Site icon Sanchika

సీత-7

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత్రి స్పందన అయాచితం – సంచిక పాఠకుల కోసం రచించిన ‘సీత‘ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]పె[/dropcap]ళ్ళి చూపులు:2

“నీకు వంటొచ్చా? నాకు వంట చేయడం అస్సలు ఇష్టం లేదు.”

ఇది అమ్మాయి నాకు వేసిన ప్రశ్న.

“వంట ఏముంది?ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళు చేస్తారు.”

“ఆలా కాదు, పొద్దున్నే లేచే లోపల హస్బెండ్ కాఫీ చేసి నిద్ర లేపుతే ఆ కిక్కే వేరు.”

పెళ్ళి చూపులు:3

“నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి?”

పెళ్ళి చూపులు:4

“మ్యారేజ్ అయ్యాక మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు?”

పెళ్ళి చూపులు:5

బాబాయ్ దగ్గరుండీ వెతికిన సంబంధం.

ఈసారి పెళ్ళిచూపుల్లో కొంచెం జాగ్రత్తగా ఉందామని డిసైడ్ అయ్యాను. కన్ఫ్యూజ్ అయ్యే ప్రశ్నను కొంచెం క్లారిటీతో అర్థం చేసుకోవాలనుకున్నా.

ఈసారి వాళ్ళ ఇంట్లో ఎరేంజ్ చేసారు.

కాసేపటికి అమ్మాయి వచ్చి టీలు, కాఫీలు అందించింది.

అమ్మాయి పట్టుచీర కట్టుకొని, పువ్వులు పెట్టుకొని వచ్చింది.

కూర్చున్న తరువాత కాసేపటికి మమ్మల్ని మాట్లాడమని వేరే గదికి పంపించారు.

అచ్చం సినిమాలో చూపించినట్లే జరిగిపోయింది.

అమ్మాయి చాలా బాగుంది. చాలా ట్రెడిషనల్ అనుకుంటా! చేతినిండా మట్టి గాజులు, పెద్ద ఎర్రబొట్టు.

కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

ఫస్ట్ టైం పెళ్ళి చూపులు ఎలాగో దొబ్బాయి.

ఈసారి మాత్రం పప్పులో కాలు వేయొద్దు. చాలా రిచ్ ఫ్యామిలీ అని మామయ్య నాతో చెప్పాడు.

ఇంటినిండా డబ్బున్నా ఎంతో సంప్రదాయంగా ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది.

అమ్మ చెప్పిన గుణాలన్నీ ఈ అమ్మాయిలో ఉన్నాయి.

సరే చెప్పేస్తాను. ఈ పెళ్ళిచూపులు జస్ట్ ఫార్మాలిటీ అంతే!

కొంచెం సేపటికి మాటల్లో పడ్డాం.

“పేరు?”

“కళ్యాణి” చిన్నగా నవ్వింది.

“మీరేం చేస్తుంటారు?”

“నేను లాయర్ని” సమాధానం ఇచ్చాను.

“మరి మీరు?”

“నేను ఇంజనీరింగ్ చేశాను.”

“మీకు ఏ ఫుడ్ ఇష్టం? అంటే చిన్నప్పటినుంచి అక్కడే ఉన్నారు కదా!” ఆమె తలదించుకునే అడిగింది.

“నేను అన్నీ తింటాను. ఇటాలియన్, చైనీస్, కాని ఇండియన్ ఫుడ్ ఎక్కువ ఇష్టం.”

“అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది?”

“చాలా బాగుంటుంది. అస్సలు ఊహించుకోలేం. లండన్ ఎంత చూసినా సరిపోదు. షాపింగ్ ఏంటి, హోటల్స్ ఏంటి, చెప్పుకుపోతే చాలా ఉన్నాయి. సిటీ ఎప్పుడు నిద్రపోదు.”

“అవునా? రాత్రి కూడా పనిచేస్తారా?” అమాయకంగా అడిగింది.

నేను చిన్నగా నవ్వాను.

