స్నిగ్ధమధుసూదనం-13

0
2

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 13వ భాగం. [/box]

[dropcap]చం[/dropcap]ద్రహాసిని నవ్వింది.

ఒక పండు పూర్తిగా తిన్నాడతను. రెండు క్షణాల కాలం గడిచాక అన్నాడు. “చాలా మధురంగా ఉంది. ఏదేమైనా నాలో ప్రాణం ఉన్నంతవరకూ, మిమ్మల్ని కంటి రెప్పలా కాపాడటమే నా బాధ్యత కదా” అంటూ కొన్ని ఫలాల్ని ఆమెకు అందించాడు.

యువరాణి కూడా ఆ ఫలాన్ని ఆనందంగా ఆరగించింది. ఆ తరువాత ఆ సరస్సులో నీరు తాగి ఇద్దరూ విశ్రమించారు ఆ పచ్చని గడ్డిలోనే. నది నీటిలో శాయశక్తుల్నీ ఉపయోగించి ఎదురీదడం వల్ల రుద్రనేత్రుడికి తెలియకుండానే నిద్ర పట్టేసింది.

చంద్రహాసిని ఎంత అలసిపోయినా ఆమెకు నిద్ర రాలేదు. ఏదో రహస్య సంగీతం ఆమె హృదయం వింటున్న అనుభూతి కలుగుతోందామెకు. ఎంతో తెలివైన ఆమెకు ఎంత ఆలోచించినా కారణం అర్థం కావడం లేదు. ఈ ప్రదేశంలో ప్రవేశిస్తూనే ఆమె ఓ అలౌకిక అనుభూతికి లోనయింది. ఆమె హృదయ స్పందన తీయగా మారిపోయిన భావన కలిగింది. అది కేవలం ఈ పరిసరాల సౌందర్యం వల్ల వచ్చినదిగా అనిపించలేదు ఆమెకి. ఏదో రహస్యం ఉందనిపిస్తోంది. తన ప్రాణాన్ని పట్టి లాగుతున్నదేమిటి? ఇక్కడేముంది? పూర్వీకులు చెప్పుకుంటున్న ప్రదేశం ఇదే అనిపిస్తోంది. చూశారు. అనుభూతించారు. ఇక మెల్లగా తెల్లవారాక ఇక్కడి మొక్కలు పరిశీలించి వేటిలో ఔషధ గుణాలున్నాయో ఏమైనా తెలుసుకోగలిగితే కొన్ని మొక్కల్ని వెంట తీసుకువెళ్ళచ్చు. అంతకంటే ఇక్కడ తను ఏమి చెయ్యగలదు? అయినా ఎందుకు తన మనసేవిటో కొత్త పాటని వింటోంది. కొత్తగా స్పందిస్తోంది. వేచి చూడాల్సిందే ఎం జరుగుతుందో.

చంద్రహాసిని ఆలోచనల్లో ఉండగానే చీకటి ముసురుకుంది మెల్లగా.

అసలు అది అడవి ప్రదేశమన్న ఆలోచన కూడా రానంతగా నిశ్శబ్దమైపోయింది. అనుకున్నట్టుగా ఏ మృగాల అరుపులూ వినిపించడం లేదు. చలి గాలికి సన్నగా కదులుతున్న అలల సవ్వడి తప్ప ఇంకేమీ లేదు.

***

తలలో నరాలన్నీ మెలికపడిపోతున్నంత బాధ. ఎక్కడో ఏదో జ్ఞాపకం లాగా. ఎన్నో అద్భుతమైన రాధాకృష్ణుల చిత్రాల మధ్య తను మరో అద్భుతమైన చిత్రాన్ని గీస్తున్నట్టుగా ఎందుకు అనిపిస్తోంది? తనింతవరకూ కాగితం పైన కూడా చిన్న బొమ్మ కూడా వెయ్యలేకపోయాడు. ఎప్పుడైనా అలా కల వచ్చి అది అలా తన మెదడులో నిక్షిప్తమైపోయి ఉంటుందా? కానీ, ఆ అలోచన వస్తూనే అది కలలా అనిపించదు. తనేదో చాలా చాలా నేర్పుతో, అన్నిటికీ మించి ప్రాణం పెట్టేంత అభిరుచుతో గీసినట్టుగా అనిపిస్తుందెందుకు. ఇప్పుడు ప్రయత్నిస్తే మళ్ళీ చెయ్యి కదలడం లేదు. ఎందుకిలా అవుతోంది తనకు. చిత్రకళలో ఆరితేరాలని, పేరు తెచ్చుకోవాలనీ కాదు. తన మెదడులో, తన అంతర్నేత్రంలో మెదిలే ఆ మహా సౌందర్యాన్నంతా కాన్వాసుపై పెట్టాలి. అప్పుడు కానీ, తన మనసు కుదుట పడదు. అలా అని తన అంతర్నేత్రంలో చిత్రాలు కూడా అన్నీ స్పష్టంగా లేవు.

కళ్ళు తెరవలేకపోతున్నాడు. బాధ … తలంతా బాధ.

