సీత-17

0
2

[dropcap]హై[/dropcap]దరాబాద్ తిరిగి వచ్చేసాము.

వస్తూనే ఒక పెద్ద పిడుగు పడ్డట్టు అయింది.

రచన ఇల్లు వదిలేసి వెళ్లిపోయింది.

“ఏంట్రా అరవింద్ నాకు పెళ్లి కుదిరింది అని అనుకుంటే నీకు ఎలా జరిగింది? నేను ఫోన్ చేసినప్పుడు అంత సర్దుకుంటాయని రచన చెప్పింది. ఇప్పుడేంటి ఇలా? గొడవ ఇంత పెద్దదా?”

“అంటే నీ ఎంగేజ్‌మెంట్ ఎందుకు డిస్టర్బ్ చెయ్యడం ఎందుకు అని ఆలా చెప్పి ఉంటుంది. కానీ తాను వెళ్లి పోదామని అప్పటికే అనుకుంది” అరవింద్ బాధగా అన్నాడు

“ఏం చేద్దాం రా, ఇదిగో ఇలా తయారయ్యారు అమ్మాయిలు. చిన్న చిన్న విషయాలకు వదిలేయడం కొంచెం తేడా రాగానే విడాకులిచ్చాయడం ఏంటో?” అరవింద్ పెదవి విరిచాడు.

“అదేంట్రా భారత వివాహ వ్యవస్థని వేరే దేశస్థులు ఎంత గొప్పగా చెప్పుకుంటారు అనుకుంటున్నావ్?”

“సరే ఇప్పటి వరకు అంతా గొడవ గొడవగా ఉంది. ఫంక్షన్ కదా. ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాను కదా. అసలేం జరిగింది ఇప్పటికైనా చెప్పరా.” నేను ఆపుకోలేక అడిగేశాను.

“పెద్ద పెద్ద యుద్ధాలేమి కావు. చిన్న చిన్న విషయాలే కానీ ఎవరి అభిప్రాయాలు వారివి. తాను చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది. ఇక నా మాట ఏం వింటుంది?”

“అంటే? నీ మాట వినటం లేదు, అంటే?” నాకు అరవింద్ చెప్పేది అర్థం కాలేదు.

“నీకెలా చెబితే అర్థం అవుతుంది?” అరవింద్ కాసేపు ఆలోచించాడు.

“అది కాదు కానీ నేను ఒక కథ చెబుతాను.

కొన్ని సంవత్సరాల కిందట ఒక ఇంట్లో ఒక యజమాని ఒక బానిస ఉండేవాడు. బానిస అంటే పని చేసేవాడు అని కాదు అర్థం. మాట వినే వాడు అని. ఉదాహరణ బానిస అని వాడాను. అంతే!”

సరే అని తలాడించాను.

“యజమాని నిర్ణయాలు తీసుకునేవాడు, యజమాని ఏది చెప్పినా బానిస అన్నిటికీ కట్టుబడి ఉండేవాడు. అప్పటి వ్యవస్థ ఎలా ఉండేది, అవకతవకలు వచ్చినా ఇల్లు మాత్రం బాగా నడిచేది.

కాలం కొంచెం మారింది. బానిస నిర్ణయాల్లో కల్పించుకోవడం మొదలుపెట్టాడు. సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అభిప్రాయాలు ఆంతర్యాలు తేడా ఉన్నా చివరికి యజమాని మాటే పై చేయి కాబట్టి గొడవలు ఉన్న ఒక మాట మీద ఉండేది.

చిన్న చిన్న కొట్లాటలతో ఇల్లు గడిచిపోయేది. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఉంటుంది ఇంట్లో ఇద్దరు యజమానులే. ఎవరి నిర్ణయం వారిదే! ఎవరి దృక్పథం వారిది!

ఒకరు ఇంకొకరికి మాట వినరు. ఇంకొకర్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు.

ఇప్పుడు ఆ ఇల్లు నడవదు ఎందుకంటే ఒక ఇంట్లో ఇద్దరు యజమానులు ఇమడ లేరు.”

ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకొని తన ఏమైనా తప్పు చేస్తున్నానా?

రాజీవ్ ఆలోచనలో పడ్డాడు. అమ్మ చెప్పినట్టు తను ఊహించుకున్నటు ఇక్కడ అస్సలు లేదు. నందినికి కూడా ఎందుకో తనకే ఈ పెళ్లి ఇష్టం లేదు అనిపిస్తుంది.

రాజీవ్‌కి ఆలోచనలలో పిచ్చెక్కేలా ఉంది.

***

“నేను రాజీవ్‍ని!”

“రత్న ఫోన్ చేసింది. నువ్వు వస్తావని చెప్పింది. రా! లోపలకి… ఎలా ఉన్నావ్?” కృష్ణవేణి బామ్మ నన్ను లోపలికి ఆహ్వానించింది.

వివేకానంద వృద్ధాశ్రమం అని పైన పెద్ద బోర్డు ఉన్న ఒక చిన్న ఇల్లు ఊరికి కొంచెం దూరంలో ఉండటం వల్ల కొంచెం ప్రశాంతంగానే ఉంది.

ఇంటి వెనక స్థలం ఇల్లు కన్నా పెద్దగా ఉంది.

నేను లోపలికి దారి చూసుకొని వెళ్లి కూర్చున్నాను.

“చెప్పు ఏంటి సంగతులు?” బామ్మ నా చేతికి టీ కప్పు అందిస్తూ అడిగింది.

ఇద్దరం మౌనంగా ఉన్నాం.

“ఎన్ని రోజులు ఉందామనుకుంటున్నావ్ ఇక్కడ?”

“మళ్లీ రేపు సాయంత్రం ప్రయాణం. టికెట్ కూడా బుక్ చేసుకున్నాను.”

“మరి రాత్రికి ఎక్కడ ఉంటావు?”

“దగ్గర్లో ఏదైనా హోటల్ తీసుకుందామని..!” నాకు ఇంకా ఏం చెప్పాలో అర్థం కాలేదు. వాస్తవానికి నేను కూడా ఏమి ఆలోచించలేదు.

బామ్మ తలాడించింది. కాసేపటి తర్వాత నేను ఒక చిన్న కవర్ తీసి చేతిలో పెట్టాను. “బామ్మ నీకు ఇవ్వమని చెప్పింది” అన్నాను.

“ఇదేంటి?” కృష్ణవేణి అర్థం కానట్టు కవర్ చేతికందుతుంది.

చూశాక “అయ్యో దేవుడా! డబ్బులు పంపించింది” తృప్తిగా నవ్వింది.

“వద్దు వద్దు అంటున్నా పెన్షన్ డబ్బులు పంపిస్తూనే ఉంటుంది. సర్లే! ఇంకేంటి సంగతులు? పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి?”

మళ్లీ నా విషయానికి వచ్చింది.

నేను చిన్నగా తలాడించాను.

“ఏంట్రా పెళ్ళికొడుకువి అంత ఉత్సాహం లేదు? ఏదో అన్ని కోల్పోయినట్టు మొహం వేలాడేసావ్?” కృష్ణవేణి బామ్మ మందలించినట్టు అడిగింది.

ఆమె అన్న మాటలు నిజమే. జరిగిన సంగతి వల్ల ఇంకా చిందరవందరగా మారింది. చాలా సందేహాలు నన్ను వెంటాడి వేదిస్తున్నాయి. దేని మీద ధ్యాస ఉండట్లేదు.

“నిన్నే బాబూ!” కృష్ణవేణి బామ్మ మళ్ళీ పిలిచే సరికి ఏం చెప్పాలో అర్థం కాక తల దించుకున్నాను.

కాసేపు మౌనం తర్వాత ……….

“నాకు చిన్న సహాయం చేస్తావా? నేను ఇల్లు బాగు చేస్తున్నాను. దగ్గరుండి చూసుకుందాం అంటే మేమంతా వయసు మళ్ళిన వాళ్ళం. కాస్త ఎవరైనా తోడుగా ఉంటే మాకు ధైర్యంగా ఉంటుంది. ఏమి అనుకోకపోతే నా దగ్గర ఒక వారం రోజులు ఉంటావా?”