“అంటే, రాత్రి పబ్స్, హోటల్స్, నైట్ లైఫ్ కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.” చెబుతూ చెబుతూ టక్కుమని ఆపేశాను.

ఇంత సాంప్రదాయమైన అమ్మాయి ఏం అనుకుంటుందో ఏమో?

“మీకు అవన్నీ అనవసరం లేండి”. మాట మార్చేసాను. “మీరు ఇంట్లో హాపీగా ఉండొచ్చు. అమ్మానాన్న ఉంటారు. చీరలే కట్టుకోవచ్చు. మీకు నచ్చినట్లు ఇండియన్ ఫుడ్ వండొచ్చు.”

“అక్కడ ఇంజనీర్లకు జాబ్స్ ఎలా ఉంటాయి?”

నా మాటల్ని ఆపేస్తూ అడిగింది.

“అయ్యో! మీరు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇష్టం వచ్చినన్ని రోజులు ఇంట్లో టైంపాస్ చేయొచ్చు. ఏమీ టెన్షన్స్ ఉండవు. హాయిగా ఉండొచ్చు. బోలెడంత మంది తెలుగు వాళ్ళు. తెలుగు ఫ్రెండ్స్ చేసుకోవచ్చు.”

ఆ అమ్మాయి సరే అని తలాడించింది.

“అమ్మ ఇంట్లోనే ఉంటుంది. మీకు తోడు కూడా ఉంటుంది.”

ఇంకా చాలాసేపు మాట్లాడింది.

ఇంటికి వెళుతూ… దారిలోనే… నాకు అమ్మాయి ఓ.కె. అని చెప్పేశాను.

అందరూ తెగ సంబరపడిపోయారు. వెంటనే అమ్మకి ఫోన్ వెళ్ళింది.

రెండు రోజులు ఆగితే మంచి రోజు అట. అమ్మాయి తరఫువాళ్ళకి కూడా శుభవార్త చెప్పేద్దాం అనుకున్నారు… అంతా.

మేము రెండురోజులు ఆగుదాం… అనుకున్నాం. కాని ఆడపెళ్ళివారు ఆగలేకపోయారు. మరుసటి రోజే ఆ అమ్మాయి నాన్ననుండి ఫోన్ వచ్చింది.

ఏం జరుగుతుందో? అని నేను తెగ సిగ్గుపడిపోయాను. ఒక్కరోజు కూడా ఆగకుండా ఫోన్ చేశారంటే….

వాళ్ళకి నేను ఎంత నచ్చానో…

ఆ నిమిషంలో ఎన్నో ఊహలు.

ముహూర్తాలు త్వరగా పెట్టుకోవాలంటారేమో…

ఒక్కసారి అమ్మానాన్నని కూడా వచ్చి చూడమంటారేమో..

అమ్మాయి నాతో కలుద్దాం అనుకుంటుందేమో…

‘‘సంబంధం వద్దనుకుంటున్నారంటరా!’’

ఫోన్ పెట్టేసి, బాబాయ్ నావైపు జాలిగా చూసారు.

నా అంతరాత్మ ప్రతిబింబాలు అద్దంలో కనిపిస్తూ… నా చుట్టూచేరి…. వద్దన్నారు, వద్దన్నారు అని వేలెత్తి వెక్కిరించినట్లుంది.

ఉలిక్కిపడి చూసాను.

నా చూపు బాబాయికి అర్థం అయిందనుకుంటా.

ప్రశ్నించకుండానే, జవాబు చెప్పేశాడు.

ఈ సారి ఫామిలీకి నచ్చావంట గాని, పాపం కల్యాణికి నచ్చలేదంట.

మరీ అంత ఫాస్ట్‌గా ఉంటే కష్టం అని చేపిందంట!..

అబ్బా దీనికి అలా అర్థం అయ్యిందా! అప్పటికి అనుకుంటూనే ఉన్నాను సాంప్రదాయమైన ఫామిలీ అని.

తల గోక్కుంటూ … “సరే! బాబాయ్ నేను ఆ అమ్మాయితో ఒక్కసారి మాట్లాడాలి”.

