స్నిగ్ధమధుసూదనం-20

0
1

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 20వ భాగం. [/box]

[dropcap]ఆ[/dropcap] రోజు పౌర్ణమి. బాల్కనీలో విరిసిన గులాబి మొక్కల వద్ద కూర్చుని అలవాటు ప్రకారం తదేకంగా చంద్రుడిని చూస్తోంది తన్మయి.

అప్పటి దాకా తల్లీ, తండ్రీ కూడా అక్కడే తన పక్కనే కూర్చుని కబుర్లు చెప్పారు. ఇక నిద్రవస్తోందని ఇద్దరూ అప్పుడే లోపలికి వెళిపోయారు. తన్మయినీ రమ్మంటే మరికాసేపు అక్కడే ఉండి లోపలికి వెళతానని అలాగే కూర్చుండిపోయింది.

అటువంటి అందమైన సమయంలో కాసేపయినా ఒంటరిగా గడపడమే ఆమెకు ఇష్టం. కాస్త వెన్నెల్ని మనసులో నింపుకుని వెళ్ళాలనే కాసేపు ఒంటరిగా కూర్చుండిపోయింది తదేకంగా చంద్రుడిని చూస్తూ.

చంద్రుడి చుట్టూ మబ్బులు మెరిసిపోతున్నాయ్. మెల్లగా కదిలిపోతూ చంద్రుడిని కాసేపు దాచిపెడుతూ ఆటలాడుతున్నాయ్.

అకస్మాత్తుగా ఆమె హృదిలో పాట మెదిలింది

“త్యజతినపాణితలేన కపోలం

బాల శసినమివ సాయమలోలం”

సంధ్యా సమయంలో కృష్ణపరమాత్ముని కొరకై నిరీక్షిస్తూ ఆతని తలపుల వలపులలో నిమగ్నమై లేత చంద్రునివలే ఉన్న తన చెక్కిలిని అరచేతిలో ఉంచుకుని కదలక మెదలక అతని రాకకై నిరీక్షిస్తున్న రాధ….

ఆ పాదం జ్ఞప్తికి వస్తూనే తన్మయి కన్నులు తన్మయత్వంతో అరమోడ్పులయ్యాయి.

రాధికా కృష్ణా …రాధికా.. తవ విరహే కేశవా

దేశిక రాగంలో ఏకతాళంలో కర్ణ మనోహరంగా పాడుతోంది తన్మయి. ఆమెలోని భక్తి భావ తరంగాలు ఆమె గాత్రంలో కలిసి ఆ పరిసరాల చల్లదనంతో, వెన్నెల కిరణాలతో కలిసి చెప్పలేని రసానుభూతిని కలిగిస్తున్నాయి.

హాల్లో లైటు ఆర్పి తన గదిలోకి వెళ్ళబోతూ కూతురి గొంతులోంచి ఆ పాట విన్నాడు ప్రకాశరావు. అప్పటికే గదిలోకి వెళిపోయింది దేవకి.

ఏదో కూనిరాగాలు తీస్తుందనీ, అష్టపదులంటే ఆమెకు ఇష్టమనీ తెలుసు కానీ, ఇంత మధురంగా కూతురు పాడగలదని ప్రకాశరావుకి తెలీదు. ఆమె ఎప్పుడూ ఎవరి ఎదురుగా పాట పాడినదే లేదు మరి. సంగీతం నేర్చుకోలేదు. చిన్నప్పటినుంచీ తీరిక సమయాల్లో ఎప్పుడూ బొమ్మలు వేసుకుంటూనే గడిపేది.

చప్పుడు చెయ్యకుండా బాల్కనీ ద్వారానికి దూరంగా నిలబడి ఆమె పాట పూర్తిచేసేవరకూ మైమరిపోయి అలాగే నిలబడ్డాడు. ఎంత తియ్యగా పాడింది? సంగీతం నేర్చుకుంటే గానీ, బాగా అభ్యాసం ఉంటే గానీ ఇంత మధురంగా పాడటం సాధ్యం కాదు. అసలెప్పుడు అభ్యాసం చేసింది? మొబైల్‌లో వింటూ నేర్చుకుందేమో ఈ పాట. ఎంత అద్భుతంగా పాడింది.

