Site icon Sanchika

స్నిగ్ధమధుసూదనం-12

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 12వ భాగం. [/box]

[dropcap]ఆ[/dropcap]లోచిస్తూ మౌనంగా కూర్చుండిపోయిన భార్గవిని పిలిచాడు రఘురాం

“భార్గవీ, తేజ డిగ్రీ పూర్తిచేశాడు. మా అందరి బలవంతం మీదా ఎమ్.సి.ఏ చేశాడు. అసలు భవిష్యత్తు గురించి ఏమనుకుంటున్నాడమ్మా? ఉద్యోగం, వ్యాపారం దేని గురించీ మాట్లాడడు. అడిగినా చెప్పడు. చిరునవ్వుతో అన్నీ దాటేస్తాడు. ఎంతసేపూ ఆ పెయింటింగ్స్ చూసుకుంటూ గడుపుతాడు. పోనీ, వీడు ఏమైనా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అవుతాడా అంటే వీడికి బొమ్మలు వెయ్యడం రాదు. ఎంతసేపూ తనలో తను ఏదో ఆలోచించుకుంటూ గడుపుతున్నాడు. కౌన్సిలింగ్ చేయిద్దామనుకున్నాను కానీ వినడం లేదు. నేను బాగానే ఉన్నాను మీరంతా ఎందుకు వర్రీ అవుతారు అంటున్నాడు. తేజకి నీకంటే దగ్గర స్నేహితులు ఎవరూ లేరమ్మా. వాడి విషయాలన్నీ నీకు తెలుసు. నువ్వు అడిగినా చెబుతాడని మా నమ్మకం. ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు ఇలా ఉంటాడో, అసలే ఆలోచన మీదున్నాడో కనుక్కోమ్మా.”

తన ముఖంలోకి చూస్తూ అర్థింపుగా అంటున్న రఘురాం వైపు మాటలు రానట్టుగా చూసింది భార్గవి. తేజ గురించి ఇటువంటి భయం వాళ్ళకి ఉంటుందని తను ఊహించగలదు కానీ, తననే ఇలా అడుగుతారని ఊహించలేదామె. తేజ తన హృదయానికి సంబంధించిన విషయాలు ఎవరితోనూ పంచుకోడు. ముఖ్యంగా పెద్దవాళ్ళతో. తను కూడా అతని మనసు తెలిసినది కాబట్టి కొన్ని విషయాలు గుచి గుచ్చి అడిగితేనే చెబుతాడు. తన జీవితపు సమస్యేమిటో అది తెలుసుకుని, తను అనుకున్నదేమిటో సాధించేవరకూ తేజ ఉద్యోగం, వ్యాపారం అంటూ దేని గురించీ ఆలోచించడు. అది తనకు బాగా తెలుసు.

“మాట్లాడవేం భార్గవీ?” సుమిత్ర భార్గవి భుజం మీద చెయ్యేస్తూ అంది.

“మా అందరికీ నిజంగా వాడి గురించి ఆందోళనగా ఉందమ్మా. మంచి పిల్లాడు. ఈ చదువు కూడా మా అందరి కోసం చదివాడని మాకు తెలుసు. అయిష్టంగా చదివినా మంచి మార్కులతోనే పాసయ్యాడు. చదువు పూర్తయ్యి ఏడాది కావొస్తోంది. ఇంకా అతనిలో ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యాలని ఎటువంటి తొందరా లేదు చూడు” అంది మళ్ళీ తనే.

“ఆంటీ. తేజ ఎప్పటికైనా గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు. వాడి బెస్ట్ ఫ్రెండ్‌గా నేనిది చెప్పట్లేదు. చిన్నప్పటినుంచీ తనకి దగ్గరగా మసలుతున్నదానిగా తన గురించి తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఏదో అడ్డుపడుతోంది తనకి. ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఇన్నేళ్ళకి ఒక బొమ్మ వెయ్యగలిగాడు. ఇక ఆగడు. తప్పకుండా మీరంతా ఆశ్చర్యపోయే విధంగా అతను చిత్రాలు గీస్తాడు. నాకు తెలిసి అసలు తనకి ఉద్యోగం గురించి ఆలోచనే లేదు. ఎవరైనా పిలిచి ఉద్యోగం ఇచ్చినా, తను చెయ్యలేడు కూడా.”

