సీత-18

0
2

[dropcap]ట్రై[/dropcap]న్ కిటికి నుంచి బయటకు చూసాను.

కృష్ణవేణిగారు కార్లో వెళ్లామన్నారు…

కాని ఎందుకో నాకు ట్రైన్ ఎక్కాలనిపించింది.

కాసేపు ఎవ్వరు గుర్తుపట్టని, ఎవరికీ తెలియని ముఖాల మధ్యలో గడపానిపించింది.

ఇక్కడ మొత్తం జనం ఎక్కేవారు, దిగేవారు. మారుతున్న ముఖాలు. ఆ నవ్వే ముఖాలు చాటు దాచుకున్న కథలు.

కాసేపట్లో ట్రైన్ బయలుదేరింది. నా ఎదురుగా ఎవరో అమ్మాయి.

“హయ్” నేనే పలకరించాను. అమ్మాయి చిన్నగా నవ్వింది.

“పెళ్ళైందా??”

‘అయ్యో దేవుడా! ఇలా అడిగానేంటి?’ నాకే విచిత్రం అనిపించింది.

“ఎందుకు నువ్వు చేసుకుంటావా?” అకస్మాత్తుగా అడిగిన ప్రశ్నకు ఆశించని జవాబు.. షాక్ అయ్యాను.

“ఛీ, ఛీ అలాంటిది ఏమి లేదు.” తలదించుకున్నా.

ఆ అమ్మాయి ఫక్కున నవ్వింది.

“అయ్యింది… ఇద్దరు పిల్లలు కూడా…”

“అవునా!! మీరు అస్సలు అలా కనిపించటం లేదు!!”

నేను నిజంగానే ఆశ్చర్యపోయాను.

“థాంక్యు!! ఎక్కడికి మీరు…”

“హైదరాబాదు..! మరి మీరు?”

“నేను కూడా హైదరాబాదుకే…” ఆ అమ్మాయి సర్దుకొని కూర్చుంది.

“అవునా!! పని మీద వచ్చారా? చేతిలో లగేజీ ఏమి లేదే?” అని అడిగాను.

“లేదు.. నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను.”

“ఫ్యామిలీ అంతా హైదరాబాదులో… అవునా! మరి రోజూ అప్ అండ్ డౌనా?”

ఆ అమ్మాయి భుజాలు ఎగరేసింది.

“కష్టంగా లేదా?”

“అమ్మో! చాలా కష్టం, రోజు నాలుగు గంటలు ప్రయాణం.”

“జాబ్ మానేయ్యచ్చు కదా!”

“మళ్లీ వెతక్కోవడం కష్టం… ఇంట్లో కూడా ప్రెజర్ ఉంటుంది. ఇప్పటికీ మానేయమని గోల… ఏదో మా హజ్బెండ్ సహకారంతో చేస్తున్నా. ఇంక నేను కష్టం అంటే తను కూడా మానేయమంటాడు. ఇంత కష్టపడి ఎందుకు చేయడం? మానేయ్యెచ్చుకదా! పైగా పిల్లలున్నారు కూడా!! మొగుడు బాగా సంపాదిస్తున్నాడు కదా! అని గొడవ మొదలెట్టేస్తారు. సో! నోరు మూసుకొని రోజు నాలుగు గంటలు ట్రైన్లో… “

“వాళ్ళన్నది నిజమే కదా!ఇంత కష్టపడి చేయడం దేనికి?” నేను నవ్వుతూ అడిగాను.

“ఒక్క నిమిషం!” ఆ అమ్మాయి ఫోన్ మోగింది.

“హలో! లేదు వచ్చేస్తున్నా!”

క్షణంలో ఆ అమ్మాయి మొఖం మొత్తం ఎర్రగా మారిపోయింది.

“లేదు వచ్చేస్తున్నా!! ఇంకో రెండు గంటల్లో అక్కడ ఉంటాను.” కన్నీళ్ళు టపటప రాలిపోతున్నాయి.

ఫోన్ పెట్టేసింది. తల కీటికి వైపు తిప్పుకొని కూర్చుంది.

