Site icon Sanchika

నాణానికి మరో వైపు – ‘స్మృతిపథం’

[dropcap]‘స్మృ[/dropcap]తిపథం’ నవలా రచయిత యశస్వి జవ్వాది చాలా చిన్నవాడు. ఒక రకంగా చెప్పాలంటే ‘చిదిమిన పాల్గారు చెక్కుటద్దములవాడు’. ఇంత చిన్న వయసులో జీవితం పట్ల ఇంత అవగాహన కలిగి ఉండడం ఒక ఎత్తు అయితే, దానిని నవలగా మలచటం మరో ఎత్తు. రెండూ సాధించాడీ కుర్రాడు.

‘Flashback Technique’ అనే పాత పద్ధతినే ఉపయోగించాడు కాని presentation మటుకు చక్కగా ఉంది. శైలి బాగుంది. తన తల్లి తన నవలకు ప్రథమ సంపాదకురాలని చెప్పుకోవడం అతని సంస్కారం. ఆమె పట్ల గౌరవం, ప్రేమ. నవల అంతా మానవ సంబంధాలు, వాటి లోని డొల్లతనం, వాటిలో దాగున్న hypocrisy, ముఖ్యంగా మన మధ్య తరగతి వారిలో, చక్కగా చిత్రీకరించబడినాయి. ‘మధ్య తరగతి వారిలో కొన్ని విలువలుంటాయి, వాటికి కట్టుబడి ఉంటారు’ అన్నదానికి ఈ నవలలో పూర్వపక్షం చేసి చూపించాడీ అబ్బాయి. ‘నాణానికి అటు వైపు’ చూపాడు!

నవల అంతా ‘నేను’ అంటూ సాగింది. కానీ పాఠకుల ఆసక్తిని sustain చేయగలిగింది.

‘శ్రీ’ ఈ నవలలో ముఖ్య పాత్ర (Protagonist) పూర్తి పేరు చివర్లో గాని తెలియదు. అక్కడక్కడా కొన్ని విశ్వసత్యాలను చెప్పాడీ యువ రచయిత. అవి abstract గా కాకుండా కథలో చక్కగా ఇమిడిపోయాయి. మొదట్లోనే, “దూరంగా ఉంటేనే ప్రేమ పెరుగుతుంది” అంటుందా పాత్ర. ‘అతి పరిచయాత్ అవజ్ఞా’ అని సంస్కృతంలో సూక్తి ఉండనే ఉంది. శ్రీ వాళ్ళత్తయ్య, ఆమె చూపే ఆపేక్ష అంతా కపటమే. వాళ్ళమ్మ, ఆమె సంభాషణలో ఈ hypocrisy అంతా కనిపిస్తుంది. సొంత పిల్లల్లో కూడా వివక్ష చూపుతారు వారు! దిగువ మధ్య తరగతి కుటుంబం, తండ్రి నిర్బాధ్యుడు. తల్లి వేదన. ‘అసమర్థుని కోపం’ అన్నదాన్ని వాళ్ళ నాన్న వాళ్ళమ్మను, తమను కొట్టడం ద్వారా చూపించాడు. ఒక రకంగా అది నిస్సహాయతకు పరాకాష్ట ఏమో! ఐరనీ ఏమిటంటే అతనికి (తండ్రికి) దైవభక్తి మెండు.

‘కేశవరం నానమ్మ’ అనే పాత్ర ఉంది. ఆ తరంలోని వారికి ఇది పూర్తిగా కాంట్రాస్ట్. ఆమె బాగా పుస్తకాలు చదువుతుంది. చక్కగా పిల్లలకు కథలు చెబుతుంది. చెప్పుడు మాటలు వినదు. ఆమె ఒక మాట అంటుంది –

“వైవిధ్యం అంటే కొత్తగా ఉండడం. ఆరు కోట్ల కథలున్నా, వాటికి మూలం వంద లోపే ఉంటుంది.”

ఎంత నిశిత పరిశీలన!

కార్ల్ మార్క్స్ చెప్పిన కఠిన సూత్రం ‘All human relations are financial relations’ను శ్రీ బాబాయి పాత్ర ద్వారా చూపిస్తాడు రచయిత. అతని తాతయ్య మంచి వాస్తు ప్రవీణుడు, పండితుడు. ఆయన మరణిస్తాడు.

“తాతయ్య శరీరం ప్రాణం లేని సింహంలా ఉంది” అంటాడు రచయిత. మంచి ఉపమ! నానమ్మ ప్రవర్తన ఆ సమయంలో కార్ల్ మార్క్స్‌నే మళ్ళీ గుర్తుకు తెస్తుంది. ఆయన మెడలోని పంచముఖి రుద్రాక్షలతో కూడిన వెండి గొలుసును ‘ఏడుస్తూనే’ తీసి చీరకొంగుకు ముడేసుకుంటుంది! ఉంగరాలు వేళ్ళు ఊడివచ్చేలా లాగించింది!

