[dropcap]భా[/dropcap]రతదేశ స్వాతంత్ర్యం అనగానే రక్తపుటేర్లు పారించిన దేశ విభజన గుర్తుకు వస్తుంది. మనిషి పశువై, రాక్షసుడై నర్తించిన భయంకరమైన గాథలు గుర్తుకు వస్తాయి. దేశ విభజన సాహిత్యం అనగానే సరిహద్దుకు రెండు వైపులా ప్రథమంగా గుర్తుకు వచ్చే పేరు సాదత్ హసన్ మంటో.
దేశ విభజన గురించి సాహిత్యం పలువురు రాశారు. దేశ విభజనను విశ్లేషిస్తూ, కారణాలు అన్వేషిస్తూ, దేశ విభజన ప్రభావాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ పలు కాల్పనిక, కాల్పనికేతర రచనలున్నాయి. సాదత్ హసన్ మంటో సాహిత్యం వీటన్నిటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది.
“I tend to view Manto as being almost alone in grasping the fragmentation of “truth” during his times, and that is why the authorial voice is absent from his Partition stories. The victims and victimizers could belong to any community but do not inhabit the same story and no attempt is made to establish parity among the monstrosities committed by all.” (‘The World of Saadat Hasan Manto’ by Shashi Joshi)
దేశ విభజనకు సంబంధించి వచ్చిన సాహిత్యాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి పూర్తిగా పాకిస్తాన్ పక్షం. మరొకటి పూర్తిగా భారత్ పక్షం. ఇంకోటి రెండు పక్షాల నడుమ సమన్వయం సాధిస్తూ ఇద్దరి మీదా దోషం చూపిస్తూ, రెండు వైపులా హింసని చూపిస్తూ సమన్వయ ధోరణిలో సాగిన సాహిత్యం. మంటో దేశ విభజన సాహిత్యం ఈ మూడు విభాగాల్లో ఒదగదు. అతనిది ప్రత్యేకమైన సృజన. మంటో సాహిత్యంలో ఆ పక్షం, ఈ పక్షం అంటూ ఉండదు. ఏ పక్షమూ వహించక మనిషి మనిషిపై జరిపే అత్యాచారాలను కాస్త వినోదంగా, కాస్త విషాదంగా, ఎంతో బాధతో చూస్తూ జరుగుతున్న దాన్ని నిర్మోహంగా, నిర్లిప్తంగా తన అక్షరాలలో బంధించి ప్రదర్శిస్తున్న మానవత్వాన్ని ప్రేమించే సృజనాత్మక మానవుడిలా కనిపిస్తాడు. జరిగింది క్లుప్తంగా, ఎలాంటి వ్యాఖ్యలు లేకుండా, రచయిత నడుమ దూరి ప్రవచనాలు పలకకుండా సూటిగా చెప్పటంతో ఇతర రచనలకు లేని శక్తి మంటో రచనలకు వస్తుంది. అందుకే మంటో రచనలు చారిత్రక, మానసిక, సామాజిక డాక్యుమెంటరీలుగా నిలుస్తాయి. దేశ విభజనకు సంబంధించి మంటో సృజించిన సాహిత్యంలో, 1948లో ప్రచురితమైన ‘సియా హషీయే’ (Black Marginalia) ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఎందుకంటే ఇవి కథలా? కావు. గల్పికలా? కావు. వ్యాఖ్యలా? కావు. ఒక్కోసారి ఒకటి రెండు లైన్లకి మించని ‘సియా హషీయే’ రచనలను ఎలా వర్గీకరించాలో? ఏమని పిలవాలో? ఎలా వ్యాఖ్యానించాలో, ఎలా అర్థం చేసుకోవాలో? ఆనాటి సాహిత్య ప్రపంచానికి అర్థం కాలేదు. ఈ అయోమయం సరిహద్దులకు రెండు వైపులా సంభవించటం గమనార్హం.
పాకిస్తాన్ సాహిత్య ప్రపంచం మంటో ‘సియా హషీయే’ రచనలను విమర్శించింది, తీసి పారేసింది. ‘a jokester, a nuisance, cynic and a reactionary’ అని అభ్యుదయ వాద రచయితలు మంటోను విమర్శించారు. మంటోకు సన్నిహితురాలు, మంటో బొంబాయి వదిలి వెళ్ళిపోయేందుకు పరోక్ష కారణంగా భావించే ఇస్మత్ చుగ్తాయ్ “Siyah Hashiye is neither a masterpiece nor a timeless marvel, but it’s not a garbage either” అని ఈ రచనలను చులకన చేసింది. ఇది మంటో జీవిత విషాదం.