నాకు ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు.

“అంతా ఓకే… కదా!” కాసేపటికి నేనే పలకరించాను.

పల్లవి తల అడ్డంగా ఊపింది.

“సారి… మీకు చెప్పటం ఇబ్బంది అనిపిస్తే..” అన్నాను.

“ఏం లేదు.. నిన్నటి నుంచి మా పాపకి జ్వరం. ఆఫీస్‍లో సెలవు అస్సలు దొరకలేదు. ఈ రోజు మధ్యాహ్నం జ్వరం బాగా ఎక్కువై పోయింది. అంతా నా వల్లే అని…. మా ఆయన ఒకటే గొడవ. నేను శ్రద్ధ తీసుకోవటం లేదని….”  పల్లవి గొంతు బాధలో అడ్డుకుంది.

“అదేంటి? మీ హజ్బెండ్ ఇంట్లో ఉన్నారు కదా!”

“కాని, నేను పక్కనుంటే ఎంతయిన వేరు కదా! పాపం ఆయన చాలా సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఈ మాత్రం అయిన ఉద్యోగం చేయగుతున్నాను.”

“మరి ఫోన్లో అలా తిడుతున్నాడు.” నాకు అర్థంకాక అడిగాను.

“అదా…! ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకని అలా కోపంగా ఉన్నాడు.” గట్టిగా నవ్వేసింది.

“మీ పేరు?”

“పల్లవి…”

“నా పేరు రాజీవ్…”

ఇంతసేపటికి పరిచయాయ్యాయి.

పల్లవి కొంటెగా నవ్వింది.

“నాకిప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే…. అంత కష్టపడుతూ ఎందుకు ఉద్యోగం చేయడం? నీ భర్త మంచివాడు. సంపాదిస్తున్నాడన్నావు కదా!” అడిగాను. మనసులో రచననే మెదులుతుంది.

పల్లవి గట్టిగా నిట్టూర్చింది.

“రాజీవ్, నీకు ఏలా చెప్పాలి? సరే, విను! ఉద్యోగం పురుష లక్షణం…. అని అంటారు. నువ్వు ఎప్పుడైనా విన్నావా?”

అవును… నేను తలూపాను.

“పురుషుడంటే ఎవరు?”

“మగవాడు..” నాకు పల్లవి ఏం చెప్పదలచుకుందో అర్థం కాలేదు.

“అంటే లండన్ వాడివి కదా, తెలుగు వచ్చోరాదో అని అలా అడిగాను. పురుషుడు అంటే అర్థం మగవాడనే కానీ దాని పరమార్థం ‘అభిమానం’ అని, అంటే మనిషిలో ఉన్న ఇగో. ఒకటి మేల్ ఇగో, రెండోది ఫిమేల్ ఇగో. ప్రతి మనిషిలో మేల్ ఇగో ఉంటుంది. అదే సమపాళ్ళలో ఫిమేల్ ఇగో కూడా ఉంటుంది.

కుటుంబం మీద ప్రేమ, బాధ్యత, తనకిష్టమైనవారిని తిడితే కోప్పడటం, కుటుంబానికి ఏదైన జరిగితే బాధ, కరుణ కలగడం మొదలైనవన్నీ ఫిమేల్ ఇగో. రోషం, అభిమానం, సమాజంలో గౌరవం, ప్రతిభకు గుర్తింపు, పరువు, అధికారం, సమానత్వం, మొదలైనవన్నీ మేల్ ఇగో కిందకి వస్తాయి.

అందుకే ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. కానీ డబ్బు సంపాదించడం పురుష లక్షణం అనలేదు. ఎందుకంటే డబ్బు ఎలాగైన సంపాదించవచ్చు. కానీ ఉద్యోగానికి ప్రతిభ ఉండాలి. బాధ్యత ఉండాలి. చదువు ఉండాలి.

మేల్ ఇగో ప్రతి స్త్రీలోను ఉంటుంది. ఫిమేల్ ఇగో ప్రతి మగవాడిలో ఉంటుంది.

