స్నిగ్ధమధుసూదనం-2

1
2

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది రెండవ భాగం. [/box]

[dropcap]“అ[/dropcap]మ్మో ఆ అడవి ఏ మాత్రం క్షేమం కాదని చెబుతారు కదా రాకుమారీ. చాలా ప్రమాదకరమైన జంతువులుంటాయిట. అడవంతా చెట్లు పుట్టలతో అసలు నడవడానికి కూడా వీలు లేనంతగా ఉంటుందిట. పాములూ, కొండచిలువలూ ఆ అడవిలో చాలా ఎక్కువగా ఉంటయని చెప్పుకుంటారు. అందాల మాటేమో గానీ, అసలు ఊపిరి ఉండటం కూడా అనుమానమే అక్కడికి వెళ్ళినవాళ్ళకి. మీకు ఈ విషయాలు కూడా తెలుసు కదమ్మా. ఈ మధ్యనే ఆ అడవిలోకి ఎవరూ వెళ్ళరాదని మహారాజుగారు చాటింపు కూడా వేయించారుగా.” జయంతి ముగించిన విషయాన్ని తిరిగి సరోజ అందుకుంది.

“అవునమ్మా. ఆ అడవిలో వేటకని వెళ్ళినప్పుడు ఎంత మంది భటులు మృత్యువాత పడ్డారు. పులులు, సింహాలూ, కొండచిలువలూ ఉండే ఆ అడవిలోకి వెళ్ళాలని కోరికేమిటమ్మా మీకు? మరింకే ప్రదేశమైనా కోరండి. మహారాజు గారు మీ యాత్రకి అన్ని రకాల ఏర్పాట్లూ చేసి పంపిస్తారు. అంతే కానీ, ఇటువంటి విచిత్రమైన కోరికలు కోరకండి.” చనువుగా హెచ్చరించింది.

నిట్టూర్చింది చంద్రహాసిని.

***

“తన్మయీ, శనివారం ఇస్కాన్ గుడికి వెళాదామా. వస్తావా” కింద చిన్న చక్రాలతో ఉండే మెత్తటి కుర్చీని కూర్చునే కాళ్ళతో తన్మయి వైపు జరుపుకుంటూ అడిగింది భార్గవి.

తన్మయి చిరునవ్వు నవ్వుతూ వెనక్కి తిరిగింది.

“నువ్వు ఇస్కాన్‌కి వెళుతూ ఉంటావా భార్గవీ.”

“ఎప్పుడూ వెళ్ళలేదు. ఎందుకో వెళ్ళాలనిపిస్తోంది. కానీ, ఒక్కదాన్నే ఏం వెళతాను? నా రూం మేట్స్ రారు. నువ్వైతే వస్తావని.”

తన్మయి ఏం మాట్లాడకుండా భార్గవి కళ్ళలోకి చూస్తూ నవ్వింది.

“నీ వల్ల నాకూ కొద్ది కొద్దిగా కృష్ణ భక్తి పెరుగుతోందిలే.”

“నా వల్లా. నేనేం చేసాను. ప్రవచనాలేమీ చెప్పట్లేదే నీకు.”

“హహ ప్రవచనాలు చెప్పక్కర్లేదు మేడం. కొంతమంది చుట్టూ ఉండే ఆరా చాలు. మనలో ఏ కాస్త చమురు ఉన్నా వాళ్ళ ఆరా మన లోపల కూడా దీపాల్ని వెలిగిస్తుంది. మనల్నీ తేజోవంతంగా మారుస్తుంది. ”

తన్మయి విస్మయంగా చూసింది భార్గవి వైపు. “నీ మాటలు బావున్నాయి భార్గవీ. ఇంత తాత్వికంగా ఎలా చెప్పగలవు?”

“ఏమో నీతో స్నేహం చెయ్యడం వల్ల అలా వచ్చేస్తున్నాయ్ మాటలు. ఒక్కోసారి నేనేనా అనిపిస్తుంది నాకు” నవ్వేస్తూ భుజాలెగరేస్తున్న భార్గవి వంక ప్రసన్నంగా చూసింది తన్మయి.

భార్గవి హైదరాబాదులోనే హైటెక్ సిటీకి దగ్గర్లో వర్కింగ్ వుమెన్స్ హాస్టల్లో ఉంటుంది. తల్లితండ్రులు విజయవాడ దగ్గర ఒక చిన్న ఊరు అని చెప్పింది. తను చదివింది విజయవాడలోని ఇంజినీరింగ్ కాలేజీలో. భార్గవి ఇలా ఇంతగా భక్తి వైపు ఆకర్షితురాలవడం ఇంత బాగా తాత్వికంగా మాట్లాడగలగడం ముచ్చటగా అనిపిస్తుంది తన్మయికి. భార్గవి చెప్పింది కూడా నిజమే. వచ్చిన కొత్తలో ఇటువంటి మాటలు లేవు. తనతో చనువు పెంచుకుని స్నేహంగా ఉంటుంది. ఈ మధ్యనే ఇలా మాట్లాడుతోంది తనతో. కానీ టీం లో ఉన్న మిగతా వాళ్ళతో కూడా తను బాగా కలిసిపోతుంది. వాళ్లతో వాళ్ళకి తగినట్టుగానే మాట్లాడుతూ ఉంటుంది. సినిమాల గురించి, ఆధునిక పోకడల గురించీ ఇలా అన్నీ.

“ఇంతకూ తీసుకువెళతావా” ముఖంలోకి చూస్తూ అడుగుతుంటే నవ్వింది తన్మయి తలూపుతూ.

