స్నిగ్ధమధుసూదనం-23

0
2

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 23వ భాగం. [/box]

[dropcap]వ[/dropcap]జ్రనేత్రుడూ, చంద్రహాసినీ తేరుకుని వెనక్కి తిరిగేలోపే అక్కడికి రుద్రపాదుడు వచ్చాడు.

అతన్ని చూస్తూనే చంద్రహాసిని ఆశ్చర్యపోయింది.

“వజ్రనేత్రుడు…” వజ్రనేత్రుడి వంక క్రూరంగా చూస్తూ అతని పేరు నొక్కి పలికాడు రుద్రపాదుడు.

“నువ్వు ఇక్కడున్నావనమాట. మహారాజు గారి మీద పగతీర్చుకోవడం కోసం యువరాణీని ఇక్కడ బంధించావన్న మాట.” అన్నాడు గంభీరంగా.

చంద్రహాసిని తేరుకుని “రుద్రపాదా … అలాంటిదేమీ జరగలేదు.” అంది.

ఆమె మాటలకి వికటాట్టహాసం చేశాడు రుద్రపాదుడు.

“అదే జరిగింది యువరాణీ. మహారాజు గారికి నేను అలాగే చెబుతాను. ఈ కొద్ది నెలల కాలంలో మీమీద బెంగతో మంచం పట్టారు మహారాజు గారు. మరో సారి అడవంతా జల్లెడ పట్టి అయినా మిమ్మల్ని వెతికి తెస్తానని చెప్పి బయలుదేరి వచ్చాను. ప్రాణాలకు తెగించి నేను, మిమ్మల్ని బంధించిన ఈ వజ్రనేత్రుడిని ఎదుర్కొని అతన్ని మట్టుపెట్టినట్టు కూడా చెబుతాను.” అని మరింత వికృతంగా నవ్వుతూ చేతిలోని కరవాలంతో వజ్రనేత్రుడి కుడిచేయి మీద ఒక్క వేటు వేశాడు.

అసలు ఊహించని ఆ పరిణామానికి హతాశురాలైపోయిన చంద్రహాసిని తేరుకునేలోపే రుద్రపాదుడు బాధతో మెలికలు తిరుగుతున్న వజ్రనేత్రుడిని గుండెల్లో పొడవడానికి సిధ్ధపడి ముందుకు దూకాడు. రెప్పపాటు కాలంలో వజ్రనేత్రుడిని కాపాడాలని అడ్డువెళ్ళిన చంద్రహాసిని గుండెల్లో ఆ కరవాలం దిగబడిపోయింది. వెచ్చటి నెత్తురు ఉబికి వచ్చింది.

“చంద్రహాసినీ..”  బాధగా అరిచాడు వజ్రనేత్రుడు.

రుద్రపాదుడు అగ్గిమీద గుగ్గిలమైపోయాడు.

“యువరాణీ, ఏమిటీ పిచ్చి పని?”

అతని మాటలు వినిపించుకునే స్థితిలో లేదు చంద్రహాసిని. వజ్రనేత్రుడి ఒడిలో వాలిపోయింది. అతని కన్నుల్లోకి చూస్తూ అలాగే ప్రాణాలు వదిలింది.

రుద్రపాదుడు ఆలస్యం చేయకుండా వజ్రనేత్రుడిని కూడా తన కరవాలానికి బలిచేశాడు. పిచ్చి వాడిలా అరుస్తూ గుహ బయటికి వెళిపోయాడు. అక్కడే బయట తన కోసం ఎదురుచూస్తున్న అతి కొద్ది మంది భటులనీ చూస్తూ “ఆ రాజద్రోహి వజ్రనేత్రుడు ఇక్కడే మన రాకుమారిని బంధించాడు. ఇప్పుడు నన్ను చూస్తూనే భయంతో రాకుమారిని చంపేశాడు. అతన్ని నేను వధించాను. రండి. జరగవలసింది చూద్దాం.” అంటూ భటులని లోనికి పిలిచాడు.

