Site icon Sanchika

స్మృతిలో నిలిచిన అతిథి

[dropcap]కో[/dropcap]తులు వచ్చే వేళ కావొస్తోంది. చిలిపి చేష్టలు వికార చేష్టలు చేసే కోతులను ఎలాగైనా ఈ సారి అదుపులోకి తేవాలని మా స్కూల్ ఉద్యోగుల మధ్య నిర్ణయం తీసుకోవడమైంది. అసలు ఈ నిర్ణయం వెనుక కథ మీరు తెలుసుకోవాలి లేకుంటే గందరగోళంగా వుంటుంది. అసలు ఓ వెధవ కోతి మా వెంకట్ మాష్టారు గారిని కరవకపోయుంటే ఈ పరిస్తితి వచ్చేదే కాదు. కానీ మేమంతా కోతులను చంపాలని మాత్రం అనుకోలేదు కేవలం వాటిని పట్టించి మా వూరికి దగ్గరగా ఛత్తీస్గఢ్ దట్టమైన అడవులలోకి వదిలిపెట్టేలా చెయ్యాలనుకున్నాం. మా రాష్ట్ర సరిహద్దులకు దగ్గరగా వున్న ఈ అడవులు ఎంతో పచ్చదనంతో నిండి వుంటాయి.

మీరు అడగొచ్చు ఎన్ని కోతులు ఉంటాయని, సుమారు ముప్పై దాకా వుంటాయి. మా స్కూలు పిల్లలు మధ్యాహ్నం భోజనం చేయగానే మిగిలిన తిండిని అవి తింటూ వుంటాయి.

పైన పేర్కొన్న ఉదంతం తప్ప అవి ఎప్పుడూ ఎవరికీ హాని కలిగించిన దాఖలాలు లేవు. అందుకనే అవి వాటి పిల్లలూ తిండి తింటున్నాయి కదా అ వదిలేశాం. తల్లిని కరుచుకుని వుండే కోతి పిల్లలు ఎంతో ముద్దొస్తాయి అయితే అవి ఒక కొమ్మ మీద నుంచి యింకో కొమ్మకు దూకుతూ చేసే అల్లరి మాత్రం యింతా అంతా కాదు.

కొద్ది రోజులు గడిచే సరికి వాటి సంఖ్య పెరగడం దానితోపాటు చిలిపి చేష్టలు మరింత పెరగడమూ జరిగింది. కానీ నిజానికి పరిశీలిస్తే వాటి అల్లరిలో కూడా కొంత క్రమశిక్షణ కనిపించేది.

మధ్యాహ్నం భోజనం తయారు చేసే వ్యక్తినీ వంటలో అతనికి సహాయం చేసేవారిని గవురవించేవి. వుంటే పూర్తి అయ్యేవరకు వేచివుండేవి. ప్రతీ క్షణాన్ని ఫలం దొరుకుతుందని వాటికి బాగా తెలుసు మరి. వంట చేసేవారికి దూరంగానే మెసలుకునేవి పైగా వారు తరిమినా ఏమీ అనేవి కావు.

అసలు చిక్కంతా వచ్చేది పిల్లలతోనే! వాళ్ళు వెక్కిరించితే కోపం వచ్చి మూతి యికిలించేవి. ఒక్కోసారి స్కూలుకి వచ్చే పిల్లల తల్లిదండ్రులపై దాడి చేసేవి. కలిసిమెలసి వుంటున్న మా చిన్న వూరిలో యిలాంటి వార్తలు తొందరగా పాకిపోయేవి. కొందరు గ్రామస్తులు మా హెడ్ మాస్టర్ని కలిసి యింకొక దుర్ఘటన జరిగాక ముందే కోతులను పారద్రోలమని ప్రార్థించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటిని ఆరాధించే కొందరు పారద్రోలే సమయంలో వాటికి ఏ విధమైన శారీరక హానీ కలగకూడదని హెచ్చరిక చేశారు.

ఎన్నో సంప్రదింపులు జరిపి చివరకు కోతులను దట్టమైన అడవులలోకి తరలించాలని నిర్ణయం అయ్యింది. వాటిని పట్టుకోవడంలో నేర్పు వున్న పనిమంతులకు ముందుగానే కొంత పైకం యివ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఇలాంటి పనినే వారు యింకొక వూరిలో చేస్తూ వున్నారు.