ఆనందంతో బరువెక్కిన హృదయంతో దేవకి దగ్గరికి వెళ్ళాడు.

“దేవకీ, మన తన్మయి ఇంత బాగా పాడుతుందని నాకు తెలినేలేదు సుమీ” అన్నాడు.

“అదా. ఏదో కూనిరాగాలు తీసుకుంటూ ఉంటుంది. పైకి ఎక్కడ పాడుతుందండీ?” అంది దేవకి.

“ఇంతసేపూ పాడింది. రాధికా కృష్ణా రాధికా అంటూ. అష్టపది. ఎంత మధురంగా పాడిందో తెలుసా. సంగీతం నేర్చుకోకుండానే ఎన్నో సంవత్సరాలు సంగీతంలో సిక్షణపొందినవాళ్ళకి ఏమాత్రం తీసిపోనట్టు.. అసలు నువ్వు విని ఉండాల్సింది.” అన్నాడు మహదానందంగా నవ్వుతూ.

“అవునా. ఏమోనండీ. అది పైకి వినపడేలా పాడటం నేనూ ఎప్పుడూ వినలేదు.” అంది దేవకి.

బయటకు వెళ్ళబోయినదల్లా తలుపు సందులోంచి బాల్కనీ తలుపులు వేసి లోపలికి వస్తున్న తన్మయి కనిపించడంతో తిరిగి పడుకుంది. తన్మయి తిన్నగా తన పెయింటింగ్ గదిలోకి వెళ్ళింది.

ఆమె తన గదిలోకే పడుకోవడానికి వెళిపోయిందనుకుని దేవకీ, ప్రకాశరావూ నిద్రకు ఉపక్రమించారు.

నిద్రలో నడుస్తున్నదానిలా వెళ్ళి పెద్ద కాన్వాసుని తీసి స్టాండ్‌కి బిగించింది. రంగులన్నీ తీసుకుని తన మస్తిష్కంలో రూపు దిద్దుకున్న చిత్రానికి ప్రాణం పోయడం ప్రారంభించింది.

***

వజ్రనేత్రుడు మరుసటి చిత్రానికి కావలసిన రంగులన్నీ సిధ్ధం చేసుకోవడానికి మూడు నాలుగు రోజుల సమయం పట్టింది. మొదటి రెండు రోజులూ చంద్రహాసిని బయటకు వెళ్ళకుండా గుహ లోపలే ఉండిపోయింది. ఆ తరువాత ఇక అంతకు మించి రుద్రపాదుడు ఆ అడవిలో అదే స్థలంలో ఉండే అవకాశం లేదనిపించాక గుహ బయటకు వచ్చింది.

రాత్రివేళ తను వచ్చినప్పుడు గమనించలేదు కానీ, ఈ గుట్ట చాలా ఎత్తులోనే ఉంది. తాము నిలబడిన స్థలం నుంచి దిగువలోనే అడవంతా పచ్చగా అందంగా కనిపిస్తోంది. పక్షుల కిలకిలా రావాలు మధురంగా వినపడుతున్నాయి. గాలివాటుకి కవాతు చేస్తున్న ఆకుల శబ్దం వింతగా వినిపిస్తోంది.

గుట్టమీద రాళ్ళ మధ్యనుంచి ఎత్తుగా పెరిగిన పచ్చగడ్డీ, అడుగు అడుగుకీ పెద్ద వృక్షాలు. ఆ వృక్షాల నిండా ఎర్రటి పూవులు. అరచేయి పరిమాణంలో ఉన్న ఆ పూలు ఎంతో అందంగా ఉన్నాయి. వాటి రేకుల మధ్యలో తెల్లటి చుక్కలు ఉన్నాయి. గాలికి నేలంతా రాలి అక్కడెవరో ఎర్రటి పొడి చల్లినట్టుగా ఉన్న ఆ పూవులని అలాగే ముచ్చటగా చాలా సేపు చూస్తూ కూర్చుండిపోయింది చంద్రహాసిని.

