Site icon Sanchika

స్నిగ్ధమధుసూదనం-19

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 19వ భాగం. [/box]

[dropcap]తే[/dropcap]జ నుంచి ఫోన్ రావడంతో భార్గవి తన మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఒక రెండు గంటలు పర్మిషన్ తీసుకుంది.

తన్మయి దగ్గరికి వచ్చి “తన్మయీ, కొంచం పనుంది నాకు. బయటికి వెళ్ళొస్తాను. లంచ్‌కి నాకోసం ఎదురుచూడకు. ఆ సమయానికి నేను రాకపోవచ్చు.” అంది.

తన్మయి తలూపింది. మరింకేమీ ప్రశ్నలడగలేదు భార్గవిని.

భార్గవి ఆసుపత్రికి చేరుకునేసరికి తేజ, సుమిత్ర రిసెప్షన్లో ఎదురుచూస్తున్నారు.

“రా భార్గవీ. ఇప్పుడే అంకుల్ స్కాన్ రూమ్‌లో ఉండే రేడియోలజిస్ట్‌ని కలవడానికి వెళ్ళారు. పదినిముషాల్లో వస్తారు” అంది సుమిత్ర భార్గవి చెయ్యి పట్టుకుని ఆమెను తనకీ, తేజకీ మధ్యన కూర్చోబెట్టుకుంటూ.

తేజ భార్గవి వైపు అభావంగా చూశాడు.

ఏమనుకుందో ఏమో సుమిత్ర లేచి తను కూడా భర్త వెళ్ళిన వైపే వెళ్ళింది. పిన్ని దూరంగా వెళ్ళడంతో భార్గవి ముఖంలోకి చూశాడు తేజ.

“భార్గవీ, ఏమిటిదంతా? నిజంగా ఈ స్కాన్ వల్ల నా సమస్యేమిటో తెలుస్తుందనుకుంటున్నావా? నాకంతా అయోమయంగా ఉంది. నేను చెయ్యవలసిన పనేదో ఆలస్యం అయిపోతోంది అనిపిస్తోంది. జీవితం ముగిసే లోపు నేను అసలు ఏదైనా సాధిస్తానా?”

పసిపిల్లాడిలా అడుగుతున్న తేజ కళ్ళలో సన్నటి కన్నీటిపొర చూసి బాధగా తేజ చెయ్యి పట్టుకుంది భార్గవి.

తన బాధ పైకి కనపడనివ్వకుండా “తప్పకుండా తెలుస్తుంది తేజా. ఇప్పటికే ఎన్నో ఏళ్ళు ఆలస్యం అయింది. ఈ పనేదో, ఈ పరీక్షాలేవో నీ చిన్నప్పుడే చేసి ఉంటే, అసలెందువల్ల నువ్వు బొమ్మలు వెయ్యలేకపోతున్నావో  తెలిసిపోయి సరయిన వైద్యం నీకు అంది ఉండేది. ఇప్పటికైనా ఫరవాలేదు. ఈ పరీక్షలైనా చెయ్యనీ.” అంది.

భార్గవి ఏం చెప్పినా ఏదో ధైర్యం కలుగుతుంది తేజకి.

అతనేదో అనేలోపే రఘురాం వేగంగా అక్కడికి వచ్చాడు. “రా తేజా.” అన్నాడు ప్రేమగా తేజ తల నిమురుతూ.

తేజ భుజంపైన చెయ్యేసి దగ్గరగా పట్టుకుంటూ స్కాన్ రూం లోకి తీసుకువెళ్ళాడు. సుమిత్రా, భార్గవీ అక్కడే నిలబడిపోయారు.

ఒక గంట గడిచాక ఒక చేతిలో స్కాన్ రిపోర్ట్స్ తీసుకుని మరో చేత్తో తేజని దగ్గరగా పొదవి పట్టుకుని రఘురాం ఆ రూం లోంచి బయటకి వచ్చాడు. వాళ్ళ వెనుకే మరో ప్రఖ్యాత న్యూరోలగిస్ట్ డాక్టర్ వేదాంత్ కూడా బయటకు వచ్చాడు. రఘురాం అతనికి షేక్ హాండ్ ఇచ్చాడు. డాక్టర్ వేదాంత్ చిరునవ్వు నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాక, రఘురాం తేజని తన గదిలోకి తీసుకువెళ్ళాడు. వాళ్ళ వెనుకే భార్గవీ, సుమిత్రా కూడా వెళ్ళారు.

అందరూ తన ఎదురుగా కూర్చున్నాక, తన వంక కుతూహలంగా చూస్తున్నా సుమిత్ర వైపూ, భార్గవి వైపూ ప్రసన్నంగా చూశాడు రఘురాం.

“తేజకి మెదడులో ఎటువంటి సమస్యా లేదు. హిజ్ బ్రెయిన్ ఈస్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్లీ వెల్.” అన్నాడు.