ఈలోగా మీడియా రంగానికి చెందిన కొందరు వ్యక్తులు కులాసాగా తిరుగుతున్న కోతులపై కథనం తయారు చేద్దామని స్కూలుకు వచ్చారు. వారు ఆ కోతులను కెమేరాలో బందీ చేద్దామని పూర్తి సరంజామాతో వచ్చారు కానీ విచిత్రంగా వారు ఎన్ని గంటలు వేచినా ఆ రోజు కోతులు రాలేదు. మధ్యాన్న భోజనం సమయం అయినా వాటి జాడ కనిపించలేదు.

“మాష్టారు గారూ! ఏమిటి సంగతి? కోతులు కనిపించటం లేదు పారిపోయాయంటారా?” అని ఓ పత్రికా విలేఖరి నన్ను అడిగాడు. నేనూ వెంటనే “నాకే ఆశ్చర్యంగా వుంది. ఈ సమయానికి కోతులన్నీ వచ్చేయాలి, గెంతుతూ తుళ్ళుతూ వుండాలి. ఎందుకు రాలేదో నాకు అర్ధం కావట్లేదండీ” అంటూ ఆలోచనలో పడిపోయాను.

పత్రికా విలేఖరి “మేము చాలా సమయం వేచి చూశాం. మధ్యాహ్నం భోజన సమయం వాటికి ఎంతో ముఖ్యం కదా అని రెండు గంటల ముందే మేము బ్యాగులూ కెమెరాలూ ఇతర సరంజామాతో స్కూలు ఆవరణలోకి రావడం అవి పసిగట్టి బహుశా వాటిలో అవి సంభాషించుకొని ఇక్కడికి రాకుండా తప్పించుకునుండాలి” అని అనుమానం వ్యక్తం చేశాడు.

నేను “అవును అదే కారణం అయ్యిండొచ్చు. కనీసం ఓ పిల్ల కోతి కూడా ఎక్కడా కనిపించడం లేదు.అవన్నీ కలిసికట్టుగానే కనిపించకుండా ఏమీ లేనట్టు మాయమయ్యాయి” అన్నాను.

కాసేపు మాట్లాడిన తర్వాత విలేకరుల బృందం నిరాశతో వెళ్లి పోయారు. ఆ తరువాత నా మనసులో కోతుల జీవన సరళి గురించి ఉత్సాహం మొదలైంది. ఇది పరిశోధన జరపాల్సిన విషయమే అనుకున్నాను. ఆసక్తి కలిగించే వాటి మార్మిక ప్రవర్తన గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. ఆశ్చర్యకరంగా ఆ మరునాడు మధ్యాహ్న భోజనం సమయానికి  ఎప్పటినించో అక్కడే తిరుగతున్నట్టు మళ్ళీ స్కూలు ఆవరణలో కనిపించాయి.

ఆరి భగవంతుడా! జంతువులు అనుభవం లేనివని ఎవరన్నారోగానీ ఇవి ఎంత తెలివైనవీ. విషయాన్ని అర్థం చేసుకుని ఎంతో నిశితంగా పని చేయగలవు. ఈ రోజు ఇక్కడకు రావడమే సురక్షితమని అవి ఆలోచించాయి. వాటికే గానీ మనుషుల్లా మాట్లాడే శక్తి వుండి వుంటే ఈ భూమ్మీద యింత కాలం మనుగడ కోసం ఎంత పోరాటం చేసాయో అదంతా ఓ మంచి ఉత్సాహ పూరితమైన కథనం అయ్యేది. నిజం చెప్పాలంటే మనుషులే సురక్షితమైన పరిస్థితుల్లో హాయిగా జీవిస్తున్నది.

ఒకరోజు నేను స్కూలు ఆవరణలో ఉన్న వేప చెట్టు నీడలో కూర్చుని వున్నాను. భారత్ బంద్ చేస్తున్న వారి కోరిక మూలాన్ని పిల్లల్ని తొందరగా పంపేశాం. కొందరు ఉపాధ్యాయులం మాత్రం స్కూల్లో వుండిపోయాం. హఠాత్తుగా నా వెనక చర చర శబ్దం వినిపించింది తిరిగి చూస్తే ఒక కోతి. ముందు భయపడినా కదలకుండా ఏమి జరుగుతుందో చూద్దాం అనుకున్నాను. తన అమాయకమైన నాకేసి చూడటం మొదలు పెట్టింది నేను మాత్రం నిశ్శబ్దంగా వేరే వైపుకి దృష్టి మరల్చాను.

