సీత-19

0
2

[dropcap]”ఏం [/dropcap]రచనా బాగున్నావా?”

“నీ పెళ్లి కుదిరింది అంట కదా”

“అవును కార్డ్ ఇద్దామని స్వయంగా నేనే వచ్చాను.”

“ఏమో రాజీవ్, అరవింద్ ఎలా ఫీలవుతాడో? డివోర్స్ కూడా కూడా అప్లై చేశాను కదా.”

“థాంక్యూ”

“కానీ పెళ్లికి రావటం కుదురుతుందో లేదో?”

“అసలు ఏం జరిగింది? సడన్‌గా ఏంటిలా? మీది లవ్ మ్యారేజ్ కదా” మొహమాటంగా అడిగాను.

“ఏమో రాజీవ్! నాకైతే అర్థం కావట్లేదు. పెళ్లి అయిన దగ్గరనుంచి అయితే గొడవలు చాలా సాధారణం అయిపోయాయి. ఇక లవ్ విషయానికి వస్తే అప్పుడు ఏదైతే చూసి నన్ను ఇష్టపడ్డాను అని చెప్పాడో ఇప్పుడు అదే ఇబ్బంది అని చెప్తున్నాడు. సరే గొడవలు అయినా చిన్న చిన్నవి సర్దుకుంటాయి అనుకున్నాను కానీ ఇప్పుడు చేయి దాటిపోయింది.”

“ఇష్టమైన వారి కోసం మనం మార్చుకోవాల్సి వస్తే తప్పేంటి రచనా? నువ్వే మార్చుకోవచ్చు కదా?”

రచన తను చెప్పేది ఆపేసి నా వైపు కోపంగా చూసింది.

“ఇక అలా చేస్తే నా లవ్ మ్యారేజ్‌కి అర్థం ఏముంటుంది?” అంది.

“అంటే పెళ్లి అన్న తర్వాత కాంప్రమైజ్ తప్పవు కదా రచనా” అర్థం చేయడానికి ప్రయత్నం చేశాను.

“నువ్వు చెప్పింది కరెక్టే రాజీవ్. కానీ నేను మార్చుకోవాల్సిన తప్పు ఏం చేస్తానో నాకే అర్థం కావట్లేదు. అరవింద్ కాంప్రమైజ్ అయ్యాడు అని ఎప్పుడూ అంటుంటాడు. కానీ నీకో విషయం తెలుసా? మా నాన్నతో నేను మాట్లాడటం మానేసి మూడు సంవత్సరాలు అవుతుంది. ఏదో పెళ్లి అయిన దగ్గర నుంచి తన ఫ్యామిలీ ఎంతో త్యాగం చేశారని ఫీల్ అవుతాడు. అలా చేసినందుకు నన్ను ఏదో భరిస్తున్నట్టు ఫీలింగ్. నా ఫామిలీ గాని నేను గాని నిన్ను ఒక్క మాట అనరు అంటాడు. నాకు అర్థం కానీ విషయం ఏంటంటే, అసలు ఆ ఫామిలీ నన్ను ఏం అనాలి? అనేంత తప్పు నేనేం చేశాను? ఎప్పుడు చూడు ఇష్టం లేకపోయినా మన పెళ్లికి ఒప్పుకున్నారు ఇష్టం లేకపోయినా మన పెళ్లికి ఒప్పుకున్నారు అని పదేపదే అంటుంటాడు. అంత ఇష్టం లేక పోవడానికి నాకేం తక్కువ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఏదో రోడ్డు మీద ఉంటే నన్ను పెళ్లి చేసుకొని ఉద్ధరించినట్టు మాట్లాడుతారు. అరవింద్ కంటే నా చదువు, ఉద్యోగం అన్ని ఎక్కువే.” రచన ఆవేశంగా మాట్లాడుతుంది. నాకు కొంచెం భయం వేసింది.

“నేను కూడా అరవింద్‌తో మాట్లాడే ప్రయత్నం చేశాను రచనా. ఒక ఇంట్లో ఇద్దరు యజమానులు ఉండలేరు అని చెప్పాడు.”

“నిజమే కదా!”

“కానీ ఎవరి దగ్గర కాంప్రమైస్ అన్నది మీరే నిర్ణయించుకోవాలి.”

రచన ఒక్క నిమిషం నా వైపు ఆశ్చర్యంగా చూసింది. తన కోపాన్ని గాల్లో వదిలేసినట్టు కుర్చీ మీద ఒదిగిపోయి హాయిగా నవ్వింది.