ఆ మాట వింటూనే సుమిత్ర హాయిగా ఊపిరి పీల్చుకుంది.

భార్గవి ముఖం చూశాడు రఘురాం. “భార్గవీ, సమస్య ఇంకా తీరలేదు అనుకోకు. శారీరకంగా వాడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఏదో ఫోబియా వాడిని బొమ్మలు గియ్యనివ్వకుండా చేస్తోంది. సాధారణంగా కొంతమంది రచయితలు ఏదైనా వ్రాయాలనుకున్నప్పుడు ఇలా చెయ్యి కదలకపోవడం ఉంటుంది. నొప్పి, వ్రాయలేకపోవడం అనమాట. దాన్ని రైటర్స్ క్రాంప్ అంటారు. కానీ, వీడి విషయంలో అసలు ఇంతవరకూ ఒక్క పెయింటింగ్ కూడా వెయ్యలేదు. వెయ్యాలి అన్న ఆకాంక్ష ఉన్నా, ఫోబియా వల్ల వెయ్యలేకపోతున్నాడు. అనుకున్నట్టుగానే ఇది పూర్తిగా మానసికం. మెల్ల మెల్లగా కౌన్సిలింగ్ ఇప్పిస్తే పరిస్థితి మెరుగుపడొచ్చు.” అన్నాడు.

అదంతా తను స్కాన్ రూం లోనే బాబాయి, డాక్టర్ వేదాంత్ మాట్లాడుకున్నప్పుడే విని ఉండటంతో తేజ అభావంగా ఎటో చూస్తూ కూర్చున్నాడు.

భార్గవికి రఘురాం చెప్పిన విషయం పెద్దగా సంతోషాన్నివ్వలేదు. కౌన్సిలింగ్ వల్ల ఇంత దారుణమైన పరిస్థితి మారుతుందంటే వెంటనే అంగీకరించలేకపోయింది. కానీ, అంతలోనే ఆమె మనసులో జరిగిన విషయం మెదిలింది. ఈ మధ్యనే తను తన్మయి వేసిన రాధాకృష్ణుల పెయింటింగ్స్ గురించి చాలాసేపు మాట్లాడాక కదూ తేజ ఆ మాత్రం అయినా కాన్వాస్ మీద బొమ్మ వెయ్యగలిగాడు.

కాబట్టి బాగా అనుభవం ఉన్న మానసిక నిపుణుడు తేజ ఇష్టాలూ, అతని ఆకాంక్షలు, అతని సమస్యా సరిగ్గా అర్థం చేసుకుని తేజకి కౌన్సిలింగ్ ఇస్తే, తేజ తప్పకుండా మారతాడేమో. ఏమో నిరాశపడటం ఎందుకు? ఇది ఇంత చిన్న సమస్యే అని తెలియడం కూడా మంచిదే కదా అనిపించింది ఆమెకు.

“ఇంకో గంటలో సైకియాట్రిస్ట్ మనోహర్ వస్తారు. నేనే స్వయంగా అయనకు తేజను చూపిస్తాను. అంతవరకూ తేజా, సుమిత్రా ఇక్కడే ఉంటారు. నీకు ఆఫీసులో ముఖ్యమైన పనేదీ లేకపోతే నువ్వూ ఉండమ్మా” అన్నాడు రఘురాం.

భార్గవి ఆలోచనల్లోంచి బయటికి వచ్చింది. ఆఫీసులో పని చాలా ఉంది. ఇంకా ఇక్కడే ఉంటే మేనేజర్ ఏమంటారో. ఏదేమైనా ఒక మంచి స్నేహితురాలిగా తనూ తేజతో అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది భార్గవి.

ఆ తరువాత కాసేపటికే డాక్టర్ మనోహర్ రావడంతో రఘురాం మాత్రం తేజని తీసుకుని ఆయన గదిలోకి వెళ్ళాడు. పది నిముషాల తరువాత రఘురాం బయటికి వచ్చాడు.

“ఆయన తేజతో మాట్లాడుతున్నారు.” అంటూ తన ఛాంబర్ లోకి వెళిపోయాడు. అప్పటికే రఘురాం కోసం ఎదురుచూస్తున్న పేషంట్స్ సంఖ్య పెరగడంతో సుమిత్రా, భార్గవీ బయటికి వచ్చేశారు.

ఒక ముప్పావుగంట తరువాత రఘురాంకి మనోహర్ నుంచి ఫోన్ రావడంతో ఆ సమయంలో తను చూస్తున్నా పేషంట్ ని పంపించేశాక బయటికి వచ్చాడు. సుమిత్ర వైపు ఒకసారి చూసి తిన్నగా మనోహర్ ఛాంబర్ లోకి వెళ్ళాడు.

