[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 21వ భాగం. [/box]
[dropcap]వ[/dropcap]జ్రనేత్రుడు నిప్పు రాజేశాడు. చీకటి కాబోతున్న గుహంతా వెలుగు పరుచుకుంది. ఆ వెలుగులో అతను చిత్రించిన చిత్రం వింతగా మెరిసింది.
అద్భుతమైన భంగిమలో రాధ విరహ బాధనంతా చూపిస్తూ ఉన్న చంద్రహాసిని చిత్రం. ఆమె హృదయం నుండి వేరయిన ముత్యాల హారం పక్కన పడి ముత్యాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఆమె చేతి మీద చందనం వేడి సెగలు పుడుతున్నట్టుగా ఉంది. కాస్త దూరంలో ఉన్న తామరకుల పాన్పు అగ్ని జ్వాలల్లా ఆమెకు కనిపిస్తూ ఉంది.
స్తబ్ధుగా ఉన్న ఆ రాధ యొక్క అధరాలు హరీ అని జపిస్తున్నట్టుగా తెరుచుకున్న అధరాలు కొద్దిగా సాగి ఉన్నట్టు చిత్రించాడు.
తను పూర్తి చేసిన చిత్రాన్ని అతను తృప్తిగా చూసుకుంటుంటే అతని వెనుకే వచ్చి నిలబడిందామె.
“శ్రీ జయదేవ.. భణిత మితి గీతం..
సుఖయతు కేశవపాదం యుపనీతం
రాధికా కృష్ణా .. రాధికా…తవ విరహే కేశవా…”
ఆమె స్వరంతో తనూ జతకలుపుతూ ఆ పాటని ముగించి మైమరచిపోతూ చిత్రాన్ని చూసుకున్నాడు వజ్రనేత్రుడు.
ఆనందంతో హాయితో బరువెక్కిన హృదయాన్ని శాంతపరుచుకుంటూ అద్భుతంగా ఆవిష్కరింపబడిన ఆ చిత్రాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయింది చంద్రహాసిని.
***
కొన్ని గంటల తరువాత తన్మయి తను చిత్రిస్తున్న చిత్రానికి కొద్ది దూరంగా జరిగింది. మళ్ళీ నిట్టూర్చింది.
విరహంతో వేదనగా కూర్చున్న రాధ భంగిమను చిత్రించి చుట్టూ సెగలు వదులుతున్న తామరాకులూ, విసిరివేయబడిన రాధ మెడలోని హారాలూ అన్నీ చిత్రించింది. వెనుక బాక్‌గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చింది. ఆకాశంలో పున్నమి చంద్రుడు. వెండి మబ్బులు. రాధ వెనుక పూల పొదరిల్లూ అన్నీ చక్కగా తను అనుకున్నట్టుగా ఊహించుకున్నట్టుగా అద్భుతంగా వచ్చాయి. కానీ, రాధ ముఖంలోని హావభావాలు అంత బాగా వచ్చినట్టుగా అనిపించడంలేదు తనకు.
భరించలేని విరహం ఆమె ముఖంలో ప్రతిబింబించడం లేదు.
అలసటగా అనిపించింది ఆమెకు. నిలబడి ఉండటం వల్ల కాళ్ళు పీకుతున్నాయి. నీరసంగా నేలమీద కూలబడింది.
అప్పుడే తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు ప్రకాశరావు.
“తన్మయీ, ఏమిటలా కింద కూర్చున్నావు?” అని అడుగుతూ ఆమె ఎదురుగా ఉన్న పెద్ద కాన్వాసుపైన రూపు దిద్దుకున్న చిత్రాన్ని చూసి అవాక్కై నిలబడిపోయాడు.
“ఎంత బాగా వేశావు తన్మయీ. రాత్రంతా ఇక్కడే ఉన్నావా అయితే? ఆ పొదరిల్లూ, ఎర్రటి పూల లతలూ, రాధ భంగిమా ఎంతో గొప్పగా ఉందిరా.” అన్నాడు.
“లేదు నాన్నా. రాధ ముఖంలో నేను అనుకున్న భావం పలకడంలేదు.” విచారంగా అంది తన్మయి.
ప్రకాశరావు తేలిగ్గా తీసుకుంటూ “లేదురా. కృష్ణుడి మీద బెంగతో ఎదురుచూస్తున్న రాధ. ఎంతో బాగా వేశావు. సరేలే. ఇక కాస్త విశ్రాంతి తీసుకోకూడదూ?” అన్నాడు కూతుర్ని లేపుతూ.
తన్మయి ఎదురుచెప్పకుండా ప్రకాశరావుతో బయటికి నడిచింది.