“తప్పకుండా తీసుకువెళతాను. ఆదివారం సాయంత్రం వెళదాం. భజన, హారతి అవీ బావుంటాయి. ఆ తరువాత ప్రసాదం కూడా ఇస్తారు. సాంబారు అన్నం కానీ, పులిహోర కానీ ఇస్తారు. చాలా బావుంటుంది.”

“వావ్. ధాంక్స్ తన్మయీ.”

తృప్తిగా భార్గవి తన కంప్యూటర్ వైపు తిరిగిపోవడం చూసి, తనూ పనిలో మునిగిపోబోయి మళ్ళీ భార్గవి వైపు తిరిగుతూ అంది తన్మయి “భార్గవీ, ఆదివారం ఉదయమే వచ్చేసెయ్ మా ఇంటికి. మధ్యాహ్నం భోజనం మా ఇంట్లోనే. అయిదింటికి బయలుదేరి ఇస్కాన్‌కి వెళదాం.”

“ధాంక్యూ తన్మయీ. తప్పకుండా వచ్చేస్తా. “

అన్నట్టుగానే భార్గవి ఆదివారం ఉదయం పదింటికల్లా కూకట్‌పల్లిలో ఉన్న తన్మయి ఇంట్లో మొదటిసారి అడుగుపెట్టింది.

“రా భార్గవీ.” బస్ దిగాక ఇంటికి ఎలా రావాలో గుర్తులు చెబుతూ గుమ్మంలోనే నిలబడిన తన్మయి ఆప్యాయంగా భార్గవి భుజం మీద చెయ్యేసింది.

తన్మయి ఫ్లాట్ అందంగా ముచ్చటగా ఉంది. పెద్ద హాల్లో ఒక పక్కగా వేసిన సోఫా. ఎదురుగా గాజు టేబుల్. దాని పైన పొడవాటి కూజాలో తాజాగా ఉన్న డైసీ పూలు నాలుగు. ప్రతి గోడకీ నిలువెత్తు దేవుడి పోస్టర్లు.

సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్న తన్మయి తండ్రి పేపరు మడుస్తూ వాళ్ళిద్దరి వంకా చుశాడు.

“నాన్నా, నా టీం మేట్ భార్గవి. మీకు చెబుతూ ఉంటా కదూ చాలా స్నేహంగా ఉంటుందని.”

నవ్వుతూ తలూపారాయన భార్గవి నమస్కారం చెబుతుంటే.

“భార్గవీ, మా నాన్నగారు ప్రకాశరావు గారు. తెలుగు లెక్చరర్. అమ్మని పరిచయం చేస్తాను. రా”

భార్గవి చెయ్యి పట్తుకుని తమ దేవుడి గదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ ఒక చిన్న పూజా మందిరం ముందు కూర్చుని సహస్రం చదువుకుంటున్న దేవకి వీళ్ళిద్దరివైపూ చూసి పలకరింపుగా నవ్వింది.

“నమస్తే ఆంటీ” అంది భార్గవి నమస్కారం పెడుతూ.

తలుపింది దేవకి.

“మా అమ్మ దేవకి” చెబుతూ వెనక్కి తిరిగింది తన్మయి. పూజలో ఉన్న ఆవిడతో మరింకేమీ మాట్లాడకుండా భార్గవి తనూ తన్మయిని అనుసరించింది.

ఆ తరువాత భార్గవిని తన్మయి తన గదిలోకి తీసుకువెళ్ళింది.

విశాలమైన గది. ఒక పక్కగా సింగిల్ కాట్. మరో వైపు గోడకి పెద్ద అద్దాల పుస్తకాల బీరువా. తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, పురాణాలు, బాల సాహిత్యం, చిత్రకళకి సంబంధించిన పుస్తకాలు అలా చాలా సేపు చూస్తూ ఉండిపోయింది భార్గవి.

“నువ్వు పుస్తకాలు చదువుతావా భార్గవీ.”

లోపల నుంచి మంచినీళ్ళు తెచ్చి ఇస్తూ ఆమె రెప్పవెయ్యకుండా పుస్తకాల వైపు చూడటం చూసి అడిగింది తన్మయి.

“ఆ. అవును తన్మయీ. చిన్నప్పుడు తెలుగు పుస్తకాలే చదివేదాన్ని. కాలేజీకి వచ్చాక మా అన్నయ్య ‘ఇంగ్లీష్ నవలలు చదువు. ఇంగ్లీష్ భాష మీద పట్టు వస్తుంది’ అంటే అప్పటినుంచీ ఇంగ్లీష్ నవలలు చదవడం అలవాటయింది. ఇప్పుడు కూడా కాస్త తీరిక దొరికినా ఏదో ఒక నవల చదువుతూనే ఉంటాను” అని మంచినీళ్ళు తాగేసి గ్లాసు తిరిగి తన్మయి చేతిలో పెడుతూ “నువ్వు అన్నీ తెలుగు పుస్తకాలే చదువుతావా?”  అంది.

తన్మయి చిన్నగా తలూపుతూ నవ్వింది. “నాన్నగారు తెలుగు లెక్చరర్ కదా. చిన్నప్పటి నుంచీ తెలుగు సాహిత్యాన్ని చదవడం అలవాటు చేసారు. చలాన్నీ, విశ్వనాథ వారినీ, కృష్ణశాస్త్రినీ అందరినీ చదివాను. ఎక్కువగా బాలసాహిత్యమంటే కూడా ఇష్టం.”

“చిత్రకళకి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి నీ దగ్గర” చిత్రకళకి సంబంధించిన ఒక పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంటూ అడిగింది.

ఆ పుస్తకాన్ని ఆసక్తిగా తడుముతున్న భార్గవి మనసులో తేజ మెదలడంతో తన్మయి మొహంలోని భావాల్ని ఆమె గమనించలేదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here