“తేజా… ఏమైందిరా…”

ఆందోళనగా అడుగుతూ అప్పుడే లోపలికి వచ్చిన రఘురాం తేజ పరిస్థితి చూసి పరుగున అతన్ని సమీపించాడు.

బాబాయి ప్రశ్నకి సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా తేజ లేడు. కన్నీళ్ళతో అతన్ని పట్టుకుని ఉంది సుమిత్ర. భార్గవి ఆందోళనగా పక్కకి జరిగింది రఘురాం కూర్చోవడానికి స్థలం చూపిస్తూ.

“అసలేమయింది?” సుమిత్ర ముఖంలోకి చూశాడు.

“పెయింటింగ్ వేసుకుంటాడని, తనని భంగపరచకూడదని నేను మీరు భోజనాలు చేసేటప్పుడు కిందకి వచ్చేశాను అంకుల్. మీరు మళ్ళీ క్లినిక్‌కి బయలుదేరి వెళిపోగానే, తేజ గదిలోకి వచ్చాను. చూసేసరికి ఇలా తల పట్టుకుని మెలికలు తిరిగిపోతూ కనిపించాడు. అసలేమడిగినా నోరు విప్పి చెప్పడం లేదు. మీరు ఎంతో దూరం వెళ్ళి ఉండరని ఆంటీ మీకు వెంటనే ఫోన్ చేశారు” తనే తేజ పరిస్థితి వివరించింది భార్గవి.

రఘురాం ఇంటికి వచ్చేటప్పటికి తేజని సుమిత్రా, భార్గవీ, వాచ్‌మాన్ సాయంతో మంచం పైన పడుకోబెట్టగలిగారు. అయినా పడుకునే రెండు చేతులతో తలని పట్టుకుని గిలగిలలాడుతున్నాడు తేజ.

“ఇంతవరకూ తేజకి ఎప్పుడూ ఏ నొప్పీ రాలేదు కదండీ. నాకు భయంగా ఉంది. ఉన్నట్టుండి ఏమిటిది?” ఆత్రుతగా అడుగుతున్న సుమిత్రని వారిస్తూ తేజ చేతుల్ని మెల్లగా తియ్యడానికి ప్రయత్నించాడు రఘురాం. తేజ బి.పి చూశాడు.

అతను విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి వెంటనే తన గదిలోకి వెళ్ళి కావలసిన మందు తెచ్చాడు. ముందు అతని మెదడు నెమ్మదించడానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. అది ఇచ్చిన పది నిముషాల్లో తేజ మెలికలు తిరగడం ఆపి తనకు తెలీకుండానే గాఢ నిద్రలోకి జారుకున్నాడు.

తేజ ప్రశాంతంగా నిద్రపోవడం చూశాక సుమిత్రా, భార్గవీ నెమ్మదిగా ఊపిరి తీసుకున్నారు. రఘురాం అందర్నీ గదిలోంచి బయటికి రమ్మన్నట్టు సైగ చేశాడు. తేజ గది తలుపు తెరిచే ఉంచి అందరూ బయటికి నడిచారు.

“భార్గవీ, చెప్పమ్మా. అసలేమయింది. తనకు చేతకాని పని కోసం ఎందుకు వాడు తిరిగి తిరిగి ప్రయత్నించి అంత బాధపడిపోతున్నాడు? బొమ్మలు వెయ్యడం రాదులే అని వదిలెయ్యకుండా ఇలా తనని తనే శిక్షించుకుంటున్నాడు?” కోపాన్ని ఆణుచుకుంటూ అడిగాడు రఘురాం.

ఆ మాటకి భార్గవి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

“మీరు చెప్పండంకుల్. మీకు తెలుసు, తేజకి చిన్నప్పటి నుంచీ చిత్రకళ అంటే ప్రాణం అని. ఎక్కడ ఏ పెయింటింగ్ చూసినా అదీ రాధాకృష్ణుల పెయింటింగ్స్ చూస్తే తనను తాను మర్చిపోతాడని. అంతే కాదు. సిధ్ధాంతపరంగా చిత్రకళ గురించి తనకి చాలా తెలుసు. ఎన్నో పుస్తకాలు చదివాడు, తెలుసుకున్నాడు. కానీ, తను బొమ్మ వెయ్యడం ప్రారంభించాలనుకున్న ప్రతిసారీ అతని చెయ్యి కదలడం లేదు. ఇలా ఒక్కసారి కాదు వదలకుండా పెద్దయ్యేవరకూ చాలా సార్లు ప్రయత్నించాడు. చివరికి బాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదవాలనే ఆశతో అందులో చేరి, ప్రాక్టికల్‌గా బొమ్మ గియ్యాల్సి వచ్చినప్పుడు పేపర్ మీద పెన్సిల్తో గీతలైనా గియ్యలేకపోయాడంటే అతని టీచర్లు, పెద్దలైన మీరు కూడా ‘నీకు బొమ్మలు వెయ్యడం రాదు. నీకు చేతకాని పని నువ్వు చెయ్యకు’ అని బలవంతంగా తేజని వేరే కోర్సులో చేర్పించారు కానీ, అతని జీవితాశయమైన చిత్రకళ ముందు ఎందుకు తను ఒక్కఅడుగైనా ముందుకు వెయ్యలేకపోతున్నాడు అన్న విషయం ఆలోచించారా అంకుల్ ఎప్పుడైనా. మరొకరయితే కొన్ని విఫలయత్నాల తరువాత చిన్నప్పుడే వదిలేసి ఉంటారు. కానీ, తేజలో ఈ విషయంలో ఏదో ప్రత్యేకత ఉందని మీకు ఎందుకు తోచలేదు. తను మాములుగా ఎంతో ఆరోగ్యవంతుడని మీకూ తెలుసు. ఈ కళతో అంతగా లీనమైపోతున్న వ్యక్తి ఏ కారణం వల్ల విఫలమవుతున్నాడో, ఆ వింత సమస్య యొక్క మూలాల్ని తెలుసుకుందాం అని మీకెందుకు అనిపించలేదు?”

