స్నేహమంటే ఇదేనా

0
1

“మన క్లాసుమేట్ శంకరం రిటైర్ అయి వచ్చి బాబా మెట్టలో ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు. నీకు తెలుసా?” మధు అన్నాడు.

“శంకరం విషయమే నాకు తెలియదు. ఈ ఊరు విడిచి వెళ్ళిన తరువాత రెండు, మూడు పర్యాయాలు ఫోనులో మాట్లాడేడు. ఆ తరువాత మరి ఏ భోగట్టా తెలియదు. స్నేహనికిచ్చిన విలువ ఇదేనా? అన్నాను నిష్ఠూరంగా మధుతో అన్నాను.

“వాడంతేలే. నీకన్నా మా ఇద్దరి మధ్య ఎంతో సన్నిహిత స్నేహం ఉందా. అలాంటిది నా దగ్గర కూడా అంతే” అన్నాడు మధు. శంకరంతో మధుకి ఉన్నంత స్నేహం ఉండకపోవచ్చును కాని, నేను కూడా కొన్ని సందర్భల్లో అతడ్ని ఆర్థికంగా ఆదుకున్నవాడినే.

శంకరం తండ్రి కుటుంబ బాద్యతలు ఏవీ పూర్తవకుండానే అకాల మృత్యువుకి గురయ్యారు. ఇద్దరు అక్కలు, తమ్ముడు, తల్లి అతని కుటుంబ సభ్యులు. ఇంత మంది బాగోగులు చూసుకునే భారం తల్లి మీద, శంకరం మీద పడింది. తండ్రి చనిపోయిన తరువాత తల్లికి వచ్చిన పెన్షను వచ్చింది, శంకరం ఓ మిల్లులో చిన్న ఉద్యోగం సంపాదించాడు. దానివలన వచ్చిన ఆదాయంతో వారి కుటుంబం అవసరాలు తీరుతున్నాయి. అంతే కాదు వాళ్ళ అక్కయ్యలు కూడా చుట్టు ప్రక్కల వాళ్ళకి బట్టలు కుట్టి ఎంతో కొంత సంపాదించేవారు.

మధు పి.జి. చేయడానికి వెళ్ళిపోతే నేను టీచరు ట్రైనింగు పూర్తి చేశాను. మా ఊర్లోనే ఓ మిషనరీ స్కూల్లో నాకు ఉద్యోగం వచ్చింది. అందుకే శంకరం కుటుంబంతో ఏ ఆర్థిక సమస్యలు వచ్చినా నాకు తోచినది నేను వారికిస్తూ ఆర్థికంగా వారిని ఆదుకునే వాడిని. అయితే ఆ తరువుత నేను ఇచ్చిన డబ్బు నాకు ఇచ్చేసేరు. అది వేరే విషయం.

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నెమ్మదిగా శంకరం కుటుంబ పరిస్థితులు చక్కబడ్డాయి. వాళ్ళ అక్కయ్యలకి పెళ్ళిళ్ళు అయ్యాయి. కట్నకానుకలు లేకుండా వాళ్ళ అక్కయ్యలను ఇష్టపడి ఇద్దరు బావలు పెళ్ళి చేసుకున్నారు.

‘అదీ ఓ అదృష్టమే’ అని అనుకుంటాను నేను. వాళ్ళ తమ్ముడు చదువు పూర్తి చేసి ఉద్యోగం వెతుకులాటలో ఉన్నాడు. శంకరానికి కూడా పెళ్ళి సంబందం వచ్చింది. అయితే అమ్మాయి అంత బాగుండదు. ఆ అమ్మాయి తండ్రి శంకరానికి ఉద్యోగం వేయించుకుని కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తానన్నాడు.

ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ శంకరంతో పెళ్ళి విషయంలో తొందరపడకు అని సలహా ఇచ్చారు. అయితే అతని ఆలోచన్లు వేరేగా ఉన్నాయి. దానికి కారణం అతని కుటుంబ పరిస్థితులే. ‘బాహ్య సౌందర్యానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అంతే కాదు అందం కొరుక్కుతింటామా. మొదట తనకి కావాల్సింది మంచి భవిష్యత్తు’ అనుకున్న శంకరం ఈ సంబంధానికి ఒప్పుకున్నాడు. దానికి ఫలితమే శంకరం ఓ ఇంటి వాడయ్యాడు. పెళ్ళి అయిన వెంటనే శంకరం మామగారు తన పలుకుబడి వినియోగించి అల్లుడ్ని ఉద్యోగస్తుడుగా చేశాడు.

శంకరం ఉద్యోగంలో చేరాడు. అస్సాంలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన తరువాత రెండు మూడు సార్లు మాత్రమే ఫోను చేశాడు. ఆ తరువాత ఫోన్లే లేవు. అతని సమాచారం తెలియనే లేదు. పెళ్ళి కాకముందు ఇద్దరం సాయంత్రాల పూట అలా తిరగడానికి వెళ్ళేవాళ్ళమి. పార్కులో కూర్చుని ఇంటి పరిస్థితుల గురించి మాట్లాడుకునే వాళ్ళమి. అలాంటిది ఉద్యోగంలో చేరిన తరువాత ఫోన్లు చేయడం శంకరం మానివేయడం నాలో అంతర్మథనం, ఓ విధమైన బాధ. మా ఇద్దరి మధ్యా ఉన్నది స్నేహమేనా లేక కాలక్షేపానికి, సమయం గడపడానికి చేసిన సహవాసమా అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే తమిద్దరి మధ్యా ఉన్నది నిజమైన స్నేహమేనా అని.

స్నేహం గురించి నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతీ మనిషి కొన్ని మంచి చెడులు, బలాలు, బలహీనతలు ఉంటాయి. వాటిని గ్రహించి మెసలుకోవాలి. అందరితో కలిసి ఉన్న మనం కొంతమందితో మాత్రమే స్నేహంగా ఉంటాము. అందరితోనూ కాదు. కొంత మంది స్నేహం పాలూ నీళ్ళలా కలిసిపోతుంది. మరి కొంత మంది స్నేహం ఎంత తొందరగా స్నేహమవుతుందో అంత తొందరగా బేధాభిప్రాయాలు వచ్చి విడిపోతారు.

నిజమైన స్నేహితుడు అన్నవాడు అమ్మలా తన ప్రేమను పంచాలి. తండ్రిలా తన బాధ్యతల్ని మనకి గుర్తు చేయాలి. తమ్ముడిలా పేచీ పెట్టాలి. ఓ గురువులా మన కర్తవ్యం మనకి బోధించాలి. జీవిత భాగస్వామిలా కష్ట సుఖాల్లో మనకి తోడుగా నిలవాలి.

నిజమైన స్నేహితుడు ఇలా అన్ని విధాలా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాడు. ఈ లోకంలో మనకి బంధువుల్ని ఆత్మీయుల్ని అన్ని బంధాల్ని ఇచ్చిన భగవంతుడు స్నేహితుడి విషయంలో మాత్రం మంచి స్నేహితుడ్ని, అత్యుత్తమ స్నేహ బంధాన్ని ఎంచుకునే అవకాశం మనిషికే ఇచ్చాడు. అని నేను అనుకుంటాను.

అంతేగాదు నిజమైన స్నేహితులు మనల్ని పైకి తీసుకెళ్ళగలరు. మన తప్పుల్ని మనకి తెలియచేసి, ఆ తప్పుల్ని సరిదిద్ది సరియైన మార్గంలో నడిపించగలరు. స్నేహితుడి యొక్క ఈ ప్రభావం ప్రతీ వ్యక్తి జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది.