గుట్టకి మరోవైపు నుంచి చూస్తే చాలా దిగువలో దూరంగా అడవిలో పారుతున్న పెద్ద నదీపాయ కనపడుతోంది. బహుశా తాము దాటి వచ్చిన నది అదే అయిఉంటుందేమో అనిపించిందామెకి.

ఆమె గుట్టమీద అందాలన్నీ పొద్దుగుంకేలోపు తిలకిస్తూ ఉన్న సమయంలో అక్కడికి తిరిగి వచ్చాడు వజ్రనేత్రుడు.

“వజ్రనేత్రా, మేమీ అడవిలో ప్రవేశించినప్పుడు అసలెప్పుడూ కనీ వినీ ఎరుగనటువంటి భయంకరమైన వింత జంతువులు రెప్పవేటు కాలంలో మా సైనికులని నోటకరచుకుని వెళిపోయాయి. దూరం నుంచి చూసిన మా వాళ్ళు అవి రూపంలో పెద్ద పులుల్లా ఉన్నాయనీ కానీ, అంతకు మూడు రెట్లు పెద్దవిగా బలంగా ఉన్నాయనీ అన్నారు. కానీ, పెద్దపులి కూడా ఎంత వేగంగా తన ఆహారాన్ని నోట కరచుకున్నా, చూసేవాళ్ళ కంటిలో పడనంత వేగంగా మాయం అవడం సాధ్యం కాదుకదా. చాలా చిత్రంగా ఉంది. ఆ జంతువుల పేరు ఏమిటి? అంత వేగంగా పొదలమాటున అవి ఎలా మాయం కాగలిగాయి? మీకేమైనా తెలుసా?” అని అడిగింది.

వజ్రనేత్రుడు ఆమె చెప్పింది శ్రధ్ధగా విన్నాడు.

“చాలా కాలం క్రితం ఈ అడవిలో ఓ మాంత్రికుడు ఉండేవాడని చెప్పుకుంటారు యువరాణీ. ఆ మాంత్రికుడు పెద్దపులులనీ, మరేవో క్రూరమైన జంతువులనీ పెంచేవాడనీ, రెండు వేరు వేరు జాతుల క్రూర మృగాలని సంగమింపజేసి కొత్త జంతువులని పుట్టించే వింత వింత ప్రమాదకర ప్రయోగాలు చేసేవాడనీ అనుకునేవారు. ఎవరో ధీరుడైన యువరాజు అతన్ని సంహరించాడని కూడా చెప్పుకుంటారు. అతను మరణించినా అతను చేసిన ప్రమాదకరమైన ప్రయోగాల ఫలితమే మీరిప్పుడు చూసినది అనుకుంటాను. ఆ వింత జంతువుల సంతతి అంతకంతకూ పెరిగి పెద్దదవుతోంది కాబోలు.” అన్నాడు వివరంగా.

“అవునా. ఈ విషయం నేనెప్పుడూ వినలేదు. మా రాజ్యంలో కూడా తెలియదనుకుంటాను. ఇంతకీ ఈ విషయాలు మీకు ఎలా తెలుసు? మీది ఏ రాజ్యం?” అడిగింది యువరాణి.

వజ్రనేత్రుడు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని “యువరాణీ, నా గురించి తెలుసుకోవాలన్న కుతూహలం మీకుందని నాకు తెలుసు. తెలియజేయడం నా బాధ్యత కూడా.” అంటూ ఆగాడు.

చంద్రహాసిని చెప్పమన్నట్టుగా చూసింది.