దేవకికి పరిస్థితి అర్థమయింది. తన్మయి ఫ్రెష్ అవడానికి బాత్‌రూం లోకి వెళ్ళగానే వేడి పాలు కలిపి తీసుకువచ్చింది.
తల్లి తెచ్చిన పాలు తాగేసి అలసటగా తన మంచం పైన వాలిపోయింది తన్మయి.
ఆమె గది తలుపు దగ్గరగా వేసి వంటింట్లో ఉన్న దేవకి దగ్గరికి వెళ్ళాడు ప్రకాశరావు. “ఇవాళ తన్మయి ఆఫీసుకి వెళ్ళకపోవడమే మంచిది. రాత్రంతా పడుకోకుండా పెయింటింగ్ వేసుకున్నట్టుంది. ఎంత చక్కటి బొమ్మ వేసిందో వెళ్ళి చూడు.” అన్నాడు.
“ఊ.. అర్థమయింది. హాయిగా తనకి ఇష్టమైన ఈ పెయింటింగ్స్ వేసుకోకుండా అంత దూరం ఆఫీసుకి వెళ్ళి ఆ సాఫ్టువేర్ జాబ్ ఎందుకు దానికి? మానేసి తన మనసుకి నచ్చిన ఈ కళ మీదే మరింత శ్రధ్ధ పెట్టవచ్చు కదా. చెబితే వినదు.” అంది దేవకి కాఫీ కలుపుతూ.
“ఈ కాలం పిల్లలు తమకంటూ ఓ సంపాదన లేకుండా ఉండగలరా దేవకీ? ఆ సాఫ్టువేర్ ఉద్యోగం పైన మనసు లేకపోయినా, తన కాళ్ళ మీద తను నిలబడాలన్న ఆలోచనతోనే అది ఇంకా ఆ ఉద్యోగం చేస్తోంది. దాని మనసుని అర్థం చేసుకునేవాడొచ్చి రేపు పెళ్ళయినా తన కళాభిరుచిని గౌరవించి సాధనకి ఏ అడ్డూ లేకుండా చూసుకోగలవాడయితే అదే హాయిగా మానేస్తుందేమో ఈ ఉద్యోగం చూద్దాం.” అన్నాడు.
తన్మయికి ఆ మాటలేవీ వినిపించలేదు కానీ, మనసంతా ఎందుకో చేదుగా అయిపోయింది.
అంత పెద్ద కాన్వాసు మీద చాలా కష్టపడి వేసింది. రంగులూ, మేళవింపూ అంతా తను అనుకున్నట్టే అచ్చంగా తన మనసులో మెదిలినట్టే వచ్చింది. రాధ భంగిమ కూడా బాగా వచ్చింది. కానీ, ముఖంలోని భావాలు ముఖ్యం కదూ. అది సంతృప్తికరంగా రాలేదు.
మగతగా ఉందామెకి. కాసేపు నిద్రపడుతోంది. అంతలోనే మెలకువ వస్తోంది. తన కల తను నెరవేర్చుకోగలదా? కష్టసాధ్యమైనదే. కానీ, ఎంత గొప్పగా రంగుల్ని మేళవించినా, రాధాకృష్ణుల ముఖాల్లో భావాల్ని తీసుకురాలేనప్పుడు తను ఏం సాధించినట్టు?
అలా మూడు, నాలుగు గంటలు నిద్రకీ, మెలకువకీ మధ్య ఊగుతూ ఉండగానే ఆమె ఫోన్ మోగింది. మొబైల్‌లో టైమ్ ఉదయం పదకొండుగా సూచిస్తోంది.
ఉలిక్కిపడి నిద్ర మత్తు విదిల్చుకుంటూ ఫోన్ తీసింది. అవతల ఆఫీసు లాండ్‌లైన్ నుంచి భార్గవి ఫోన్.
తను హలో అనగానే “తన్మయీ, ఇవాళ ఆఫీసుకి ఇంత లేటయిందేమిటి? మరో అరగంటలో మీటింగ్ ఉంది. ఎక్కడున్నావ్?” అంది.
అప్పుడు గుర్తువచ్చింది తన్మయికి. ఆ రోజు ఆఫీసులో చాలా చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది.
“ఓ, భార్గవీ… రాత్రంతా పెయింటింగ్ వేసుకుంటూ ఉండిపోయాను. అలసటగా ఇందాకే పడుకున్నాను. గుర్తులేదు. ఏం చెయ్యను? మేనేజర్ అడిగారా?” అంది.
“ఇంకా లేదు తన్మయీ. రాత్రంతా పెయింటింగ్ వేశావా? వావ్. ఏం పెయింటింగ్?”