కొద్ది క్షణాల తర్వాత కూడా కోతి నా వైపు చూస్తూనే వుంది. ఇక దాని కళ్ళలో కళ్ళు పెట్టిన నేనూ చూడాలనుకున్నాను. బహుశా అది కూడా ఇక్కడ వుండడం సురక్షితమే అనుకుందేమో ఎందుకంటే దాని మొహంలో ఎక్కడా కోప లక్షణాలు కనిపించలేదు. నేనూ దానికి ఏ విధమైన హనీ కలిగించాలనుకోలేదు. నా శరీర కవళికల అర్థం తెలిసిందనుకుంటాను. కొద్ది నిమిషాల తర్వాత నిశ్శబ్దం ఛేదించాలని “ఓ స్నేహితుడా! నువ్వు దేనికోసం చూస్తున్నావో కానీ, ఈ రోజు స్కూలు సెలవని ప్రకటించడం వలన భోజనం తయారు కాలేదు. ఇంకెక్కడైనా తిండి వెతుక్కోవడం ఈ రోజు” అనేశాను. నేను అన్న  మాటలు అర్థమైనట్లు తన మొహాన్ని మెల్లగా క్రిందకు దించింది. దాని కళ్ళలో స్నేహం కనిపించింది. మూసి వున్న వంటగది వైపుకి మెల్లగా వెళ్తూ చూసి నిర్ధారించుకుని చుట్టూ పరుచుకున్న దట్టమైన పచ్చదనం లోకి మాయమయ్యింది.

మరునాడు ఓ కోతి ఎవరినో కరిచిందన్న చెడు వార్త వినాల్సి వచ్చింది. ఒక ఎనిమిదవ తరగతి విద్యార్థిని కరిచింది. కుడి కాలుపై దాని దంతాల గాటు లోతుగా దిగినట్టుంది. రక్తం బొటబొటా కారుతుడుండంతో దగ్గరగా వున్న ఆసుపత్రికి తీసుకుపోయి మందు యిప్పించి కట్టుకట్టించి యింటికి పంపేశాం. నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకు ఈ కోతులు ఇలా చేస్తాయి? నిన్నేమో చాలా స్వామ్యంగా ప్రవర్తించిన కోతి యిలా చేసిందేమిటీ అనుకున్నా మరుక్షణం బహుశా అది వేరే కోతి అయ్యిండొచ్చేమో అనిపించింది.

కోతి కరిచిన కుర్రాడి ఓ స్నేహితుడిని నేను సంప్రదించీ వివరాలు అడిగాను. దానితో ఆ కుర్రాడిని కోతి ఎందుకు కరిచిందోనన్న రహస్యం వెలికి వచ్చింది. ఆ కుర్రాడే ముందు కోతిని వెక్కిరిస్తూ కర్ర చూపిస్తూ చిలిపి చేష్టలు చేస్తూ తరిమేడట. ముందు ఆ కోతి తప్పించుకుని విరామ సమయంలో ఆ అబ్బాయి ఒంటరిగా వుండడం చూసి మీద పడిందట. విన్న తర్వాత, ఈ జీవులకి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఎంత పద్ధతిగా తెలుసో అమ్మో! అనుకున్నాను.

నేను వెంటనే “పిల్లలారా! వాటికి ఏ హానీ తలపెట్టకండి. మీరు ఏమైనా చేస్తేనే అవి మిమ్మల్ని కరుస్తాయి. ఆ కుర్రాడిని కోతి కరవడమే మీ కళ్ళెదుట కనిపిస్తున్న ఉదాహరణ” అని చెప్పాను. అర్థమైనట్టుగా తలూపారు. వాళ్ళకు ఆ విధంగా సలహా యిచ్చినందుకు మనసులో సంతృప్తిగా వున్నా ఏదో మూల నేనూ కాస్త వణికిపోయాను.

నా సహోద్యోగి రామేశ్వర రావు విరామ సమయంలో కోతులతో తన అనుభవాలను పంచుకున్నాడు. ఇంతకు ముందు తాను నారాయణ పురం అనే గ్రామంలో పనిచేసేవాడినని చెబుతూ “మనకు తెలిసిన దాని కన్నా ఈ కోతులు చాలా తెలివైనవి. నేను ఇంతకు ముందు పనిచేసిన ప్రదేశంలో ఒక పెద్ద కోతుల గుంపు చాలా క్రమశిక్షణతో ప్రవర్తించేవి, నేను మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు దారి యిచ్చేసి పొదల్లో దాక్కునేవి, నేను వెళ్లిపోయాక మళ్ళీ బయటకు వచ్చేవి. వాటి ఆటల్లో జోక్యం చేసుకోని వాళ్ళని ఎలా గౌరవించాలో వాటికి తెలుసు” అన్నాడు.