కృష్ణవేణి బామ్మ జాలిగా బతిమాలింది.

***

“ఒరేయ్ వారం రోజులు ఉండమని చెప్పి నేను ఇబ్బంది పెట్టలేదు కదా?”

“అసలే పెళ్లి సమయం” కృష్ణవేణి బామ్మ కొంచెం భయంగా అడిగింది. మొదట్లో నన్ను ‘మీరు’ అని పిలిచేది. ఇప్పుడు ఒరేయ్ అన్నంత చనువు రెండు రోజుల్లో ఏర్పడిపోయింది.

“అయ్యో ఇబ్బంది ఏముంది బామ్మా, అయినా పని పూర్తి గావస్తుంది కదా.”

“ఒరేయ్ నా ఇంటికి సున్నం వేయించుకున్నాను గాని, నీ మొహానికి నవ్వు మాత్రం తీసుకురాలేకపోయాను రా. అసలు ఏం జరిగిందో చెప్పరా! ఇంకో నెల రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఎందుకిలా ఉన్నావ్? నీకు పెళ్లి ఇష్టం లేదా?నందిని అంటే ఇష్టం లేదా? పోనీ నేను ఏమైనా సహాయం చేయగలనా?”

ఏం చెప్పాలో తెలీక నేను గట్టిగా ఊపిరి తీసుకున్నాను.

“ఏమో బామ్మా! నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఈ పెళ్లి సరైన నిర్ణయం కాదో కూడా తెలియటం లేదు. నందినికి నేనంటే ఇష్టం లేదో పెళ్లంటే ఇష్టం లేదో అర్థం కావడం లేదు. అన్నిటికన్నా ముందు అసలు నేను అమ్మాయిలను అర్థం చేసుకోగలనా అని భయంగా ఉంది. ఆలోచిస్తుంటే ఈ పెళ్లి మానేయాలి అనిపిస్తుంది.”

బామ్మ గట్టిగా నవ్వేసింది.

“పెళ్లికి ముందు ఈ భయాలన్నీ సహజమే రా. అన్నీ అవే సర్దుకుంటాయి.”

“కానీ నందిని మనసులో ఏముందో ఎలా అర్థం చేసుకోవడం?”

“అమ్మాయిల అర్థం చేసుకోవడం అంత కష్టం రా” బామ్మ తేలిగ్గా అంది.

“సరే బామ్మా! ఒక విషయం అడుగుతాను. నాకు నందినికి ముందు ఒక పెళ్లి చూపులు జరిగాయి. ఇంట్లో ఎంతో పద్ధతిగా ఉండేది. నచ్చింది కదా అనుకున్నాను. కానీ తర్వాత నన్ను పబ్‍‌లో కలవమంది. తీరా కలిశాక అమ్మాయి ఆలోచనలు ఆచరణ అంతా వేరే అని తెలిసింది. ఎందుకిలా ఇంత నాటక నాటకం ఆడింది? పైగా నేనే తనకి సరిపోను, లండన్ పద్ధతులు తనకి సరిపోవు అని నా మీద లేనిపోని అబద్ధాలు చెప్పింది.”

“అలా ఎందుకు అనుకుంటున్నావు రా? నీ దగ్గర ఏమీ దాచకూడదు, తను నిజంగా ఎలా ఉంటుందో పరిచయం చేయాలని ఉందేమో. తన తల్లి తండ్రి అర్థం చేసుకోలేనిది నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుoదేమో. లేదా నీ దగ్గర ఏమీ దాటకూడదు అని చిన్న ప్రయత్నం కావచ్చు.”

కృష్ణవేణి బామ్మ చెప్పింది విని ఒక్క క్షణం ఆశ్చర్యం వేసింది. నేను ఎందుకు ఇలా ఆలోచించడం లేకపోయాను?