“నువ్వు కూడా అలాగే ఆలోచూస్తున్నావ్ కదా రాజీవ్, ఎంతైనా నువ్వు కూడా మగవాడివి కదా. సరే! నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం కానీ నాకు ఒక చిన్న విషయం చెప్పు. ఒక ఇంట్లో ఇద్దరు యజమానులు ఉండలేరు కానీ ఒక ఇంట్లో ఇద్దరు బానిసలు హాయిగా ఉండొచ్చు కదా.”

***

తిరిగి వస్తున్న అంతసేపు రచన మీదే నా ఆలోచనంతా. తప్పు ఎక్కడ జరుగుతుంది? అమ్మాయిలను అర్థం చేసుకోవడం లోనా? లేక అమ్మాయిలు తప్పు చేస్తున్నారా?

“బాబూ ఎటు తీసుకెళ్తున్నారు?”

ఆలోచనల్లో పడిపోయి ఆటోవాడు దారేటు తీసుకెళ్తున్నాడు సరిగా పట్టించుకోలేదు.

“నేను కరెక్ట్‌గా తీసుకెళ్తున్న!” వాడు పొగరుగా సమాధానమిచ్చాడు.

“కరెక్ట్ ఏంటి? ఇది తప్పు దారి కదా, మన వెళ్లాల్సింది వేరేవైపు కదా.”

“సరైన దారి ఎటో మరి చెప్పొచ్చు కదా” వాడు కోపంగా అరిచాడు.

“ఏంటి అలా మాట్లాడుతున్నావ్? మంచిగా మాట్లాడు, మంచిగా తీసుకెళ్ళు!” నాకు ఒళ్ళు మండింది.

“తీసుకెళ్తున్న, నువ్వే మంచిగా కూర్చో ..! లేదు ఇక్కడ దిగిపో” వాడు అంతే ఘాటుగా సమాధానం చెప్పాడు

“సరే ఆపేయ్!”

వాడు ఆపేసాడు.

“మధ్యలో ఆపేసినా ఫుల్ పేమెంట్ ఇవ్వాల్సిందే!”

“అట్లా ఎలా ఇస్తాను?మీటర్ ఎంతయిందో అంతే ఇస్తాను!”

నేను ఆటో దిగి డబ్బులు చూస్తున్నాను

“ఫుల్ పేమెంట్ ఇవ్వాల్సిందే, లేకపోతే ఒప్పుకునేది లేదు.!”

“ఏం పిచ్చి పిచ్చిగా ఉందా?”

“నీకు పిచ్చి పిచ్చిగా ఉందా?”

“ఎవరితో పెట్టుకున్నావ్ తెలుసా? అసలు నేనెవరో తెలుసా?” వాడు మీదకు రావటం మొదలెట్టాడు.

“ఎవడైతే నాకేంటి? నీకు ఫుల్ పేమెంట్ ఇచ్చేది లేదు.”

“ఎవడైతే నాకేంటా? నేను ప్ర .ప్రే.సం. సంఘానికి అధ్యక్షుని తెలుసా?”

“ప్ర .ప్రే.సo.? అదేo సంఘం? నేను ఎక్కడా వినలేదు.”

“ఏంటి?” వాడు వచ్చి కాలర్ పెట్టుకున్నాడు.

వాడు దగ్గరికి వచ్చాక తెలిసింది మందు కొట్టి డ్రైవ్ చేస్తున్నాడని.

“మై గాడ్! ఏంటి తాగి డ్రైవ్ చేస్తున్నావా? ఉండు ఇప్పుడే నీ పని చెప్తా”

“ఏం చేస్తావ్ ఏం చేస్తావ్?”

“ఏం చేస్తానా ? ఐ విల్ సూ యూ!” కోపంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ నాకు అనుకోకుండా వచ్చేస్తుంది.

“అవునా ఏది చెయ్యి, ఐ విల్ సుస్సు యు!”

వాడు ప్యాంటు ఇప్పడం మొదలు పెట్టాడు.

నా అదృష్టం. అక్కడే ఒక ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు.

“సర్!!” గట్టిగా అరిచాను.

“ఏంట్రా? ప్రాబ్లెమ్ ఏంటి?” ఆటో వాడిని కఠినగా అడిగాడు.

“సార్! వీడు నన్ను ప్రాబ్లెమ్ చేస్తున్నాడు” నేను వినయంగా చెప్పాను.

“ఏంట్రా గొడవ?”

“సార్! నమస్తే సార్” వాడు సెల్యూట్ కొట్టాడు.

“ఛీ వెధవా, తాగి ఆటో తోలుతున్నావా? పద స్టేషన్‌కి” అన్నాడు పోలీస్.

