Site icon Sanchika

సీత-13

[dropcap]లే[/dropcap]చి టైం చూసా! పది కావస్తోంది. టక్కున లేచి.. బాత్‌రూమ్‍లోకి పరిగెత్తాను.

ముందు రోజు రాత్రి లండన్‌లోని ఫ్రెండ్స్‌తో చాలాసేపు మాట్లాడాను. పడుకునేసరికి అర్ధరాత్రి అయ్యింది.

తయారయ్యి కిందకు వెళ్ళాను.

ఇల్లంతా నిశ్శబ్దం…. వంటింట్లోనుంచి గిన్నెల శబ్దం వినిపిస్తోంది.

అటు వైపు వెళ్ళాను.

నన్ను చూస్తూనే…. పనిమనిషి చేస్తున్నపని పక్కన పడేసి…. దగ్గరికి వచ్చింది.

“మీరు లేచాక టిఫిన్ పెట్టమన్నారు బాబూ…. రండి కూర్చోండి.” డైనింగ్ టేబుల్ చూపించింది.

నేను కూర్చునే లోపలే అన్నీ తెచ్చి వడ్డించింది.

“అందరూ ఏరి?”

“సార్లకు ఫ్యాక్టరీ ఉంది కదా బాబూ…. ఆడవాళ్ళంతా షాపింగ్‌కి వెళ్ళారు. ఇది వీళ్ళకి కొత్తకాదు. ఇలా అప్పుడప్పుడు నాలుగైదు రోజులు పోతూనే ఉంటారు. నందిని కాలేజీకి వెళ్ళింది.”

“అదేంటి? నందినికి కాలేజి అయిపోయింది కదా…”

“అదేదో కోర్సు చేస్తున్నారట బాబు…”

“మీది ఉమ్మడి కుటుంబం కదా.”

“లేదు, వాళ్ళు నందిని ఎంగేజ్మెంట్‌కి వచ్చారు. వెళ్ళిపోతారు.”

“అయితే ఇంట్లో ఎవరూ లేరా?”

“పైన బామ్మగారున్నారు….”

“సరే!”

నేను టిఫిన్ ముగించి… నా రూమ్‌ లోకి వెళ్లాను. కాసేపు టి.వి…. కాసేపు మ్యాగజైన్… ఇలా గడిచింది.

కానీ ఏం చేసినా సమయం ముందుకు జరగటం లేదు.

బామ్మకి మధ్యాహ్న భోజనం పైకి తీసుకువెళ్ళింది పనమ్మాయి. ఆవిడ అక్కడే వడ్డించమందట.

ఎలాగోలా మొదటి రోజు గడిచింది.

కాసేపటికి అందరూ భోజనం చేసి, మళ్ళీ వాళ్ళ గదుల్లోకి…

రాత్రి పడుకునే ముందు రవీందర్ గారు తన తల్లి గదిలోకి వెళ్ళి, మందు లేసుకుందా? ఆరోజు తిన్నదా? లేదా? అని చూసి… ఒక అయిదు నిమిషాలు కూర్చుని…. తిరిగి తన గదిలోకి…

అరవింద్ ఎంగేజ్మెంట్ అయ్యిన రాత్రే వెళ్ళిపోయాడు. రచన లేదు కదా వాడికి మూడ్ లేదని చెప్పాడు. అందరితో కలసి షాపింగ్ వెళ్లడమంటే అది ఇంకా టార్చర్. బాబాయ్, రవీందర్ అంకుల్ బిజినెస్ పని అనిచెప్పి వాళ్ళు వెళ్లిపోయారు

అబ్బా పిచ్చెక్కిపోతుంది. ఏమి చేసినా టైం పదినుంచి ముందుకు జరిగితే ఒట్టు. మెల్లిగా బయటికి వెళ్ళాను. ఊరు పెద్దగా ఏమి లేదు చూడటానికి. ఒక అరగంట అటుతిరిగి… ఇటు తిరిగి.. ఇంటికొచ్చేసా. మిగతా రోజు మామూలే.

ఇక లాభం లేదు.

ఆ రోజు నందిని ఇంటికి రాగానే… మురుసటి రోజు తనని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళమని… లేకపోతే లండన్ వెళ్లిపోతానని బెదిరించాను.

