స్నిగ్ధమధుసూదనం-10

0
1

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 10వ భాగం. [/box]

[dropcap]అ[/dropcap]రఘడియలో వారంతా తినడం ముగించి లేచాక, అంతవరకూ కాపలాగా నిలబడిన భటులూ, అప్పటి వరకూ మొదటి పంక్తి వారికి వడ్డించిన భటులూ తినడం ముగించారు.

అశ్వాలకి వెంట తెచ్చిన పచ్చగడ్డి అవసరపడలేదు. అక్కడే పెద్ద వృక్షాల మధ్యలో పెరిగిన పొడవైన పచ్చగడ్డిని కడుపారా తిన్నాయవి.

చంద్రహాసినికి నది దాటాలని ఉబలాటంగా ఉంది. భుక్తాయాసం అంటూ సమయాన్ని వృథా చెయ్యడం ఆమెకి ఇష్టం లేదు. అలా అని అంతవరకూ అత్యంత శ్రధ్ధతో తనను కాపాడుతూ వచ్చిన వారిని భుక్తాయాసంతో ఇప్పుడు నది దాటమని తను ఆజ్ఞాపించలేదు. చంద్రహాసిని మనసులో ఆలోచనల్ని పోల్చుకున్నట్టు కొద్ది ఆందోళనగా ఆమె వైపు చూసింది విరజ. దైవ కృప వల్ల అప్పటి దాకా ఏ ఆపదా రాలేదు. విచిత్రమైన శబ్దాలూ, అరుపులూ వినపడుతూనే ఉన్నా ప్రమాదమేమీ ఎదురుపడలేదు. ఇప్పుడు నది దాటడం కష్టం. ఇంత లోతు నది దాటి ఆవలి తీరానికి వెళ్ళి ఎంత దూరం చూసి వచ్చినా, చీకటి పడే వేళ లోపు తిరిగి అడవి బయటికి వెళ్ళడం సాధ్యపడే విషయం కాదు. యువరాణి నది దాటాలని కోరుకోకూడదని దైవాన్ని ప్రార్థిస్తూ కూర్చుందామె.

రుద్రనేత్రుడు అక్కడే కాలినడకన తీరం వెంట నడుస్తూ ఆవలి తీరాన్ని తేలిగ్గా దాటగల దారేమైనా కనపడుతుందేమో అని చూస్తున్నాడు. అతనికి తెలుసు ఇంతవరకూ వచ్చాక యువరాణి తప్పకుండా నది దాటాలనే ఆజ్ఞాపిస్తుందని. ఈ సాహసం అతనికీ చాలా ఆనందంగానే ఉంది. తన బలపరాక్రమాలు నిరూపణ అవుతాయి. అందరూ అనుకున్నంత ప్రమాదకారిగా ఈ అరణ్యం కనపడటంలేదు. ఎందుచేత ఆ ప్రచారం జరిగిందో. ఇదివరలో ఇక్కడికి వచ్చిన భటులు కూడా ఇంత దూరమైనా రాకుండా అరణ్యం మొదట్లోనే అందరూ మృత్యువాత పడ్డారు. అదీ భయంకరమైన మృగాలేవో చంపేశాయని చెప్పుకున్నారు. అప్పుడు ఆ మృగాలు ఆ ప్రదేశంలో తచ్చాడుతూ ఉండి ఉంటాయి. ఇప్పుడు ఇంతమంది కలిసి వచ్చేసరికి ఏ అడవి మధ్యకో పారిపోయి ఉంటాయి. ఒకవేళ ఏ మృగమైనా అకస్మాత్తుగా వచ్చినా, తామందరి వద్దా విషపూరితమైన బాణాలున్నాయి. కొట్టి చంపెయ్యచ్చు. ఇలా ఆలోచిస్తూ, పరిసరాల్ని గమనిస్తూ అతను ముందుకి పోతూ ఉండగానే భయంకరమైన ఆక్రందన అతని చెవులకి వినపడింది. ఉలిక్కిపడి మెరుపులా తన కరవాలాన్ని ఎత్తి పట్టుకుని వెనక్కితిరిగాడు రుద్రనేత్రుడు.