“ఏదోలే. అంత సంతృప్తికరంగా ఏమీ రాలేదు. మనసు కూడా బాలేదు. ఇవాళ ఆఫీసుకి రావాలని కూడా లేదు భార్గవీ. మేనేజర్ ఏమంటారో.”
“తన్మయీ. నువ్వు రెస్ట్ తీసుకో. నేను మేనేజ్ చేస్తాలే. వర్రీ అవకు. సాయంత్రం ఫోన్ చేస్తా.” కంగారుపడుతున్న తన్మయికి భరోసా ఇస్తూ ఫోన్ పెట్టేసింది భార్గవి.
సాయంత్రం ఆఫీసు అవగానే ఫోన్ చెయ్యలేదు భార్గవి. నేరుగా తన్మయి ఇంటికే వచ్చేసింది.
అప్పటికి తన్మయి తల్లి ఇచ్చిన టీ తాగి బాల్కనీలో కూర్చుంది. భార్గవి ఆమె వెనుకే వెళ్ళి భుజాల చుట్టూ ఆప్యాయంగా చెయ్యి వేసింది.
“భార్గవీ. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. మేనేజర్ ఏమైనా అన్నారా?”
తన ముఖంలోకి ఆత్రుతగా చూస్తూ అడుగుతున్న తన్మయి చెయ్యి మెత్తగా నొక్కుతూ “నేనుండగా నిన్ను ఏమైనా అననిస్తానా? అయినా ఇంకా ఎందుకు ఆఫీసు గురించి ఆలోచిస్తున్నావ్? సెలవు పెట్టాక ఇక ఆలోచించకూడదు. సరేగానీ, నాకు నీ కొత్త పెయింటింగ్ చూపించవా ప్లీజ్” అంటూ తన్మయి ముఖంలోకి చూసింది అర్ధింపుగా.
తన్మయి లేచి తిన్నగా భార్గవిని తన పెయింటింగ్ గదిలోకి తీసుకువెళ్ళింది.
తలుపు తియ్యగానే ఎదురుగా కనిపించిన తన్మయి పెయింటింగ్ చూసి బొమ్మలా నిలబడిపోయింది భార్గవి. ఎంత అద్భుతంగా వేసింది. వెంటనే ఆమె మనసులో తేజ మెదిలాడు. ఎందుకు తేజని తన్మయికి ఇంతవరకూ తను పరిచయం చేయకుండా ఆలస్యం చేసింది? తేజ ఇటువంటి చిత్రాల కోసమే వెతుకుతున్నాడేమో. తన్మయి చిత్రాల్ని చూస్తే ఇంతవరకూ తేజ పడుతున్న వేదనంతా తీరిపోతుందేమో. బహుశా తన్మయే తేజకి సరయిన వైద్యమేమో అని ఆమెకు ధృఢంగా అనిపించింది.
అప్రయత్నంగానే తన్మయి దగ్గరగా వచ్చి ఆమెని హత్తుకుంది గట్టిగా.
“భార్గవీ. ఏంటిది?” సున్నితంగా ఆమెని దూరం జరుపుతూ నవ్వింది తన్మయి.
భార్గవి మౌనంగా తన్మయి చేయి పట్టుకుని ఆమె గదిలోకి తీసుకువెళ్ళింది. తన్మయి మంచం పైన తను కూర్చుంటూ తన్మయిని కూడా తన పక్కనే కూర్చోబెట్టుకుంది.
“తన్మయీ, నీకు మా తేజ విషయంలో ఈ మధ్య జరిగిన సంఘటనలేవీ చెప్పలేదు కదూ. ఇప్పుడు చెప్పాలనిపిస్తోంది. విను తన్మయీ” అంటూ భార్గవి తను తేజకి తన్మయి వేసిన చిత్రాల గురించి చెప్పడంతో తేజ ఉత్తేజితుడై కొద్దిగా చేయి కదిపి కాన్వాసు మీద పెయింట్ చెయ్యగలగడం దగ్గర నుంచీ క్రితం రోజు బ్రెయిన్ స్కాన్ చెయ్యడం, ఇక కౌన్సిలింగ్ ఇప్పించాలని అనుకోవడం వరకూ అన్నీ వివరంగా చెప్పింది.
భార్గవి చెబుతున్న విషయాలన్నీ ఊపిరి బిగబట్టి ఆశ్చర్యంగా వింది తన్మయి.