గట్టిగా నవ్వి… చివరికి ఒప్పుకుంది. “సరే! నాకు లంచ్ బ్రేక్ ఉంటుంది. సరిగ్గా పన్నెండింటికి రెడీగా ఉండు. రాహుల్ నిన్ను నా దగ్గరకు తెస్తాడు. అక్కడినుంచి ఏదైనా దగ్గరలో హోటల్‌కి వెళ్దాం. ఒకేనా?” అంది నవ్వుతూ…

మరుసటిరోజు నందిని చెప్పినట్లు పన్నెండిరటికల్లా రెడీ అయి కిందకు వచ్చాను. రాహుల్ వచ్చి పిలిచాడు. బయలుదేరుదామని బయటకి వచ్చాను.

అప్పుడే పోస్ట్‌మాన్ వచ్చాడు. ఎదురుగా… బయటే… ఉన్నానని తెచ్చి, నా చేతిలో పెట్టాడు.

పైన ‘టు, రత్నా’ అని ఉంది.

ఇంట్లోకెళ్ళి…. పనిమనిషికి ఇద్దాం అనుకునే లోపే… మళ్ళీ ఎందుకు తిరగటం? నందిని ఎదురు చూస్తుంటుంది. లెటర్‌ని ఇంటికొచ్చాక ఇవ్వొచ్చని, నా జేబులో పెట్టుకుని కారెక్కాను.

“ఈ రత్నా ఎవరు?” రాహుల్‌ను అడిగా….

“బామ్మగారు అండి.”

లంచ్ చేసి, నేను ఇంటికి వచ్చాను. నందిని తింటున్నంతసేపు నన్ను చూసి నవ్వటం తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయింది.

నేను ఇంటికొచ్చి నిద్రపోయాను. లేచేటప్పటికి రాత్రి ఏడయ్యింది.

ఉత్తరం సంగతి గుర్తొచ్చింది.

“బామ్మగారిదట…”

‘ఈ ఉత్తరం ఏమిటో?’

వెనుక తిప్పి చూశా…

‘కృష్ణ, వివేకానంద వృద్ధాశ్రమం. ……’ అని రాసి ఉంది.

‘కృష్ణనా! బామ్మా ….ఈ వయసులో నీకు లవ్ స్టోరీనా? అందుకేనా వృద్ధాశ్రమం, అనాథాశ్రమం అని తెగ కలవరిస్తున్నావు? ఉండు నీ పని పడతా.’ టపటపా ఉత్తరం చింపి….. తెరిచాను.

నా కర్మ! తెలుగులో ఉంది.

ఏం చేయాలి? ఏం చేయాలి?

యస్… ! ఎవరికైనా ఫోన్ చేసి…. ఇమేజ్ పంపి… చదవమంటాను.

కాని ఎవరు? ఎవరైతే బాగుంటుంది?

హు…. సంధ్య. అవును సంధ్యకు చెప్పి…. చదవమంటాను. తనైతే ఎవ్వరికి చెప్పదు. ఇదేంటి? ఎందుకు? అని అడగదు.

వెంటనే ఉత్తరం ఫోటో తీసి…. సంధ్యకు పంపాను.

***

“రత్నా,

ఎలా ఉన్నావు రా?

నేను బాగానే ఉన్నా. నిన్ను తిరుపతిలో కలిసిన దగ్గరనుంచి నువ్వు బాగా గుర్తొస్తున్నావు రా.

వెళ్ళగానే ఉత్తరం రాస్తానన్నావు? ఇంకా రాయలేదు.

అంతా… బాగుంది కదా?

మీ అబ్బాయిని ఒప్పించి, అనాథాశ్రమానికి వస్తానన్నావు… మరి ఏమైంది?

ఏంటోరా! అంతకు ముందు నిన్ను కలుద్దామంటే మీ ఆయన ఉన్నాడని…. నన్ను ఎప్పుడూ కలవనీయలేదు. పోనీ ఇప్పటికైనా బాధ్యతలు అన్నీ తీరిపోయాయి. కనీసం ఇప్పుడైనా కలిసి ఉండు. అంటే కొడుకు నన్ను చాలా బాగా చూసుకుంటాడు. వాడికి చెబితే బాధపడతాడు అంటావు.