అల్లంత దూరాన తన సైన్యం బాణాలతో కరవాలాలతో చెల్లా చెదురుగా ఒకే దిక్కువైపు పరుగులు పెడుతూ కనిపించారు.

భయంకరంగా గర్జిస్తూ విషపు బాణాలు వదులుతున్నారు ఆ దిక్కు వైపు. అమితాశ్చర్యంతో వారంతా బాణాలు వేస్తున్న దిక్కు కేసి చూశాడు రుద్రనేత్రుడు. ఎత్తుగా పెరిగిన గుబురు పొదలు విపరీతంగా కదిలిపోవడం తప్ప మరింకేది అతని కళ్ళకి కనిపించలేదు. పరుగు పరుగున తన సేనను చేరాడతను.

“ఏవో భయంకరమైన మృగాలు మన భటుల్లో నలుగురిని నోట కరుచుకుని మెరుపు వేగంతో మాయమయ్యాయి రుద్రనేత్రుల వారూ” భయాందోళనలతో చెబుతున్న భటుల్ని విస్తుపోతూ చూశాడు రుద్రనేత్రుడు.

“ఏ మృగాలు? పులులా, సింహాలా?” గర్జిస్తూ అడిగాడు.

“తెలియదు ప్రభూ. ఈ పొదల మాటు నుంచి చడీ చప్పుడూ లేకుండా మెరుపు వేగంతో వచ్చాయి. వెనుకగా నిలబడ్డ భటుల్ని నోట కరుచుకుని అందరూ చూసేంతలో తిరిగి పొదల్లో దూరి మాయమయ్యాయి. పులి ముఖంలాగే ఉన్నా చాలా పెద్ద శరీరంతో భయంకరమైన కోరలతో పులులకన్నా నాలుగురెట్లు ఎత్తుగా ఉన్నట్టుగా ఉన్నాయి. మిగతా శరీరం కూడా చాలా బలంగా చిత్రంగా ఉంది. అంత జాగరూకతతో చెవులు రిక్కించి వింటున్న మన చెవుల్నే మోసం చేసేంత నిశ్శబ్దంగా అవెలా వచ్చాయో తెలియటం లేదు స్వామీ. పొదల్లో దూరగలిగినంత మేర వెంబడించాము, బాణాలు వేశాం. కానీ ఎక్కడా ఆ మృగాలు గాయపడిన జాడలు లేవు” బాణాలు వేసి వెనుతిరిగి వచ్చిన భటుడొకడు ఆయాసంతో రొప్పుతూ చెప్పాడు.

అక్కడే ఉన్న చంద్రహాసిని వారిని కాపాడలేకపోయిన నిస్సహాయతతో, క్రోధంతో, తన వల్ల వారు మరణించారన్న బాధతో ఆ భటుడి వంక చూస్తూ ఆవేశంతో ఊగిపోయింది.

రుద్రనేత్రుడు చంద్రహాసిని వంక చూశాడు. ఆమె మౌనంగా నదివైపు చూసింది.

“ఆలోచించడానికి ఇది సమయం కాదు యువరాణీ. ఈ నది దాటితే మరెన్ని ప్రమాదాలు, ఎన్ని భయంకర మృగాలు ఉన్నాయో ఎవరికెరుక? మీరు చూడాలనుకున్న ప్రదేశం ఇటువైపే ఉందా అన్న విషయం కూడా మనకి తెలియదు. ఇలా ఒక్కొక్కరమే ప్రాణాలు పోగొట్టుకుంటూ ఏం సాధిస్తాం? నిర్ణయం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీ ప్రియసఖిగా మీ క్షేమం కోరి చెబుతున్నాను. ఇకనైనా చూసిన దానితో తృప్తి పడండి” కన్నీరు చిందుతుండగా అంది విరజ.

