సీత-4

0
2

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత్రి స్పందన అయాచితం – సంచిక పాఠకుల కోసం రచించిన ‘సీత‘ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]మా[/dropcap] నాన్న బాబాయికి కూతురి కొడుకు వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటారని చెప్పారు. నాకు వరుసకు బావ అవుతాడట. వాడి పేరు అరవింద్. లగేజ్ పక్కన పెట్టి, వాడి కోసం చూడటం మొదలుపెట్టా.

బయటకు వచ్చి సరిగా ముప్పై సెకన్లు అవుతుంది.

ఏంటి…?

ఏంటిది….? ఓ మై గాడ్!!

ఏంటి ఒళ్ళు ఏదో నిప్పుల్లో వేసినట్టుంది.

మండే బొగ్గులో నడుస్తున్నట్టుంది.

ఏంటీ వేడి? ఎవరో ఎర్రగా మండే బొగ్గు వేసి మండిస్తున్నట్లు ఒళ్లు భగభగ మండిపోతున్నది.

చకచకా నా గ్యాప్ లెదర్ జాకెట్ తీసి, పక్కన పడేసా… షూస్ కూడా తీసేసి, బాత్రూం స్లిప్పర్లు వేసుకున్నా….

అయినా ప్రశాంతంగా లేదు.

పక్కనే ఉన్న టాయిలెట్‌లో ఆర్మాని జీన్స్ విప్పి, అవతల పారేసి, కాటన్ పైజమా తొడుక్కున్నా. బయటకు వచ్చే ముందు అద్దంలో నా మొఖం చూసుకున్నా!…

“అయ్యో రాజీవా? గ్లామరంతా తగ్గిపోయింది రా.

ఏం చేస్తాం? ఎండ మండిపోతుంది. చచ్చిపోయేలా ఉన్నావు, అయినా ఫేస్ వ్యాల్యూ ఉండాలి, అంతేకానీ బట్టల బ్రాండుల్లో ఏముంది?”

ఏదో మనసుకి సర్దిచెప్పుకొని బయటకు వచ్చా.

బయట అరవింద్ నాకోసం నిలబడి ఉన్నాడు.

నన్ను చూడగానే “బావా? ఎలా ఉన్నావ్?” అంటూ వచ్చి, వాటేసుకున్నాడు.

నేను కౌగిలించుకున్నా, కొంచెం ఇబ్బందిగా, మరి ఏం చేయను?

లోపల నుంచి సెగలు, పొగలు. వేడికి బ్రెయిన్ కరిగి, చెవుల్లోంచి బయటకు పారేలా ఉంది.

అరవింద్, నేను నా లగేజి తీసుకొని కారు దగ్గరికి వచ్చాం.

హమయ్య! ఎ.సి.కారు తెచ్చాడు, కొంచెం మనసు శాంతించింది.

గంటన్నర ప్రయాణం తరువాత హోటల్‌కి చేరాం.

“ఇదేనా నేనుండే హోటల్?” కిటికీలోంచి చూస్తూ అడిగాను. అరవింద్ ఏమి మాట్లాడలేదు. కారులోంచి సామాన్లు దింపాం, మేము దిగాం.

నేను చుట్టూ చూస్తున్నా!! చుట్టుపక్క చాలా హోటల్స్ ఉన్నాయి.

“రా బావా!!” అరవింద్ చేయి పట్టుకొని, లోపలికి తీసుకువెళుతున్నాడు.

“ఇది హోటల్ కాదు బావా, ఇల్లు.”

“ఏంటి? ఇది మీ ఇల్లా?”

నాకు అర్థంకాక అడిగాను.

“అదేంటి బావా? ఇది మన ఇల్లు రా…రా…!!”, ‘మన’ను ఒత్తి ఒత్తి పలికాడు.

కారు దిగి ఇంటి గుమ్మానికి వెళ్ళే దారిలో ఉన్న సమయం కొన్ని సెకన్లలో తపైకెత్తి చూసాను. ఒక రెండు అంతస్తులు వరకు లెక్కపెట్టగలిగా.

ఇంకా పైన ఉన్నాయి. కానీ కుదరలేదు.

ఎందుకో అనుమానం వచ్చి, వెనుకకు తిరిగి చూశా.

ఎండకి మైండ్ బ్లాక్ అయ్యింది. సరిగ్గా చూడలేదు కానీ……

బాస్!! నేను వచ్చింది బిఎండబ్లు 7 సీరీస్ కారులో, అయోమయంగా తటపటాయిస్తూ, ఇంధ్రభవనం లాంటి ఇంట్లో అడుగుపెట్టా.