“మరి అమ్మాయి నా గురించి అబద్దాలు ఎందుకు చెప్పింది? అది తప్పు కదా?” నాలో తప్పులేదు అని బామ్మతో అనిపించుకోవాలని చిన్న ప్రయత్నం చేశాను.

“మరి ఇంకేం చేస్తుంది రా నువ్వు ఉన్న పళంగా అక్కడి నుంచి వెళ్లిపోయావు. నీకు ఇష్టం లేదని తెలుస్తుంది. నీ నోటి నుంచి ఎందుకు వినడం అని అలా చెప్పు ఉంటుంది. మళ్లీ తర్వాత ఎలాగో నువ్వు కలుసుకో కదా, ఏం పర్వాలేదు లే అని అనుకుంటుంది. ఏరా ఆ మాత్రం చిన్న త్యాగం చేస్తే ఏమైంది? వాళ్లకి ఫోన్ చేసి గొడవ గొడవ చేసేవంట.”

“మరి తప్పు తనదే కదా బామ్మ నాకు కోపం రాదా?”

“కొన్ని సందర్భాల్లో ఎవరిది తప్పు అని ఉండదు రా. ఎవరికి ఎక్కువ ఓర్పు అన్నది ఉంటుంది. అయినా జరిగిందేదో జరిగిపోయింది. అంతా మన మంచికే లేరా. చూడు నీకు నందిని అంత మంచి పిల్ల దొరికింది. నాకు అదే సంతోషం.”

నేను బాధపడుతున్న విషయం ఆమెకి అర్థమైంది అనుకుంటా, నన్ను బుజ్జగించే ప్రయత్నం చేసింది.

“మరి బామ్మ సంగతి ఏంటి? తనని అర్థం చేసుకోవడం కూడా నేను తప్పు చేశానా?”

“ఎవరి గురించి మాట్లాడేది మన రత్న గురించా.”

అవునని నేను తలాడించాను

“బామ్మకి అన్నీ ఉన్నాయి కదా? ఏ లోటు లేదు. అంత వైభవంగా చూసుకుంటాడు. ఇంట్లో పిల్లలందరూ ఎంతో ఇష్టపడతారు. అయినా సరే మా బామ్మకి ఎందుకు అక్కడ ఉండటం ఇష్టం లేదు. వృద్ధాశ్రమానికి వచ్చేస్తాను అని అడుగుతూ ఉంటుంది? ఎందుకు అంత బాధ పడుతుంది?”

కృష్ణవేణి బామ్మ చిన్నగా నవ్వింది.

“ఒక పిచ్చికని పంజరాల్లో పెట్టి, నచ్చిన తిండి పెట్టి చుట్టూ బంగారు చుట్టినా అది ఆకాశం వైపు చూసి బాధ పడుతుంది. ఇది కూడా అంతేరా! స్వేచ్ఛ కోసమే దాన్ని ఆరాటం అంతా.”

నేను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. కృష్ణవేణి బామ్మ చెప్పినది కొంత ఊరట ఇచ్చినా ఇంకా నన్ను బాధ పెట్టిన అంశాలు చాలానే ఉన్నాయి.

ఎన్నో ఎన్నో ప్రశ్నలకు ఇంకా సమాధానం కావాలి అనిపిస్తుంది.

“ఏంట్రా ఆలోచిస్తున్నావ్?”

“బామ్మా! నువ్వు చెప్పాక కరెక్ట్ అనిపిస్తుంది కానీ, ఏంటో ఇంకా చాలా విషయాలు కళ్ళ ముందు ఉండి సమాధానం దొరకడం లేదు అనిపిస్తుంది. అంతా కరెక్ట్‌గా ఉన్నా ఎక్కడో చిన్న తప్పు జరుగుతుంది అనిపిస్తుంది. అది నందిని విషయం కూడా కావచ్చు. అర్థం చేసుకోలేక పోతున్నాను బామ్మా.”

కృష్ణవేణి బామ్మ ప్రశాంతంగా నావైపు చూసింది.

“సరే నువ్వు రామాయణం చదివావా?”

నేను తలాడించాను.