ఇంకా చెబుతూ “కొందరు గ్రామస్తులు వాటిపై కోపగించుకుని  కరెంటు తీగలు తగిలించి కొన్ని కోతులను చంపేశారు. వాటిలో కొన్ని చిన్న కోతి పిల్లలు వుండడంతో, మిగిలినవి రాక్షసుల్లా ప్రవర్తించడం మొదలెట్టాయి. రోడ్డు పై ఎవరు నడిచినా మీదపడి గాయం చేసేవి. దానితో ఇరువురి మధ్య ఎప్పుడూ తగువులే. గ్రామస్తులు ఈ తగువులు తమకు అవమానంగా భావించి ఈ ప్రాణులను వదిలించుకోవాలని అన్నింటినీ చంపేశారు. కానీ నన్ను ఆశ్చర్య పరిచింది ఏమిటంటే కోతులని చంపించిన మారణహోమంలో వున్న వాళ్ళందరూ ఏదో వేరే వేరే కారణాల మూలాన ఆ వూరు వదిలి పెట్టాల్సి వచ్చింది.” అని ముగించాడు.

“నువ్వు ఈ దేశంలో ఏ ప్రదేశానికి వెళ్లినా అది గ్రామమైనా పట్నం, మహనగరమైనా కోతులు కనిపించని జాగా లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఎలా వాటిని నియంత్రించాలి? ప్రజలూ ప్రభుత్వం కలిసి వాస్తవాలను గురించి ఆలోచించాలి. పూర్వం రోజుల్లో కోతులని ఆడించే వాళ్ళు వచ్చి ఆటలు చూపిస్తూ అడుక్కునే వారు. ఇప్పుడు ఇది తలనొప్పిగా మారింది” అన్నాడు. నేనూ తల వూపాను.

“ఇదిగో! రెండు రోజుల క్రితం మా యింట్లోకి ఓ కోతి చొరబడింది”  అన్నాడు రావు.

“మరప్పుడేం జరిగింది?” అని నేను ఉత్కంఠగా అడిగాను.

“మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. వాటిని మన హావభావాలతో ఉసిగొల్పడం మంచిదికాదు. మేము అవి లేనట్టుగానే ప్రవర్తించాం. అవి తినుబండారాలను అటు యిటు పారబోసి కొంచెం తినేసి ఎక్కువ నష్టం కలిగించకుండా వెళ్లి పోయాయి. దేవుడి దయ వలన ఇంకోసారి ఎప్పుడూ మాపై దాడి చెయ్యలేదు అవి. మనం వాటితో కొంచెం తెలివిగా ప్రవర్తించడం మన రక్షణ కోసమే సుమా!” అన్నాడు రావు.

“సరే సార్… సుమారు నాకూ యిలాంటి అనుభవమే అయ్యింది. కానీ వీటిని స్కూలు ఆవరణలోంచి తోలెయ్యటం ఎలా?” అని అడిగాను.

“ఏ అవాంతరాలు రాకుండా వాటిని పంపించేయేలాంటే అవి ఆశపడే లాంటి పళ్ళలో మత్తు మందు ఎక్కించి వీలైనంత దూరంగా వున్న దట్టమైన అడవుల్లో విడిచి పెట్టడం చేయాలి” అన్నాడు.

నా తోటి ఉద్యోగులందరికీ ఈ సలహా ఆచరణయోగ్యంగా అనిపించి సంతోషం వేసింది. అంతా సరిగ్గా కుదిరింది. దీనికి సంబంధించిన వ్యక్తులకు ముందే డబ్బులు ముట్టచెప్పాం. కొద్ది రోజుల్లో ఈ పని పూర్తి కావాల్సి వుంది.

నేను కీటికీలోంచి కోతులు ఆడుతున్న దృశ్యాలను తదేకంగా చూస్తున్నాను. అవి ఎప్పటిలాగే సంతోషంగా వున్నాయి. మేము చేస్తున్న తంత్రాలు వాటికి తెలియవు. కొన్ని పిల్లకోతులు తల్లులను కరుచుకుని వున్నాయి. కొన్ని సరదాగా చెట్లమీద గెంతుతున్నాయి. ఒక కోతి యింకొక కోతి జుట్టులో పేలు వెదుకుతోంది. వాటి లోకంలో వాటికి సంతోషమే అన్నట్లుగా ఆనందిస్తున్నాయి.