పిన్నీ, బాబాయ్ ఆప్యాయంగా ఎదురుగా వచ్చారు.

ఎందుకైనా మంచిదని, లేని గంభీరం ప్రదర్శిస్తూ, వంగి దండం పెట్టా.

“బావ వచ్చాడోచ్!” అరవింద్ ఒక గట్టికేక వేశాడు. అంతే!

అన్నయ్య, బావ, మామయ్య, బాబాయ్ అంటూ పిల్లలంతా చుట్టు ముట్టారు. కాసేపటి వరకు ఊపిరి ఆడలేదు. ఇల్లంతా గందరగోళం, నవ్వులు, పండగలాగా మారిపోయింది.

“ఎప్పుడు తిన్నావో ఏమిటో ముందు భోజనం చేద్దువు గానీ.. రా.” పిన్ని వచ్చి డైనింగ్ దగ్గరకు తీసుకువెళ్ళింది.

అమ్మ, నాన్న వచ్చే ముందు లీలగా చెప్పినట్టు గుర్తు –

“అది కావాలి, ఇది కావాలి అని అడిగి, వారిని ఇబ్బంది పెట్టకు. పెట్టింది నచ్చినా నచ్చకపోయినా తిను. పాపం వాళ్ళని కష్టపెట్టకు.” అని.

కాని ఇదేంటిక్కడ? ఏది తినాలని కూడా అర్థం కావటం లేదు. అన్ని వంటలున్నాయి.

“అలా ఆగిపోయావే? రా కూర్చో ఇది నీ ఇల్లే” మా అత్తయ్య పిలిచింది.

తనే అరవింద్ వాళ్ళ అమ్మ.

నాతోపాటే అందరూ వచ్చి కూర్చున్నారు.

“ఏంటి? మీరు ఇంకా భోజనం చేయలేదా?” అడిగాను.

“అదేమిటి? ఇన్ని రోజుల తర్వాత వచ్చావు. కలిసి భోజనం చేయకపోతే ఎలా?” మామయ్య అన్నాడు నవ్వుతూ.

అందరూ భోజనం మొదలుపెట్టారు.

అత్తయ్య, పిన్ని దగ్గరుండి మరీమరీ వడ్డించారు.

“హోటల్ ఎందుకు బాబు, చక్కగా మన ఇల్లు ఉంది కదా?” పిన్ని ఆప్యాయంగా అంది.

“నువ్వు ఇరవై ఏళ్ళ పైగా అక్కడున్నావు కదా?” బాబాయి అడిగాడు.

అవునని తలాడించాను.

“ఫరవాలేదురా! అన్ని సంవత్సరాలు అక్కడుండి కూడా, తెలుగు బాగా మాట్లాడుతున్నావు.”

నేను చిన్నగా నవ్వాను.

“తెలుగు అమ్మాయిని పెళ్ళి చేసుకుందామని అనుకున్నావట! అసలు మేమెంత సంతోషపడ్డామో తెలుసా?” పిన్ని సంబరపడిపోతూ అంది.

మాటల్తో, పాటల్తో భోజనాలు పూర్తయ్యాయి.

బాబాయ్ చనువు, ప్రేమ చూసి, నాకు అడగాలనిపించింది, ఇక ఆలోచించకుండా అడిగేసా –

“బాబాయ్! ఏమి అనుకోనంటే ఒక చిన్న డౌట్ తీర్చగలరా?

నాన్న చెప్పారు. మీరు నామీద కోపంగా ఉంటారనీ, అంటే మీ నాన్న మా తాతయ్యకు పెద్ద గొడవ జరిగిందంట కదా?”

కొంచెం తడబడుతూ, భయపడుతూ అడిగాను.

బాబాయ్ ఒక్క సెకన్ నన్ను తేరిపార చూసాడు.

అనవసరంగా అయిపోయిన విషయాన్ని కెలికానేమో అని భయపడ్డాను.

‘నోరు ఆగదు కదా! చెత్త వెధవను…’ తిట్టుకున్నా, టూ లేట్!!

బాబాయ్ నావైపు చూసి గట్టిగా నవ్వాడు.

“అవున్రా! నాకు తెలుసు, ఏదో పెద్ద గొడవ జరిగిందని. మీ తాతయ్య మా నాన్న విపరీతంగా కొట్టుకున్నారట. కానీ కారణం నాకు సరిగ్గా తెలీదు. నాకు అప్పుడు సుమారు పది పదిహేను. అది నాకు అర్థం అయ్యే వయసు కాదు, అర్థం చేసుకునే వయసు కాదు రా! ఏం జరిగిందో మీ నాన్నే చెప్పాలి. అయినా ఇరవై ఏళ్ళ కిందట జరిగిన సంగతి. కొట్టుకున్నవారిద్దరూ చనిపోయారు కదా! ఇంకా ఆ విషయాలు మనకెందుకురా?” బాబాయ్ నా తమీద చేయివేసి, ప్రేమగా నిమిరాడు.