“నేను మీ నాన్నగారి వద్ద ఎంతో నమ్మిన బంటుగా పనిచేసిన మంత్రి సిధ్ధవర్మ కుమారుడిని. యుక్త వయసు కూడా రాకపూర్వమే నేను అమితమైన మక్కువతో సైనికుడిగా శిక్షణ పొందడానికి సేనలో చేరాను. ఏ యుధ్ధ విద్య అయినా ఎంతో లాఘవంగా, అతి వేగంగా నేర్చుకోవడం చూసి మా నాన్నగారూ, మిగతా సైనికాధికారులూ కూడా నన్నెంతగానో మెచ్చుకునేవారు. అలా కొన్ని సంవత్సరాలలోనే నా పరాక్రమం చూసి భవిష్యత్తులో మహాసేనాధిపతి కాగల లక్షణాలు ఉన్నాయనీ, అందుకు తగిన విధంగా శిక్షణ నాకు ఇవ్వాలనీ ఆ సమయంలో మహాసేనానిగా ఉన్న విశ్వసేనుడికి చెప్పారు. కానీ, ఆ పదవి అతను తన కుమారుడైన రుద్రపాదుడికి ఇప్పించాలనే ఆలోచనలో ఉన్నారు. రుద్రపాదుడు కూడా ఆ సమయంలో నాలాగే సైనిక శిక్షణా శిబిరంలో ఉండేవాడు.

కానీ కొద్ది రోజులలోనే మిగిలిన అధికారులు, మంత్రుల ద్వారా నా పరాక్రమాల విషయం మహారాజులవారికి తెలిసి ఆయన కూడా నన్నే తదుపరి మహాసేనానిగా నియమించాలనీ, అందుకు తగిన రీతిలో శిక్షణ ఇవ్వాలనీ వృధ్ధులైన విశ్వసేనుడికి ఆజ్ఞ ఇచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులకే మా తండ్రిగారైన సిధ్ధవర్మ అనారోగ్యంతో మరణించారు.

ఒకరోజు విశ్వసేనుడు అరణ్య పర్యటనకు వెళుతూ వారితో పాటుగా నన్నూ వెంట తీసుకువెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు నన్ను బంధించివేసి మహారాజు ఎదుట నిలబెట్టి నేను గూఢచారులతో చేయి కలిపినట్టు వార్తలు వస్తున్నాయని మహారాజు గారికి చెప్పారు. మిగిలిన అధికారుల చేత కూడా ఆ విషయాన్నే నొక్కి చెప్పించడంతో ఆగ్రహించిన మహారాజు నాకు దేశ బహిష్కరణ శిక్ష విధించారు.

మీ తండ్రిగారివద్ద చిన్ననాటి నుంచీ స్నేహితుడిగా, నమ్మకస్తుడైన మంత్రిగా నా తండ్రి పనిచెయ్యడం వల్ల నన్ను చంపించడానికి చేతులు రాలేదు మహారాజుకి.

కుట్రలూ, కుతంత్రాలకీ, అసత్యాలకీ నిలయమైన రాజకీయాల కోసం నా నిజాయితీ నిరూపించుకోవాలని కూడా నాకు అనిపించలేదు. తండ్రిని కూడా పోగొట్టుకున్నాను అప్పటికే. వారిని ఎదిరించి పోరాడేంత పెద్దవాడినీ కాను. చిన్ననాటి నుంచీ కూడా నేను కృష్ణ భక్తుడిని. కృష్ణ నామాన్నే జపిస్తూ అడవిలో ఇంత దూరం రాగలిగాను. మధ్యలో ఎక్కడో ఒక రోజు అడవిలో జీవించే ఒక తెగ వారి వద్ద గడిపాను. వారి ద్వారానే నాకు ఈ మాంత్రికుడి సంగతీ, ఈ అడవిలో సంచరించే క్రూర మృగాల సంగతీ తెలిసింది. వారిదగ్గరే ఉండిపోమని వారెంతో బ్రతిమాలినా వినక నేను ఈ అడవిలో ప్రయాణించి ఇంత దూరం వచ్చాను. ఈ గుట్ట ఎక్కుతూ ఇక్కడ ఇలా రహస్యంగా ఉన్న ఈ గుహని చూసి ఇక దీన్నే నా నివాసంగా చేసుకున్నాను. ఇదీ నా కథ” అన్నాడు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ.