హఠాత్తుగా ఓ పిల్ల కోతి భయంతో అరిచింది. వెంటనే పెద్ద కోతులన్నీ పిల్లకోతి చుట్టూ రక్షణ కవచంలా నిలబడ్డాయి. పిల్ల కోతి వెంటపడ్డ కుక్క పారిపోయింది. పెద్ద కోతులన్నీ ఎప్పుడూ పిల్లకోతుల రక్షణకు సిద్దంగా ఉంటాయి.

ఒకరోజు ఉదయం అనుకున్నట్లుగానే కోతులన్నింటినీ బంధింపబడి అడవుల్లో వదిలేయటానికి వేనులో ఎక్కించబడ్డాయి. ఇప్పుడు మా స్కూలు కోతుల బాధ లేకుండా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మేమూ హాయిగా వుందనుకున్నాం. వెంకట్ మాష్టారు సంతోషంగా వున్నారు. అసలు ఆ మాష్టారుని కోతులు కరవడానికి గల కారణం ఏమిటో మీకు తెలుసా? ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వాటిని కొట్టడానికి వీలుగా పెద్ద కర్ర ఒకటి వుంచుకునేవారు. ఆయనకు అదొక సరదా.

వాటిని కొట్టవద్దని సహోద్యోగులు ఎవరైనా సలహా యిచ్చినా ఖాతరు చేయకుండా పైగా పగ పట్టినట్లుగా మరింత కొట్టేవారు. ఒకరోజు ఆఫీసు గదిలో ఆయన ఒంటరిగా వుండడం చూసి కోతులు ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాయి. అవన్నీ మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచాయి. అవన్నీ ఒక పద్దతి ప్రకారం మూడు దళాలుగా విడిపోయి ఆయన పారిపోకుండా కాపు కాశాయి.

ఆయన ఆ ఘటనతో కంపించిపోయారు.

కొన్ని నెలలు యిలా గడిచిపోయాయి. వర్షాకాలం మంచి ఊపు అందుకుంది. ఆ రోజుల్లో మాకు యిళ్ళల్లో బాత్రూములు వుండేవి కావు. ఒక రోజు రాత్రి ఇంటి దొడ్డిలో కొంచెం దూరంలో వున్న బాత్రూముకి వెళుతుంటే సర సరా చప్పుడయింది. ఉత్సుకతతో  వెళ్లి శబ్దం ఏమిటని చూడడానికి వెళ్ళాను.

ఒక కోతి దాన్ని అంటుకుని ఓ పిల్లా కనిపించాయి. అసహాయ చూపులు చూస్తూ పిల్లని మరింత హత్తుకుంది. దాని కళ్ళలో బాధ పశ్చాత్తాపం కనిపిస్తున్నాయి. ఈ వర్షం నుండి తమని తాము కాపాడుకోవడానికి బాత్రూం చూరు కిందకి దూరినట్టున్నాయి. “హాయిగా వుండండి. మీరు మా అతిథులు” అని వాటితో అన్నాను. వెంటనే వెనుతిరిగి యింట్లోకి వెళ్లి పోయాను. ఏ మాత్రం వాటిని రెచ్చగొట్టలేదు.

అవి అర్దం చేసుకున్నాయి.

పొద్దు పొడిచిన తరువాత కోతి పిల్లతో పాటు కూర్చున్న ప్రదేశాన్ని వెతికాను. ఆ జంతువులు కనిపించలేదు. బహుశా మమ్మల్ని ఇబ్బంది ఎందుకు పెట్టడం అని సూర్యోదయం కాకముందే వెళ్లి పోయి వుండాలి. ఆ తరువాత ప్రతీ వర్షాకాలంలో బాత్రూము కోసం వెళ్లినపుడు అవి కూర్చున్న  ప్రదేశాన్ని  ఒకసారి చూడాలని నా మనసు గుర్తు చేస్తూనే వుంటుంది. ఆశ్చర్యంగా ఆ తర్వాత అవి ఎప్పుడూ కనిపించలేదు.

***

ఆంగ్ల మూలం రచయిత-KVVS Murthy

(The River side Man & Other Stories అన్న పుస్తకం లోంచి అనువదించిన కథ. కథ పేరు The Obsessed Guest)

అనువాదం-ఆర్.ఎస్. వెంకటేశ్వరన్.

Exit mobile version