“అవున్రా నేనే నిన్ను తక్కువ అంచనా వేశాను. నాకే ఆ విషయం తెలుసనుకున్నా… నీక్కూడా చెప్పిందంటే నందినికి నచ్చావన్నమాట.”
బామ్మ పొగుడుతుంటే…. ఇంకేముంది…. అన్నీ మరిచిపోయా.
“దాంట్లో ఏముంది? నాకు నీ లవ్ స్టోరీ కూడా తెలుసు!” ఫుల్ స్పీడ్ మీద చెప్పేశా…!
కొంప మునిగింది. నాలుక కరుచుకున్నా.
“నా లవ్ స్టోరీనా. అదేంటి?” బామ్మ పట్టేసింది.
“ఎబ్బే …. ఏమీ లేదు. ఉత్తినే…”
“ఏంట్రా నిజం చెప్పు? నేనేమీ అనుకోను.”
ఛీ ఛీ ఇలా దొరికిపోయానేంట్రా బాబు!
“ఏం లేదు బామ్మ మీ ఫ్రెండ్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది.”
“అవునా? నాకు తెలీదే?”
“పోస్ట్‌మాన్ నా చేతికిచ్చాడు. నేను నీకే సరాసరి తెచ్చి ఇద్దామను కున్నాను. కానీ…”
“ఆఁ కానీ? తర్వాత ఏం జరిగింది?” బామ్మ ఆత్రంగా అంది.
“ఏం జరిగిందో? ఎందుకని చేశానో తెలియదు… వెనకాల కృష్ణ… వివేకానంద వృద్ధాశ్రమం… అని రాసి ఉంటే…. చదవాలనిపించి చదివాను. అంతే. అంటే నీమీద కోపంతో అలా చేశాననుకో” తల దించుకున్నాను.
“ఓర్ని…. భడవా!”
బామ్మ ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి… వెంటనే ఫక్కున నవ్వింది.
“చదివితే చదివావు…. కానీ, ఇప్పుడైతే నాకు తెచ్చివ్వు.”
నేను పరుగున వెళ్ళి…. పరుగున తెచ్చిచ్చాను.
బామ్మ సంతోషంగా ఉత్తరం చదవటం మొదలుపెట్టింది. చదవటం పూర్తయ్యే సరికి మొఖమంతా దిగాలుగా మారింది. బాధగా ఉత్తరాన్ని మూసి…. పక్కన పెట్టి … కళ్ళు మూసుకుంది.
కాసేపు! మా ఇద్దరి మధ్య మౌనం.
“బామ్మ….! నీకు అక్కడికి వెళ్ళిపోవాలని ఉందా?”
బామ్మ అవునని తల ఊపింది.
“ఆయన్ని చాలా ప్రేమించావా?”
బామ్మ ఒక్కసారి మొఖం చిట్లించింది.
“ఎవర్ని రా? ఏం మాట్లాడుతున్నావ్?”
“అదే! ఆ ఉత్తరం రాసిన కృష్ణని… ఆయన నీ లవర్ కదూ?”
“ఛీ ఛీ భగవంతుడా!” బామ్మ లెంపలేసుకుంది.
“ఒరేయ్…. అది నోరా ఇంకేమన్నానా? కృష్ణ…. అబ్బాయి కాదు… అది నా స్నేహితురాలు. పూర్తి పేరు కృష్ణవేణి.”
“అవునా? మరి మీ స్నేహితురాలు అయితే మీ ఆయన ఎందుకు మిమ్మల్ని కలవనీయలేదు?”
“అబ్బా నీ అనుమానం దొంగులు ఎత్తుకెళ్లా… అది వేరే కులానికి చెందినది. అసలు చెప్పాంటే మా ఇంట్లో పనిచేసేదాని కూతురు. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నాం… కలిసి పెరిగాం…. మా ఇంట్లో నేనొక్కదాన్నే ఆడపిల్లని. తరువాత మా అమ్మకు ఇద్దరు పుట్టి… చనిపోయారు.. నాక్కూడా తోడుగా ఉంటుందని…. మా అమ్మ దాన్ని ఇంట్లోనే ఉంచుకునేది. మిగతావారు ఏమనుకునేవారో గాని… మేం మాత్రం ప్రాణ స్నేహితులం. నాకు అది తోబుట్టువు కన్నా ఎక్కువ.
