[సుగుణ అల్లాణి గారు రచించిన ‘స్నేహా సుగంధం..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నీ[/dropcap] స్నేహం ఆకాశంలోనక్షత్రం
నిరంతరం నా కంటి ముందుండవు
నేను కష్టాల చీకట్లలో తచ్చాడుతూంటే
నాకంటికి వెలుగై దారి చూపిస్తావు!
నీతో నా స్నేహం
ఎప్పుడు మొదలైందో కానీ
అప్పుడు ఆట పాటలల్లో తోడున్నావు
ఇప్పుడు నా ఆటుపోటుల్లో తోడున్నావు
ఎప్పుడూ నా చేయి పట్టుకుని నడిపించావు
నీవు లేకపోతే నేను శూన్యమేకదా!
నీ కోపం కూడా ప్రేమను వర్షిస్తుంది
నీ అభిమానం నిర్మలాకాశం
ప్రపంచమంతా నన్నొదిలేసినా
నీ స్నేహమొక్కటి ఉంటే చాలు
నీవు లేని ఈ ప్రపంచం నేను ఒంటరిని
నా ఊపిరి వీడిన తరువాత కూడా
నా ఊహలే చిరుగాలితరగలా
నిన్ను చుట్టుకుంటుంటాయి!
నా కోసం నీవు ఆకాశం వైపు చూస్తే
చినుకై నీ కంటి కొలుకులో నిలుస్తాను
నేల నలు చెరగుల నను వెదుకుతావేమో
నీ వెనుక నీ నీడనై అడుగులేస్తాను
నీ తలపులలో నేను సజీవంగా ఉంటాను!!