స్నిగ్ధమధుసూదనం-17

0
3

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 17వ భాగం. [/box]

[dropcap]“యు[/dropcap]వరాణీ, నా పేరు వజ్రనేత్రుడు. కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడే జీవించాలని నిర్ణయించుకుని వచ్చాను. ఈ అడవి, ప్రకృతి ఇక్కడే నా అంతరాత్మకి శాంతి లభిస్తుందని తెలుసుకున్నాను. అందుకే జీవితాన్ని ఈ విధంగానే గడపడానికి నిశ్చయించుకుని ఇలా వచ్చేశాను.”

అతని మాటలు విని చంద్రహాసిని కాసేపు నిజంగానే వజ్రాల్లా మెరుస్తున్న అతని విశాలమైన కన్నుల్లోకి చూస్తూ అతను తప్పకుండా రాజవంశీయుడో, ఏ దేశానికో సేనాధిపతో అయి ఉంటాడని ఊహించింది.

“యువరాణీ, గత రాత్రి మీరిక్కడికి వస్తూనే నా చిత్రాన్ని చూసి మైమరచిపోతూ పాడిన ఆ గీతం…”

“జయదేవుని అష్టపది. అదేగా మీరు ఈ రాతి మీద చిత్రించినది” అంది యువరాణి అతని ముఖంలోకి చూస్తూ.

“ఊ.. మీకు కూడా జయదేవ కవి అంటే అంత ఆరాధనా? లేకపోతే మధురమైన మీ గాత్రంతో ఆ గీతాన్ని అంత అద్భుతంగా ఆలపించడం సాధ్యం కాదు. మనసు, తనువు ఏకమైపోయినట్టు మీరే ఓ నదయినట్టు.. ఓహ్ వర్ణించలేను” అన్నాడు తల అడ్డంగా ఊపుతూ.

“చిత్రించగలరుగా..” సూటిగా చూసి నవ్వుతూ అంది యువరాణి.

ఆ మాటకి తల కొద్దిగా దించుకుంటూ చిరునవ్వు నవ్వుతున్న వజ్రనేత్రుడి వంక క్షణకాలం రెప్ప వెయ్యడం మరచిపోయి చూస్తూ ఉండిపోయింది చంద్రహాసిని.

ఇతన్ని ఏ విధంగా అంచనా వెయ్యాలి? జయదేవ కవి రచించిన గీతగోవిందం మీద తనకు గల అభిమానం ఎటువంటిదో ఎవరికైనా ఎలా వివరించగలదు? గురుకులంలో చదువుకునేటప్పుడు ఆ గ్రంథం గురువుగారు పరిచయం చేశాక తన జీవితమే మారిపోయింది. ఈ కావ్యాన్ని చదవడం, ఆ పద్యాల్ని కంఠస్థం చెయ్యడం, మధురంగా వాటిని ఆలపించడమే కాదు.. ఇంకా ఏదో చెయ్యాలనే తపన.. తనను అహర్ణిశలూ వేధించేది. అంతకు మించి ఏం చెయ్యాలో పాలుపోయేది కాదు. జనులకు అర్థమయ్యే భాషలో భాష్యాన్ని రాద్దామనుకుంది కానీ, అది కూడా తృప్తి నిచ్చేది కాదని తెలిసిపోయింది. తన చదువు పూర్తవగానే గురుకులం నుండి అంతఃపురానికి వచ్చేసింది. కానీ, ఆ గ్రంథం తనను నీడలా వెన్నంటే వచ్చిందని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. రాధాకృష్ణుల ప్రేమ, విరహం అత్యద్భుతంగా వివరించే ఆ గ్రంథమంటే ఆమెకు కృష్ణుడి మీద ఉన్నంత ఆరాధన. ఆ ప్రేమ ఓ నది అని ఆమె అభిప్రాయం. ఆ నది ఆ గ్రంథంలోనే బంధింపబడి ఉంది. ఆ నదీ జలం లోకాన్ని తడపాలి. లోకమంతా ఆ ప్రేమ జలాల్లో మునిగి తేలాలి. ఆకాశమంత ఆనందాన్ని అందరూ పొందాలి. ఇలా ఉండేవి తన ఆలోచనలు. కానీ అందుకు ఏం చెయ్యాలో ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు.