మన భావోద్వేగాలు అయిన దుఃఖం, సంతోషం, కోపం, నవ్వు, ఆలోచనా, ఆరోగ్యం అన్నింటిని నిర్దేసించేది, మన గమ్యాన్ని నిర్ణయించేది మంచి స్నేహితుడు మాత్రమే. అంతే కాదు స్నేహితుల మధ్య సరదాగా ఆనందంగా మెలిగేవాళ్లు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు. అనుకోకుండా ఒంటరిగా ఉండే పరిస్థితి వచ్చినా ఏదో తెలియని ఆత్మనూన్యతా భావం మనిషిలో కలుగుతుంది. ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. మనిషిలో ప్రతికూల ఆలోచన్లు మొదలవుతాయి.

ఇవన్నీ మన అభివృధ్ధికి ఆటంకంగా నిలుస్తాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలంటే ఓ మంచి స్నేహితుడు ప్రతీ ఒక్కరికీ ఉండాలి. అటు వంటి స్నేహితుడు సహకారం లభిస్తే మనిషి జీవితం సాఫీగా సాగుతుంది. మనల్ని కలవర పెట్టే స్థితి సద్దుమణగాలంటే మంచి స్నేహం లభించాలి.

జీవితంలో అప్పుడప్పుడయునా స్నేహితుడి సాయం కావాలి. సుదీర్ఘకాలం జీవించాలంటే స్నేహితుడి సహచర్య చాలా కీలకం. స్నేహితుల మద్య ఉండే వాళ్ళకి ప్రతీ విషయం ఇతరులతో పంచుకునే వారికి ఒత్తిడి ఉండదు. ఆరోగ్యం మెరుగవుతుంది దీని వల్ల. అంతే కాదు మన వ్యక్తిత్వం మీద కూడా మంచి చెడు స్నేహితుల ప్రభావం పడుతుంది. ఇదే నిజమైన స్నేహితుడు గురించి నిజమైన స్నేహబంధం గురించి నా అభిప్రాయం.

“మూర్తీ శంకర్రాన్ని చూడ్డానికి వెళ్దమనుకుంటున్నాను, వస్తావా?” మధు అడిగాడు. రిటైర్ అయిన తరువాత ముగ్గురం ఒకే ఊర్లో సెటిలయ్యాము. మొదట వెళ్ళాలనిపించలేదు నాకు. అయితే ఇప్పుడు శంకరం ప్రవర్తన అతని తీరు ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న ఆలోచనే శంకరాన్ని చూడ్డానికి వెళ్ళడానికి అంగీకరించాను.

సమాజంలో మంచి స్నేహితుడనే వాడు కత్తెరలా కాకుండా సూదిలా బతకాలని నేను అనుకుంటాను. సూది తన పని జోడిస్తూ పోతూ వుంటే కత్తెర తన పని ఎప్పుడూ విడదీస్తూ ఉంటుంది. ‘మంచి స్నేహితుడునే వాడు అందర్నీ కలుపుకుంటూ పోవాలే కాని విడదీస్తూ కాదు’ అని కూడా నేను అనుకుంటాను.

మమ్మల్ని చూడగానే శంకరం మొదట తికమక పడ్డాడు. అయితే ఆ భావాల్ని తన ముఖంలో కనబడనీయకుండా జాగ్రత్త పడ్డాడు. నవ్వుతూ వచ్చి పలకరించాడు, ఆహ్వానించాడు మమ్మల్ని.

“మీరు వస్తున్నట్లు ముందుగా ఫోను చేయవల్సింది” అన్నాడు.

“నీకు సర్‌ప్రైజ్ ఇద్దామని” మధు నవ్వుతూ అన్నాడు.

శంకరంలో అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు. అది ప్రతీ వాళ్ళకీ వయస్సు తెచ్చిన మార్పు అని అనుకున్నాను మనిషి జీవితంలో వార్ధక్యం ఓ భాగం. అందుకే ఆ మార్పు.

శంకరం కూతుర్ని అక్క కొడుక్కి ఇచ్చి పెళ్ళి జరిపించాడు. కొడుకు నార్త్ వేపు ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ విషయాలు అక్కడికి వెళ్ళిన తరువాత మాకు తెలిసాయి. అతని వాలకం తీరుని బట్టి మా రాక అతనికి మనస్ఫూర్తిగా ఆనందం ఇవ్వలేదని నాకు అనిపించింది. నాకే కాదు మధుకి కూడా. శంకరం ముఖంలో అగుపడ్తున్న భావాలే అందుకు నిదర్శనం.