వజ్రనేత్రుడు తన గతాన్ని చెబుతున్నంతసేపూ ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి ఎంతో ఉద్వేగంగా వింది చంద్రహాసిని.

చిన్నతనంలో సిధ్ధవర్మని తను చూసింది. ఆ తరువాత సిద్ధారణ్యంలో జ్ఞానానందుడి ఆశ్రమంలో తను సకల విద్యలూ అభ్యసించడానికి అంతఃపురాన్ని వదిలి వెళిపోయాక అప్పుడప్పుడూ తండ్రితో కలిసి సిధ్ధవర్మ కూడా తనను చూడటానికి ఆశ్రమానికి వచ్చేవారు. ఆ తరువాత ఆయన మరణం గురించి వింది. కానీ, ఆయన కుమారుడి గురించిన వివరాలేవీ తను వినలేదు. విద్యాభ్యాసం ముగించుకుని తను అంతఃపురానికి తిరిగి వచ్చాక, రాజ రహస్యాలు సైతం తనకు వివరించేవారు తన తండ్రి. ఆ సమయంలో ఎప్పుడో మహాసేనాని పదవి విషయంలో ఎవరో ఓ పరాక్రమవంతుడిని తను ఎన్నుకుంటే అతను గూఢచారులతో చేతులు కలిపినట్టూ, అతనికి దేశబహిష్కరణ శిక్ష విధించినట్టూ చెప్పారు కానీ, అతను సిధ్ధవర్మ కుమారుడని తనకు తెలియనివ్వలేదు.

ఇక అతని గతాన్ని గురించి మాట్లాడదలుచుకోలేదు చంద్రహాసిని.

“మరి.. ఈ గీతగోవింద కావ్యం మీద మీకు ఇంత మక్కువ..” అని ఆపింది.

“చెప్పానుగా. నేను కృష్ణ భక్తుడిని. కృష్ణ తత్వాన్ని చిన్నతనంలోనే నా తండ్రిగారి ద్వారా, నా తాతగారి ద్వారా ఎంతో తెలుసుకున్నాను. ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలావిలాసాల్లో నా హృదయాన్ని నింపేసినది జయదేవ మహాకవి వ్రాసిన ఈ గీతగోవింద కావ్యం.

ఆ కావ్యాన్ని చదువుతూ ఆ రాధాకృష్ణుల ప్రేమని ఊహించుకుంటూ ఉండేవాడిని. నాకు చిత్రకళలో ప్రవేశం ఉండటం వలన చిన్నప్పుడు కృష్ణుడి చిత్రాలు ఎన్నో చిత్రించాను. ఇప్పుడు ఇలా నా జీవితం ఈ అరణ్యానికే అంకితమని నిర్ణయింపబడ్డాక, నా జీవితాన్ని ఈ గీతగోవింద కావ్యానికి చిత్ర రూపం ఇవ్వడానికే అంకితం ఇవ్వదలిచాను. నా జన్మకి ఓ సార్ధకతని ఇచ్చేది, నా మనసుకి సంత్రిప్తినిచ్చేదీ ఈ కార్యం ఒక్కటే.

ఈ జన్మ నాకు ఈ గీతగోవింద కావ్య గీతాల్ని చిత్రించడానికే ఇవ్వబడిందేమో. అందుకే నా జీవిత లక్ష్యం యుధ్ధాలు కాదని తెలియజేయడానికీ, నా లక్ష్యానికి వీలైన పరిస్థితులు కల్పించడానికే నాకిలా దేశ బహిష్కరణ విధింపబడిందేమో. అందుకు నాకు ఎంతో ఆనందంగా మనశ్శాంతిగా ఉంది యువరాణీ.” అన్నాడు వజ్రనేత్రుడు.

ఇదంతా చెప్పేటప్పుడు అతని కళ్ళలో వెలుగుతున్న నిజాయితీని గమనించిన చంద్రహాసిని చలించిపోయింది.

