Site icon Sanchika

సీత-9

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత్రి స్పందన అయాచితం – సంచిక పాఠకుల కోసం రచించిన ‘సీత‘ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]”మ[/dropcap]నసులో ఒకలాగా ఉండి, పైకి ఒకలాగా చూపించడాన్ని హిపోక్రసి అంటారు.”

మర్మం తెలిసిన యోగిలా మొఖం పెట్టా.

“నీ కేమన్నా మతిపోయిందా?” మాయ అరుపుకి నాకే కాదు… చుట్టూ ఉన్న పిట్టగోడకి, గోడ కింద పేర్చిన పూలకుండీకి, కుండీ మీద ఉన్న పూలకి, ఆ పూలను ఊపుతున్న గాలికి, ఆ గాలిలో తిరిగే దోమకి, అన్నిటికి అర్థం అయ్యింది…. ఆమెకి ఎంత కోపం వచ్చిందో.

అయినా నేను తగ్గలేదు.

“ఛీ ఛీ!! అసలు అమ్మాయి వ్యక్తిత్వం అర్థం చేసుకోని నీలాంటి మూర్ఖుడితో నేనెలా స్నేహం చేసాను? అందుకే నిన్ను చూసి, అమ్మాయిలు అందరూ పారిపోతున్నారు.”

అంతే… ఆ మాటతో కసి కాస్తా కారంగా మారింది, ఎక్కడో మంటపెట్టింది.

నాలో మండుతున్న అగ్నిపర్వతం… ఆ మాటతో బద్దలయింది.

“అవును నేను మూర్ఖుడిని. అదే మీ నాన్న లాగా నోరుమూసుకొని, ఇంట్లో వంట చేస్తుంటే, నువ్వు కూడా మీ అమ్మలాగా బలాదూర్‌గా ప్రాజెక్ట్, పార్టీ అంటూ…. ఓ మర్చిపోయా చీర కట్టుకొని…. మరి పబ్ వెంట తిరుగుతుంటే… నువ్వు చేసిన ప్రతి దానికి తలాడిస్తూ, కుక్కలాగా పడి ఉండి…. నేను మాత్రం… ‘అబ్బో మాయ ఎంత గొప్పది’ అంటుంటే అప్పుడు నన్ను మంచోడు అంటావ్.”

“ఏంట్రా వాగుతున్నావ్, నోరు మూసుకో. నా ఫామిలీ గురించి ఇంకొక్క మాట మాట్లాడితే బాగోదు.” మాయ కళ్ళనుంచి నీళ్ళు టపటప కారుతున్నాయి.

“ఏంటే రా, గీ అంటావ్? చనువు ఇచ్చాను కదా అని.”

“పోరా నీతో నాకు మాటలేంటి?” మాయ తన బ్యాగ్ తీసుకొని వెళ్ళబోయింది.

“పోవే… వచ్చింది… మహా పతివ్రత. పెద్ద దీనికే ఉంది ఫ్యామిలీ…” నేను మొఖం తిప్పుకున్నాను.

మాయ ఏడుస్తూ వెళ్ళిపోయింది.

***

నా ట్రావల్స్ ఏజెంట్‌తో తిరుగు ప్రయాణానికి కావాల్సినవి మాట్లాడాను. అమ్మానాన్నకి కూడా వస్తున్న సంగతి చెప్పేశాను.

‘ఇంక ఏం పనులు ఉన్నాయ్?’ బెడ్ మీద వెల్లకిలా పడుకుని, ఆలోచిస్తున్నా.. ఎవరో తలుపు కొట్టారు.

“ఎవరు?”

“ఏం చేస్తున్నావురా?” అంటూ బాబాయ్, పిన్ని లోపలికి వచ్చారు.

“ఏం లేదు బాబాయ్!…”

“ఒరేయ్ ఏమీ లేదు రా, నీకు ఒక సంబంధం వచ్చింది.”

నేను ఏమి మాట్లాడలేదు.

“ఒకసారి చూసి రా, ఏముంటుంది?”

“నాకు ఇష్టం లేదు. కావాలంటే కొన్ని రోజులు ఉండి వెళ్తాను. ఇంకా పెళ్లి సంబంధాలు చూడాలని ఆసక్తి లేదు. మిమ్మల్ని ఇలాగైనా కలిసినందుకు నాకు సంతోషంగా ఉంది.” నాకు బాబాయ్ కళ్ళలో చూసి మాట్లాడటం ఇష్టం లేదు. తలదించుకునే చెప్పాను.

