[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘స్నేహం.. నేనూ..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]పం[/dropcap]జరంలో అందాల రామచిలుక కాదు
మనసు వేసిన సంకెల అమలిన స్నేహకరచాలనం
నిర్మల గంధమైన గాలి స్వేచ్ఛ
తనకూ నాకూ లేదు ఏ ముందస్తు పరిచయం
మనిషికీ మనిషికి మధ్య ఏ తీగ రాగం కనిపించదు
మనసు సృష్టించుకున్నదే నాందీ ప్రస్తావన
కలతచెందిన నేను ఓ దారెంట పోతుంటే
ఓ ఐక్యతా రాగాలాపన చేసింది అతని గొంతు రాగమాలై
ఆత్మీయ ఔషధం అందుకున్న
మనసు బాధ సాహితీ మేఖలైంది
విప్పారిన పూదోట వీచే గాలిని స్నేహించి
కష్టాలకూ కన్నీళ్లకూ తోడూనీడా
ఇష్టపది కవి కలం హాలిక హలం
బాధల ముళ్ళ బాట చిందిన చెమట చెలిమె
మైదాన వైశాల్యం లోతుల గాఢత ప్రతిక్షేపించిన బతుకున
స్నేహం ఒక కొత్త సమాసం
ఓ గొప్ప సరిగమల సామాజిక వీణ
మనసులో పుట్టినదే
స్నేహ తరంగ తటి సుందర బంధం
రక్తమై ప్రవహిస్తేనే బతుకు
కలిసిన నడకల వంతెన నింగీనేలా
తనూ నేనూ స్నేహించిన బతుకే ఆదర్శం ఆత్మీయం
ఏ రెండు మనసులూ విహరించని
అమేయ లోకాన
వేర్వేరైనా మేమిద్దరం కలిసిన స్వేచ్ఛ స్నేహం
జీవితం అరుదైనది విలువైనది
శిలలు రాసిన మైత్రి కవనం భావావేశాల అంచుల చుట్టే మట్టి మనసు