‘కుమాతా న భవతి’ అన్నారు ఆదిశంకరులు. పాపం ఆయనకు మన మధ్య తరగతి గురించి తెలియదు. నానమ్మ పాత్రను చూస్తే ఆయన తప్పకుండా ‘కుమాతా భవతి’ అంటారు. మధ్య తరగతివారు పేదరికంలో ఉన్నా, ‘కుహానా ప్రతిష్ఠ’ (False Prestige)ను ఎలా మెయిన్‍టెయిన్ చేస్తారో, శ్రీ, మెడికల్ షాపులో పనిలో చేరినప్పుడు – నానమ్మ, బాబాయి ‘కుటుంబం పరువు పోయింద’న్నప్పుడు – తెలుస్తుంది. Dignity of labour గొప్పతనాన్ని తెలుసుకోలేని గతి, మధ్య తరగతిది!

తల్లి శ్రీకి ‘అన్యాయార్జిత విత్తము’ చేటు తెస్తుందని బోధిస్తుంది. వ్యక్తిత్వ వికాస సూత్రాలలో ఇది అతి ముఖ్యం. ఆత్మీయులనుకొనే బంధువుల కంటే పరాయి వారే నిజమైన శ్రేయోభిలాషులని, సుబ్రహ్మణ్యం గారి పాత్ర నిరూపిస్తుంది. శ్రీ నాన్నపై గృహహింస కేసు పెడితే దారికి వస్తాడంటాడాయన. వాళ్ళకు, శ్రీకి ధైర్యం చెబుతాడు. నిస్వార్థమైన జోక్యం!

శ్రీ ఇంజనీరింగ్ చదువును ‘down to earth’గా చూపించాడు రచయిత. బీదపిల్లలు ఆత్మన్యూనతా భావానికి లోనవటం, వారికి employability skills లేకపోవడం, చివరికి శ్రీ ఆత్మహత్యకు పాల్పడడం ఇవన్నీ సహజంగా చిత్రీకరించాడు. ఆత్మహత్యా ప్రయత్నం విఫలమవుతుంది. అప్పట్నించి అంతర్ముఖుడవుతాడు కథానాయకుడు. ఆత్మపరిశీలన ప్రారంభమవుతుంది. హైదరాబాద్ చేరుకుంటాడు బ్రతుకు తెరువు కోసం. అక్కడ నానా కష్టాలు పడతాడు.

ఎక్కడా ‘ఔచిత్య భంగం’ కాకుండా జాగ్రత్త పడతాడు రచయిత. “ఇలా ఎక్కడైనా ఉంతుందా?”, “అలా ఎలా కుదురుతుంది?” లాంటి ప్రశ్నలు పాఠకుడి మనసులోకి రావు. ఆ విధంగా ‘suspension of Readers’ disbelief’ అన్న ఉత్తమ రచన లక్షణాన్ని సాధించాడు.

నాన్న పట్ల ఉన్న ఏహ్యభావం త్యజిస్తాడు. అతని వ్యక్తిత్వంలో పరిణతిని సాధిస్తాడు. “నా నాన్న నాకు తిరిగొచ్చేశాడమ్మా” అన్న మాట, Resume లో S/o అని నాన్న పేరు రాయడం మనల్ని కదిలిస్తాయి. అందులోని అతడు రాసిన objective అతని పరివర్తనను, లక్ష్యశుద్ధిని సూచిస్తుంది. ఒక రకంగా అది particular కాదు universal. Particular నుంచి General కు వెళ్లడమే కావ్య ప్రయోజనం.

రాజు, వంశీ లాంటి స్నేహితులు శ్రీకి ‘unconditional love’ అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. వారికి అసూయ ఉండదు. అభివృద్ధిని హర్షిస్తారు.

బంధాలన్నీ జీవిత పాఠాలు నేర్పిస్తాయి అని శ్రీ realize అవుతాడు.

చక్కని తెలుగు భాష నవలంతా పరచుకొని ఉంది. అనవసరమైన ఆంగ్ల పదాలు లేవు. చివర్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడే అతని మాటలతో నవల ముగుస్తుంది.

“ఏదైనా, నా మార్గం సన్మార్గమే అవుతుందని తెలుసు”. కాళిదాస మహాకవి తన అభిజ్ఞాన శాకుంతల కావ్యంలో దుష్యంత చక్రవర్తి చేత అనిపించిన మాటలనే యశస్వి తన మాటలలో, క్లుప్తంగా, ప్రభావవంతంగా చెప్పాడు.

‘సతాం హి సందేహ పదేషు వస్తుషు ప్రమాణ మంతఃకరణ ప్రవృత్తయః’

ఈ యువకుడు తన కలాన్ని మరింత పదును పెట్టి, అదునుకు తగిన మరిన్ని మంచి రచనలు చేయాలని ఆశీస్సు!

***

స్మృతిపథం (నవల)
రచన: యశస్వి జవ్వాది
ప్రచురణ: ఇయర్‍హుక్ పబ్లికేషన్స్, హైదరాబాద్.
పేజీలు: 169
వెల: ₹ 180/-
ప్రతులకు:
ఇయర్‍హుక్ పబ్లికేషన్స్, 9160003371

 

Exit mobile version