చంద్రహాసిని హృదయం బాధతో బరువెక్కింది. ఆమె ధరించిన ధనుర్బాణాలు, దుస్తుల్లో దాచుకున్న పిడి బాకులూ, కరవాలం, అన్నిటికీ మించి తన ధైర్యసాహసాలూ ఏవీ ఆ భటుల్ని కాపాడలేకపోయాయి.

తనవైపే ఆనతి కోసం చూస్తున్న రుద్రనేత్రుడి వైపు చూసిందామె. “వెనుతిరగండి. వెళ్ళిపోదాం. ఇక ఏం జరిగినా ఏ శబ్దం వచ్చినా ఎవరూ అశ్వాన్ని దిగవద్దు. వచ్చిన దారిలోనే వీలైనంత వేగంగా అశ్వాల్ని పరుగెత్తించండి. మరోసారి చెబుతున్నాను. ఏం జరిగినా, అశ్వాలు దిగొద్దు. మనమంతా అరణ్యం బయటికి అతి వేగంగా చేరుకోవాల్సిందే. ఇది నా ఆజ్ఞ” ఆఖరిమాట గంభీరంగా అంటున్న చెలి వంక అనుమానంగా చూసింది విరజ.

యువరాణి ఆజ్ఞాపించిందే తడవుగా అంతా మెరుపు వేగంతో అశ్వాల్ని అధిరోహించారు. ముందులాగే ఎదర భటులు కత్తులు చేత పట్టుకుని అశ్వాలతో సిధ్ధపడితే మధ్యలో చంద్రహాసినీ, విరజలు అశ్వాలపై ఉన్నారు.

వెనుక మరో తొమ్మిది మంది భటులు సాయుధులై సిధ్ధంగా ఉన్నారు.

అశ్వాల్ని ముందుకి ఉరికించి పది అడుగులు పరుగెట్టాయో లేదో మెరుపువేగంతో ఆలోచించింది చంద్రహాసిని. ఎందుకో ఇంత భయంకరమైన ప్రమాదం కళ్ళముందు జరిగినా, ఆమెకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. తన ఈ నిర్ణయం ఎవరికీ ఆమోదయోగ్యంగా ఉండదు. అడవి లోపల ఏదో ఉంది. తన ప్రాణాన్ని పట్టిలాగుతున్న విషయం ఏదో ఉంది. ఖచ్చితంగా ఇది సాహసం చెయ్యాలన్న కాంక్ష అయితే కాదు. వేరే ఏదో. తెలుస్తోంది తన అంతరాత్మకి. ఏదో శక్తి ఉంది. ఇప్పుడు వెనక్కి వెళిపోతే ఇక మళ్ళీ ఈ అడవిలో ప్రవేశించడానికి ఎవరూ ఒప్పుకోరు. తన కోరిక తీరడం కోసం ఈ అమాయక భటుల ప్రాణాల్ని పోగొట్టడం తనకి న్యాయం కాదు.

ఆలోచించినంత వేగంగా నిర్ణయం తీసేసుకుని అశ్వాన్ని పక్కకి తిప్పి నది వైపు తిరిగిపోయింది యువరాణి. ఊహించని ఈ పరిణామానికి ఖిన్నురాలైపోయిన విరజ ‘యువరాణీ’ అని గావుకేక పెట్టడంతో, వీరికి ముందు వరుసల్లో వెళుతున్న రుద్రనేత్రుడూ, వెనుకగా వెళుతున్న మిగతా భటులూ అశ్వాల్ని ఆపేసి వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే యువరాణి నదీ తీరాన్ని సమీపించింది.

రుద్రనేత్రుడూ, యువరాణి వెనుకగా వస్తున్న భటులూ భయాందోళనలతో స్పందించేలోపే మరో ప్రమాదం చోటు చేసుకుంది. మరో దిక్కునుండి అవే భయంకరమైన వింత మృగాలు వెనుక వరుసలో ఉన్న భటుల్ని, రెండు అశ్వాల్నీ కూడా నోట కరుచుకుని మెరుపు వేగంతో పొదల మాటుకి వెళ్ళి మాయమైపోయాయి.