నిజాయితీగా చుబుతున్న భార్గవి వంక చూస్తూ రఘురాం విసుగూ, కోపమూ కలిసిన ఒక బాధతో ఏమీ చెప్పకుండానే తన డ్రెస్ వేసుకుని కారు తాళాలు తీసుకుని బయటికి వెళిపోయాడు.

రఘురాం తేజకి సహాయపడతాడేమో అని అతని వైపు ఆశగా చూసిన భార్గవి నిట్టూరుస్తూ తలదించుకుంది. సుమిత్ర కూడా మరేమీ మాట్లాడలేనట్టు టేబుల్ సర్దేసి, సోఫాలో కూర్చుని టి.వీ పెట్టుకుంది.

అప్పటికే తను కిందకి దిగొచ్చి గంట పైనే కావడంతో భార్గవి తేజ గదిలోకి వెళ్ళడానికి సిధ్ధపడింది.

తేజ గదిని సమీపిస్తూనే భార్గవికి మూలుగు వినపడటంతో, పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిన ఆమెకి రెండు చేతులతోనూ తలని పట్టుకుని కింద మోకాళ్ళమీద కూర్చుండిపోయి మెలికలు తిరిగిపోతున్న తేజ కనపడ్డాడు. అతన్నలా చూసిన భార్గవికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

“తేజా, ఏమయింది” ఒక్కసారిగా అతని ముందు కూలబడి తేజ ముఖాన్ని ఎత్తాలని ప్రయత్నించింది కానీ, ఆమెకు సాధ్యం కాలేదు.

తేజ తన మాటలు వినిపించుకునే పరిస్థితిలో లేడని తెలుసుకుని “ఆంటీ ఆంటీ” అంటూ సుమిత్రని పిలిచింది. భార్గవి అరుపులు విని కంగారుగా పరుగెత్తుకొచ్చిన సుమిత్ర తేజని అలా చూసేసరికి భయపడిపోయింది. ఎప్పుడూ తలనొప్పి వచ్చిందని కూడా చెప్పని తేజ అకస్మాత్తుగా అలా గిలగిలలాడిపోతుంటే ఏం చెయ్యాలో తెలీక వెంటనే భర్తకి ఫోన్ చేసింది.

***

పచ్చని చిక్కని ఆ అడవి ప్రదేశమంతా ఏదో తెలీని ఉల్లాసంతో నిండిపోయినట్టు పక్షుల పాటలు తియ్యగా వినిపిస్తున్నాయ్. గాలితో పాటుగా ఏదో అడవిపూల పరిమళం ముక్కుపుటాల్ని తాకుతూ మనసుని మరింత ఉత్తేజపరుస్తోంది. ఎత్తుగా పెరిగి గొడుగులా గుబురుగా ఉండి ఆకాశం కనపడకుండా కప్పేసిన చెట్ల కొమ్మల సందుల్లోంచి నేల మీద పడుతున్న సూర్యకిరణాలు ఎవరో పారేసుకున్న వెండి నాణేల్లా మెరుస్తున్నాయ్.

హృదయ వీణ ఏదో కొత్త రాగాన్ని పాడుతున్నట్టనిపించి ఆ స్పందన వింటూ ముందుకి నడుస్తోంది చంద్రహాసిని.

“యువరాణీ, ఈ ప్రదేశం ఎందుకో గానీ, సురక్షితమైనదిగా అనిపించడం లేదూ? ఘడియ కాలంగా నడుస్తున్నాం. ఇంతవరకూ ఏ భయంకర శబ్దాలూ వినపడలేదు. గమనించారా?” ఉత్సాహంగా అన్నాడు ఆమెని అనుసరిస్తున్న రుద్రనేత్రుడు.

“అవును రుద్రనేత్రా. మీరు చెప్పేవరకూ మనం ఓ ప్రమాదకరమైన అడవిలో అడుగులేస్తున్నామన్న స్పృహ కూడా లేదు నాకు. ఎంతో హాయిగా ఉందీ ప్రదేశం. ఉదయం నుంచీ చేసిన ప్రయాణపు అలసట కూడా తెలీటం లేదు కదూ.”

అవునన్నట్టుగా తలూపాడు రుద్రనేత్రుడు. క్షణం తరువాత మళ్ళీ అన్నాడు “యువరాణీ, ఆశ్వాల్ని పెట్టుకుని ఎందుకీ నడక? ఆశ్వాల మీదే వెళితే మరిన్ని ప్రదేశాల్లో తిరగవచ్చు కదా చీకటిపడే లోపులో.”