ఇవేమి ఆలోచించకు…. కళ్ళు మూసుకొని వచ్చేయి…. అయినా కొడుకు, కూతుళ్లు వదిలేసినవారే వృద్ధాశ్రమానికి వస్తారని ఎవరు చెప్పారు?

ఈ మిగిలిన జీవితంలో మనకి నచ్చింది చెయ్యాలి. అంతేకానీ, కొడుకు చూడట్లేదనో, మనవళ్ళు వదిలేశారనో రావాల్సిన అవసరంలేదు. ఎలాంటి నిర్ణయం తీసుకునే హక్కు మనకి ఉంది.

నీకోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటాను.

ఇట్లు

నీ కృష్ణ”

హు… ఇదీ సంగతి.

తన లవర్ కోసం ఇన్నేళ్ళు వృద్ధాశ్రమానికి వెళతానని అంటుంది.

అందుకే కాబోలు…. ఇక్కడ మహారాణిలా చూసుకున్నా…. ఈవిడకి నచ్చటం లేదు. పైగా నామీద కోపం ఒకటి.

***

దేవుడా ఇంత కష్టపడితే మధ్యాహ్నం అయ్యింది. ఈ ఒంటరితనం ఎలా భరించాలో? ఆ తరువాత అందరూ రేపు తెల్లవారుజామునే హైదరాబాదు ప్రయాణం.

మాయ ఉంటే బాగుండేది.

నిజంగా మూడు నెలలు అసలు టైమే తెలియలేదు.

ఎంత జాలీగా అయిపోయిందో… తనతో గొడవపడి తప్పుచేసానేమో. తప్పు అని తెలిసి మరీ తప్పు చేశాను.

మాయ నన్ను ఏమనుకుందో.

టి.వి. పెట్టుకున్నానే గాని సెకన్ సెకనుకి ఛానెల్స్ మారుస్తున్నాను. ఆలోచనలు ఎటో పరుగుతీస్తున్నాయి.

ఎవరో వెనుకనుంచి నడుస్తున్నారు. తిరిగి చూస్తే బామ్మ…! మెల్లగా నడుస్తూ వచ్చి…. నా పక్కనే సోఫాలో కూర్చుంది. అసలు తన పక్కన చెట్టంత మనిషి ఒకడు ఉన్నడని ఆవిడకి కొంచెం కూడా లేదు. నావైపు చూడటం కాని, పట్టించుకోవడం కాని చేయలేదు.

గంభీరంగా… నిజం చెప్పాలంటే పొగరుగా…. కూర్చొని పేపరు తిరగేస్తుంది. రెండు నిమిషాలు ఆగి…. పోనీలే పెద్దావిడని నేనే మాట్లాడించాను.

“బామ్మా! ఎలా ఉన్నారు?”

ఇష్టం లేకపోయినా హి… హి… అని పళ్ళు ఇకిలించింది. పేపర్ కిందకి జరిపి…. కళ్ళజోడు సరిచేసుకుని… నన్ను పరీక్షగా చూసింది. బాగున్నాని తల ఊపి….. మళ్ళీ పేపర్లో తల దూర్చింది.

“పేపర్ చదువుతున్నారా?”

పేపర్‌ను పక్కకు జరిపి…. సీరియస్‌గా కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది.

“ఓ! సారీ!! అవును… అవును…. మీరు పేపరే చదువుతున్నారు. చదువుకోండి… చదువుకోండి….” అక్కడ నుంచి లేచి వెళ్ళిపోబోయాను.

‘ఈవిడకి నాతో ప్రాబ్లమ్ ఏమిటో? ఏదో ఈవిడ లవ్ ఫెయిల్‌కి నేనే కారణమైనట్లు. అయినా నాకెందుకు? నా గదికి వెళ్తాను.’

“రాజీవ్‍!”

ఎవరు పిలిచింది? నాలుగు దిక్కులు చూసా.

బామ్మేనా!

“నీ పేరు రాజీవే కదా!”

బామ్మే! అమ్మో ఇంత మర్యాదగా పిలిచిందేంటి?

“అవునండి” వెనక్కి తిరిగి…. వినయంగా అన్నాను!

