరుసటి రోజే ఎంగేజ్మెంట్. హడావిడిలో, సంతోషాల్లో మా ఎంగేజ్మెంట్ అయిపోయింది.

చాలా మందే వచ్చారు. పెళ్ళిలాగానే ఆర్బాటంగా జరిగింది. షేర్వాణి… గాగ్రాలు.. అబ్బో… అదో ఫంక్షన్ కాదు…. ప్యాషన్ షోలా ఉంది.

ఆ నగలు ఏంటి? ఒక్కొక్కరి మెడలో కనీసం ముప్పై తులాల బంగారం ఉంటుంది. అంటే పావు కిలో పైనే అన్నమాట. ఇక నందిని అయితే…. ఏకంగా దుబాయ్‌నే దిగేసుకుంది. బంగారు బొమ్మలా ఉంది.

నందిని మనస్ఫూర్తిగా నవ్వింది.

“నన్ను చేసుకునేవాడు ఎలా ఉంటాడో అని భయపడ్డాను. కానీ నా అదృష్టం. చాలా బాగా అర్థం చేసుకునేవాడు వచ్చాడు. థాంక్యూ రాజీవ్.”

హడావిడి కొంచెం తగ్గాక…. అప్పటి వరకు మౌనంగా చుట్టూ చూస్తున్న  నందిని నానమ్మ “‘ఇక పైకి వెళ్తాను” అని లేచారు.

“అరే! అప్పుడే ఏంటి అమ్మా? కాసేపు కూర్చో…” రవీందర్ వెంటనే వచ్చి ఆవిడని లేవనీయకుండా మళ్ళీ సోఫాలో కూర్చోపెట్టారు.

సంతోషంగా చేతిలోకి చేయి తీసుకొని….

“చెప్పమ్మా… నీకేం కావాలి? ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా బంగారు తల్లికి పెళ్లి….. నువ్వేం అడిగినా ఇచ్చేస్తాను.”

ఏ కళాలేని ఆవిడ మొఖం…. ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయింది.

“నిజంగా చేస్తావా రా?” ముందుకు వంగి ఆశగా అడిగింది.

“ఒక్కసారి అడిగి చూడు…”

“అదే …. నేను వృద్ధాశ్రమానికి వెళతాను రా!”

రవీందర్ తన చేతిలో ఉన్న తల్లిచేతిని విదిలించి కొట్టాడు.

అంతే కోలాహంగా ఉన్న ఆ గది అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అందరూ రవీందర్ వైపు, వాళ్ళ తల్లివైపు తిరిగారు. అందరి మొఖాల్లో ఏదో అలజడి.

రవీందర్ మొఖం సంగతి ఇక చెప్పనక్కరలేదు. సిగ్గుతో ఎర్రగా మారిపోయింది.

కోపంగా పైకి లేచి…. ఆవేశంగా అటూ, ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఎవ్వరూ ఏం మాట్లాడటం లేదు. కంగారుగా, బాధగా నిల్చొని ఉన్నారు.

నాకు మాత్రం ఏం అర్థంకావటం లేదు. మా బాబాయ్, మామయ్య మొఖం చూశాను.

వాళ్ళూ కొంచెం ఇబ్బందిగా మొఖాలు పెట్టారు.

“అమ్మా…! ఏంటిది? అందరి ముందు….! నా పరువు తియ్యటానికి కాకపోతే…” కొంచెం చిన్నగా మందలించాడు.

“ఛీ ఛీ…! లేదురా! నీ పరువు తీస్తానని ఎందుకనుకుంటున్నావు రా…!” ఆవిడ మాట ఇంకా పూర్తికాలేదు.

“ఇక్కడ నీకు అస్సలేం తక్కువ చేసాను? ఇంటి పెద్దరికం అంతా నీదే…! ఏది చేయాన్నా… ఏది కొనాలన్నా…  మొదట నిన్నే అడుగుతాను. నీకోసం ఇంట్లో ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరు నీకు ఎదురు చెప్పరు. ఇంకేం కావాలమ్మా?”

రవీందర్ గొంతు కోపంనుండి దయనీయంగా మారింది. ఇంతకు మించి ఇంకేం చేయాలో నాకు అర్థం కావటం లేదు. రవీందర్ తల పట్టుకొని సోఫాలో కుప్పకూలిపోయాడు.

అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి రవీందర్ చుట్టూ చేరారు.

“ఎందుకమ్మా? నీకు ఏం కావాలి? అడిగినప్పుడల్లా… నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతానంటావు?  నేనేం తప్పుచేశాను?” రవీందర్ ఆవేశంగా మాట్లాడుతున్నాడు.

“నువ్వు బాగా చూసుకోవట్లేదని… నేను ఎప్పుడన్నాను రా….. నీలాంటి కొడుకు ఉండటం నా అదృష్టం రా….” తన కొడుకుని అనునయిస్తోంది.

“మరి ఇంకేంటమ్మా…?” రవీందర్ కోపం పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు.

“నా తల్లి వృద్ధాశ్రమంలో ఉంటే… నలుగురు నన్ను ఏమనుకుంటారు? ఇన్నాళ్ళు సంపాదించిన నా పరువు ప్రతిష్ఠ ఏం కావాలి?” అన్నాడు రవీందర్.

“రవీందర్ ఇంత సంపాదించి… చివరికి తన తల్లిని వయసు మళ్ళాక వదిలేశాడని… అందరు నా నోట్లో ఊస్తారు. ఇలా జరిగే ముందే నేను చస్తే బాగుండు. ఛీ ఇంత బతికీ …. నా జీవితం వృథా…” రవీందర్ గట్టిగట్టిగా అరుస్తూ ఏదోదో మాట్లాడేస్తున్నాడు.

రవీందర్ తల్లి మౌనంగా కూర్చుంది.

కాసేపటికి రవీందర్ అసహనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు.

తరువాత మెల్లిమెల్లిగా అందరూ తమ దారిపట్టారు. ఇంత సంతోషకరమైన వాతావరణాన్ని పాడుచేయాని ఆవిడకి ఎలా అనిపించిందో?

అబ్బా! నాకు చిరాకేసింది. నా ఎంగేజ్మెంట్ మధ్యలో ఈవిడ గోల ఏంటో….

మా నాన్నవల్ల తన కూతురు చనిపోయిందని… కోపం కావచ్చు.

***

(సశేషం)

Exit mobile version