***

“హలో! హలో! ఒరేయ్ నేను”

“ఆ చెప్పన్నా”

“ఒకడు నన్ను బాగా డిస్ట్రబ్ చేసాడు రా.”

“ఏమైందన్నా?”

“నన్ను పోలీసులకి పట్టించి జైల్లో పెట్టించాడు. అంత కన్నా పెద్ద తప్పు…! మన సంఘం గురించి తెలియదు అని అన్నాడు.”

“ఎవరన్నా వాడు చెప్పు ఇప్పుడే లేపేద్దాం”

“అంత లేదు లే రా. వారంలో వాడి పెళ్లి. వాడి వెడ్డింగ్ కార్డ్స్ ఆటోలోనే మర్చిపోయాడు. వాడు నన్ను డిస్టర్బ్ చేశాడు కదా నేను వాడి పెళ్లి డిస్టర్బ్ చేస్తా.”

***

వారంలో పెళ్ళి. నందినివాళ్ళు షాపింగ్‌కి హైదరాబాదుకి వచ్చారు. ఇంట్లో వాళ్ళు అందరూ ప్రపంచంలో కరువు వచ్చినట్టు బట్టలు కొంటున్నారు. మ్యాచింగ్ పేర్లతో ఫంక్షన్ల పేర్లతో ఏవేవో డ్రస్సులను అసలు హద్దు లేకుండా షాపింగ్ చేస్తున్నారు. అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు.

పెళ్లి కూతురు, పెళ్ళి కొడుకు, పెళ్ళి పెద్ద తప్ప.

తెచ్చిపెట్టుకున్న నవ్వుతో నందిని… ఏమీ అర్థం కాని అయోమయంలో నేను…. ఎటూ తోచక బెంగతో బామ్మ.

“త్వరగా బయలు దేరండి.” బాబాయ్ హడవిడి చేస్తున్నాడు.

“ఏమి అనుకోవద్దు… నేను ఈ రోజు షాపింగ్‌కి రాలేను.” బామ్మ నీరసంగా అంది.

“అయ్యో మరి ఆగిపోదామా?” అమ్మ, పిన్ని బామ్మ దగ్గరికి వచ్చారు.

“అయ్యో నా కోసం మీ పనులు ఆపుకోవద్దు.” అంది బామ్మ.

చాలా రోజునుండి నాకు బామ్మతో మాట్లాడాలని ఉంది. ఇది మంచి అవకాశం.

“నాకు లండన్ నుంచి పార్సిల్ వచ్చేదుంది. నేను ఎలాగో ఉండి పోదామనుకున్నాను. బామ్మకు తోడుగా ఉంటాను.” నేను నచ్చజెప్పాను.

అందరూ వెళ్ళిపోయాక బామ్మ పక్కన కూర్చున్నాను.

“ఏంటి బామ్మా? అలా ఉన్నావ్?” చేయిని నా చేతిలోకి తీసుకున్నా.

“నాన్న, అమ్మ మీద కోపంగా ఉందా? నీ కూతురు గుర్తుకు వచ్చిందా?”

బామ్మ నా కళ్ళలోకి చూసింది. నవ్వుతూ తన చేయిని నా చెంప మీద అనించింది.

“నా గురించి ఎంత ఆలోచిస్తావురా?”

బామ్మ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

“సారీ బామ్మా!”

“అయ్యో! నువ్వు ఎందుకు సారీ చెబుతావు? నీదేo తప్పురా?”

“నాన్న చేసిన దాన్ని ఏ మాత్రం మనసులో పెట్టుకోకు బామ్మ.”

“అయ్యో, లేదురా!! నాకేం కోపంగా లేదు. నిజానికి అసలు మీ నాన్న తప్పేమీ లేదు. మీ అందరికి తెలిసింది సగం నిజమే…. మిగతా సగం… నాకు తెలుసు. కేవలం, నాకు మాత్రమే తెలుసు.”

***

“ఓరేయ్ రవీందర్. వెళ్ళి అమ్మకు శుభవార్త చెప్పు.”

వీరయ్య కుర్చీలో చతికిపడ్డాడు. రత్నమ్మ బయటకు వచ్చింది.

“మన సుధకు పెళ్ళి ఖాయం చేసుకొని వచ్చాను.”

“అవునా ఎవరు?ఎక్కడ?”