కానీ మన సమాజం వైఖరే వేరు… ప్రతి మగవాడికి ఫిమేల్ ఇగో సంతృప్తి అవుతుంది.

ఉద్యోగం చేసేవాడు కుటుంబాన్ని ప్రేమిస్తాడు. ఉద్యోగం చేసేవాడు బాధ్యతగా ఉంటాడు. ఉద్యోగం చేసేవాడు భార్యను బాగా చూసుకుంటాడు.

మరి ప్రతి స్త్రీలో ఉన్న మేల్ ఇగో పరిస్థితి?

కుటుబంపైన తనకున్న బాధ్యతకి సమాజంలో గుర్తింపు?

తను పిల్లల్ని కనిపెంచి చేస్తున్న త్యాగానికి ఫలితo?

ఆ స్త్రీ ప్రతిభను ఎవరు గుర్తిస్తారు?

అప్పుడు మొదలైంది ఘర్షణ…

ఇది ఒక స్త్రీకి, పురుషుడికి కాదు.

ఒక మనిషికి చెందిన రెండు అభిమానాల మధ్య ఘర్షణ.

ఏ స్త్రీకైన మగవాడు తనని అర్థం చేసుకోలేదని ఘర్షణ కాదు, తనలోని మగవాడిని సమాజం ఎందుకు అర్థం చేసుకోవట్లేదని ఘర్షణ.

మగవాడిని తన తల్లిపేరుతో ఒక బూతు తిడితే, అతని ఫిమేల్ ఇగో ఎంతో దెబ్బ తింటుందో; ప్రతీది చెయ్యి చాపి అడగాలన్నా, నేను సంపాదిస్తుంటే…. నువ్వు హాయిగా కూర్చుని తింటున్నావని అన్నా…. మాకు మేల్ ఇగో అంతే దెబ్బతుంటుంది మరి.”

పల్లవి తన చేయి నోటికి అడ్డుపెట్టుకుని గట్టిగా నవ్వింది.

“మరి తప్పు ఎక్కడ జరుగుతోంది. ఇంట్లో ఉన్న అమ్మాయికి గౌరవం లేకపోతే ఎలా? మరి పరిష్కారం ఎలా?” అడిగాను.

“ఏమో” పల్లవి భుజాలు ఎగరేసింది.

“ఏం చేస్తాం? సమాజం ఆధునీకరణ పట్ల మార్పు చెందుతూ… ఒక విచిత్రమైన స్థితిలోకి చేరింది. ఉదాహరణకి మా అమ్మమ్మ వేదాలు చదివింది. సంస్కృతం అద్భుతంగా చదువగదు. ఆయుర్వేదం తెలుసు, కాని ఇప్పుడు సమాజం దాన్ని విద్యగా పరిగణించదు. ఎందుకంటే డిగ్రీ పట్టా లేదు కదా! అలాగే ఇంటికి, కుటుంబానికి చేస్తున్న శ్రమ ఎవ్వరు పరిగణలోకి తీసుకోరు. దానికి డబ్బు సంపాదన లేదు కదా! చులకనై పోయింది. అందుకే నాకు విసుగుపుట్టి, పంతం పట్టి, మరీ ఉద్యోగంలో చేరాను.” అంది పల్లవి.

***

హైదరాబాదు తిరిగి వచ్చాను. అమ్మానాన్న కూడా వచ్చారు.

చాలా సంతోషంగా ఉన్నారు. ముందెన్నడూ వాళ్లని నేనిలా చూడలేదు.

వచ్చిన దగ్గర నుంచి షాపింగ్, పెళ్ళి పనుల్లో రోజులు చిటికెలో గడిచిపోతున్నాయి. ఇల్లంతా కోలాహలం. ఆటలు, పాటలు, సందడి. అయినా తెలియదు నాకెక్కడో బాధ. నా చుట్టూరా ఉన్న సంతోషాన్ని ఎందుకో అనుభవించలేకపోతున్నానని, తప్పు చేస్తున్నాని ప్రతీ క్షణం చిత్రవధ.

