Site icon Sanchika

సీత-2

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత్రి స్పందన అయాచితం – సంచిక పాఠకుల కోసం రచించిన ‘సీత‘ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]“గు[/dropcap]డ్ మార్నింగ్ రా!”

నేను లేచేటప్పటికే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరున్నారు. ప్రియా నా చెల్లి. నన్ను చూసి కొంటెగా నవ్వుతోంది.

“రారా!! కూర్చో ఏం తింటావ్?”

వినయం నటిస్తూ…. మర్యాద చేస్తుంది.

“ఏంటీ రోజు అందరూ కొత్తగా ఉన్నారు?” అనుమానంగా అడిగా…

“నువ్వు పెళ్ళి చూపులకి ఒప్పుకున్నందుకు చాలా హాపీగా ఉందిరా!!” నాన్న కనుబొమ్మలు ఎగరేశాడు.

“పెళ్ళి చూపులా? నేనా? ఇదెప్పుడు? ఏంటమ్మ ఇదంతా?”

నాకు అగ్ని పర్వతం బద్దలైనట్టనిపించింది.

అమ్మ మాత్రం తీరిగ్గా బ్రెడ్ మీద జామ్ రాస్తుంది.

“నిన్నే కదరా చూద్దాం అన్నావ్.”

“అబ్బా అమ్మా, నువ్వు, నీ తెలుగు. చూద్దాం అంటే ‘లెటజ్ సీ’ అని. అంటే ‘ఏదో లే’ అన్నట్టు.”

ఇక నాకు ఏం చెప్పాలో తోచక అటు ఇటు అయోమయంగా చూసాను.

“చూద్దాం అంటే … ఏదోలే అని ఎలా అవుతుంది? చూద్దాం అంటే చూద్దాం అని కాదా!!”

“సర్లే, ఇప్పుడు చెబుతున్న నాకు ఇష్టం లేదు.”

“అయ్యో! ఓరి దేముడో…  ఆ అమ్మాయిని పదింటికి రమ్మని చెప్పానురా!!”

“ఏంటి?…. ఈ రోజా? అంటే ఇంకా రెండు గంటల్లోనా? నీకేమన్న పిచ్చా? నేను వెళ్ళను.”

“అయ్యో మరి ఏమని చెప్పనురా!”

“ఏదో ఒకటి చెప్పు!”

“అదే ఏమని?”

“నాకు డయేరియా…”

“ఛీ!! బాగోదేమో రా…అరే! ప్లీజ్ రా!!”

“నిన్నేం పెళ్ళి చేసుకోమనట్లేదు కదా! ఏదో వెళ్ళి చూసి మాట్లాడిరా!”

“నాకు ఇష్టం లేదు. ఎరేంజ్డ్ మారేజ్ ఏంటి? పెళ్ళంటే ఏదో ఒక ఎడ్వంచర్ ఉండాలి కదా!!

“ఏంటి బాబు అడ్వెంచర్, నిన్ను ఎవరెస్ట్ ఎక్కమనటం లేదు.”

చెల్లి నాన్నకి వినిపించేటట్లు గొణిగింది.

“సర్లే వెళ్ళి చూసిరావడమే కదా! ఎందుకు అంత బెట్టు చేస్తావ్ రా.?”

నాన్న అడిగేసరికి, సరే అన్నాను

“అమ్మా! ఇంతకి అమ్మాయి ఎవరు?”

“అదే, శారద నా ఫ్రెండ్ లేదు..!”

“అదేంటి? శారద ఆంటికి ఇద్దరు అబ్బాయిలు కదా!”

“అబ్బ!! చెప్పనీ రా…!”

“శారద అక్క కూతురు. ఇక్కడ ఎం.ఎస్. చేయడానికి వచ్చిందట. అలాగే పెళ్ళికూడా చేద్దాం …… అనుకుంటున్నారట. మీ ఇద్దరికి సెట్ అయితే, ఆ అమ్మాయి హ్యాపిగా పెళ్ళి చేసుకొని, ఇక్కడే చదువుకోవచ్చు. మన మంచి అమ్మాయి అంట…”

తెలుగు అమ్మాయి!

ఇంకేం పెళ్ళి చూపులు, నన్ను చూస్తూనే సిగ్గుపడుతుంది. లoడన్ అంటే ఎవరు కాదంటారు. తల దించుకొని నాకు ఒకే చెప్పేస్తుంది. ఎంత మంది తెలుగమ్మాయిలను చూడలేదు.

