Site icon Sanchika

స్నేహ పరిణామం

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘స్నేహ పరిణామం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఎ[/dropcap]వరు ఎవరికి దోస్తు
నాకు నువ్వా నీకు నేనా!

ఎవరు ఎవరికి తెలుసు
నీకు అతనా అతను నీకా!

ఎవరు ఎవరికి అర్థమయ్యారు
నీకు నువ్వా అతనికి అతనా!

అంతా స్పష్టా స్పష్టమా
పారదర్శకమా! అపారదర్శకమా!!

***

చూపులు కలిసి కరచాలనం చేసినప్పుడే
దూరాలు తరిగిపోయాయి
బాహువులు చాపి
ఆలాయి బలాయి తీసుకున్నప్పుడే
అభ్యంతరాలు కదిలిపోయాయి

కన్నీటిలో తడిసిన మాటలు
కలల్ని వెంటేసుకుని ప్రవాహంలో కలిసినప్పుడే
ఊహలూ ఊపిరులూ పెనవేసుకున్నాయి
స్నేహం కళకళ లాడింది

***

నిలబడిపోయిందనుకున్న కాలం
వడివడిగా నడిచింది
నువ్వేమో అపోహల ఆసరాతో
చూపులు మరల్చి కదిలి వెళ్ళిపోయావు

ఇక కనిపించీ కనిపించని చూపులు
వినిపించీ వినిపించని మాటలు
అరువు తెచ్చుకున్న ముఖాలు
అంటించుకున్న నవ్వులు
తడిలేని కరచాలనాలు పొడి పొడి ఆలింగనాలు

రెండు తీరాల నడుమ ప్రవాహం ఇంకిపోయి
ఇసుకమేటలు వేసినట్టు
ప్రాణస్నేహాలు పరిచయాలుగా
పరిణామం చెంది ముడుచుకుపోయాయి

నిజానికి ఇద్దరినీ కలిపివుంచడానికి
కరచాలనమో ఆలింగనమో చాలదు
ఆర్తి గల మనసుండాలి
తడి తడి ప్రేముండాలి

Exit mobile version