“స్వయానా ఉండి మాట్లాడాను. ఆయన దగ్గరుండి మాట్లాడాను. వాళ్లు చాలా ఇష్టంగా ఉన్నారు. ఇప్పుడు అన్నీ మాట్లాడాక కావాలంటే నువ్వు ఒకసారి వెళ్లి అమ్మాయిని చూసి ఆ తర్వాత వద్దని చెప్పు. పద్ధతిగా ఉంటుంది.”

“లేదు బాబాయ్, నేను లండన్‌కి వెళ్లి పోయాను అని చెప్పేసేయ్, లేదా ఏదో ఒకటి చెప్పేసేయ్! నాకు మాత్రం ఇష్టం లేదు!” ఖచ్చితంగా చేప్పేసాను

“నువ్వు వద్దని చెప్పే ముందు నీకు గతం కొంచెం తెలియాలి రా. ఈ సంబంధం గురించి నేను ఎందుకు అంత ఒత్తిడి చేస్తున్నాను నీకు గతం తెలిసాక అర్థం అవుతుంది.”

***

శంకరం లండన్‌కి వెళ్ళి మూడు సంవత్సరాలు అవుతుంది.

ఆ మూడేళ్ళు ఒక ఎత్తు. వాడు వస్తున్నాడు అని కబురు పెట్టిన దగ్గరనుంచి ఒక ఎత్తు.

ఎప్పుడొస్తాడా? అని ఎదురు చూస్తూ….. సమయం ముందుకు జరగటం లేదు.

సరస్వతి మనసులోనే తిట్టుకుంది.

సాయంత్రం వరకు ఆగాలంటే…… ఏంటీ అసహనం.

్”వదినా, ఒంట్లో ఎలా ఉంది?” ఏదో ఆలోచిస్తున్న సరస్వతిని, కృష్ణమూర్తి ప్రేమగా పలకరించాడు.

“బాగానే ఉంది బాబు….” సరస్వతి లేవబోయింది.

“లేవద్దు వదినా… పడుకో….”

“ఇప్పుడే బయట అన్నయ్యను కలిసి వస్తున్నాను”. అక్కడే ఉన్న కుర్చీని లాక్కుని కూర్చున్నాడు.

“ఏం చేస్తున్నారు ఆయన?”

“అబ్బా! చెప్పొద్దు ఒకటే హడావిడి.”

“సర్లే నువ్వు ఏదో తక్కువ చేసినట్టు…”

“ఆయన ఈ ఒక్కరోజే… నువ్వు మూడు రోజుల నించి నిద్రపోవు, పోనీవు. ఇంటికి కొత్త రంగులు వేయించావు. బాత్రూమ్ కట్టించావు.”

“ఆ మరి! ఇంటికి పెద్దకొడుకు, అదీ ఫారిన్ నుంచి తిరిగివస్తున్నాడు అంటే మాటలా?”

“సర్లే! నువ్వు నీ చాదస్తం”.

సరస్వతి తృప్తిగా నవ్వింది.

“నీ పేరు కృష్ణమూర్తి కాదయ్య లక్ష్మణమూర్తి అని పెట్టాల్సింది. మీ అన్నదమ్ములు రామక్ష్మణులేనయ్యా… అయినా ఎందుకయ్యా! వాడికోసం ఇంత కష్టపడుతున్నావ్?”

“అన్నయ్య నువ్వు కూడా నాకేం తక్కువ చేసారు వదినా. నా ఇద్దరి ఆడపిల్లల్ని, నా కొడుకుని సొంత బిడ్డకన్నా ఎక్కువగా ప్రేమించారు. వాళ్ళకి తల్లిలేని లోటును తీర్చారు.”

“నాకుంది ఇద్దరు కొడుకులు కదా… ఆడపిల్ల లోటు నీ పిల్లతో తీర్చుకున్నా…. కానీ నువ్వెందుకు ఇవన్నీ?”

“అంతేకదా వదినా! అన్నయ్య కదా అన్నీ…. శంకరంకి ఏం చేసినా తక్కువే వదినా? వాడిమీదే నా ఆశ, ధ్యాస అన్నాను.”

“చూస్తూ ఉండు… వాడొక్కడే… మొత్తం ఇంటిల్లిపాదిని వృద్ధిలోకి తెస్తాడు. వాడికి చెల్లి, తమ్ముళ్ళంటే చచ్చేంత ప్రేమ. ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు.”

“సరే! వస్తా వదిన… చాలా పనులున్నాయి.”

***

“అమ్మా…. మాట్లాడమ్మా….!” శంకరం బతిమాలుతున్నాడు.