“బాగా చదివావా? లేక ఊరికేనా? అంటే పైన చదివావా?”

“లేదు బామ్మ. పూర్తిగా చదివాను. ఒక్కసారి కాదు, చాలా సార్లు చదివాను.”

“మరి దాంట్లో కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్పగలవా?

రాముడు విష్ణు స్వరూపుడు అంటారు. అలానే సీత స్వయానా లక్ష్మీదేవి.

వారు కారణజన్ములు. అయితే రాముడు అగ్ని పరీక్ష చేసినప్పుడు సీత ఒకమారు మాటైనా మాట్లాడకుండా కళ్ళు మూసుకుని అగ్నిలో దూకింది. అవునా?

రాముడు ఎప్పుడైతే అడవిలో వదిలేసాడో, పిల్లలు పెద్దవారైన అంతవరకు ఓపిక పట్టి రాముడికి అప్పచెప్పి తను సహనం పాటించింది.

అంత తెలిసిన సీత రాముడు తిరిగి తన దగ్గరికి రమ్మని అన్నప్పుడు తన తల్లి అయిన భూమిలో కలిసిపోయిందే తప్ప తిరిగి రాముడు దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకని?

రాముడి తప్ప ఇంకో పేరు కూడా తెలియని సీత శ్రీరాముని ఎలా వదలగలిగింది?

రాముడు కోసమే కదా అగ్ని ప్రవేశం చేసింది? రాముడు కోసమే కదా అడవుల పాలైంది?

శ్రీరాముడు తిరిగి రమ్మంటే తాను వెళ్లలేదు. కారణం చెప్పగలవా?

ఎవరో ఏదో అన్నారని అలా రాముడు అడవికి ఎలా పంపిస్తాడు? అందుకే కోపం వచ్చి తిరిగి వెళ్ళలేదు.

అదే కారణంతో కదా అంతకుముందు అగ్నిప్రవేశం చేయమంటే సీత చేసింది. అడవి జీవితం అగ్నిప్రవేశం అంత పెద్ద పరీక్ష కాదు కదా?”

కృష్ణవేణి బామ్మ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు.

“ఒకసారి అగ్ని ప్రవేశం, మళ్లీ ఎవరో ఏదో అన్నారని అడవులపాలు చేయడం, మళ్లీ ఇంకా ఎవరో ఏదో అన్నారని మరో శిక్ష.

సీత ఇంకెన్నాళ్లు భరిస్తోంది?

అందుకని రాముని వదిలేసి వెళ్ళిపోయింది.”

కృష్ణవేణి బామ్మ చిన్నగా నవ్వింది.

ఘోరమైన అడవుల్లో తిరిగి, దుర్మార్గులైన రాక్షసులని ధైర్యంగా ఎదిరించి, అగ్నిలో దూకినా చలించని సీతకి అడివిలో వదిలేస్తే అంత కోపం వచ్చిందా.

మళ్లీ ఇంకా ఎవరో మాటలు విని శ్రీరాముడు మళ్లీ ఇంకో శిక్ష వేస్తే?

సమాధానంగా కృష్ణవేణి బామ్మ, “మరో శిక్ష వేస్తే ఏముంది? సీతకు కష్టాలు కొత్త కాదు కదా. రాముడి మాట సీతకు వేదవాక్కు కదా. రాముడు విష్ణువు అవతారం ఏది చేసినా లోక కల్యాణం కోసమే అని తెలియదా? ఎందుకు రాముడుని వదిలేసింది?” అడిగింది.

ఇక నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. మౌనంగా ఆలోచనలో పడ్డాను.

కృష్ణవేణి బామ్మ నా చేతుల్లో రామాయణం పుస్తకం పెట్టింది.

“ఈ వృద్ధాశ్రమంలో ఒకరు నాకు బహుకరించారు. ఇంగ్లీష్ రామాయణం ఏం చేసుకుంటాను? అనుకున్నాను. ఇదిగో ఇలా ఉపయోగపడింది. ఈసారి ఇది చదువు. రామాయణంలా కాదు సీత ప్రయాణంలా చదువు…”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here