[dropcap]8[/dropcap] డిసెంబరు 2024 న కరీంనగర్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సమావేశ మందిరంలో, భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో, డా. వైరాగ్యం ప్రభాకర్ గారి తాజా కవితాసంపుటి, ‘స్మరించుకుందాం’ ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ పుస్తకం ఆయన నూరవ ప్రచురణ. ఒక వ్యక్తి, తన సంస్థ ద్వారా వంద పుస్తకాలు ప్రచురించడం సాహిత్య చరిత్రలో ఒక అరుదైన సంఘటన.
గ్రంథ సమీక్షకుడిగా, ప్రధాన వక్తగా, ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, కాలమిస్ట్, ప్రవచనకర్త శ్రీ పాణ్యం దత్తశర్మగారు హాజరై, ప్రసంగించారు. ‘స్మృతి కవిత్వం’ సాహిత్యంలో ఒక ముఖ్యశాఖ (జోనర్) అని, ఇంగ్లీషు సాహిత్యంలో దానిని Nostalgic Poetry అని అంటారని ఆయన చెప్పారు.
డా. ఎన్. గోపి, జాషువా, శ్రీ మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి గారల సృతికవిత్వాన్ని ఆయన ఉటంకిస్తూ, కవితలు, పద్యాలను పాడి, శ్రోతలను అలరించారు. ప్రభాకర్ గారు వంద పుస్తకాలను, కొన్ని స్వీయరచనలు, కొన్ని ఆయన సంపాదకత్యంలో సంకలనం చేసినవి, కొన్ని ఇతరుల రచనలు. ‘భవానీ సాహిత్యవేదిక’ సంస్థ ద్వారా ప్రచురించి, రికార్డు నెలకొల్పారని, ఈ నూరవ పుస్తకం ఒక మైలురాయి అని, పాణ్యం దత్తశర్మ కొనియాడారు.
సభకు, ప్రముఖకవి, నటులు, నంది అవార్డు గ్రహీత – శ్రీ సాధనాల వెంకటస్వామి నాయుడుగారు అధ్యక్షత వహించారు.
‘స్మరించుకుందాం’ అన్న నూరవ ప్రచురణను ప్రముఖ సినీ గేయరచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు ఆవిష్కరించారు. విశిష్ట అతిథులుగా ప్రముఖ హాస్యావధాని, హాస్యబ్రహ్మ, శ్రీ శంకరనారాయణ గారు హాజరై, తన ప్రసంగంతో, సభోద్యానంలో నవ్వుల పువ్వులు పూయించారు. పాణ్యం దత్తశర్మ గారి ప్రసంగం తనను ఎంతో ఆకట్టుకొన్నదని, ఈ రోజునుంచి, ఆయన పేరును ‘నాణ్యం దక్షశర్మ’గా మారుస్తున్నానని చెప్పి, అందర్నీ నవ్వించారు.
‘సాహితీ గౌతమీ’ పూర్వాధ్యక్షులు, ప్రముఖ కవి, అవధాని, శ్రీ గండ్ర లక్ష్మణ రావు గారు విశిష్ట అతిథిగా విచ్చేశారు. కవులను, అతిథులను ఘనంగా సత్కరించి డా. వైరాగ్యం ప్రభాకర్, తన సంస్కారాన్ని చాటుకొన్నారు.
గంప ఉమాపతి, కరీంనగర్.