కొన్నాళ్ళకు నాకు పెళ్ళైంది. ఆ రోజుల్లో నాకు, పదిహేనేళ్ళకే పెళ్ళైంది. పాతకాలంలో అలాగే జరిగాయి. ఆ తరువాత మా అత్తగారు పనిపిల్లతో స్నేహం ఏంటి? అని తిట్టి… మాన్పించారు. ఆవిడ మాటంటే మీ తాతగారికి వేదం చెప్పినట్టే. ఆయన కూడా నన్ను కలవనిచ్చేవారు కాదు. నాకు నచ్చింది ఏదీ చేయనిచ్చేవారు కాదు. ఎప్పుడో పుట్టింటికెళ్ళినప్పుడు దాని బాగోగులు అడిగేదాన్ని. దానికి పెళ్ళై…. పట్నం వెళ్ళిపోయిందన్నారు. తరువాత జాడలేదు. ఇదిగో మొన్న అందరం తిరుపతికి వెళ్ళాం. అప్పుడు మళ్ళీ కనిపించింది.
పాపం ఏదో తను…. వాళ్ళ ఆయన చాలానే కష్టపడ్డాడట. కానీ దాని అదృష్టం బాగుంది. ఆమె కొడుకు పైకి వచ్చాడు. బాగా చదువుకొని ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడట.”
“మరి నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళాలని ఎందుకనుకుంటున్నావు?”
బామ్మ రెండు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు.
“ఇక్కడ ఏముందిరా నా జీవితం? ఇదిగో! పడుకోవడానికి ఈ మంచం… చూడటానికి ఆ కిటికి… ఇంక చేయడానికి ఏముంది? అంటే నా కొడుకు బాగా చూసుకోవటం లేదని కాదు. కానీ వాళ్ళైన ఇంతకంటే ఏం చేస్తారు?
మా రవీందర్‌కి బాధ్యతలు ఎక్కువ. ఎప్పుడు చూడూ… పని… వ్యాపారాలు అంటూ రాత్రింబవళ్ళు కష్టపడతాడు. వాడికి సమయం ఎక్కడిది? కొంచెం నందిని, నాకు ఊరట. ఇప్పుడు నందినికి పెళ్ళైపోతుంది. ఈ చివరి రోజుల్లో అయినా నేను దాని తో గడుపుదాం అని.”
నేను అంతా వింటున్నాను. ఏమి మాట్లాడలేదు…
“హు…! నా జీవితంపై నాకు విసుగు వచ్చిందిరా. నా కోసం నేను ఎన్నడూ బతకలేదు. మొన్న కృష్ణ కలిసిన దగ్గరనుంచి… దాని దగ్గరకు వెళ్ళిపోవాని ఉంది. మేము ఆడిన ఆటలు, పాడిన పాటలు అన్నీ గుర్తుపెట్టుకుంది తెలుసా…!
పైగా దానికి పక్షవాతం వచ్చి… ఒక చేయి పనిచేయటం లేదు. చిన్నప్పుడు నాకు అన్ని పనులు చేసిపెట్టేది. ఇప్పుడు దానికి కొంచెం సహాయంగా ఉండాలని ఉంది. అంతే రా!”
“దానికి ఫోన్లు ఉన్నాయి కదా, రోజు చూస్తూ మాట్లాడొచ్చు. ఇంకా ఈ ఉత్తరాలు ఎందుకు బామ్మా.”
“ఉత్తరం చదువేస్తేనే నాకు తృప్తి రా. ఫోన్ లో ఏదో బాగున్నారా? తిన్నారా? అంటే అది మొక్కుబడికి ఎదో అడిగినట్టు అంతేకానీ స్నేహం కాదు రా!”
మరి అంకుల్కి చెప్పి …. ఒప్పించవచ్చు…. కదా బామ్మ?
“వాడు ఒప్పుకోడు రా! వాడికి నా బాధ అర్థం కాదు. ఎంతసేపు నీ రూమ్‌లో ఎ.సి. ఉంది కదా… నీ దగ్గర పిలిస్తే వచ్చే పనివారు ఉన్నారు కదా…. అంటాడు. చిన్ననాటి స్నేహితురాలి ముందు ఏ ఎ.సి. పనికొస్తుంది? అయితే అన్నిటి కన్నా ఎక్కువ వాడి పరువు. నా తల్లి వృద్ధాశ్రమంలో ఉందంటే నా గురించి వాడేమంటాడు? వీడేమంటాడు? నా పరువేం కావాలి? ఇదే గోల….
మీ తాతయ్య బతికినంత కాలం నాకు ఏదో ఒక వ్యాపకం ఉండేది. ఇప్పుడు రోజు జరగడం కష్టమయింది. పగలూ రాత్రి తేడా తప్ప… నా జీవితంలో ఏ మార్పు, ఏ ఆశ లేకుండా పోయింది.