ఎంత సారూప్యం? తన ఆశయానికీ అతని లక్ష్యానికీ ఎంతటి సారూప్యం? ఒక రూపం లేకుండా ఇన్ని సంవత్సరాలుగా తన మనసులో మెదులుతున్న భావాలు, ఆలోచనలూ ఇక్కడికి రాగానే, ఇతన్ని చూడగానే ఘనీభవించి తన ఆశయానికి ఓ రూపాన్నిచ్చి, తన జీవితానికి అర్థాన్నిచ్చినట్టు ఎందుకనిపిస్తోందో ఇప్పుడు పూర్తిగా స్పష్టమైపోయింది.

ఇదంతా ఆ దేవదేవుడి మహిమేనేమో. ఎందుకా రాజభోగాలు? తన మనసుకి ఏ మాత్రం ఆనందాన్నీ, శాంతినీ ఇవ్వలేని రాజభోగాలు ఎందుకు తనకు? లేదు. ఒక దేశానికి మహారాణి కావడమో, యుధ్ధాల్లో మహా వీరత్వమున్న రాణిగా పేరు తెచ్చుకోవడమో కాదు తన జీవిత లక్ష్యం.

ఇక్కడే ఈ అరణ్యంలో, ఈ పచ్చని ప్రకృతి ఒడిలో వజ్రనేత్రుడి సహాయంతో గీతగోవింద కావ్యానికి చిత్ర రూపాన్నివ్వాలి. ప్రతి ఒక్క అష్టపదికీ అద్భుతమైన చిత్రరూపాన్నిచ్చి సామాన్య జనులు కూడా ఆ చిత్రాన్ని చూడగానే ఆ గీతం యొక్క సౌందర్యాన్ని గ్రహించగలిగి రసానుభూతిలో ఓలలాడగలగాలి. అనంతమైన అజరామరమైన ఆ రాధాకృష్ణుల ప్రేమ గురించి తెలుసుకోవాలి. పరస్పర ప్రేమలోని మాధుర్యమేమిటో విశ్వవ్యాపితం కావాలి.

బదులు మాట్లాడకుండా సూటిగా తనవైపు చూస్తూనే ప్రసన్నమవుతూ, ప్రకాశవంతమవుతున్న చంద్రహాసిని కనులను చూశాడు వజ్రనేత్రుడు. ఆమె చెప్పకుండానే అతనికి ఆమె ఆలోచనలు అవగతమైనట్టు చిన్నగా తలూపాడు చిరునవ్వు నవ్వుతూ.

ఆ తరువాత వజ్రనేత్రుడు రంగుల  తయారీ కోసం వివిధ రకాల, వివిధ వర్ణాల పుష్పాలని సేకరించి తెస్తే అన్నిటికీ తన వంతు సహాయాన్ని అందించిందామె.

గుహలో గచ్చు మీద ఆమె విశ్రమించడం కష్టమని వజ్రనేత్రుడు గచ్చు మీద దొంతరలుగా పరచడానికి ఎన్నో తామరాకులని సేకరించి తెస్తే సున్నితంగా నిరాకరించిందామె. మేఘాలంటి మెత్తనైన పరుపుల మీద సేద దీరడానికి అలవాటు పడ్డ ఆమె అందమైన శరీరం కఠినమైన గుహ గచ్చు మీద ఎలా సేదతీరగలుగుతోందో అతనికి చిత్రంగా తోచింది. దేనికైనా మనసే ముఖ్యమని తెలిసినా ఆమె పరిస్థితికి మొదట్లో చింతించకుండా ఉండలేకపోయాడు వజ్రనేత్రుడు.

వర్ణాల తయారీ పూర్తయిన తరువాత చిత్ర రచన మొదలుపెట్టాడు.

మొదట వేసిన చిత్రానికి పక్కనే ఈ చిత్రాన్ని చిత్రించేందుకు తన చేతిని ముందుకు చాచిన సమయంలోనే అతని వెనుక నిలబడింది చంద్రహాసిని.

“స్నిగ్ధ మధుసూదన రసావలయమా ఇప్పుడు మీరు చిత్రించబోయేది?”  అనడిగింది.