‘నందిని వేరేవాడిని… ప్రేమించిదనా… ఈ బాధ’

లేదే! తను అతనిని మర్చిపోతానని చెప్పింది… నాతో సంతోషంగానే ఉంది.

మరి ఇద్దరిని విడకొడుతున్నారా? అదీ లేదు.

నేను కాకపోతే…. వాళ్ళ నాన్న వేరే ఒకడిని తెస్తాడు.

ఇందులో నా తప్పేమీలేదు.

మరి… మరి… ఏంటి?

దేవుడా ఏంటీ గందరగోళం?

మాయా….! ఉన్నట్టుండీ ఎందుకో మాయ గుర్తొచ్చింది.

మాయ పక్కనుంటే బాధే తెలియదు.. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది.

నిజంగా తనని మిస్ అవుతున్నా… హైదరాబాదులో వెళ్ళిన ప్రతి ప్రదేశంలో తన జ్ఞాపకాలు ఉన్నాయి. తనతో కలిసి గడిపిన ట్యాంక్‌బండ్, తిరిగిన గల్లీ… పిచ్చిపట్టినట్లు తిరిగిన షాపింగ్ మాల్స్… హోటల్స్… ఒకటేమిటి? ప్రతీచోట ఒక తీపి గుర్తే.

ఎంతయిన మంచి స్నేహితురాలు. ఏదో చిన్న గొడవవల్ల కనీసం పెళ్ళికి కూడా పిలవలేదు . ఎంత బాధపడిందో… ఏమిటో… చాలా తప్పు చేసా… ఇంక ఆలోచించలేదు. వెంటనే మాయకి ఫోన్ చేసాను.

***

“రా..రా…! అబ్బో పెళ్ళి కళ వచ్చేసింది.” తలుపు తీస్తూనే మాయ నన్ను ఆటపట్టించింది.

నేను చిన్నగా సిగ్గుపడి లోపలికి వెళ్ళాను.

“రా కూర్చో….” మాయ సోఫాను చూపించింది.

వెళ్ళి కుర్చున్నాను..

ఇప్పుడే వస్తానని మాయ లోపలికి వెళ్ళింది.

మాయ ఉండేది అపార్ట్మెంట్స్‌లో. ఇల్లు చిన్నదైనా చాలా అందంగా ఉంది. అపార్ట్మెంట్ ఒకటే కాదు. అలాంటివి చాలా బ్లాక్స్ ఉన్నాయి. అన్నీ కలసి ఒక చిన్న కాలనీలా ఉన్నాయి. చిన్న ప్రపంచం లాగా ఉంది.

మాయ మెల్లగా లోపల్నించి వీల్ చైర్ తోసుకుంటూ వచ్చింది.

“ఇదిగో ఇతనే మా నాన్న” రెండు చేతులు ఆయన మెడ చుట్టూ వేసి కౌగిలించుకుంది.

నాకు నోట మాట రాలేదు. లేచి నిలబడ్డాను.

ఆయన ‘కూర్చో’ అంటూ సైగ చేసారు.

ఆయన మాట్లాడలేడని, కాళ్ళు చేతులు కూడా పడిపోయాయని అర్థం అవుతుంది. ఒక్క చేయి కొంచెం పని చేస్తుంది. దాని తోటే ఆయన సైగ చేస్తున్నారు.

“నాన్నా…. నేను… చెప్పానే… రాజీవ్….. ఇదిగో… ఇతనే….. పెళ్ళి కుదిరింది. పిలుద్దామని వచ్చాడు.”

ఆయన ఏదో సైగ చేసారు.

మాయ నా వైపు చూసి… ‘మంచిది.’ అంటున్నారు.

నేను తలూపాను.

ఆయన మళ్ళీ ఏదో సైగ చేసారు.

మాయ నా వైపు చూసి.. “నిన్ను భోజనం చేసి వెళ్ళమంటున్నాడు” అంది.

“అయ్యో! వద్దు వద్దు…” మొహమాటంగా అన్నాను.