మీ తాత ఉన్నప్పుడు నా జీవితం ఆయన చెప్పినట్టే నడిచేది. నా నాట్యం మాన్పించారు… నా స్నేహం మాన్పించారు…. ఆ తరువాత నేను నాకు తెలియకుండానే నవ్వడం మాన్పించారు. లేక నేనే మానేశానో?!… ఇప్పుడు నా కొడుకు….”
బాధతో బామ్మ మాటలు తడబడుతున్నాయి. గొంతు బొంగురుపోయింది.
“అయ్యో! ఏడవకు బామ్మా… దగ్గరకు వెళ్లి ఓదార్చాను. లేదురా నా బాధ నీకు అర్థంకాదు.”
“సరే సరే!”
బామ్మ కళ్ళు తుడుచుకుంది.
“అయినా ఆ గోలంతా నీకెందుకు రా…! ఏదో ఉత్తరం చదివావని నీకు చెప్పాను. కానీ ఇవన్నీ నీకు చెప్పాల్సిన విషయాలు కావు.
నీవు హాయిగా పెళ్ళి చేసుకో… నందిని చాలా మంచి అమ్మాయి. దానికి నచ్చినవాడిని కాదని నీతో పెళ్ళి చేస్తుంటే భయపడ్డాను. కాని ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. నువ్వు దాన్ని బాగా చూసుకుంటావు…..”
నాకు బామ్మ చెప్పేవి ఏమి వినిపించటం లేదు.
“సరే గాని బామ్మ! కృష్ణవేణి గారు ఎందుకు వృద్ధాశ్రమానికి వెళ్లారు?”
ఇవన్నీ ఎందుకులే బాబు?
“అబ్బ చెప్పు బామ్మా… ప్లీజ్…!”
ఇప్పటి వరకు సగం కథే కదా అయ్యింది. మిగతా సగం గురించి అంతా నా ఆలోచన.
“అదా… ఆర్నెల్ల కిందట మేమంతా తిరుపతికి వెళ్ళాo. అక్కడ నాకు కృష్ణవేణి జరిగిందంతా చెప్పింది.”
***
“నీకు తెలుసా మన వెనుక గల్లీలో రాజయ్యగారు, మంగమ్మగారు ఉన్నారు కదా.”
“నేను వాళ్ళ ఇంట్లో కూడా పని చేస్తున్నాను. అవును!! ఏమైంది?”
“ఆ ఏముంది లెండి? అత్తకు, కోడలుకు పడిచావదు. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా!”
“ఆఁ ఆఁ ఎందుకు తెలియదు…!”
“పెళ్ళైన మరుసటి రోజునుంచి తన్నుకు చస్తున్నారు కదా…!”
“అవునమ్మ…! వాళ్ళే…”
“ఇప్పుడు ఏమైంది?”
“అత్తామామ మీద వాళ్ళ కోడలు గృహహింస కేసు పెట్టిందంట.”
“అవునా…! పెళ్ళై రెండేళ్ళు కూడా కాలేదు…!”
“మరే….!”
“ఓరి దేవుడా! ఏం పిల్ల రా…!”
“ఛీ ఛీ… వాళ్ళని…. ఆడవాళ్ళు అంటారా? మగాళ్ళలా జుట్టు కత్తిరించుకొని, పాంటు, షర్టు వేసుకొని… ఏదో రెండు డబ్బు సంపాదించగానే …. ప్రపంచాన్ని ఏలొచ్చు అనుకుంటున్నారు. పెద్దలంటే భయంలేదు. గౌరవం లేదు. ఏదైన చిన్నమాట అంటే ఇదిగో గృహహింస చట్టం కేసు….. ఇదే గోల.”
“కొడుకులకి పెళ్ళిళ్ళు చేయాంటేనే భయం వేస్తుంది.”
“అమ్మా …. ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు…” పనమ్మాయి చెప్పింది.
తలుపు తెరిస్తే ఎదురుగా పోస్ట్‌మాన్.
“కృష్ణవేణిగారు…?”
“అవును నేనే…”
“ఇదిగోండి మనీ ఆర్డర్… ఇక్కడ సంతకం పెట్టండి.”
కృష్ణవేణి తలుపు దగ్గరకు వేసుకొని…వెంటనే కొడుక్కి ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తలేదు కానీ రెండు నిమిషాల్లో మెసేజ్ ఒచ్చింది.
‘అమ్మా! ఎలా ఉన్నావు? మేము బాగానే ఉన్నాం. ఆఫీస్‍౬లో ఉన్నాను, ఫోన్ ఎత్తలేక పోయాను.