మంటో, సాహిర్ లుథియాన్వీలు అత్యద్భుతమైన సృజనాత్మక కళాకారులు. ఇద్దరూ పాకిస్తాన్ వెళ్ళారు. కానీ తన అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛ పాకిస్తాన్‍లో లేదని అర్థం చేసుకున్న సాహిర్ “బొంబాయికి నా అవసరం ఉంది” అని వెనక్కు వచ్చాడు. స్వేచ్ఛగా తన భావాలు వ్యక్తపరిచాడు. ఈనాటికీ ప్రజల కృతజ్ఞతా పూర్వకమైన నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇందుకు భిన్నంగా, పాకిస్తాన్ వెళ్ళవద్దనీ, తాము రక్షణ కల్పిస్తామనీ అశోక్ కుమార్ వంటి వారు ఎంతగా బ్రతిమిలాడినా వినకుండా ఏ మతమౌఢ్యాన్ని, ఏ సంకుచిత్వాన్ని జీవితాంతం వ్యతిరేకించాడో ఆ మతమౌఢ్య సంకుచిత ధోరణిలోకి మారుతున్న పాకిస్తాన్ వెళ్లిపోయాడు మంటో. పిచ్చివాడై, దారిద్య్రంలో మరణించాడు.
‘సియా హషీయే’ రచనలలో మంటో రచయితగా ఒక నిర్మోహమైన సాక్షి. ఎలాంటి వర్ణనలు, ఆవేదనలు, ఆవేశాలు చూపించకుండా తన కళ్ళ ఎదురుగా జరిగిన, జరుగుతున్న విషయాలతో, ఏ మాత్రం సంబంధం లేని చరిత్ర రచయిత ఎలా అతి తక్కువ పదాలతో అక్షరబద్ధం చేస్తాడో, అలా అక్షరబద్ధం చేశాడు.
“A reading of Manto’s Black Marginalia suggests a deliberate deconstruction of the concept of violence in general, and Partition violence in particular. The texts, therefore, are not simple metaphors, but projections of the profundity of the affective experience of violence on the individual and, by extension, the community the individual belongs to. Most importantly, what they underline is that violence is latent in Man.” (Violence, Gender and Religion: A Critical Study of Saadat Hasan Manto’s Siyah Hashye, Barnali Saha).
అంటే వందల వేల పేజీల్లో దేశ విభజన నాటి భయాందోళనల హింసాత్మక వాతావరణాన్ని వర్ణించే బదులు కేవలం కొన్ని వాక్యాలలో మనసును హత్తుకునే రీతిలో మానవ మనస్సు లోలోతుల్లో నిక్షిప్తమైన జంతు ప్రవృత్తి, రాక్షస లక్షణాలను ప్రస్ఫుటం చేస్తాడన్న మాట మంటో. ఇది ప్రతి వ్యక్తి మనస్సాక్షిని తట్టి లేపి కుదిపే శక్తివంతమైన రచనా పద్ధతి. అందుకే మంటో రచనలపై వచ్చినన్ని విశ్లేషణలు, విమర్శలు ఇతర ఏ రచయిత రచనల గురించి రాలేదు. తెలుగులో మంటో రచనల విశ్లేషణలు, అధ్యయనాత్మక వివరణలు దాదాపుగా లేవు. కానీ పలువురు పదే పదే మంటో రచనలను అనువదించటం ఆశ్చర్యం అనిపిస్తుంది. చివరకు ‘అందరూ మంటో మీద పడ్డారు’ అని పాఠకులు వ్యాఖ్యానించే పరిస్థితికి మంటో రచనల అనువాదాల పరంపర దారితీసింది. అందుకే మంటో రచనల మరో అనువాదం అంటే కాస్త విసుగు, కాస్త చులకన భావం కలగటం స్వాభావికం.
కానీ పూర్ణిమ తమ్మిరెడ్ది అనువదించిన ‘సియా హషీయే’ ఇంత వరకూ తెలుగులో వచ్చిన మంటో రచనలన్నిటికీ భిన్నంగా, ప్రత్యేకంగా నిలుస్తుంది. రచయిత్రి మంటో రచన ‘సియా హషీయే’ను కేవలం అనువదించినట్లు అనిపించదు. మంటో రచనను అనుభవించి, ఆకళింపు చేసుకొని, అధ్యయనం చేసి, మంటో వేదనతో తాదాత్మ్యం చెంది, ఆ ఆవేదనను తెలుగు అక్షరాలలోకి తర్జుమా చేసి అందించారనిపిస్తుంది. ఇది కేవలం ఒక అనువాదమో, అనుసృజనో అనటానికి వీలు లేదు. This is a work of passion, a labour of love అనిపిస్తుంది. అది ఈ పుస్తకం ప్రత్యేకత. ఒక భాషలోని అక్షరాలను మరో భాషలోకి అనువదించటం సులభం. బోలెడన్ని యాంత్రిక అనువాద సౌకర్యాలు కూడా ఉన్నాయి. కానీ ఏ యంత్రం కూడా మానవ మనస్సుకు ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి మనసుతో చేసే పని ప్రత్యేకత వేరు. మంటో ఇతర రచనల అనువాదాలకూ, ఈ అనువాదానికి తేడా ‘మనసుతో పని చేయటం’ అన్న లక్షణం.