రఘురాం కళ్ళలోకి సూటిగా చూస్తూ నిలదీస్తున్నట్టుగా అడుగుతున్న భార్గవిని ఆశ్చర్యంగా చూసింది సుమిత్ర.

“మీరు న్యూరాలజిస్ట్. తేజకి మీకంటే గొప్పగా ఎవరూ సహాయపడలేరు ఈ విషయంలో. ఆ కోణంలో మీరు ఆలోచించి ఉంటే, తేజ బొమ్మలు వెయ్యడం అనేది కేవలం తనకు చేతకాని పని చేసి తీరాలనుకునే మొండి మనస్తత్వంగానే మీరు చూడకపోయి ఉంటే తేజ ఎప్పుడో ఈ సమస్యని అధిగమించి ఉండేవాడేమో అంకుల్. ఇప్పటికైనా మీరు తనకి సహాయం చెయ్యండి” అర్థిస్తున్నట్టుగా అడిగింది భార్గవి.

ఆమె చెప్పింది విన్నాక రఘురాంకి తేజ కొత్తగా కనపడ్డాడు. తన ఇంట్లో పెరుగుతున్న తమ బిడ్డగా కాక, మొదటిసారిగా ఒక సమస్యతో బాధపడుతున్న పేషంట్‌లా కనపడ్డాడు.

అలోచనల్లో పడ్డాడు రఘురాం. భార్గవి చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకు తను ఇంతవరకూ ఆ దృష్టితో తేజ సమస్యని చూడలేదు? ఎప్పుడూ పనికిరాని ఆలోచనలతో తనకి సాధ్యంకాని పనుల వెంట పడుతూ ఉన్నాడనే ఇన్నాళ్ళూ భావించేవాడు కానీ, భార్గవి చెప్పినట్టుగా ఒక్కసారైనా ఎందుకు తను ఆలోచించలేకపోయాడు? ఒక నరాల నిపుణుడైయుండీ ఎదురుగా చాలా స్పష్టంగా కనపడుతున్న సమస్యని ఎందుకు కనిపెట్టాలేకపోయాడు? నిజమే తేజ చిన్నప్పటి నుంచీ చిత్రకళ మీద ప్రేమ చూపించేవాడు. తనకి చిత్రకళంటే ఏ మాత్రం ఆసక్తి లేదు. తన ప్రపంచం వేరు. ఎంతసేపూ తనకు సంబంధించిన వైద్య వృత్తి వివరాలు, తన దగ్గరికి వచ్చే రోగులు, వారికి ఎంత సమర్థవంతంగా తను నయం చెయ్యగలిగాడు అనే విషయాలు తప్ప వేరే ఏవీ పట్టని వాడు. బహుశా అందుకేనేమో, తేజ ఎప్పుడైనా ఉత్సాహంగా తన దగ్గరకి వచ్చి ఎక్కడైనా తను చూసిన అందమైన చిత్రం గురించి మాట్లాడినా తను పెద్దగా స్పందించక తీసి పారేసేవాడు. ఆ తరువాత తేజ తన సంతోషాల్ని పంచుకోవడం మానేశాడు.

ఎటువంటి మనుషులైనా చేతికి పెన్సిల్, పేపర్ ఇచ్చి బొమ్మ గియ్యి అంటే, కనీసం పిచ్చి గీతలైనా గియ్యకపోరు. అలాంటిది చిత్రకళంటే ప్రాణ వాయువులా భావించే తేజ… గుండె అకస్మాత్తుగా వేగంగా కొట్టుకుంది రఘురాంకి.

తనెంత మూర్ఖుడు… నిజమే… ఒక చిన్న పిల్ల, అదీ కంప్యూటర్స్ చదివిన పిల్ల కనిపెట్టిన తన ఇంటి సమస్యని తను కనిపెట్టలేకపోయాడు. సిగ్గనిపించింది రఘురాంకి. జ్ఞానమున్నంత మాత్రాన అన్ని సమస్యలూ కంటికి కనపడవు. కొన్ని సమస్యల్ని మనసుతో చూడాలి. మనసుతోనే పరిష్కరించాలి. ఈ భావన కలిగాక తేజ మీద అప్పటి దాకా ఉన్న కోపమంతా మాయమై, జాలి కలిగింది రఘురాంకి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here