చిన్న కమ్యూనికేషన్ లోపంవల్ల అంత నచ్చిన అమ్మాయిని వలుదుకోవడం కరెక్టు కాదనిపించింది. అందుకే అడిగాను. “ఆమెను ఒక్కసారి కలిసి, మాట్లాడితే అన్నీ సాల్వ్ అయిపోతాయేమో బాబాయ్.”

“సరే! అడిగి చూస్తాను. కాని వద్దనుకున్నాక మళ్ళీ కలవడం కష్టం.”

“అదేంటి బాబాయ్! తను చాలా ట్రెడిషనల్ కదా, చీర కట్టుకోవడం ఇష్టమని అలా అన్నాను.”

“హూ…!” బాబాయ్ దీర్ఘంగా నిట్టూర్చాడు.

“ఏంటో రా! అర్థం కావటం లేదు… నీకు ఏదీ అచ్చిరావటం లేదు. సరే! ప్రయత్నించి చూస్తా.”

మ్యారేజి బ్యూరో వాడిని కాళ్ళవేళ్ళ పడి మామయ్య, బాబాయ్ మొత్తానికి ఆ అమ్మాయితో మళ్ళీ కలిసే ఏర్పాటు చేసారు.

ఈసారి ఇంట్లోకాదు. ఎక్కడికో రెస్టారెంటుకి రమ్మంది.

ఈసారి ఎటువంటి అపార్థం రానీకుండా అన్నీ మాట్లాడాలి అనుకున్నా.

లోపలి వెళ్ళి, రిసెప్షనిస్ట్ దగ్గర పేరు చెప్పాను. టేబిల్ బుక్ అయింది, ఆ అమ్మాయి సరాసరి లోపలికి దారి చూపించింది. నడవడం మొదలు పెట్టింది.

నేను ఆమె వెనుక నడిచాను.

లోపలికి వెళ్ళా. అదొక రెస్టారెంట్. టేబుల్స్ అన్నీ అమర్చి ఉన్నాయి.

కూర్చున్నవాళ్ళ మొఖాల్ని చూస్తూ….

ఆ అమ్మాయి ఎక్కడైనా ఉందా? అని వెతుకుతూ…. అక్కడే ఆగిపోయాను.

రిసెప్షనిస్ట్ వచ్చి, “ఇక్కడ కాదు. ఇంకా లోపల” అంటూ నన్ను దాటుకుంటూ లోపలికి వెళ్ళింది. నేనూ మెల్లగా చుట్టూ చూస్తూ అనుసరించా.

రెస్టారెంటులో కాకుండా ఇంకెక్కడికో. కొంచెం అనుమానం. కొంచెం ఎక్సైట్‌మెంట్.

రెస్టారెంటు తరువాత చిన్న సొరంగం లాంటి దారి – ఒకే మనిషి పట్టేంత.

రిసెప్షనిష్ట్ ముందు వెళుతూ, మధ్య మధ్యలో వెనక్కి తిరిగి నన్ను చూస్తూ, నవ్వుతూ వెళుతోంది. సొరంగంలోంచి బయటికి వచ్చాక అదో పెద్ద సిమ్మింగ్ పూల్.

అస్సలు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను.

ఏదో పార్టీ అనుకుంటా. పెద్ద మ్యూజిక్ పెట్టుకొని, అందరూ మైకంలో వున్నారు.

ఇక్కడ ఆ అమ్మాయా? ఛాన్సే లేదు….

స్విమ్మింగ్ ఫూల్ దాటితే ఇంకేదైనా ఉందేమో?

నేను అందరినీ చూస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాను.

“సార్!” రిసెప్షనిష్ట్ పిలిచింది.

“ఇక్కడే మిమ్మల్ని వెయిట్ చేయమన్నారు.” అంటూ వెళ్ళిపోయింది.

అమ్మాయి కోసం చూస్తూ అక్కడే ఉండిపోయాను.

సిమ్మింగ్ పూల్ అంతా కోలాహంగా ఉంది. పెద్ద మ్యూజిక్ సౌండ్‌తో అందరూ డాన్స్ చేస్తున్నారు.