బహుశా తన తపనకు సమాధానంగానే భగవంతుడు తనను ఇక్కడకు చేర్చాడేమో. అందుకే ఎవరేం చెప్పినా, ఎవరెంత భయపెట్టినా తను ఇక్కడికి రాకుండా ఉండలేకపోయింది.

“యువరాణి, మీ సేనాని మీకోసం వెతుకుతూ ఉంటారేమో. అందోళన చెందుతూ ఉంటారేమో. పదండి. మిమ్మల్ని త్వరగా అతని వద్దకి చేరుస్తాను.” అన్నాడు వజ్రనేత్రుడు ఆమె ఆలోచనలకి అడ్డు తగులుతూ.

అతని మాటలకి ఉలిక్కిపడింది చంద్రహాసిని.

“ఒద్దు వజ్రనేత్రా. ఆ పనిచెయ్యకండి. నేను రావలసిన చోటకే వచ్చాను. నా గమ్యం ఇదే.”

ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ వజ్రనేత్రుడు ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. ఆమె మనస్ఫూర్తిగా ఆ మాటలంటున్నట్టు వెన్నెల్లా ప్రకాశిస్తున్న ఆమె కన్నులే చెబుతున్నాయి.

“ఏమంటున్నారు యువరాణీ? ఈ అడవిలో మీరు ఇలా ఇక్కడ జీవించలేరు.” అన్నాడు.

“ఎందుకలా అనుకుంటున్నారు? జన్మ యొక్క రహస్యం తెలిశాక, గమ్యమేదో నిర్ధారించుకున్నాక, ఇక నేనొక దేశానికి యువరాణీనన్న స్పృహ కూడా నాకు కలగటంలేదు.” అందామె.

“మీరేదో ఆవేశంలో.. నా చిత్రాల్ని చూసిన క్షణికానందంలో ఇలా అంటున్నారేమో. ఆలస్యం చేస్తే మీ సేనాని మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ స్థలానికి దూరంగా వెళిపోగలరు. అప్పుడు మీరు మీ వాళ్ళని చేరడం మరింత కష్టమైపోతుంది. మీ తల్లితండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించండి.”

అతని మాటలకి మధ్యలోనే అడ్డు తగ్గిలింది యువరాణి. “వజ్రనేత్రా గత కొన్ని సంవత్సరాలుగా నా హృదయం ఈ అడవి మధ్యకి చేరుకోవాలని ఎందుకు తహతహలాడిందో నాకు ఇవాళే తెలిసింది. ఈ గుహలో అడుగుపెట్టిన క్షణంలోనే నేను యువరాణీనన్న విషయం మరచిపోయాను. మీరు మరచిపోండి. నా జీవితానికి అర్థం ఈ నాటికి నాకు తెలిసింది. జన్మ పొందినందుకు నేను చేయవలసిందేమిటో ఈ నాటికి నాకు స్పష్టమయింది. జయదేవుడి అష్టపదులు ప్రజలందరినీ అలరించాలంటే ఏం చెయ్యాలా అని ఇన్ని సంవత్సరాలూ ఎంతో అలోచించాను. సామన్య ప్రజానీకానికి కూడా ఆ అష్టపదుల్లోని అందాలు అవగాహనకి రావాలని నా ఆశ. పెద్ద చదువు లేదన్నంత మాత్రాన ఆ ప్రేమధార మామూలు ప్రజల్ని తడపకుండా పక్కనుంచి పారుతూ పోరాదని నా అభిప్రాయం. నా ఆలోచనలకి రూపం మీరు. అందుకే భగవంతుడు ప్రవేశించడానికి నిషేఢింపబడిన ఈ అడవిలోకి ప్రవేశించి తీరుతానని నేను పట్టుబట్టేలా చేశాడు. బహుశా మిమ్మల్ని నాకు చూపించడానికే.”

చాలా ధృఢంగా చెబుతున్న ఆమె మాటల్ని వింటున్న వజ్రనేత్రుడికి అష్టపదుల విషయంలో ఆమె ఆశ వినగానే ఎంతో ఆనందం కలిగింది.