తన భార్యను వాడు మాకు పరిచయం చేయలేదు. మేము ఉన్నంత సేపూ ఆవిడ వంట గదిలోనే ఉండిపోయింది. “వాడిలో ఆత్మనూన్యతా భావం ఇంకా పోలేదు” నెమ్మదిగా అన్నాడు మధు నాతో. నేను తల పంకించాను.

మమ్మల్ని హాల్లో కూర్చోబెట్టి మంచి నీళ్లు బిస్కెట్లు కూల్ డ్రింకు తీసుకువచ్చి మాకు ఇచ్చాడు. బిస్కట్లు తిని కూల్ డ్రింకు త్రాగాము మేము. ఇక తన గొప్పలు, బడాయిలు చెప్పడం ప్రదర్శించడం ఆరంభించాడు.

తమ ఆఫీసు స్టాఫ్ రాష్ట్రపతితో తీయించుకున్న ఫోటోలు, ప్రధాన మంత్రి చేతుల మీద తను తీసుకుంటున్న బహుమతుల ఫోటోలు, తనకి వచ్చిన బహుమతులు, ఆటల్లో తను గెల్చుకున్న బహుమతులు, తరువాత తను కట్టుకున్న అధునాతన భవనం అన్నీ చూపించడం ఆరంభించాడు. తన వైభవం, స్థితిగతులు గరించి అలా చెప్పుకుపోతున్నాడే కాని అన్ని సంవత్సరాల తరువాత కలుసుకున్నాం, ‘ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి?’ అని అడిగిన పాపాన్న పోలేదు శంకరం మమ్మల్ని.

తనే వైభవంతుడు, ఎదుటివాళ్ళు ఏదో లేకిగా బ్రతుకుతున్నారు అన్న భావం నాకు అగుపడింది శంకరంలో. వీడు గత జీవితాన్ని మరిచి పోయాడు. దీన్నే అంటారు నడమంత్రపు సిరి అని. మేము మాత్రం శంకరానికి ఏ మాత్రం తీసిపోలేదు. ఎవరికున్న హోదాలో వాళ్ళు ఉన్నాం. ఎంతైనా ఉద్యోగం చేస్తున్నప్పుడే పదవులు, హోదాలు, రిటైర్ అయిన తరువాత ఇవేవి ఉండవు. ఉద్యోగంలో ఉన్నప్పుడే వాటి విలువ. జీవితంలో స్నేహం స్నేహితులు ముఖ్యం ఇలా సాగిపోతున్నాయి నా ఆలోచన్లు.

మధు వేపు చూశాను నేను. “కొందరి స్వభావమే అంత. ఇటువంటి వాళ్ళు గతాన్ని మరచిపోతారు” చిన్నగా నవ్వుతు నెమ్మదిగా అన్నాడు మధు. అక్కడ మరి ఉండబుద్ది వేయలేదు. ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుని బయటకు వచ్చి తృప్తిగా ఊపిరిపీల్చుకున్నాం మధు, నేను.

జీవితంలో మనకి అనేక మంది పరిచయం అవుతారు. స్కూల్లో, ఆటల్లో, కాలేజీలో, ఉద్యోగం చేస్తున్న సమయంలోనూ. అయితే ఇవన్నీ ఇన్నాళ్ళూ స్నేహం అనుకున్నారు. అయితే ఇప్పుడు తనకి అనిపిస్తోంది తమది తాత్కాలిక స్నేహమని.

ఇప్పుడు తమిద్దరి మధ్యా ఉన్నది స్నేహమేనా లేక తాత్కాలిక స్నేహమేనా. కాలక్షేప స్నేహమేనా, స్నేహమంటే ఇదేనా అన్న ప్రశ్న మదిలో మెదిలింది.

ఆలోచిస్తూ ఇంటి వేపు అడుగులు వేస్తున్నాను నేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here