కొడుకు వచ్చి వారం దాటింది. తల్లీకొడుకుల మధ్య మాటలు లేవు. శంకరం తనకు చెప్పకుండా బ్రిటిష్ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని విపరీతమైన కోపంతో ఉంది.

తనే కాదు… ఇంటిల్లిపాది కోపంగా ఉన్నారు.

ఎవ్వరూ మాట్లాడం లేదు.

తన భార్య ‘సారా’కి విషయం ఇంకా గందరగోళంగా ఉంది.

ఇండియాకి రావడం ఇదే మొదటిసారి అన్న విషయం పక్కన పెడితే ఇంట్లో వాళ్ళందరూ తన మీద అమితమైన కోపంతో ఉన్నారు.

ఎవ్వరిని పలుకరించినా సమాధానం చెప్పటం లేదు.

కనీసం తనను తల ఎత్తి చూడటం లేదు. అంతా అయోమయం.

“ఇదంతా నావల్లేనా?” సారా బాధగా అంది.

శంకరం ఏం మాట్లాడలేదు.

“నేను అనవసరంగా వచ్చి తప్పుచేశానేమో….”

“ఛీ ఛీ అవేం మాటలు, నువ్వేం తప్పుచేయలేదు. తప్పంతా నాదే. మన విషయం మా ఇంట్లో ముందే చెప్పాల్సింది.”

సారా గట్టిగా నిట్టూర్చింది.

“అసలేం జరిగింది? మనం పెళ్ళి చేసుకుంటే కోపం ఉండొచ్చు. కానీ మాటలు మానేసేంత తప్పేం చేశాం. కనీసం మీ అమ్మ అయినా మాట్లాడొచ్చు కదా!”

***

నాన్న, బాబాయ్…!

రామ్మూర్తి, కృష్ణమూర్తి ఇద్దరిది విడదీయలేని బంధం. సొంత అన్నా తమ్ముళ్ళు కాకపోయినా సొంత అన్నాదమ్ముల పిల్లలు. నాన్నకి నేను, తమ్ముడు……

కృష్ణమూర్తి బాబాయికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిు.

ఎప్పుడూ కొట్టుకోలేదు, తిట్టుకోలేదు.

చూశావుగా… మావి అంతంత మాత్రమైన జీవితాలు.

ఇరవై ఎకరాల పొలం. దాని మీదే వీరిద్దరి జీవితాలు.

కానీ నాకెప్పుడూ లోటు రానీయలేదు.

నేను చిన్నప్పటినుంచి చదువులో చాలా ముందుండేవాడిని. అందుకని నాన్న, బాబాయ్ అప్పు చేసి, మరీ ఎం.బి.బి.ఎస్. చదివించారు.

పై చదువుకి ఫారిన్ వెళ్ళతానని అడిగాను. వాళ్ళ దగ్గర అంత డబ్బులేదు.

మా బాబాయ్ భార్య, మా పిన్ని!

వాళ్ళ అన్నయ్య కావల్సినంత ఏర్పాటు చేస్తానని చెప్పారు. కాని బదులుగా తన కూతుర్ని పెళ్ళిచేసుకోవాలన్నారు. అప్పుడు ఆ అమ్మాయికి పన్నెండేళ్ళు. పేరు సుధ.

“ఏంటి?” సారా ఆశ్చర్యపోయింది.

“జస్ట్ పన్నెండేళ్ళకు పెళ్ళా?”

నేను అదే చెప్పాను. నాకు ఇరవైమూడు, అమ్మాయికి పన్నెండు. కానీ ఖచ్చితంగా కుదరదని చెబితే…. నాకు డబ్బుండదు.

అందుకని “ఇప్పుడు ఇంకా చిన్నపిల్ల… నేను చదువు పూర్తిచేసుకొని, మూడేళ్ళ తరువాత పెళ్ళి చేసుకుంటాను.” అని చెప్పాను.

“చాలా పెద్ద తప్పు చేసావు శంకర్.” సారా నిట్టనిలువునా కుప్పకూలిపోయింది.

“చాలా చాలా పెద్ద తప్పుచేశావు. ఇది ద్రోహం.”

శంకరం తలదించుకున్నాడు.

“అవును నన్ను క్షమించు. తప్పుచేశాను, కాని ద్రోహం మాత్రం కాదు సారా! అబద్ధం చెప్పాను. ఇప్పుడు కూడా చూడు. ఆమెకు కేవలం పదిహేనేళ్ళు. వాస్తవానికి చిన్నపిల్లే. ఎలా చేసుకోను? వాళ్ళకి చెబితే అర్థం కాదు.

పదిహేనేళ్ళ పిల్ల… అన్యాయం కదూ? అది ద్రోహం కాదు? నేను కేవలం అబద్ధం చెప్పాను అంతే!”