కొంతమంది ఊగుతున్నారు. కొంతమంది తూగుతున్నారు. ఇలాంటివి లండన్‌లో కూడా ఉంటాయి. కాని ఇరవై ఏళ్ళ లోపువారికి ఇలాంటి క్లబ్‌లో ఎంట్రీ ఉండదు. ఇరవైఏళ్ళ తరువాత డబ్బులుండవు.

సరే! పని చేసి డబ్బు సంపాదించి వెళ్ళదాం అంటే అంత పని చేసాకా ఓపిక ఉండదు.

కాని ఇక్కడ కూడా ఇలాంటివి ఉంటాయి అంటే మాత్రం వింతగా ఉంది.

ఏంటో మేం లండన్ వెళ్ళి, వెనుక పడ్డామేమో, లేక లండన్ వెళ్ళాక ఇండియా ముందుకు వెళ్ళిపోయిందో? అర్థం కావటంలేదు.

కాని ఖచ్చితం, మా అమ్మ చెప్పినట్టు భారతదేశం లేదు.

సరే, ఆలోచను పక్కనపెట్టి, కళ్యాణి కోసం ఎదురుచూడటం మొదలు పెట్టాను.

***

‘‘ఒరేయ్! ఏమైందిరా?’’ రెండు రోజులనుండి స్తంభించిపోయిన నన్ను ఈ ప్రశ్నను చాలామంది, చాలాసార్లు వేశారు.

కళ్యాణి స్విమ్మింగ్ పూల్‍లో కలిసిన దగ్గరనుంచి అసలేం ఏం జరిగిందో తెలియదు.

ఆరోజు పట్టుచీర కట్టుకొన్న, తలదించుకొన్న ఆ అమ్మాయి – ఈ రోజు ఒకచేతిలో వైన్ గ్లాస్‍తో, మరోచేతిలో సిగరెట్‌తో దర్శనమిచ్చింది.

అదే తన నిజస్వరూపమట. వాళ్ళ ఇంట్లో మాత్రం చీర కట్టుకొని, ఆరోజు చూసినట్లు ఉంటుందట.

తనకి పెళ్ళి ఇష్టం లేదట. ఫెమినిస్ట్ అట. ఇండిపెండెంట్ అట. ఇంక ఏవో చెప్పింది. నాకు ఒక ముక్క అర్థం కాలేదు.

పెళ్ళి చేసుకుంటుందంట కాని లండన్ వచ్చాక ఆ పెళ్ళి జరిగిందని అనుకోవద్దట.

కేవలం లండన్ రావడానికి పెళ్ళి చేసుకుంటుందట. కావాలంటే తను లండన్ వచ్చాక నేను వేరే పెళ్ళి చేసుకోవచ్చట.

తను ఒక్కతే లండన్‌కి వస్తే …. తన ఇంట్లోవాళ్ళు ఒప్పుకోరట. ఇది ఇంట్లో వాళ్ళకు చెప్పొద్దట.

బాబోయ్! ఆ విచిత్ర లాజిక్స్‌తో నాకు వైరాగ్యం వచ్చింది. అక్కడ ఆమెకు దండం పెట్టి, వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాను. కనీసం క్యాబ్ బుక్ చేయాన్న ఆలోచన కూడా రాలేదు. ఈ కన్ఫ్యూజన్ మధ్యలో నాకు రెండు మూడు పెళ్ళిచూపులు జరిగిపోయాయి.

***

ఏది పెద్దగా కలిసిరాలేదు.

మా అత్తయ్య, పిన్ని మాత్రం వదటంలేదు. కనీసం రోజుకో పదిమంది అమ్మాయి వివరాలు తీసుకువస్తున్నారు.

“వదిలేయి పిన్ని, మిమ్ములందరిని కలిసాను… అదే చాలు. ఇక పెళ్ళి గురించి నాకేం పెద్ద ఇంట్రస్ట్ లేదు.”

