మాటదో చేతిదో మనసుదో
స్నేహ స్పర్శ ఒక బంధం
ఒక దుఃఖం
ఒక మంత్రమూ కూడా
పగలైనా రాత్రైనా
కాలంతో పనిలేకుండా
నరనరానా పరుగెత్తి
మస్తిష్కాన్ని ముట్టించే
ఒక మహా జ్వలనం
మంత్రాన్ని నమ్మకపోయినా
వెచ్చగానో చల్లగానో తాకే
మాటనో చేతినో మనసునో
నమ్మాల్సిందే
బతికే వున్నామని
బండపడి పోలేదని
బతకగలిగే తనాన్ని
చెప్పగలమనీ చెప్పే
ఒక్కస్పర్శే చాలు
కలనైనా ఇలనైనా
బోథి వృక్షమంత ఆసరా
అనూహ్య స్వప్నమై దగ్గర కొచ్చినా
ఆశ కల్పించి దూరతీరాలకు
మోసుకుపోయినా
క్షమతోనో ప్రేమ తోనో
ఇంకిన బావి లాటి
గుండెను తొలిచి
ప్రాణాన్ని ఉవ్వెత్తున ఎగసే
కంటిధారను చేసే
జీవమూ అదే
ప్రేమను పంచే స్నేహ స్పర్శ ఎప్పుడూ
ఒక బంధం ఒక స్వప్నం ఒక మంత్రం