[dropcap]హిం[/dropcap]దీ లఘు చిత్రాల్లో బేరెల్ స్టాగ్ వాళ్ళవి బాగుంటున్నయి. ఆ తర్వాత పాకెట్ ఫిలంస్ వాళ్ళవి కూడానూ. లఘు చిత్రాలంటే సీమ టపాకాయల లాంటివే వొక రకంగా. పెద్ద విస్ఫోటనం లా కాకుండా చిన్న చురక అంటించి ఆలోచింపచేస్తుంది. చిన్నపాటి పరిధిలో చేసిన ఆ పని కూడా ఘనమైనదే.
“స్లీవ్‌లెస్” అనే లఘు చిత్రం తల్లీ కూతుళ్ళ కథ. పాత తరం ఆలోచనలతో తల్లి, కొత్త తరం ఆలోచనలతో పదహారేళ్ళ కూతురు. మర్నాడు కాలేజీలో జాయిన్ కావాలి. ఆ ఉత్సాహం. తల్లి నూనె ఎక్కువ వేసి రొట్టె కాల్చి ఇస్తే ఇంత నూనా?, మొటిమలొస్తాయి అని కూతురంటే, బలం అని తల్లి లలిత (దివ్య జగ్దాలే) అంటుంది. అంటే ఒకే విషయంలో వాళ్ళ మధ్య భిన్న ఆలోచనలు చూపించడం జరిగిపోయింది. పార్సెల్ వస్తుంది. కెనడా నుంచి చుట్టాలు కూతురు జాహ్నవి (కనిష్క విషె) కోసం స్లీవ్లెస్ డ్రెస్ పంపిస్తారు. కూతురు సంబరపడిపోతుంది, మర్నాడు అదే వేసుకుని కాలేజికెళ్తానంటుంది. ఆ రాత్రి తల్లీ కూతుళ్ళు మంచం మీద పడుకుని వుంటారు. పక్క పక్కనే వున్న వాళ్ళ ఆలోచనల్లో దూరం మాత్రం ఎక్కువే. కూతురు తన ఫ్రెండ్స్ తన డ్రెస్ గురించి, ఇన్స్టాగ్రాం లో లైక్స్ గురించీ మాట్లాడుకుంటున్నట్టు ఊహించుకుంటుంది. తల్లేమో తన కూతురు స్లీవ్లెస్స్ వేసుకున్నందుకు సమాజంలో మనుషులు తప్పు పడుతున్నట్టు, కూతురిని అబ్బాయిలు వెంటబడుతున్నట్టు ఊహించుకుంటుంది. భయంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లి పోతుంది. లేచి అంత రాత్రి పూటా ఆ డ్రెస్ కి స్లీవ్స్ కుట్టి కూతురికి చూపిస్తుంది. కూతురికి అది నచ్చదు, మంచి డ్రెస్ ను పాడుచేసావంటుంది. ఇలా వేసుకుంటే ఏ పాపిష్టి కళ్ళూ నీ మీద పడవు అంటే, మరి ఆరుగజాల చీర కట్టుకున్నా నీకు అలా ఎందుకయ్యింది? నువ్వు మౌనంగా అన్నీ ఎందుకు భరించావు, జరిగిన దాంట్లో నీ తప్పు ఏమీ లేనప్పుడు అని కూతురు అంటుంది. కూతురు అప్పుడు చిన్న అమ్మాయి అయినా అంతా గుర్తుంది, వొక రోజు తల్లి మేనమామ వచ్చి తనకు అయిదు రూపాయలిచ్చి చాక్లెట్ కొనుక్కోమని బయటకు పంపడం. ఆ రోజు లలిత కూడా ఊహించలేకపోయింది తన స్వంత మేనమామ కళ్ళల్లో తన పట్ల కామం వుందనీ, చెరచాలని అదను కోసం చూస్తున్నాడనీ. అలా “శీలం” కోల్పోయిన భార్యతో వుండలేక భర్త మరో వివాహం చేసుకుంటాడు. ఇదంతా గుర్తు తెచ్చుకుని తల్లి వొక నిశ్చయానికి వచ్చి, ఆ డ్రెస్ స్లీవ్స్ కుట్లు ఊడదీస్తుంది. మర్నాడు కూతురిని కాలేజికి తీసుకెళ్తుంటే కుర్రమూక ఈల వెయ్యడం, తల్లి కసురుకోవడం తో కథ ముగుస్తుంది.
ఈ చిత్రానికి కథా బలం వుంది. విషయం ఎమో పెద్దది. కాని తక్కువ నిడివిలో చెప్పాలి. అదీ ప్రభావవంతంగా. కేవలం తల్లీ కూతుళ్ళ పాత్రలతో అవసరమైనంతా పదమూడు నిముషాల్లో చెప్తాడు రచయితా దర్శకుడూ అయిన వికాస్ కుమార్. మొట్ట మొదటి రొట్టె సీన్ తో భిన్న ఆలోచనలు ఎస్టాబ్లిష్ చేసి, మంచం మీద పడుకున్న ఇద్దరి ఊహలూ చెప్పడం తో తక్కువ ఫుటేజ్ లో అంతా చెప్పే అవకాశం వదులుకోలేదు. ఫ్లాష్బేక్ లో కూడా వొకే సీన్, క్లుప్తంగా. దివ్యా జగ్దలే, కనిష్క ల నటన బాగుంది. నితిన్ బందేకర్ చాయాగ్రహణం, సెమల్ భట్ సంగీతం బాగున్నయి. అలాగే అత్యాచారాల వెనక స్త్రీల పొట్టి వస్త్రాల కారణం పూర్తిగా తప్పు అని చెబుతూనే, తెర మీద వచ్చే మొదటి వాక్యంలోనే చెబుతాడు దర్శకుడు : అందం అనేది చూసే దృష్టిలో వున్నట్టే కామం కూడా చూసే దృష్టిలోనే వుంది అని.