చెప్పిందే చెప్పి శంకరం వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.

“తీసుకున్న డబ్బు రాగానే తీర్చేద్దాం….. అనుకున్నా.”

“ఈ విషయం డబ్బు గురించి కాదు…. నమ్మకం గురించి.”

‘‘నాకు ఆ విషయం అప్పుడు అర్థం కాలేదు సారా! నన్ను క్షమించు.’’

“సరే! జరిగిందేదో జరిగిపోయింది. కొన్ని రోజుల తరువాత మనమే వెళ్ళి మాట్లాడతాం.” సారా సర్దిచెప్పింది.

***

“ఒరేయ్ శంకరం… శంకరం….” కృష్ణమూర్తి హడావిడిగా తలుపు కొడుతున్నాడు.

“ఏం బాబాయ్? ఏం జరిగింది?”

“అమ్మ…! అమ్మ….! కదలటం లేదురా. త్వరగా వచ్చి చూడు.”

శంకరం వచ్చి చూసే లోపే సరస్వతి చనిపోయింది.

“అమ్మా!” శంకరం శవాన్ని వాటేసుకున్నాడు.

“నువ్వు ఆమె శవాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు.” రామ్మూర్తి ఆవేశంగా అరిచాడు.

‘‘ఏం నాన్నా!” శంకరం మాట ఇంకా పూర్తికాలేదు.

“ఒరేయ్. ఛీ…. నీ వల్లేరా…. తను చనిపోయింది. నీవు పెట్టిన బాధకే చనిపోయింది. నువ్వు చేసిన మోసానికి చనిపోయింది.”

రామ్మూర్తిని అంత కోపంగా ఎవ్వరూ ఇంతకు ముందు చూడలేదు. మనిషి వణికి పోతున్నాడు.

‘‘నాన్నా’’ శంకరం ఏదో చెప్పబోయాడు.

“ఇంకొక్క క్షణం ఇంట్లో ఉన్నావంటే…. నేనేం చేస్తానో… నాకే తెలియదు.”

రామ్మూర్తి కోపం ముందు శంకరం ఓడిపోక తప్పలేదు.

శంకరం కట్టుబట్టలతో రాత్రికి రాత్రే వెళ్ళిపోవాల్సి వచ్చింది. తల్లి దహనం కూడా చూడలేకపోయాడు.

***

‘‘అన్నయ్యా’’ సుందరం హడావిడిగా క్లినిక్కి వచ్చాడు.

శంకరం హైదరాబాదులో క్లినిక్ పెట్టుకొని, అయిదేళ్ళు అవుతుంది. ఇంకా తండ్రీ కొడుకు మధ్య మాటలు లేవు. కనీసం శంకరానికి కొడుకు పుట్టినా… ఇంటికి రానీయలేదు.

ఇదిగో సుందరం ఇలా వచ్చిపోతుంటాడు. అంతే…

కానీ ఆరోజు సుందరం పరిస్థితి కొంచెం వేరేగా ఉంది. మొఖంలో అలజడి స్పష్టంగా కనిపిస్తోంది.

“ఏంట్రా! ఏమైంది?”

‘కొంపలు మునిగాయి అన్నయ్యా…. నాన్న ఇప్పుడు సుధని నాకిచ్చి, పెళ్ళి చేస్తా అంటున్నాడు!”

“అవునా!”

“సుధా వాళ్ళ నాన్న వచ్చి, పెద్ద గొడవ చేశాడు. ఇక నాన్నకి తప్పలేదు. ఇప్పుడు నేనెంత చెప్పినా వినటం లేదు. పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతానన్నాడు.”

“అయ్యో ఇప్పుడెలా రా?”

శంకరానికి ఏం తోచటం లేదు.

“పోనీ, పెళ్ళి చేసుకోరా!”

“ఏంటన్నయ్యా నువ్వు కూడా… నేను పై చదువుకి కెనడా వెళ్లాలి… అనుకుంటున్నాను కదా! వీసా కూడా రాబోతోంది.”

శంకరం గట్టిగా నిట్టూర్చాడు. “ఒరేయ్.. తొందరపడి… ఏ నిర్ణయం తీసుకోకు. నేను చేసిన తప్పు నువ్వు చేయకు…. నాన్న తట్టుకోలేరు. నాకు దూరం అయి, మూడేళ్ళు అవుతుంది. ఆయనకి మిగిలింది నువ్వేరా…”

సుందరం ఏం మాట్లాడలేదు. తలదించుకొని వింటున్నాడు.

(సశేషం)

Exit mobile version