ఏమనుకుందో ఏమిటో… వచ్చి తన పక్కన కూర్చోమని సైగ చేసింది.

వెళ్ళి కూర్చున్నాను…

“హు..! రాజీవ్”

నా వైపు చూసి…. కళ్ళద్దాలు మడిచి చేతిలో పట్టుకుంది.

“చెప్పండి…!”

“ఏం లేదు….బాబు! నీతో సరిగ్గా మాట్లాడటం లేదని ఏమి అనుకోకు. ఏదో మనసు బాగోలేదు. పెద్దతనం… ఏంటో… ఆ కోపాన్నంతా నీ మీద తీసాను…”

ఇంకా ఏదో చెప్పబోయింది.

కొన్ని సెకన్ల తరువాత “ఛీ ఛీ నీదేమి తప్పులేదు. పాపం. అదీ నేనే …. దేని మీదో కోపం…”

బామ్మ మాటలు రాక తడబడుతోంది.

పాపం! నాకే జాలేసింది.

“ఫర్వాలేదు బామ్మగారు… నేనేమి అనుకోలేదు…” మొహమాటంగా నవ్వాను.

ఆవిడ తలాడించింది.

“నన్ను కొంచెం…. నా గదికి తీసుకు వెళ్ళతావా?”

“సరే!”

“రా కాసేపు నాతో కూర్చో…” నన్ను సోఫాలో కూర్చోపెట్టింది. చివరి గది కావడంతో గదిలో గాలి, వెలుతురు భలే ఉన్నాయి. ఊరంతా కిటికీలోంచి కనిపిస్తుంది. హైదరాబాదు గుర్తొస్తుంది.

“ఏంటి చూస్తున్నావు? ఊరేనా?”

ఆలోచనలో ఉన్న నన్ను బామ్మ పిలిచింది.

“నాక్కూడా రోజంతా ఇదే కాలక్షేపం” అంది దిగులుగా.

“చూడు! నా విషయాలు ఏవీ మనసులో పెట్టుకోకు…”

“అయ్యో! అలాంటిదేమి లేదు. బామ్మా…”

“లేదు నన్ను చెప్పనీ బాబూ…. పాపం…. తల్లిలేని పిల్ల … ఏదైన మనసులోనే పెట్టుకుంటుంది. ఏదీ పైకి చెప్పుకోలేదు. నోరు తెరిచి ఏమీ అడగదు….. నా బెంగంత దాని మీదే బాబు…. ఇప్పుడు మాకందరికి దూరంగా వెళ్ళుతుంది. ఎలా ఉంటుందో? ఏమో? నువ్వే దాన్ని అర్థం చేసుకోవాలి.

ఏం కావాలో అడిగి తెలుసుకోవాలి. అన్నిటికి ఎడ్జస్ట్ అవుతుంది. ఎలా బతుకుతుందో? ఏమో? పిచ్చిపిల్ల..” ఇంకా ఏదేదో ఆత్రంగా, హడావిడిగా చెప్తోంది.

నేను లేచి వెళ్ళి, బామ్మ చేయి పట్టుకున్నాను. ఆవిడ కూర్చున్న సోఫా పక్కనే కింద…. మోకాళ్ల మీద కూర్చున్నాను.

“నువ్వేం కంగారుపడకు బామ్మా…. నేను నందినిని బాగా చూసుకుంటాను. పైగా నీకేం భయం లేదు… ఇప్పుడు మేం చాలా మంచి ఫ్రెండ్స్. నాతో అన్ని విషయాలు చెప్పింది. తన లవ్ స్టోరీతో సహా.”

“అవునా?” బామ్మ నోరు తెరచింది.

“కానీ ఈ విషయం నువ్వు ఎవ్వరికీ చెప్పకు. తెలిస్తే నందిని బాధపడుతుంది.”

“ఏమో అనుకున్నా ఘటికుడివే…!” అంది.

కళ్ళు పెద్దవి చేసి… “అది పాపం మనసులోనే కుమిలిపోతుందని బాధపడ్డాను. నువ్వు గ్రేట్ రా.”

“మరేమనుకున్నావ్. రాజీవా మజాకా?”

(సశేషం)

Exit mobile version