“నాకు అవన్నీ తెలియదు కానీ, తెలిసింది ఒక్కటే రా….

మా ఇంటికి పెద్దన్నయ్య అంటే శంకరం అన్నయ్యే అంటే మీ నాన్నే, పెద్ద వదినంటే మీ అమ్మే. పెద్ద కొడుకంటే నువ్వే!” బాబాయ్ కళ్ళు తుడుచుకున్నాడు.

ఇంక నేను ఆగలేకపోయాను. ‘బాబాయ్!’ అంటూ గట్టిగా పట్టేసుకున్నా.

అందరూ మా చుట్టూ చేరిపోయారు.

“మీ నాన్న ఇంకా ఈ విషయాలు గుర్తుపెట్టుకున్నాడట్రా.”

“లేదు బాబాయ్!! కానీ మీరు గుర్తుపెట్టుకుంటారని భయపడ్డాడు.”

అందరూ నవ్వారు!

అంతే! అప్పటినుంచి నా ప్రపంచమే మారిపోయింది.

అమ్మ, నాన్న, నేను చెల్లి అంతే, గీత గీసుకున్న చిన్న ప్రపంచం ఇప్పుడు హద్దుల్లేకుండా ఆకాశం అంత విశాలంగా విస్తరించినట్లయింది.

రోజుకో కొత్త చోటుకి పోతున్నాం. కొత్త సరదా, కొత్త సందడి చేస్తున్నాం.

మా చెల్లెళ్లతో, తమ్ముళ్లతో, వదినతో, బావతో, అక్కతో అసలు రోజు ఎలా గడిచిపోయాయో తెలియదు.

***

“అమ్మా! చూస్తూ చూస్తూనే నెల గడచిపోయింది. నిమిషంలాగా, ఒక చిటిక వేసినట్లుగా, ఒక కనురెప్పపాటులో విషయాన్నీ జరిగిపోయాయి.”

అమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నా, అప్పుడే బాబాయ్, మామయ్య నా గదికి వచ్చారు.

“ఏంటి బాబాయ్?”

“ఏం లేదురా! ఈ సంతోషంలో నువ్వు వచ్చిన పని విషయం మరిచి పోయావా? నీకు ప్లిలని చూడమని మీ నాన్న చెప్పాడు.”

“చూద్దాంలే బాబాయ్. తొందరేముంది!” నేను కొంచెం సిగ్గుపడ్డాను.

“తొందర్లేదు కానీ ఇక మొదలు పెట్టాలి కదా!”

పెళ్ళి విషయం ఎత్తగానే ఇంట్లో అందరూ చేరిపోయారు.

“ఎలాంటి అమ్మాయి కావాలి? ఏ తీరుగా ఉండాలి? ఎలా తయారవ్వాలి?” అని.

బాబోయ్ ఒకటి కాదు. అసలు అమ్మాయిు ఇన్ని రకాలుగా ఉండొచ్చని ఆ ప్రశ్న విన్నాకే అర్థం అయ్యింది.

పెద్దవాళ్ళ సంగతి తెలియదు, కాని మా కజిన్స్‌కు, నాకు మాత్రం అమ్మాయిని చూడటం పెద్ద ఎడ్వంచర్ అయిపోయింది.

“ఈ అమ్మాయి ఫోటో చూడరా! మా తరఫున బంధువు.”

పిన్ని నా చేతికి ఫోటో అందించబోయింది.

అంతలోనే వెనుకనుంచి ఒక కొత్త చేయి ఠక్కున

“ఏది నన్ను చూడనీ!” అంటూ ఫోటో లాక్కుంది.

అందరూ అటువైపు తిరిగి చూసారు.

“హాయ్! ఎవరీ అమ్మాయి?” అని నవ్వుతూ, అందరినీ చనువుగా పలుకరించింది.

అందరూ సమాధానంగా ‘హాయ్’ అని అన్నారు.

నేను మాత్రం నోరు తెరిచి, అలాగే చూస్తూ ఉండిపోయా.

మెరూన్ చుడిదార్, బ్లాక్ చున్నీ వేసుకొని ఉంది. రింగుల జట్టు, స్ప్రింగ్ కన్నా యాక్టివ్‌గా ఉంది. భుజానికి క్రాస్‌గా బ్యాగ్ వేసుకొంది. గుండ్రని కళ్ళు.