వజ్రనేత్రుడు తల తిప్పకుండానే చిరునవ్వుతో చిన్నగా తల ఊపాడు అవునన్నట్టు.

చంద్రహాసిని దూరంగా జరిగింది. అతనికి కుడివైపుగా చదునుగా కాస్త ఎత్తుగా ఉన్న స్థలంలో కూర్చుంది.

అద్భుతమైన రాగంలో పాట మొదలుపెట్టింది.

“స్తనవిని హితమపి హారముదారం…సామనుతే కృశ తనురివ భారం..”

మధుర మనోహరంగా పాడుతూ తన హృదయం పైన ఉన్న తన ముత్యాల హారాల్ని బరువుగా ఉన్న భావనని తన ముఖంలో ప్రతిఫలింపజేస్తూ మెల్లగా తీసి ఆ హారాన్ని సున్నితంగా పక్కన విసిరేసింది.

“సరస మసృణమపి మలయజపంకం

పశ్యతి విషమివ వపుషి స శంకం….”

వయ్యారమైన భంగిమలో కూర్చుని ఈ చరణాన్ని పాడుతూ తన చేతుల మీద వ్రాసుకుంటున్న చందనం విషపూరితమైపోతున్నట్టుగా భావిస్తూ ఆ అనుభూతిని తన ముఖంలో చూపిస్తూ అతని వంక చూసింది.

“శ్వసితపవనమనుపమ పరిణాహం      

మదన దహనమివ వహతి సదాహం..”

విరహాగ్ని తనను చుట్టుముట్టినట్టుగా భావిస్తూ వేడి నిట్టూర్పులతో నడుముని విల్లలా వంచి తల పైకెత్తి పక్కకి వంచి వ్యధాభరితలా కూర్చుంది.

ఆ పాట పాడుతూనే రాధ యొక్క మనస్థితిలోకి వెళ్ళిపోయిన చంద్రహాసినికి ఆమెకు తెలియకుండానే కన్నుల నుండి నీరు జాలువారింది.

“దిశి దిశి కిరతి సజలకణజాలం

నయన నళినమివ విగళిత నాళం..”

వజ్రనేత్రుడామె దగ్గరగా వచ్చి ఆమె ముఖంలోకి చూస్తూ నీరు నిండిన ఆమె కన్నులను అపురూపంగా చూస్తూ దుఃఖం వల్ల ఆగిన ఆమె గానాన్ని తను అందుకున్నాడు.

నయన విషయమపి కిసలయ తల్పం ..

కలయతి విహితహుతాశన కల్పం..

అతనే పాడాడు ఆమె ముఖంలో అద్భుతంగా పలుకుతున్న భావాల్ని గమనిస్తూ

ఆమె మెల్లగా తన కుడిచేతిని చెక్కిలి మీద పెట్టుకుని స్థబ్దుగా మారుతూ “హరీ హరీ” అని జపిస్తూ పెదవులు కదలిస్తోంది.

“త్యజతిన పాణి తలేన కపోలం

బాల శశినమివ సాయమలోలం..”

నిజంగా పున్నమి చంద్రుడిని తలపిస్తున్నట్టుగా ఉన్న ఆమె ముఖారవిందాన్ని చూస్తూ ఆలపిస్తున్నాడు రుద్రనేత్రుడు.

“హరిరితి హరిరితి జపతిస కామం

విరహ విహిత మరణేన నికామం..

రాధికా కృష్ణా.. రాధికా

తవ విరహే కేశవా..

రాధికా కృష్ణా.. రాధికా”

నిజంగా ఆ ద్వాపర యుగంలో రాధ తానే ఒక మహామోహరాగమై ఈ విధంగానే కృష్ణుడి రాక కోసం పరితపించిందా అన్నట్టుగా ఉన్న చంద్రహాసిని రూపాన్ని కన్నుల్లో నింపుకుంటూ చక చకా ఆ గుహ గోడ మీద ఆమె చిత్రాన్ని రచించసాగాడతను.

అదో తపస్సై పొద్దుగుంకేసరికి పూర్తి అయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here