అబ్బాయి ఎలా ఉన్న సరే. లoడన్ అంటే ఒకే చెప్పేస్తారు. నా ఫ్రెండ్స్‌ని ఎంతమందిని చూడలేదు.

ఇక నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఈ పెళ్ళి చెడగొట్టాలి.

***

నేను కేఫ్‌కి వచ్చి పావుగంట అయ్యింది. ఆ అమ్మాయి జాడలేదు.

సరే! ఇంకో అయిదు నిమిషాలు చూస్తాను. వస్తే వచ్చినట్టు, లేదంటే ఆమె ఖర్మ. మనసులో తీర్మానం చేసుకున్నా…

“మీరు రాజీవ్?……”  వెనక నుంచి అమ్మాయి.

తిరిగి చూసాను…

అమ్మ చెప్పినట్లు ఉంది…

చూస్తే మనల్ని మనం కాసేపు మరచిపోవాల్సిందే…

కాని నాకు ఇప్పుడు మూడ్ లేదు.

ఈ మీట్‌ని ఎలాగైనా చెడగొట్టాలి.

ఆ అమ్మాయి మళ్ళీ జీవితంలో నన్ను పెళ్ళి చేసుకుంటా ననుకోకూడదు.

అంతే! నాలో నాకే తెలియని శాడిస్ట్ యాంగిల్ బయటకు వచ్చింది.

చూస్తూ ఉండండి. ఊది పారేస్తా… హా!!

“హాయ్” అని అన్నా! …..

అమ్మాయి వచ్చి నా ఎదురుగా కూర్చుంది.

ఇబ్బందిగా నవ్వి, మొహమాటంగా తలూపింది.

నేను గొంతు సవరించుకున్నాను స్టైల్‌గా

“మీ ప్పేరు?”

“చైత్ర…!”

“ఏంటీ ‘చెత్త’నా?”

చైత్ర ఘాటుగా చూసింది.

“కాదు ‘చై ….. చైత్ర….’ ఒత్తిపలుకుతూ చెప్పింది.

“ఓ సారి! నాకు తెలుగ్గు సరిఘా రాదు.” అని స్టైల్‍గా మూతిని ముప్పై వంకర్లు తిప్పుతూ అన్నాను.

“సరే!” చైత్ర తలూపింది. ఫరవాలేదు.

“ఏం ఛదువుతున్నారు…?”

“హైదరాబాదులో ఆర్స్ చదివాను.”

“ఏంటి! ఫార్ట్స్ … ఆ ??… అలాంఠి ఖోర్షు ఉందా? “ అని కళ్ళు ఎగరేస్తూ అన్నాను.

నా తెలుగుకు నాకే ముచ్చట వేసింది.

కానీ చైత్ర మాత్రం తాగుతున్న నీళ్ళ గ్లాస్‌ని టేబిల్ పైన కొట్టింది.

“మీకు ఇంగ్లీష్ కూడా రాదా?” కోపంగా అంది.

“అంటే!! అంటే నాకు సరిగ్గా వినిపించలేదు.”

“ఓ అయితే చెవుడా!!”

“ఛీ ఛీ అలాంటిది ఏమి లేదు.” నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు.

ఇలాంటి రియాక్షన్ ఊహించలేదు.

“తెలుగు అమ్మాయిలు అణకువగా ఉంటారని అమ్మ చెప్పిందే??”

“ఇప్పుడు తెలుగు బాగానే మాట్లాడుతున్నవే?”

“అంటే చైత్ర…..!!”

“అబ్బా పేరు కూడా బాగానే చెబుతున్నావే…! చూడు! మొన్న మా పిన్నివాళ్ళ ఇంట్లో మీ అమ్మగారిని కలిసాను. ఆవిడ మీద గౌరవంతో వచ్చాను. కానీ, నీకు అంత సీన్ లేదు. పెళ్ళి ఇష్టం లేకపోతే ఆ మాట ముందే చెప్పొచ్చు కదా!”

అమ్మని ఎంత మాట అంది? ఎంత పొగరు? నాకు అంత సీన్ లేదా? అరికాలి మంట నెత్తికెక్కింది.

“హలో మేడమ్!! నాకోసం ఎంత మంది అమ్మాయిు వెంటపడుతున్నారో తెలుసా?”

“ఎందుకు సార్? తన్నడానికా….” ఎగతాళిగా అంది.