మాయ కోపంతో నావైపు చూసింది.

“ఏంటి వద్దు? వంట చేసేసాను? తినకపోతే చంపేస్తా.”

తింటున్నంత సేపు ఆయన మాట్లాడేది, సైగ చేసేది, మాయ నాకు అర్థం చెబుతూనే ఉంది.

ఆయనకు తనే తినిపిస్తుంది.

నాకు ముద్ద దిగటం లేదు. గొంతు పూడుకు పోతుంది. మనసంతా భారంగా మారింది.

ఎంత తప్పుగా ఆలోచించాను. ఆంటీ గురించి ఎంత తప్పుగా మాట్లాడాను.

మాయ కళ్ళల్లో కళ్ళు పెట్టి… మాట్లాడాలంటే సిగ్గేసింది.

ఏం మాట్లాడకుండా తిని బయులు దేరుతానని లేచాను..

మాయ కింద వరకు వచ్చింది.

కొంచెం మొహమాటంగా “మాయా! నిన్ను ఒకటి అడగొచ్చా?”

“ఏంటిది! కొత్తగా అడగొచ్చా అనీ?” మాయ నా భుజం మీద దెబ్బ వేసింది.

“హాయిగా అడిగేయ్ హీరో…!”

“మీ నాన్నకి ఇలా… అంటే…. ఏం జరిగింది? వంట్లో బాగోలేదు… ఎప్పటి నుంచి?” తడబడుతూ అడిగాను..

“ఓ అంతేనా? దానిలో ఏముంది రాజీవ్? నేను రెండో తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా.. నాన్నకి ఆక్సిడెంట్ అయ్యింది. అప్పటినుంచి ఇదే పరిస్థితి.  డాక్టర్లు అయితే చనిపోతాడని చెప్పారంట. కాని అమ్మే మొండిగా పోరాడి బతికించుకుంది. అమ్మ ఇప్పుడు పనిలో బిజీ అయ్యిపోయింది, నాన్నని ఎవరో ఒకళ్ళు చూసుకోవాలి కదా. అందుకే నాకు పెళ్లి చేసుకోవాలంటే భయం. నాన్నని ఎవరు చూస్తారు?

ఆ కుదిరిన పెళ్లి కూడా అందుకే వొద్దన్నాను. నన్ను అర్థం చేసుకొని, నాన్నని కూడా తన ఫ్యామిలీగా చూసిన వాడినే చేసుకుంటా” అంది.

“మరి నాకు ఇన్నాళ్ళు చెప్పలేదేంటి?”

“ఇందులో చెప్పేదేముంది రాజీవ్?”

“కష్టాలు, బాధలు ఉంటే చెప్పుకోవచ్చు… భారం తగ్గుతుందంటారు. కాని నాన్న అంత పెద్ద ఆక్సిడెంట్ నుంచి బతికి బయటపడటం సంతోషమైన విషయం కదా! అయినా వైకల్యం అన్నది మనసుకి సంబంధించింది… కానీ శరీరానికి సంబంధించింది కాదు.”

“అవును నువ్వన్నది నిజమే.. నిన్ను, ఆంటీని అర్థం చేసుకోలేదు. వైకల్యం నాకుంది.”

“అయో! ఛీఛీ.. ఏం మాటలవి రాజీవ్..” మాయ వచ్చి, నా చేయి పట్టుకుంది.

“నువ్వు హ్యపీగా ఉండాలి. నువ్వు చాలా మంచోడివి కదా!”

మాయ గట్టిగా నవ్వింది.

“అది సరే! మీ నాన్న చెప్పేదంతా ఎలా అర్థం చేసుకోగలుగుతున్నావ్? నాకయితే ఒక్క సైగ అర్థం కాలేదు” అన్నాను.

“అదేంటి రాజీవ్? ఆయన చేయిపట్టుకొని నడిపిస్తే నడిచాను. దగ్గరుండి నేర్పిస్తే మాటలు నేర్చుకున్నాను. ఆయన చెప్పేదేంటో ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా?” అంది మాయ.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here