ఇక్కడ ఉన్నాననే… గానీ… నీ మీదే నా బెంగంత …. ఒక్కదానివి ఎలా ఉన్నావో? ఏంటో…! నాన్న ఉంటే…. ఇంత బాధ ఉండేది కాదు. నాకు చాలా ధైర్యంగా ఉండేది. అయినా ఎన్ని రోజుల్లే…. ఇదిగో …. నీ ఫించం. పని పూర్తికాగానే… నేను వచ్చి తీసుకువెళతాను. త్వరగా ఆ పని పూర్తిచేసుకో…. అమ్మా! నీ కోసం ఎదురుచూస్తుంటాను.
అన్నట్టు నీకో విషయం చెప్పాలి. ఈసారి డబ్బు కొన్ని తక్కువ పంపించాను. ఏమి అనుకోకు… కొంచెం నాకు కష్టంగా ఉంది. అయితే వచ్చే నెల నీకు డబ్బు పంపడం కుదరకపోవచ్చు. ఎలాగో సర్దుకో అమ్మ…. మిగితా విషయాలు ఆదివారం మాట్లాడుతాను.’
కృష్ణవేణి, ఉబికి వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటూ… చేయి అడ్డం పెట్టుకుంది.
“పాపం నా కొడుక్కి నేనంటే ఎంత ప్రేమ. నామీద బెంగగా ఉందని రాసాడు. వచ్చే నెల డబ్బు పంపించలేనంటున్నాడు.”
“ఏం కష్టం వచ్చిందో?” పనమ్మాయి జాలిగా అంది.
“ఆఁ ఏం కష్టం వచ్చింది? ఆ మహాతల్లి వద్దని ఉంటుంది. వీడు ఆమెకు దాసోహం అని ఉంటాడు.” కృష్ణవేణి కనీళ్ళు ఆగి…. కోపంగా మారాయి.
తన భర్త చనిపోయినప్పుడు వచ్చింది కదా మహారాణి. నాతోపాటు తోడుగా ఉంటుందిలే. మా వాడు నా దగ్గర మూడు నెలు ఉండమన్నాడు… అప్పుడు తెలిసింది రేవతి సంగతి.
***
“రేవతీ… రేవతీ.. రామ్మా…”
“ఆఁ … ! వస్తున్నా”
రేవతి మెల్లిగా వచ్చి తలుపు తీసింది.
“ఎనిమిదౌతుంది. ఇంకా నిద్రేంటి?”
“రాత్రి ఆఫీస్ పని చేయాల్సి వచ్చింది అత్తయ్యా.” రేవతి మొహమాటంగా అంది.
“సరే.. మామయ్యకు హాస్పిటల్‍కి క్యారేజి తీసుకెళ్ళాలి… కొంచెం వంట చేయి. నేను స్నానం చేసి వస్తాను..”
కృష్ణవేణి స్నానం చేసి వచ్చేసరికి …. రేవతి వంటతో సతమతమౌతోంది. ఇద్దరికి వంటచేయడానికి ఎంతో హడావిడి చేస్తోంది.
కృష్ణవేణికి చిరాకు వేసింది. కానీ ఇంకేమి పట్టించుకోలేదు.
తన భర్త హాస్పిటల్లో ఎదురుచూస్తుంటాడు. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. తన భర్తకు హార్ట్ ఎటాక్ వచ్చిందని ఐ.సి.యు.లో ఉంచారు. ఇప్పటికే మూడురోజులు అయ్యింది. ఇంకా ఏం సంగతి చెప్పలేం అని డాక్టర్ అన్నారు.
పని ఒత్తిడివల్ల వేణు రాలేకపోయాడు. కానీ రేవతి తనకు సహాయంగా వచ్చింది.
ఏం సాయమో? ఏంటో? మొత్తం పని నేనే చేసుకోవాలి. ఈ అమ్మాయికి ఏమీ చేతకాదు…. నా ఖర్మ.
కృష్ణవేణి తనని తాను తిట్టుకుంది.
తన భర్త చనిపోయి… అప్పుడే రెండు వారాలు అయ్యింది. పరమర్శించడానికి వచ్చిన చుట్టాలు వెళ్ళిపోయారు.
ఒంటరితనం… అంతా అయోమయం.
అంతలోనే….
సర్లే…. కొడుకు ఉన్నాడు కదా అని ధైర్యం.
అయినా ఏదో తెలియని అలజడి…. మనసులో ఎక్కడో తెలియని భయం.
(సశేషం)