స్నిగ్ధమధుసూదనం-17.1

0
3

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 17.1వ భాగం. [/box]

[dropcap]అం[/dropcap]తే. ఆ తరువాత తను కళ్ళు తెరిచేసరికి బాబాయి తనకేవో ఇంజెక్షన్స్ ఇచ్చి స్పృహ తెప్పించాడు. మందులిచ్చాడు. ఏమయిందో ఎందుకలా తలలో నరాలు చిట్లిపోతున్నాయంటూ ఏడ్చానో చెప్పమంటాడు. ఏం చెప్పగలడు తను? ఇదంతా బాబాయికి చెబితే నమ్మడు. అంతా సైకలాజికల్ సమస్య అంటాడు. కాదు. తను ఇన్నాళ్ళూ ఎటువంటి చిత్రాలు తన మనసుకి హాయినిస్తాయని వెతుకుతున్నాడో అచ్చంగా అటువంటి చిత్రాలే అది కూడా తను బలవంతంగా బొమ్మలు వెయ్యాలని ప్రయత్నించే సమయంలో తన మెదడు పొరల వెనుక కదులుతున్నాయి. అది కూడా తనే గీసినట్టు. ఇప్పుడు కొత్తగా తన పక్కన ఎవరో ఒక స్త్రీ మూర్తి కూడా.

ఇదంతా బాబాయికి చెప్పలేక భార్గవికి చెప్పుకున్నాడు. తను చాలా మంచి స్నేహితురాలు. తను ఏం చెప్పినా దానికి ఓ అర్థముందని నమ్ముతుంది. అందరిలా కొట్టిపారెయ్యదు.

తలలోకి వేళ్ళుపోనిచ్చి జుట్టుని గట్టిగా పట్టుకుంటూ తల కిందకి వాల్చాడు తేజ.

అతనికి ఎదురుగా సోఫాలో కూర్చుని నిస్సహాయంగా అతను పడే అవస్థని గమనిస్తోంది భార్గవి.

“సారీ తేజా. ఇదంతా నావల్లనే వచ్చింది. నేను అలా కాన్వాస్ బిగించి బొమ్మ వెయ్యమని నిన్ను బలవంతం చెయ్యకపోయి ఉంటే నీకీ అవస్థ వచ్చేది కాదేమో అనిపిస్తోంది కానీ, దాని వల్ల నీకు నష్టం కంటే లాభమే ఎక్కువ కలుగుతోందేమో.” అని ఆపింది.

తేజ తల ఎత్తకుండానే ఆమె మాటలు వింటున్నాడు.

“ఏవో చిత్రాలు. నీకు నచ్చినట్టుగా నువ్వనుకున్నట్టుగా ఉన్న చిత్రాలు నువ్వే గీసినవి కనపడుతున్నాయి అంటున్నావు. అది ఇలా ప్రయత్నించడం వల్లనేగా.” అంది మళ్ళీ.

జుట్టులోంచి చేతులు తీసి ఆమె వైపు చూస్తూ అవును అన్నట్టు తలూపాడు తేజ.

“ఇదివరకూ కూడా చాలా సార్లు బొమ్మ వెయ్యడానికి ప్రయత్నించావుగా. ఎప్పుడూ చెయ్యి కదలట్లేదు అనేవాడివి అంతే. కానీ గత రెండు సార్లుగా మాత్రమే బొమ్మ వెయ్యడానికి ప్రయత్నించే సమయంలో నువ్వీ వింత అనుభవానికి లోనవుతున్నావు కదూ.”

తేజ మళ్ళీ మౌనంగానే తలూపాడు.

“అంటే.. ఇదివరకూ నువ్వు చేసిన ప్రయత్నానికీ, ఈ రెండు సార్లూ నువ్వు చేసిన ప్రయత్నానికీ నీ వైపు నుంచి అంటే నీ ప్రయత్నంలో తేడా ఉందా తేజా? ఆలోచించు.”

ఈ సారి తేజ ఆమె కళ్ళలోకి చూశాడు.  “ఊ.. ఆలోచించి చూడు. నీ వైపు నుంచి ఏదైనా ప్రత్యేకమైన ప్రయత్నం చేశావా?” అంది భార్గవి తేజకి దగ్గరగా జరుగుతూ.

సరిగ్గా ఆ సమయంలోనే రఘురాం ఆ గదిలోకి అడుగుపెట్టాడు.

“తేజా, నీకు ఒకసారి బ్రెయిన్ స్కాన్ చేయిద్దాం అనుకుంటున్నానురా. రేపు కొంచం ఫ్రీగా ఉంటాను. ఉదయం పదకొండు గంటలకి మీ పిన్నిని తీసుకుని ఆసుపత్రికి వచ్చేయ్.” అంటూ తేజ పక్కన కూర్చున్నాడు.