చిత్రకళంటే ప్రాణం పెట్టే వ్యక్తి అసలు ఏ చిత్రమూ గీయలేకపోవడం ఏమిటి? అతనికి రాధాకృష్ణుల చిత్రాలంటే అంత ప్రేమా? ఎన్ని రాధాకృష్ణుల చిత్రాలు చూసినా తృప్తి కలగకపోవడమా? చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వంలా ఉంది. తన ఇష్టాలే అతనివి కూడా. అంత ప్రాణంగా ప్రేమించే చిత్రకళని అభ్యసించే విషయంలో అతను ఓడిపోతూ ఉండటం, అయినా పట్టువదలక చిన్నప్పటి నుంచీ కూడా అలా ప్రయత్నిస్తూనే ఉండటం తేజ మీద జాలి కలిగించిందామెకి. అతన్ని వెంటనే చూడాలనిపించింది. తన వంతుగా ఏమైనా చెయ్యగలదేమో. ఎవరికి తెలుసు? తనూ అంతేగా? రాధాకృష్ణుల వర్ణ చిత్రాలంటే చిన్ననాటి నుంచీ తనకి ప్రాణం. ఎన్ని పుస్తకాలు వెతికేది అటువంటి చిత్రాల కోసం. ఎంతమంది చిత్రకారుల చిత్రాల్లో తను కోరుకునే పోలికల కోసం వెతికేది. ఎక్కడా దొరకలేదు. చివరికి తను కోరుకునే విధంగా ఇన్నేళ్ళకి తను గీయగలుగుతోంది కానీ, రాధాకృష్ణుల ముఖాల్లో ఆ భావావేశాన్ని లోటు లేకుండా చిత్రించలేకపోతోంది.
అంతా అయోమయంగా అనిపించింది తన్మయికి.
తనెప్పుడూ తన లోకంలో తను ఉంటుంది. కొత్త వ్యక్తులని కలిసే ఆసక్తి తనకు సాధారణంగా ఉండదు. తేజ విషయంలో ఇక ఆ జాప్యం పనికిరాదనిపిస్తోంది. ఒకసారి కలిస్తే భార్గవి కూడా సంతోషపడచ్చు. కనీసం స్నేహుతురాలి కోసమైనా తేజని కలవాలి.
తన్మయి ఇలా ఆలోచనలో ఉండగానే ఆమె భుజం మీద చేయి వేసింది భార్గవి.
“తన్మయీ, ఒక పెద్ద రెక్వెస్ట్. నువ్వొకసారి తేజని కలు ప్లీజ్. నువ్వు ఒప్పుకుంటే తననే ఇక్కడికి తీసుకువస్తాను. నీ పెయింటింగ్స్ చూస్తే తను తప్పకుండా ఎంతో సంతోషిస్తాడు. కౌన్సిలింగ్ వల్ల పెద్దగా ఉపయోగమేమీ ఉండదు అనే నిరాశలో ఉన్నాడు. ఈ సమయంలో నీ పెయింటింగ్స్ చూస్తే తనలో ఉత్సాహం కలుగుతుందనిపిస్తోంది. ఇది తన ట్రీట్మెంట్‌కి తప్పకుండా ఉపయోగపడుతుంది. ప్లీజ్ కాదనకుండా నాకీ సహాయం చెయ్యవా.” తన్మయి భుజం మీద నుంచి చేయి తీసి ఆమె రెండు చేతుల్నీ గట్టిగా పట్టుకుంటూ అభ్యర్ధిస్తున్నట్టుగా అంది భార్గవి.
తన్మయి సిగ్గుపడిపోతూ తన చేతులు విడిపించుకుంది. “భార్గవీ, ఏంటిది? నువ్వంతగా బ్రతిమాలాలా? సాటి చిత్రకారుడికి నా నుంచి సహాయం అవసరం అంటే చెయ్యకుండా ఉంటానా? నా చిత్రాలు అతనిలో ఫోబియాని పోగొట్టి అతను చిత్రకారుడిగా ఎదిగేలా సహాయపడతాయంటే అంతకంటే నాకు మాత్రం కావలసింది ఏముంది చెప్పు? తప్పకుండా తేజని ఇక్కడికి తీసుకురా.”
ఆ మాటకి భార్గవి ముఖం వెలిగిపోయింది. తన్మయి చేతిని సున్నితంగా ముద్దాడుతూ “థాంక్స్ తన్మయీ. థాంక్యూ వెరీ మచ్. అసలు ఇప్పుడే తనని ఇక్కడికి తీసుకురావాలని ఉంది. కానీ అంత దూరం నుంచి రావాలి తను. రేపటి నుంచీ మన రిలీజ్ కోసం పని చెయ్యాలి. ఇక మేనేజర్ పర్మిషన్ కూడా ఇవ్వడు. సో, వచ్చే శనివారం తేజని ఇక్కడికి తీసుకువస్తాను.” అంది.
సరేనన్నట్టు తలూపింది తన్మయి.
భార్గవి సంతోషంగా అక్కడి నుంచి హాస్టల్‌కి వెళ్ళిపోయింది.
(సశేషం)