అతని మాటకి నడక ఆపి అతని వైపు చూస్తూ కలువల్లాంటి తన కళ్ళని చిత్రంగా ఆడించింది చంద్రహాసిని. “అవును రుద్రనేత్రా. ఏదో తెలీని తన్మయత్వంలో పడి అశ్వాన్ని నా చేత్తో నేనే నడిపిస్తూ కూడా ఎందుకో అధిరోహించాలన్న ఆలోచన కూడా చేయలేకపోయాను. పదండి. వేగంగానే విహారం చేద్దాం” అన్నది నవ్వుతూ.

ఆమె అలా చెప్పిన మరుక్షణమే ఇద్దరూ అశ్వాలమీద వేగంగా ముందుకు సాగారు. చిత్రంగా ముందుకు వెళ్ళేకొద్దీ దారంతా అందమైన పూల తీగలతోనూ, పెద్ద పెద్ద పూలూ, తియ్యటి వాసనలు వెదజల్లుతున్న పళ్ళూ నిండి ఉన్న వృక్షాలతోనూ మనోహరంగా ఉంది. దారిలో అక్కడక్కడా కనిపిస్తున్న అందమైన జింకల్నీ, నెమళ్ళనీ, కుందేళ్ళనీ చూస్తూ ఆనందంగా ముందుకు సాగుతోంది యువరాణి.

‘ఎటు పోతున్నామో, ఏమైపోతామో’ అని ఏ మూలో అప్పటిదాకా ఉన్న సందేహం కాస్తా తీరిపోయింది రుద్రనేత్రుడికి. ఎందుకో ఈ అరణ్య ప్రదేశంలో ఏ ఆపదా రాదని గట్టి నమ్మకం కలుగుతోంది. బహుశా పూర్వీకులు చెప్పిన ఆ ఆరోగ్యాలనిచ్చే మహిమగల మూలికలూ, సరస్సూ ఉండే ప్రదేశం ఇక్కడికి దగ్గరలోనే ఎక్కడో ఉండి ఉండవచ్చు.

అతను ఈ ఆలోచనల్లో ఉండగానే యువరాణి చంద్రహాసిని కూడా సరిగ్గా ఈ మాటే అంది రుద్రనేత్రుడితో.

“రుద్రనేత్రా. పూర్వీకులు చెప్పేవారని విన్నాను. ఈ అడవి మధ్యలో ఓ అద్భుతమైన ప్రదేశం గురించి. ఎటువంటి అనారోగ్యాన్నైనా పోగొట్టే విలువైన మూలికలూ, శరీర ధారుఢ్యాన్ని పెంచి , రోగాల్ని నాశనం చేసే శక్తి ఉన్న నీరు ఉందని భావించే ఆ సరస్సూ బహుశా ఇక్కడికి దగ్గరలోనే ఉన్నవేమో కదూ. ఆ మూలికా ప్రభావం చేతనో ఏమో, ఇక్కడే క్రూర జంతువులూ తిరగాడటం లేదు అనిపిస్తోంది. మనసూ, శరీరం కూడా ఆశ్చర్యంగా ఎంతో శక్తివంతంగా , ఉల్లాసంగా లేవూ? బహుశా ఆ మూలికల గాలి మనం శ్వాసించడం వల్ల కావొచ్చు కదూ.”

చుట్టూ చూస్తూనే తన మనసులోని మాటల్ని బయటికి చెప్పిన యువరాణి వంక అంగీకారంగా చూస్తూ “అవును యువరాణీ, నాకూ అలాగే అనిపిస్తోంది. కానీ, మనం సరిగ్గా ఆ ప్రదేశం ఏ దిక్కులో ఉందో అటే వెడుతున్నామా? మరికొద్ది సేపట్లో చీకటి పడుతుంది. ఈ లోపుగా మనం ఓ సురక్షిత ప్రదేశం చేరుకోవాలి కదూ” అన్నాడు.

చంద్రహాసిని చిన్నగా నవ్వి “ఈ పరిమళ భరితమైన గాలి ఎటు తీసుకువెళుతోందో అటే మనం మన ఆశ్వాల్ని పోనిస్తున్నాం రుద్రనేత్రా. సందేహం వద్దు. ప్రతికూలమైన, నిరాశాపూరిత ఆలోచనలు అసలే వద్దు. ఏమీ కాదు. మనం క్షేమంగా ఆ ప్రదేశాన్ని చేరుకుంటాం” అంది.