“ఇంకెవరు, శంకరం తమ్ముడు, సుందరం. ఆ ఇంటికి కోడలిగా పంపుతున్నాను. పంపించి తీరుతాను. వీరయ్య అంటే నిలువెత్తు పరువని… ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని ఊరిలో నాకు ఊరికే పేరు వచ్చిందా?” వీరయ్య గర్వంగా తల పైకెగరేశాడు.

“ఒప్పుకున్నారా?” రత్నమ్మ దిగాలుగా అంది.

“మరి కాకపోతే?

“సరే శంకరం చెప్పా పెట్టక పెళ్ళిచేసుకుని వచ్చాడు.”

“పోనీలే అదీ ఒకందుకు మంచిదే. మన అమ్మాయి శంకరం కన్నా వయస్సులో చాలా చిన్నది. సుందరంతో అయితే ఈడు,జోడు బాగుంటుంది.”

“అందుకే కదా ఇన్నేళ్ళు ఆగాను.”

రత్నమ్మ తల మీద చేయివేసి నేల మీద చెరిగిబడిరది.

“అయ్యో దేవుడా? ఇందుకా మీరు ఇన్నేళ్ళు ఆగింది. మీరు కాస్త పాత విషయాలు మర్చిపోతారు. సుధకి ఇంకో సంబంధం తెస్తారు అనుకున్నాను. సుందరంతో దాని పెళ్ళి ఇష్టంలేదని ముందే చెప్పింది. వేరే సంబంధం చూద్దాం.” రత్నమ్మ బతిమాలింది.

వీరయ్య కోపంగా చూసాడు.

“ఒక ఇంటికి ఇస్తానని ఒప్పుకున్న పిల్లని ఇంకో చోటికి ఏలా పంపిస్తాను? నా పరువేం కావాలి?”

సుధకి కూడా తన అభిప్రాయం తన తండ్రితో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ, సుధకు భయం ఎక్కువై పోయింది.

ఇక ఒక రోజు “నాన్నా…” ధైర్యం కూడతీసుకొని పిలిచింది.

“చెప్పమ్మా!…”

వీరయ్య వాలు కుర్చీలో పెరట్లో ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు.

“నాన్నా, సుందరంతో నాకు పెళ్ళి ఇష్టంలేదు.”

సుధ తన నరాలు బిగపట్టి, రక్తాన్ని కూడగట్టి, మొత్తానికి తన మనసులో మాట చెప్పేసింది. తన మాట ఇంకా పూర్తి కాలేదు.

వీరయ్య కొట్టిన దెబ్బకి సుధ ఎగిరి కొంత దూరంలో పడింది.

“అయ్యో! అయ్యో!” రత్నమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది.

“ఏంటిది? పిచ్చి పిచ్చిగా వాగుతుంది? ఇంకా ఎక్కువ మాట్లాడిందంటే చంపెస్తానని చెప్పు.” వీరయ్య కోపంతో ఊగిపోతున్నాడు.

“నాన్నా! నన్ను క్షమించండి. మీరు ఎవరిని తెచ్చిన పెళ్ళి చేసుకుంటాను. కాని సుందరం మాత్రం వద్దు నాన్న. చిన్నప్పటి నుంచి శంకరం నీ భర్త, నీ భర్త అంటే దాని అర్థం తెలియకపోయినా… మీరు చెప్పారని నమ్మాను. ఇప్పుడు అదే ఇంట్లో అతని తమ్ముడు సుందరం అంటే…. నా మనస్సు అసలు ఒప్పుకోవటం లేదు. అన్న కాదన్నాడని తమ్ముడిని… నాన్నా….!” సుధ తండ్రి కాళ్ళని పట్టుకొని బావురుమంది.

“నాన్నా…. నువ్వే సంబంధం తెచ్చినా…. పెళ్ళి చేసుకుంటాను. కాని సుందరాన్ని మాత్రం చేసుకోను.”

“పిచ్చి పిచ్చి ఆలోచను పెట్టుకోకు… ఇంత కష్టపడి కుదుర్చుకొని వస్తే…. ఇప్పుడు ఏంటి? ఇలా? నాకు ఇంత గౌరవం లేని ఇంట్లో ఇక బతకడానికి వీలులేదు. చచ్చిపోతాను. ఇక చచ్చిపోతాను.” అంటూ కోపంగా అరుచుకుంటూ…. మీ తాతయ్య బావిలో దూకబోయాడు.

పాపం నా కూతురు భయపడి…, పెళ్ళి చేసుకుంటానని ఒప్పుకుంది.

ఆ తరువాత మీ బాబాయ్ కూడా పారిపోయాడు.

“ఇక భరించలేక ఆత్మహత్య చేసుకుందా?” ఉండబట్టలేక అడిగాను.