అచ్చం తనలాగే ఆలోచించే ఈ సౌందర్య దేవత తననిలా వెతుక్కుంటూ రావటం ఏమిటి? తన ఆశయాన్నే తన ఆశయమనుకుని ఇకపై ఇదే తన జీవితమని అనడమేమిటి? ఇదంతా కల కాదు కాబట్టి తప్పకుండా ఇది ఆ జగన్మోహనుడి అనుగ్రహమే. ఆతని సంకల్పమే. ఎటువంటి కల్మషాలూ లేని ప్రేమ ధార జనులందరినీ తడపాలని, ప్రపంచం ఎంత సుందరమయినదో, ఎంత సమ్మోహనమైనదో అందరికీ తెలియాలనీ ఆయన సంకల్పించాడు కాబోలు. అందుకు తమని ఎన్నుకున్నాడు కాబోలు.

భక్తిగా ఆ రాధాకృష్ణుల్ని తలుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు వజ్రనేత్రుడు. ఆశయమున్నా తను కొన్ని సాధించే అర్హత కోల్పోయాడు కాబట్టి ఆ దేవదేవుడే ఈమెను తనకి సహాయంగా పంపించాడు కాబోలు.

***

దిగులుగా తన గదిలో కూర్చున్నాడు తేజ. మధ్యమధ్యలో కణతలు నొక్కుక్కుంటున్నాడు. తలనొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదు.

ఏమయింది తనకి? గత రాత్రి తను అలా బలవంతంగా చిత్రాన్ని వెయ్యాలని అనుకున్నప్పుడు మెల్లగా ధ్యానం చేస్తూ చెయ్యి కదిపి గీతలైనా గియ్యాలని శ్రధ్ధగా ప్రయత్నించినప్పుడు.. ఎందుకలా అయింది.

తన చుట్టూ చీకటి వలయాలుగా తనను చుట్టేస్తున్నట్టు. తనెక్కడో ఏదో లోకంలోకి విసిరేయబడినట్టు. ఛెళ్ళున ఎవరో కొట్టినట్టు.. ఏమిటా వింత? అప్పుడే తను.. తనే.. స్వయంగా తన చేతులతోనే అద్భుతమైన రాధాకృష్ణుల వర్ణ చిత్రాలు ఎన్నో వేస్తున్నట్టు.. ఆ వర్ణ చిత్రాల్లో తనూ ఓ వర్ణమై…కా..దు… తనొక్కడే ఉన్నాడా అక్కడ? ఎవరో స్త్రీ మూర్తి కూడా.. తన పక్కన అవును.. ఇద్దరు.. తామిద్దరూ ఆ వర్ణ చిత్రాల మధ్య కలనేత వర్ణమై ప్రకృతి శోభల మధ్య.. ఎన్నెన్ని చిత్రాలు? లెఖ్ఖ లేదు. ఎన్నెన్ని భంగిమల్లో రాధాకృష్ణుల్ని చిత్రించాడు.. తనే.. ఖచ్చితంగా అది తనే. అటువంటి చిత్రాల కోసమే తను అంతర్జాలాన్ని వడపోస్తూ ఉంటాడు. ఎన్నెన్నో ఆర్ట్ గాలరీలకి వెళుతూ ఉంటాడు. ఎక్కడా తన మనసుకి తృప్తి కలిగించేలా రాధాకృష్ణుల చిత్రాలు తనకి అగుపడలేదు.

ఎందరో అద్భుతమైన చిత్రకారులున్నారు. వారిలో కొందరు కేవలం రాధాకృష్ణుల చిత్రాలు మాత్రమే చిత్రించేవారు ఉన్నారు. ఎంతో నయనరంజకంగా ఉంటాయి ఆ చిత్రాలు. కానీ, తను అనుకున్నట్టు.. ఎక్కడో లీలగా తనకి నచ్చిన భంగిమల్లో తనకు నచ్చిన తీరులో చిత్రించిన చిత్రాలు ఎక్కడా కనపడలేదు.

రాధాకృష్ణుల గీతాల పుస్తకాల్లో కొన్ని చూశాడు కానీ, అవేవీ తనకు కొంచం కూడా తృప్తినివ్వలేదు.

ఇప్పుడు ఇది కలా? మాయా? లేక తనకేదైనా సమస్యా? ఆ వలయాలు తనను ఎక్కడికి తీసుకుపోయాయి? ఆ ప్రదేశమేమిటి? అవన్నీ తను ఎలా వెయ్యగలిగాడు? ఎప్పుడు వేశాడు?

ఆ చిత్రాలన్నీ తన చుట్టూ గిర్రున తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంటే భరించలేక కుప్పకూలిపోయాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here