యువరాణీ ధైర్యం గురించి తెలీసీ తను అలా మాట్లాడినందుకు సిగ్గుపడ్డాడు రుద్రనేత్రుడు.

ముందుకు వెళ్ళే కొద్దీ దారి మరింత సుందరంగా మారడం ఇరువురూ గమనించారు. అద్భుతమైన రంగుల్లో పూలతో నిండిపోయి ఉన్న చెట్లూ, మొక్కలూ కనిపించాయి. ఎక్కడినుంచో లీలగా జలపాత శబ్దం వినిపిస్తోంది. అది వింటూనే ఎందుకో తాము ఆ ఔషధ స్థలానికి చేరుకుంటున్నామని నమ్మకం కలిగింది. ఆ నమ్మకం కలిగాక ఎక్కడలేని శక్తీ వచ్చింది ఇద్దరికీ. ఆశ్వాలు కూడా ఉత్సాహంగా ఉరకలేస్తుంటే ఆనందంగా ముందుకు సాగారు వారిరువురూ.

మరి రెండు క్రోసుల దూరం ప్రయాణించేసరికి కనుచూపు మేరలో అందమైన జలపాతం అతి ఎత్తైన కొండ మీదనుంచి సరస్సులోకి వయ్యారంగా జారుతూ కనిపించేసరికి ప్రాణం ఒక్కసారి శక్తి నిండిపోయినట్టు అనిపించింది.

ఆ సరస్సు చుట్టూ, పచ్చటి రంగులో గడ్డి చల్ల గాలికి తలలూపుతూ స్వాగతిస్తున్నట్టుగా ఉంది. సరస్సు మధ్యలో అక్కడక్కడ పసుపు పచ్చని కలువ మొగలు ఉన్నాయ్.

అశ్వాల్ని అక్కడే ఆపి ఇద్దరూ కిందకి దిగి అబ్బురంగా ఆ ప్రదేశాన్ని చూశారు. అశ్వాలు రెండూ ఆ పచ్చగడ్డి చూస్తూనే ఉత్సాహంగా ముందుకి వెళ్ళాయి ఆకలి తీర్చుకోవడానికి.

ఆ జలపాతం జారుతున్న కొండ చాలా పెద్దది. ఇంతవరకూ ప్రయాణంలో దారంతా పెద్ద పెద్ద వృక్షాలు ఆకాశాన్ని కూడా కనపడనివ్వకుండా పెరిగి ఉండటం వల్ల దగ్గరికి వచ్చినా కూడా ఇక్కడొక కొండ ఉంది అన్న సంగతి వారికి తెలియలేదు.

అబ్బురంగా ఆ ప్రదేశాన్ని చూస్తూ పరిసరాలు గమనిస్తూ చాలా సేపు ఉండిపోయారు వాళ్ళు. ఆ సరోవరం ఎదురుగా పచ్చగడ్డి మొలిచి ఉన్న స్థలమంతా ఎంతో విశాలంగా ఉంది. పెద్ద వైశాల్యం తరువాత చుట్టూ రకరకాల పూలు విరిసిన మొక్కలు, వాటికి ఆవల ఏవేవో పళ్ళతో నిండుగా ఉన్న చెట్లు ఉన్నాయి. బాగా పండి ఉన్న ఆ పళ్ళ చెట్లని చూడగానే రుద్రనేత్రుడికీ, చంద్రహాసినికీ ఆకలి గుర్తుకువచ్చింది.

చంద్రహాసిని ఉద్దేశ్యం కూడా గమనించిన రుద్రనేత్రుడు తనే ముందుగా ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి కొన్ని పండ్లని కోసుకుని వచ్చాడు. వాటిని సరస్సు నీటిలో శుభ్రంగా కడిగి ఒక తామరాకు కోసి దాంట్లో పెట్టి చంద్రహాసిని దగ్గరికి తీసుకొచ్చారు. ఇద్దరూ అక్కడే గడ్డిలో కూర్చున్నాక చంద్రహాసిని ఒక ఫలాన్ని తీసుకోబోయింది.

“ఆ.. ఆగండి యువరాణీ. ఇవేమి ఫలాలో పేరు కూడా తెలియవు. మంచిదో కాదో ముందు నన్ను తిననివ్వండి” అన్నాడు రుద్రనేత్రుడు ఆమెని వారిస్తూ.

(సశేషం)

Exit mobile version