“అలా జరిగుంటే నాకు ఇంత బాధ వేసేది కాదురా!” బామ్మ గుండెమీద చేయి వేసుకొని, సోఫామీద వాలిపోయింది.

“దానికి అసలు మీ బాబాయ్‌తో పెళ్ళే ఇష్టం లేదు.”

“మరి ఏం జరిగింది బామ్మా?”

“పెళ్ళికి ఒప్పుకొని నా కూతురు తన జీవితంతో రాజీపడిపోయింది. ఆ రోజు సాయంత్రం మీ బాబాయ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ సంగతి నా భర్త, కొడుకు మా దగ్గర దాచి పెట్టారు. మీ బాబాయ్ని కొట్టయినా సరే తీసుకురావడానికి వెళ్ళిపోయారు. పాపం పిచ్చి తల్లి… దానికి, నాకు ఈ సంగతి తెలియదు. రాత్రి ఇంకా వాళ్ళు తిరిగి రాలేదు. నేను గాఢ నిద్రలో ఉన్నాను. ఎప్పుడు పెరట్లోకి వెళ్లిందో…. ఎప్పుడు బావిలోకి దూకిందో… తెలీదు. తెల్లారేసరికి శవంలా మారింది. నా భర్త జరిగిన సంగతి చెబితే.. పెళ్ళి ఆగిపోయిందని… నా కూతురు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన మానుకునేదేమో?  అలా బతికుంటే ఇప్పుడు నలుగురిలో నవ్వుతూ తిరిగేదేమో!”

బామ్మ ఎక్కిళ్ళు పెడుతోంది.

“అయ్యో!” నేను బామ్మ భుజంమీద చేయి వేసాను.

“మాకు ఈ ఇంట్లో ఏం ఇష్టమో అని ఆలోచించే స్వేచ్ఛ లేదు. కనీసం ఇష్టంలేదని కూడా చెప్పే హక్కులేదు. అంతా నా ఖర్మ.”

“ఇంత తెలిసి ఇంకా ఎందుకు నీ కొడుకు నిన్ను అర్థం చేసుకుంటాడనుకుంటున్నావు బామ్మా? నిన్ను నీ స్నేహితురాలి దగ్గర, అంటే వృద్ధాశ్రమంలో ఎలా వదిలిపెడతాడు? ఇంకా నీ కొడుకుని ఒప్పించాని ఎందుకు అనుకుంటున్నావు? నీ నిర్ణయం నువ్వు తీసుకోలేవా?”

బామ్మ క్షణం ఆలోచనలో పడిరది.

“లేదు రా! అలా అని కాదు. కానీ వాడిని ఇబ్బంది పెట్టి…. నేను ఏ పని చేయలేను. అలా చేసినా నాకు సంతోషంగా ఉండదు.”

“ఎందుకు?” నాకు కోపం చిరాకుగా మారింది. “నీది పిచ్చితనం, అసలు ముందు నీకు ధైర్యం లేదు. దానికి ఈ కారణాలన్నీ వెతుకుతున్నావ్.” అన్నాను. నాకు కోపం ఆగటం లేదు.

“ఏం? నీ అంతట నువ్వు వెళ్ళొచ్చు కదా?”

“ఆలా వెళితే నేను వాడిని మోసం చేసిన దాన్ని అవుతాను కదరా. నాకు అది ఇష్టం లేదు.”

“మోసమా? ఇది మోసం ఎలా బామ్మా?”

“అంతే కదరా… చెప్పకుండా వెళ్ళిపోతే వాడు నన్ను బాగా చూసుకోటం లేదు అనే కదా అర్థం. అది నిజంగా ఎంత పెద్ద మోసం. వాడు అర్థం చేసుకొని… ఒప్పుకొని… పంపిస్తే… నాకు తృప్తి.”

“ఏంటో బామ్మ…. మీరు అసలు అర్థం కారు. సముద్రాన్ని గుండెల్లో దాచుకుంటారు. చిన్న వాన చినుకు కోసం ఆరాటపడతారు.”

బామ్మ నా మాట విని గట్టిగా నవ్వింది.

“అంతే కదరా! సేద తీరేది వాన చినుకు తోటే కదా!” అంది.

బామ్మ మాటకి నా మనస్సు కదిలినట్టయ్యింది.

“బామ్మా నీకు ఒక విషయం తెలియాలి… ఎందుకంటే ఇది నా గతం గురించి కాదు. నీ భవిష్యత్తు గురించి. నేను చెప్పేది జాగ్రత్తగా విను ప్లీజ్…”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here