ఇలాంటి అమ్మాయిని ముందెప్పుడు నేను చూడలేదు. ‘ఎంత బాగుంది? ఎవరీ అమ్మాయి’ అనుకున్నా మనసులో.

“ఎవరీ అమ్మాయి?” తనే అడిగింది. ఫోటోని చూస్తూ.

“పెళ్ళి కూతుర్ని వెతుకుతున్నాం.” సంధ్య అంది.

“ఎవరికి?”

“ఇదిగో ఇతనికి…” సంధ్య నా వైపు చూపించింది.

“ఎవరితను?”

ఇతను మా కజిన్. చాలా ఏళ్ళ కిందట లండన్‌లో సెటిలయ్యారు.”

“ఓ….” అంది ఆ అమ్మాయి.

“నేను మాయ” అంటూ నా వైపు తిరిగి, తన కుడిచేయి ముందుకు చాపింది. నేను ఇంకా నోరు తెరుచుకొనే చూస్తున్నాను.

“హలో!” అంది మళ్ళీ నవ్వుతూ కొంచెం గట్టిగా.

నేను ఈ లోకంలోకి వచ్చాను.

“హాయ్!” అని, నేను కూడా నా చేయి అందించాను.

“ఈ అమ్మాయి మన సంధ్య క్లాస్‌మేట్ రా. సంధ్య బెస్ట్ ఫ్రెండ్ కూడా.” అరవింద్ పరిచయం చేశాడు.

“నా పిల్లలకి, మీ బాబాయ్ పిల్లలకి ట్యూషన్లు కూడా చెబుతుంది.” అన్నాడు.

నేను తలాడించాను.

“చాలా మంచి అమ్మాయి. అందరితో ఇట్టే కలిసిపోతుంది. నాకు సంధ్య ఎంతో, మాయ కూడా అంతే.” మా అత్తయ్య మాయని దగ్గరికి తీసుకుంది.

“ఫస్ట్ టైమా?” నన్ను చూసి, నవ్వుతూ అడిగింది.

ఆమె అడిగిన మాటకి ఒక్క నిమిషం పాటు గుండె గుబేల్ మంది.

ఏంటీ? మరీ సెకండ్ మ్యారేజి వాడిలా ఉన్నానా?

మైండ్‌లో చిన్న జర్క్, పేకముక్క టపటపమని పడిపోయినట్లు. ఉరుము, మెరుపు వచ్చి షాక్ కొట్టినట్లు.

“అయ్యో, అవును, ఫస్ట్ టైమే” హడావిడిగా అన్నాను.

“మరి నచ్చిందా?”

“ఇంకా లేదు, ఇప్పుడే కదా చూడటం స్టార్ట్ చేసింది.”

“అవునా? ఇప్పటి వరకు చాలా టైమ్ వేస్ట్ చేసారు. చాలా లేట్ అయ్యింది.”

అయ్యో ఇదేంటి? టైమ్ వేస్ట్ ఏంటి? నన్ను ముసలోడు అనుకుంటుందా?

“నాకు ముఫ్పై ఏళ్ళండి.” మొహమాటంగా అన్నాను.

“అయితే?” మాయ అనుమానంగా చూసింది.

“అంటే….. అంటే?” నాకు కోపం వచ్చేసిoది.

“ఇక్కడ తొందరగా మ్యారేజ్ చేస్తారేమో కానీ, అక్కడ లండన్‌లో ముఫ్పై అంటే చాలా చిన్న వయసు.” చిరాగ్గా చెప్పాను.

మాయ గట్టిగా నవ్వింది.

పైకి, కిందకి చూస్తూ మరీ నవ్వింది.

“కాదు, నేనంది ఫస్ట్ టైమ్ హైదరాబాదుకా అని. ఈ ఊరు నచ్చిందా అని.” మాయ వివరణ ఇచ్చింది.

అందరూ నన్ను చూసి గట్టిగా నవ్వారు.

నా తొందరపాటు చూసి నాకే నవ్వొచ్చింది.

ఇంకేముంది పెద్దవాళ్ళంత ప్రతిరోజూ అమ్మాయి ఫోటోతో, వాళ్ళ గురించి వివరాలతో బిజీ అయ్యారు.

మేము హైదరాబాదు చూడటంలో బిజీ అయ్యాం. అబ్బ రోజుకో చోటికి, హోటల్‌కి, షాపింగ్‌కి, హైటెక్ సిటీకి, ఇంకా…….

అస్సలు రోజులు ఎలా చకచక జరిగిపోయాయో తెలియలేదు. చూస్తూచూస్తూనే నేను పెళ్ళిచూపు కెళ్ళే రోజు వచ్చింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here