“అవి భయంకరమైన పెద్ద పులుల్లాగే ఉన్నాయి ప్రభూ” భయంతో అరిచారు మిగతా సైనికులు. “పెద్ద పులులకంటే చాలా ఎత్తుగా బలంగా ఉన్నాయి ప్రభూ” అన్నారు మరికొందరు.

ఎవరూ ఆగలేదు. అందరూ భయంతో అశ్వాల్ని తిరుగుప్రయాణం వైపే పరుగెత్తించారు.

వారంతా విరజతో సహా తనకు కనపడినంత మేర క్షేమంగా వెళ్ళాక నిట్టూరుస్తూ అశ్వాన్ని నది వైపు తిప్పాడు రుద్రనేత్రుడు.

అప్పటికే చంద్రహాసిని వేగవంతమైన నదీ జలాల్లోనే సుశిక్షితమైన అశ్వాన్ని ఎదురీదిస్తోంది. నదీ ప్రవాహాం ఉధృతంగా ఉన్నా, ఆ మేలు జాతి అశ్వం తన శాయశక్తులా నది దాటే ప్రయత్నం చేస్తోంది. చంద్రహాసిని ధృఢనిశ్చితలా తీక్షణంగా ఆవలి తీరం వైపు చూస్తూ గుర్రపు కళ్ళాన్ని ఒడుపుగా పట్టుకుంది.

ఆమెనలా చూస్తున్న రుద్రనేత్రుడు దిగులుగా నిట్టూర్చాడు. ఇంత ప్రమాదాలు ఎదురైనా యువరాణి కెందుకంత పట్టుదల. ఏం చూస్తుంది ఈ ప్రమాదాల్లోకి వెళ్ళి. తను యువరాణికి అంగరక్షకుడిగా వచ్చినవాడు. ఉత్త చేతులతో రాజధానికి తిరిగి వెళ్ళలేడు. ఏదేమైనా, ఆమెని ప్రాణాలతో ఆమె తల్లితండ్రుల వద్దకి చేర్చడమే తన బాధ్యత.

ధృఢంగా నిశ్చయించుకుని, తన అశ్వాన్ని నదిలోకి ఉరికించాడు. యువరాణి అశ్వానికి ఏమాత్రమూ తీసిపోని ఈ అశ్వం కూడా ఎదురుగా యువరాణితో ధైర్యంగా నదిని ఈదుతున్న తన తోటి అశ్వాన్ని చూసి ఉత్సాహం పొందినట్టుగా పెద్దగా సకిలిస్తూ ముందుకు దూకింది.

యువరాణి అశ్వం అప్పటికే నది వెడల్పుని సగం పైగా దాటగలిగింది. అశ్వాన్ని జాగ్రత్తగా నడిపించడంలోనూ, నీటి ప్రవాహపు శబ్దంలోనూ యువరాణి వెనుక వస్తున్న రుద్రనేత్రుడిని గమనించలేదు.

చాలా గొప్పగా శిక్షణ పొందినట్టుగా యువరాణి అశ్వం నదిని తేలిగ్గా దాటేసింది. దాదాపుగా తడిసిపోవడంతో ఒడ్డుకి చేరుతూనే తడిసిన బట్టల్ని దులుపుతూ అశ్వాన్ని ముచ్చటగా నిమురుతూ అలవోకగా నదివైపు చూసిన చంద్రహాసినికి నది మధ్యలో అశ్వాన్ని నియంత్రించలేకపోతున్న రుద్రనేత్రుడు కనిపించి అత్యంత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూండిపోయింది.

దాదాపుగా తీరం దగ్గరకు వచ్చేశాడనుకున్న రుద్రనేత్రుడు అకస్మాత్తుగా అశ్వం ఎందుచేతనో నీటిలో అదుపు తప్పినట్టు పల్టీకొట్టడంతో తనూ నీటిలో పడిపోయాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here