“అయ్యో అలా అంటే ఎలారా? వెతుకుదాం…” పిన్ని నవ్వింది.

“ఏమీ లేదు పిన్ని…. నాకీ అమ్మాయిలు అర్థం కావటంలేదు. వాళ్ళు కనిపించేది ఒకటి, మనసులో ఉండేది మరొకటి. ఏంటో…”

“ఇద్దరు ముగ్గురుని కలిస్తే వాళ్ళే అర్థం అవుతారు అన్నయ్య!” సంధ్య తేలిగ్గా అంది.

“రాజీవ్ అన్నది నిజమేనే!” అత్తయ్య అందుకుంది.

“ఈ కాలంలో అమ్మో కొంచెం కష్టమే… పైకి బాగానే ఉంటారు. లోపల ఏముందో ఎవ్వరికి తెలియదు. నువ్వనుకునే అమ్మాయిలు కాదు రా బాబు. అంతెందుకు? మన మాయనే చూడు.”

“మాయనా?” నాకాశ్చర్యం వేసింది.

“నీకు తెలుసా. మాయ సంధ్య కన్నా అయిదేళ్ళు పెద్దది. కాలేజీ అయిపోయాక ఇంట్లో ఉంది. ఇక కాలక్షేపం కావట్లేదని ఎం.బి.ఏ.లో జాయిన్ అయ్యింది.”

“అవునా?”

“ఎవరు అడిగినా నేను చదువుకుంటుందనుకున్నా అని చెప్పుతుందా? పెళ్లి వద్దు అని చెప్పడానికి అదో సాకు. కనీసం పది పదిహేను పెళ్ళిచూపుల్ని కాదoది. చివరికి ఒక పెళ్ళి సెటిల్ అయ్యింది. రేపు పెళ్లి అనగా అదీ క్యాన్సిల్ చేసింది.”

“ఓ ఎందుకు?”

“ఆ పెళ్లి కొడుకు వాళ్ళు మాకు చాలా రోజులు నుంచి తెలుసు. వాళ్లు చెప్పారు, పెళ్ళి చేసుకున్నాక భర్త వచ్చి, తన ఇంట్లో అమ్మానాన్న దగ్గర ఉండాలని, తను ఉద్యోగం చేసినా చేయకపోయినా తననేమి అడగొద్దు అని, అంతా తన ఇష్టం అని, ఇలా పిచ్చిపిచ్చి కండిషన్లు పెట్టింది. ఇంకెవరు చేసుకుంటారు? వచ్చినోళ్ళందరూ పారిపోయారు.”

“నిజమా?!” నేను నోరెళ్ళబెట్టాను.

“అయినా మాయది ఏం తప్పులేదు. తప్పంతా మాయ వాళ్ళ అమ్మది.”

పిన్ని అత్తయ్యతో మాట కలిపింది.

“నీకో విషయం తెలుసా? బయటి వ్యవహారాలు, ఇంటి పెత్తనం, చివరికి ఉద్యోగం చేయడం కూడా మాయ వాళ్ళ అమ్మది. మాయ వాళ్ళ నాన్న ఇంట్లో ఉండి వంట చేస్తాడు. తన భర్త లాంటివాడినే ఇప్పుడు అల్లుడుగా రావాలని కాబోలు….. ఇక తల్లిలాగానే కూతురు కూడా!”

“అంటే మాయ నాన్న ఇంట్లోనే ఉంటాడా?”

“అంతే కదా మరి…. ఆమె ఆఫీస్నుంచి వచ్చేసరికి ఆయన వంటలు అన్నీ చేసి ఉంచుతాడట. మొన్న మా ఇంటికి మాయని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు తనే స్వయంగా చెప్పింది. అబ్బో అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు, ఎంత గర్వంగా చెప్పిందని. పైగా చూడటానికి తల్లి కూతుర్లు ఎలా ఉంటారని? చక్కగా చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని…..”

“కాని మాయ మంచిదేలే అమ్మ!” సంధ్య ఇబ్బందిగా అంది.

(సశేషం)

Exit mobile version