“ఏంటమ్మ! పెద్ద అందంగా ఉన్నావని స్టైలా? చూడు నీ కంటే అందగత్తెని, తెలివైనదాన్ని పెళ్ళి మండపం నుంచి మరీ లేపుకు వస్తా… ! ఇదే నా శపథం.”

***

“అమ్మా మాట్లాడమ్మా…! అమ్మా …. ప్లీజ్ …!”

ఇప్పటికి అమ్మ నాతో మాట్లాడక మూడు రోజులయ్యింది.

ఎoత కోపం వచ్చినా గంట రెండు గంటలే….. ఈ సారే…!

“అమ్మా నీకు నా కన్నా చైత్రనే ఎక్కువా?!”

అమ్మ నావైపు కోపంగా చూసింది.

“చేసింది వెధవ పని, మళ్ళీ ఈ ప్రశ్న ఒకటా? ఛీ! అస్సలు నాకు మొఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు.”.

“అంతా నీ వల్లే అమ్మ. నాదేం తప్పులేదు. నేను వద్దనే చెబుతున్నా. నువ్వే బలవంతం చేసి పంపించావు.”

“బాబు తప్పు చేశాను” అమ్మ చేతులు ఎత్తి దండం పెట్టింది.

ఎంత కాదన్న చిన్న పరాజయం. పైకి ఎవ్వరికి చెప్పకపోయినా, నా ఇగో బాగానే హర్ట్ అయ్యింది. కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటున్నా.

***

“ఏంటీ? కింద సందడిగా ఉంది.” కిందకి వచ్చాను.

అమ్మో ! శారదా ఆంటీ. కొంతమంది అమ్మ ఫ్రెండ్స్.

దేవుడా!! చైత్ర కూడా ఉంది.

ఏం తెలియనట్టు పైకి వెళ్ళబోయాను.

“హలో రాజీవ్, ఎలా ఉన్నావు??”

చచ్చాను, శారదా ఆంటీ కళ్ళలో పడ్డాను.

ఇక పళ్ళు ఇకిలించక తప్పలేదు.

“హలో ఆంటీ? ఎలా ఉన్నారు?”

“బాగున్నాం రా!! నీ డయేరియా ఎలా ఉంది! అమ్మ చెప్పింది రా!”

ఏంటి? అమ్మ వైపు ఉరిమి చూశా….

“పాపం చైత్రతో కూడా ఫార్ట్స్, ఫార్ట్స్ అన్నావట.

ఆరోగ్యం జాగ్రత్త రాజీవ్, అసలే డయేరియా అందరూ గట్టిగా నవ్వారు.

పాపం తెలుగమ్మాయి నిన్ను పెళ్ళి చేసుకుంటే ఆర్ట్స్ అన్న ప్రతిసారి ముక్కు మూసుకోవాలి.”

నేను కోపంగా చైత్రను చూసాను. మళ్ళీ అందరు గ్లొల్లున నవ్వారు.

చైత్ర నవ్వు ఆపుకుంటూ ఎటో చూస్తుంది!!

లాభం లేదు!  ఇక యుద్ధం ప్రకటించాల్సిందే!

“అమ్మా నేను ఇండియా వెళతాను!” దృఢంగా అన్నాను. నవ్వుతున్న వాళ్ళంతా టక్కున ఆగిపొయారు.

“ఏం బాబు, అక్కడ టాయిలెట్స్ పావనం చేయడానికా?”

హ హ హా …

హాస్యం వికృతంగా మారింది….. నా మెదడు నరాల్ని నలిపేస్తుంది.

“కాదు పెళ్ళి చేసుకోడానికి!!” తలెత్తి ప్రతిజ్ఞ చేసాను.

అమ్మ ఉన్న పళంగా నిట్టూర్చింది.

“ఏంటి నువ్వు చెప్పేది నిజమా!!”

“అవును, మామూలుగా కాదు. ప్రేమించి, పిచ్చెక్కించి, ఓ తెలుగు అమ్మాయిని పెళ్ళి మండపంనుంచి లేవదీసుకు వస్తా…..”

బాగా తెలుగు సినిమాలు చూస్తాను కదా. ఇది తప్ప ఇంకో డైలాగ్ రాలేదు.

“నాకు కూడా అదే చెప్పావు.” చైత్ర ముసిముసిగా నవ్వుతూ అంది.

“ఇప్పటి వరకు ఇండియాకి వెళ్ళలేదు.” శారదా ఆంటీ అన్నది.

నాకెందుకో ఏదో ఛాలెంజ్ విసిరినట్టనిపించింది.

(సశేషం)

Exit mobile version