తేజ బాబాయ్ వంక నిస్సహాయంగా చూశాడు.

“భయపడకురా. నీకు నేనున్నాను. నీ సమస్య ఏంటో కనుక్కుని దానికి తగిన వైద్యం చేసి నువ్వు అద్భుతమైన కళాఖంఢాలు సృష్టించేలా చేస్తాను. సరేనా. నవ్వు.” అన్నాడు తేజ ముఖంలోకి ఆప్యాయంగా చూస్తూ.

ఆయన మాటలకి భార్గవి చాలా సంతోషించింది. తేజ రఘురాం వైపు చూస్తూ బలవంతంగా నవ్వాడు.

“ఈ నవ్వు సహజంగా వచ్చేట్టు చేస్తానురా. నీ సమస్యని త్వరలోనే తీరుస్తాను.” అంటూ రఘురాం లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

ఆయన వెళ్ళిపోగానే భార్గవి దిగ్గున లేచి వెళ్ళి తేజ ఎదురుగా దగ్గరగా వచ్చింది. “తేజా అయాం వెరీ హ్యాపీ. అంకుల్ కల్పించుకున్నారంటే ఇక నీ సమస్య తీరిపోయినట్టే అనిపిస్తోంది నాకు. నువ్వు త్వరలోనే అద్భుతంగా పెయింటింగ్స్ వేస్తావు చూడు. క్రియేటివ్ విజువలైజేషన్ గురించి నీకు తెలుసుగా. ఇప్పుడు నీ మస్తిష్కంలో నువ్వు చూస్తున్నది కూడా అదే. అలాగే నువ్వు అద్భుతంగా చిత్రాలు గీయగలుగుతున్నట్టు ఊహించుకుంటూ ఉండు. అదే జరుగుతుంది. అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఇక నువ్వు విశ్రాంతి తీసుకో. మళ్ళీ నేను వచ్చే శనివారం నిన్ను కలుస్తాను.” అంటూ లేవబోయింది.

వెళిపోవడానికి ఉద్యుక్తురాలవుతున్న ఆమె చెయ్యి మణికట్టు దగ్గర సున్నితంగా పట్టుకుని ఆపాడు తేజ.

వెనుతిరిగినదల్లా అతని స్పర్శకి తిరిగి పక్కన కూర్చుంది. “ఏమిటి తేజా? ఏమైనా చెప్పాలా?” మెల్లగా అడిగింది అతని ముఖంలోకి చూస్తూ.

“రేపు నాకు స్కాన్ చేసే సమయానికి నువ్వు కూడా ఉంటే బావుంటుంది భార్గవీ.” అర్ధింపుగా అన్నాడు తేజ.

“నేనా..” అంటూ క్షణం ఆలోచించి “సరే తప్పకుండా వస్తాలే. స్కాన్ టైంకి హాస్పిటల్ కే వచ్చేస్తాను. సరేనా?” అని తేజ హాయిగా తలూపాక తన బాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళినవైపే కాసేపు చూస్తూ ఉండిపోయాడు తేజ. తనకు తెలుసు. రేపు సోమవారం. భార్గవికి ఆఫీసులో చాలా పని ఉంటుంది. కానీ ఎందుకో అడగకుండా ఉండలేకపోయాడు. తన పరిస్థితిని అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి భార్గవి. ఆమె స్నేహం లేకపోతే తను ఏమైపోయేవాడో. తన బాధలు వినడమే కాదు. ఆలోచిస్తుంది. పరిష్కారాలు చెబుతుంది.

***

తన్మయి ఎంతకీ గదిలోంచి బయటికి రాకపోవడంతో దేవకీ, ప్రకాశరావూ ఆమె పెయింటింగ్ గదిలో అడుగుపెట్టారు. అప్పటికే మధ్యాహ్నం మూడు దాటింది. ఆమె ఉదయం టిఫిన్ తప్ప మళ్ళీ ఏమీ తినలేదని దేవకి ఆందోళన.

వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళేసరికి ఆమె కాన్వాస్ మీద అద్భుతమైన చిత్రం ప్రాణం పోసుకుంటోంది. తన్మయి ఇంతకు ముందు వేసిన చిత్రాలకీ ఈ చిత్రానికి చాలా తేడా కనిపించింది వారిద్దరికీ. ఇంతకు ముందు వేసిన చిత్రాలన్నీ కూడా గొప్పగా అనిపించేవే కానీ, ఈ చిత్రం అంతకు ఎన్నో రెట్ల పరిణతితో, శ్రధ్ధగా తీర్చి దిగ్గినట్టు స్పష్టంగా తెలుస్తోంది. రాధాకృష్ణులు మరో గోపిక, ముగ్గురి ముఖాల్లోనూ జీవకళ స్పష్టంగా కనిపిస్తోంది. చిత్రంలో ప్రతి చిన్న విషయమూ అత్యంత శ్రధ్ధతో చిత్రిస్తోంది తన్మయి. వారి ముఖ కవళికలూ, హావభావాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆ ముఖారవిందాలు చూసినవారు అచ్చెరువొందేలా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఒక సాధారణ యువతి, ఆర్ట్స్‌కి సంబంధించిన ఎటువంటి డిగ్రీ చదవని వ్యక్తి, ఎక్కడా ఎవరిదగ్గరా చిత్రకళ అభ్యసించని వ్యక్తి వేసినది అంటే నమ్మడం కష్టం. అంత గొప్పగా తోచింది ఆమె తల్లితండ్రులకి.

ఆ చిత్రాన్ని చూశాక ఎందుకో తన మనసులో ఉన్న కాస్త ఆందోళనా కూడా మటుమాయం అయిపోయింది ప్రకాశరావుకి. తన కూతురికి ఎటువంటి సమస్యా లేదు. ఆమె ఓ కళాకారిణి. ఇంత అద్భుతమైన దృశ్యం ఆమె మనసులో రూపు దిద్దుకునేటప్పుడు ఎదుటివారికి మింగుడుపడని పరధ్యానం మామూలే. భయపడవలసినది ఏదీ లేదు.

దేవకి ఆలోచనలు కూడా ఇలాగే ఉన్నాయి. ఎంత గొప్పగా వేసింది తన్మయి ఈ చిత్రాన్ని? బహుశా దీని గురించే ఆలోచనలో మునిగిపోయింది కాబట్టే ఉదయం ఆమెకు వర్షంలో తను పూర్తిగా తడుస్తున్న విషయం కూడా తెలియలేదు. ఇంతగొప్పగా చిత్రాన్ని మలచడానికి ఎంత శ్రమపడి ఆ చిత్రాన్ని ముందు మనసులో చిత్రించుకోవాలో ఆమెకు తెలియనిదేమీ కాదు.

కొద్దిగా నెమ్మదించిన మనసుతో కూతురికి దగ్గరగా వెళ్ళి ఆమె తల నిమిరింది.

అప్పటి దాకా చిత్రాన్ని రచించి ఇంకా పూర్తి చెయ్యవలసిన భాగాన్ని ఏంచెయ్యాలో తెలియనట్టుగా ఆలోచిస్తున్న తన్మయి తల్లి స్పర్శకి మెల్లగా వెనక్కి తిరిగింది.

“తన్మయీ, ఇప్పుడైనా వచ్చి భోజనం చెయ్యమ్మా. లేకపోతే నేనే అన్నం కలిపి తీసుకు వచ్చి నోట్లో పెట్టనా? నువ్వు బొమ్మ వేసుకుంటూ ఉంటావా?”

తన్మయి అందంగా నవ్వింది. “వద్దులేమ్మా. నేనే వస్తాను. పద.”  

అంటూ రంగులూ, కుంచెలూ అన్నీ సర్ది తలుపు వారగా వేసి తల్లితండ్రుల వెంట డైనింగ్ టేబుల్ వైపు నడిచింది.

“తన్మయీ ఇప్పుడు నువ్వు వేసిన చిత్రం నీ మునుపటి చిత్రాలకంటే ఎన్నో రెట్లు అద్భుతంగా ఉందమ్మా” అన్నాడు ప్రకాశరావు కూతురి ముఖంలోకి అభినందనగా చూస్తూ.

“థాంక్స్ నాన్నా” అంది తన్మయి.

“చాలా బాగా వేశావమ్మా. ఇంకా పూర్తిచెయ్యవలసి ఉంది కదూ.” తనూ అంది దేవకి.

“అవునమ్మా. పూర్తి చెయ్యవలసింది చాలా ఉంది.” తనే ప్లేట్ పెట్టుకుని వడ్డించుకోబోతూ అంది తన్మయి. దేవకి ఆమెను వారించి తనే అన్నీ వడ్డించి పక్కనే కూర్చుంది.

తన్మయి మెల్లగా భోజనం చేస్తూ మధ్య మధ్యలో తమతో మామూలుగా మాట్లాడుతూ ఉండటంతో దేవకి మనసులో ఎక్కడో మిగిలిన భయాలు కూడా తుడిచిపెట్టుకు పోయాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here