స్నేహశీలి అక్కినేని

1
2

[20 సెప్టెంబరు 2022 అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా వారికి అంజలి ఘటిస్తూ వారితో తమకున్న అనుబంధాన్ని వివరిస్తున్నారు శ్రీమతి ఏ. అన్నపూర్ణ.]

[dropcap]కా[/dropcap]లం గడిచి పోతూనే ఉంటుంది. జీవితయానంలో ఎందరో  పరిచయం అవుతారు. అందులో కొందరు ప్రముఖులు వున్నప్పుడు మనం తప్పకుండా గుర్తు చేసుకుంటాం కదూ!

వారితో మాటాడిన మాటలు మననం చేసుకుంటాం. మనిషి శాశ్వతం కాకపోవచ్చు కానీ వారి జ్ఞాపకాలు మనని వెన్నంటి ఉంటాయి.

మా భార్యాభర్తలం అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళినపుడు సినిమాలోని పాత్రలు, నటీమణుల అలవాట్లు, సందేహాలు గురించి అడిగితే ఓపికగా తడుముకోకుండా చెప్పేవారు. వారి మేధాశక్తి అపారం.

”మేము మీ కాలాన్ని వృథా చేస్తూన్నామేమో..” అని మొహమాటపడితే “అలా ఎప్పుడూ అనుకోవద్దు. మీరు వచ్చినందువల్ల పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నాను. అవి నాకు సంతోషం కలిగిస్తాయి.. మీకు ఎప్పుడు మాట్లాడాలి అనిపించినా రావచ్చు. అపాయింట్‍మెంట్ అవసరం లేదు” అనేవారు.

మేము అడగకుండానే  కొన్ని చెప్పేవారు.

KBR పార్క్ వాకింగ్‌కి వెళ్లే రోజుల్లో సంగతి ఇది.

పార్కులో అభిమానులు కొందరు పలకరించి ఫోటోలు తీసుకునేవారు. వారితో ఎప్పుడు సమస్య రాలేదు.

కొందరు రాజకీయ నాయకులూ,  పిచ్చి ప్రశ్నలతో విసిగించే  సీనియర్ సిటిజెన్స్ వలన నాకు చిరాకు కలిగేది.

వారి వయసు కంటే చిన్న ఐనా వాకింగ్ స్టిక్‌తో కుంటూ కుంటూ నడిచేవారు, అసూయాపరులు వుండేవారుట. నాలుగు అడుగులు వేసి బెంచీ మీద కూర్చునే వారుట.

సరే వారి ఇష్టం ఓపిక. నాగేశ్వరరావు గారిని ”మా కంటే వయసులో మీరు పెద్ద, అయినా ఎలా నడుస్తారు? చేతిలో స్టిక్ లేకుండా! అమృతం తాగుతారా.. అమెరికా నుంచి స్టెరాయిడ్స్ తెప్పించుకుంటారా!” అని అడిగేవారట.

“కళ్ళు చేతులు వణకడం, సరిగా మాటాడలేక పోవడం, చూపు మసకగా ఉండటం మాకు 60 దాటగానే వచ్చేసాయి. మీ ఆరోగ్య రహస్యం ఏమిటో చెబుదురూ.. మేమూ ఫాలో అవుతాం” అనేవారుట.

”మహానుభావులారా నేను ఏ మందులూ వాడను. మా తల్లిగారి ఆరోగ్యం నాకు వంశ పారంపర్యంగా వచ్చి ఉండవచ్చు. నన్ను వేధించకండి” అన్నారుట.

ఐనా వదలక “మాకు నమ్మకం లేదు. చెబితే పోటీకి వస్తామని దాచిపెడుతున్నారు” అన్నారట.

దాంతో విసిగిపోయి KBR పార్కుకి వెళ్లడం మానేసి అన్నపూర్ణా స్టూడియోకి నడక మార్చారట.

”చాలా మంది వయసు రోగాలు మందులు డాక్టర్లు గురించే మాటాడుతారు. మరో మాట ఉండదు. అందుకే నేను నా కంటే  చిన్న వయసు వున్నా మీతో  స్నేహం చేస్తాను. హాయిగా మాటాడుకోవచ్చు.” అని చెప్పేవారు.. నవ్వుతూ.

ఇది నిజం! వయసుతో వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మరచి పోయి వేరే అంశాలమీద దృష్టి పెడితే మాటాడేవారికి  బాగుంటుంది. వినేవారికి బాగుంటుంది. మేమూ అలాగే భావిస్తాం.

మా ఆలోచనలు నడవడి ANR కి నచ్చినందువలనే మాతో స్నేహం ఇష్ట పడ్డారు. 30 సంవత్సరాలు ఆ స్నేహం వర్ధిల్లింది.

అక్కినేని గారు కానుకగా ఇచ్చిన వెండి నాణేలు

మిత్రమా.. స్నేహానికి నిర్వచనం మీరు. అందుకే  సదా సంస్మరణీయులు!

అవును స్నేహానికి వయసు ఆటంకం కాదు మరి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here