పుస్తకానికి రాసిన సుదీర్ఘమైన ముందుమాట మంటోను పరిచయం చేస్తుంది. పుస్తకంలోని వ్యాసాలను, సియా హషీయే లఘు అక్షర చిత్రాలను చదివేందుకు మూడ్‍ని స్థిరపరుస్తుంది. రచయిత్రి అధ్యయన లోతును కూడా తెలుపుతుంది. వ్యాసాలయినా, ‘సియా హషీయే’ చిన్న రచనలయినా అనువాదం సరళంగా, సులభంగా ఉంది. అక్కడక్కడా హిందీ, ఉర్దూ వాక్యాలను యథాతథంగా వాడటం రచనకు సహజత్వాన్నిచ్చింది.
అయితే అక్కడక్కడా వాక్యనిర్మాణం మరో రకంగా ఉంటే అనువాదం మరింత సహజంగా ఉండేదనిపిస్తుంది. ‘జెల్లీ’ కథలో ‘పిల్లవాడికి రోడ్డు మీద గడ్డ కట్టుకు పోయిన రక్తం వైపు చూసి నోరూరింది’ అంటే అర్థం బోధపడుతుంది. కానీ ‘రోడ్డుపై గడ్డ కట్టిన రక్తం వైపు చూసిన పిల్లవాడి నోరూరింది’ అనటం మరింత సహజంగా ఉంటుంది. అప్పుదు ‘జెల్లీ’ అనగానే గడ్డ కట్టుకున్న మాంసం, రక్తం పిల్లవాడికి ‘జెల్లీ’లా కనిపించటం శరాఘాతంలా మనసును తాకి కలవరపరుస్తుంది. పలు ఆలోచనలకు ఊపు నిస్తుంది. అలాగే ‘బడు’ ప్రయోగాన్ని పరిహరించటం శ్రేయస్కరం. మూలంలో పాసివ్ వాయిస్ వున్నా, అనువాదంలో బడు వాడటం అసహజంగా అనిపిస్తుంది.
ఈ పుస్తకంలో మొత్తం మూడు విభాగాలున్నాయి. సియా హాషియే కన్నా ముందు విభజనకు దారితీసిన పరిస్థితులు, విభజనకు దారి తీస్తున్న సమయంలో మంటో రాసిన వ్యాసాలు, కథలు ‘నేపథ్యం’ విభాగంలో ఉన్నాయి. 1948లో అంటే పాకిస్తాన్ వెళ్ళిన తరువాత మంటో రాసిన ‘సియా హాషియే’ పుస్తకంలో ప్రధాన విభాగం. మూడో విభాగంలో విభజన రాజకీయాల పర్యవసానాలు, విభజన గురించి మంటో రాసిన జ్ఞాపకాలు వంటివి పొందుపరిచారు.
పుస్తకం చివర అనుబంధంలో రచయిత్రి మంటో గురించి వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాలు పొందుపరిచి ఉన్నాయి. పుస్తకంలో కేవలం ‘సియా హాషియే’ రచనల అనువాదం ఉండి ఉంటే ఇంత నిండుదనం పుస్తకానికి వచ్చేది కాదు. కానీ సియా హాషియే వంటి రచన ఉద్భవించటానికి దారి తీసిన పరిస్థితుల నేపథ్యం, మంటో బావాలు వంటి అదనపు వ్యాసాల జోడింపు వలన ‘సియా హాషియే’ రచనలను అర్థం చేసుకోవటానికి, మంటో మనస్సు లోతుల్లోకి తొంగి చూసేందుకు పాఠకులకు వీలు కలుగుతుంది.
ఇంత వరకూ మంటోకు సంబంధించి తెలుగులో వచ్చిన పుస్తకాలలో మంటో రచనలనే కాక, మంటోను ఒక వ్యక్తిగా, సృజనాత్మక రచయితగా పాఠకుడికి చేరవేసే పుస్తకం ఇదొక్కటే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మంటో అభిమానులకు ఇదొక ‘వరం’. కాగా, సాహిత్యాభిమానులు, ఆలోచనాపరులు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది. చక్కని పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందించిన రచయిత్రికి అభినందనలు.
***
సియా హాషియే
అనువాదం: పూర్ణిమ తమ్మిరెడ్డి
ప్రచురణ: ఎలమి పబ్లికేషన్స్
పేజీలు:188
వెల: ₹ 190
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.
ఫోన్: 090004 13413
ఆన్‍లైన్‍లో తెప్పించుకునేందుకు:
https://www.telugubooks.in/products/siya-hashiye
ప్రచురణకర్తలు: వాట్సాప్ నెం: 8247474541