ఆ వెంటనే తేజ బయటికి వచ్చేశాడు. అతని ముఖం ఉదయం కన్నా కాస్త తేటగా ఉండటం గమనించారు సుమిత్ర, భార్గవి. రఘురాం కూడా బయటికి వచ్చేదాకా ముగ్గురూ ఏమీ మాట్లాడుకోలేదు. భార్గవి కానీ, సుమిత్ర కానీ లోపలి విషయాలు అడిగి తేజని కంగారు పెట్టదలుచుకోలేదు.

రఘురాం చిరునవ్వుతో మనోహర్ గదిలోంచి బయటికి రావడం వాళ్ళ ముగ్గురికీ ఎంతో హాయిగా అనిపించింది.

“తేజది పూర్తిగా మానసికమైన సమస్య అనే అంటున్నాడు డాక్టర్ మనోహర్. మెల్లగా కౌన్సిలింగ్ ద్వారా ఈ పరిస్థితిని తప్పకుండా నయంచెయ్యొచ్చు అంటున్నాడు. మొదట రెండు మూడు సెషన్స్‌లో అసలెందువల్ల తేజ బొమ్మలు వేసే విషయంలో అంత యాంగ్జయిటీకి గురవుతున్నాడో తెలుసుకుని అందుకు ఏం చెయ్యాలో ఆ విధంగానే ట్రీట్మెంట్ ఇస్తాడు. సరేనా? తేజా ఇక నువ్వు హాపీగా ఉండు. త్వరలోనే నీ సమస్య తీరిపోతుంది.” అన్నాడు తేజ భుజం మీద చెయ్యి వేసి అతని కళ్ళలోకి చూస్తూ.

తేజ బాబాయి చెయ్యి పట్టుకుని బుగ్గకి ఆనించుకున్నాడు.

సుమిత్ర తేజని దగ్గరికి తీసుకుంటూ “పద తేజా. ఇక వెళదాం. ఉదయం నుంచీ నువ్వు ఏమీ తినలేదు. కాస్త భోజనం చేసి ఇక విశ్రాంతి తీసుకుందువుగాని.” అంది.

భార్గవి కూడా రఘురాం వైపు కృతజ్ఞతగా చూసి “థాంక్ గాడ్ అంకుల్. మంచి మాట చెప్పారు.” అంది.

సుమిత్ర తేజని వదిలి భార్గవి చుబుకాన్ని ఎత్తి పట్టుకుని “మేమే నీకు థాంక్స్ చెప్పాలి భార్గవీ. నువ్వు ఆ రోజు అంకుల్‌ని అలా నిలదియ్యకపోయి ఉంటే ఇప్పటికి కూడా తేజ విషయం ఇంత వరకూ వచ్చేది కాదు. తేజ చిన్నవాడుగా ఉన్నప్పటినుంచీ వాడిని కూడా తనలా డాక్టర్ చెయ్యాలని ఈయన ఆశ పడ్డారు. వాడు అటువైపు ఒగ్గకుండా ఇలా చిత్రకళ మీద ఆసక్తితో తిరగడం ఆయనకు ముందు నుంచీ ఇష్టం లేదు. అందుకే ఆ విషయంలో వాడిని ఎప్పుడూ ఎగతాళి చేసేవారే కానీ, వాడి సమస్య ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చెయ్యలేదు. ఈ విషయంలో నేను కూడా ఎన్నో సార్లు చెప్పి చూసి ఇక వదిలేశాను. ఆ కృష్ణ పరమాత్మే నీ నోటి వెంట ఇలా ఆజ్ఞాపించాడేమో. ఇకనైనా తేజ చక్కగా బొమ్మలు వెయ్యగలిగి వాడు ఆనందంగా తృప్తిగా ఉంటే అదే చాలు.” అంది మనస్ఫూర్తిగా.

ఆ సమయంలో ఎందుకో కృష్ణ పరమాత్మ అన్న మాట పిన్ని నోటి వెంట వింటూనే తేజ శరీరంలో నదీ జలాలు లోపల కదులుతున్నంత హాయయిన అనుభూతి కలిగింది. ఆ ఆనందం అతని ముఖంలో కొత్త వెలుగునీ, శాంతినీ చూపించింది.

అందరి వైపూ ఆనందంగా చూస్తూ వీడ్కోలు చెప్పి ఆఫీసుకి బయలుదేరింది భార్గవి.

“మీరు కూడా ఇంటికి వెళ్ళండి. రేపటి నుంచే మనోహర్ తేజకి కౌన్సిలింగ్ మొదలుపెడతాడు” అంటూ సుమిత్రనీ, తేజనీ కారులో ఇంటికి పంపించేసి తన ఛాంబర్ వైపు వెళ్ళిపోయాడు రఘురాం.

(సశేషం)

Exit mobile version