అక్కడ వజ్రనేత్రుడి ఒడిలో ప్రశాంతమైన వదనంతో కన్నుమూసినట్టుగా ఉన్న చంద్రహాసినినీ, ఆమెను ప్రేమగా ఎడమచేత్తో పొదవి పట్టుకుని అలాగే పక్కకి వాలిపోయి ఉన్న వజ్రనేత్రుడినీ చూస్తూ భటులు కన్నీరు పెట్టుకున్నారు.

***

తేజ భార్గవితో కలిసి తన్మయి ఇంట్లో అడుగుపెట్టాడు.

వారిద్దరికీ ఎదురొచ్చి స్వాగతం పలికింది తన్మయి.

భార్గవి ఇద్దరినీ ఒకరికొకరికి పరిచయం చేసింది. ఇద్దరినీ కూర్చోబెట్టి మంచినీళ్ళిచ్చింది తన్మయి.

“తన్మయీ, ఈ ఉపచారాలేవీ వద్దు. త్వరగా నీ పెయింటింగ్స్ చూపించు ప్లీజ్.”

భార్గవి తొందరపెడుతుంటే తన్మయి నవ్వుతూ లేచి వాళ్ళిద్దరినీ తన పెయింటింగ్స్ గదిలోకి తీసుకువెళ్ళింది. తలుపు తెరిచి లైటు వేసింది.

ఆ వెలుగు గదంతా పరుచుకుంది. తన్మయి ఎంతో అందంగా ఒక ఆర్ట్ గాలరీలా తన పెయింటింగ్స్ అన్నీ గోడకి తగిలించి కొత్తగా వేసిన పెద్ద పెయింటింగ్స్‌ని స్టాండ్లకి బిగించి గది మధ్యలో పెట్టి ఉంచింది.

“వావ్ తన్మయీ. ఎప్పుడు సర్దావు ఇంత బాగా? నీ గది ఒక ఆర్ట్ గాలరీలా ఉంది తెలుసా.” అంటూ భార్గవి చిన్నపిల్లలా గదంతా తిరిగింది.

తేజ అప్రతిభుడైపోయి గది మొదట్లోనే నిలబడిపోయి ఉన్నాడు. అతని చూపులు గది మధ్యలో ఉన్న పెయింటింగ్ మీద ఉన్నాయి.

“హరివల్లభ శోకపల్లవం…” గట్టిగా అంటూ ఆ పెయింటింగ్ దగ్గరికి వెళ్ళాడు.

ఆ మాట వింటూనే తన్మయి ఆనందంగా అతని వైపు చూసింది.

“నిందతి చందనమిందుకిరణమను … విందతిఖేదమదీరం…” సన్నగా పాడుతూ ఆ పెయింటింగ్ మీద సున్నితంగా వేళ్ళతో రాశాడు తేజ.

ఎప్పుడూ పాటలే పాడని తేజ, అసలు సంస్కృతం రాని తేజ ఎలా పాడుతున్నాడో తెలీక భార్గవి విచిత్రంగా చూసింది.

నిద్రలో నడుస్తున్నవాడిలా గదంతా కలియజూసి ఓ మూలగా టేబుల్ మీద పెట్టి ఉన్న రంగులనీ, బ్రష్‌లనీ తీసుకున్నాడు తేజ. ఆ చిత్రానికి దగ్గరగా వచ్చి తన్మయి ఆ చిత్రంలో అసంపూర్తిగా వదిలేసిన రాధని చిత్రీకరించాడు. అత్యంత శ్రధ్ధగా, ఎంతో నేర్పుగా. చేయి తిరిగిన చిత్రకారుడిలా చక చకా ముఖకవళికలతోనే విరహోత్కంఠిత అయిన రాధని చిత్రిస్తున్న తేజ వంక అప్రతిభురాలై చూస్తూ ఉండిపోయింది భార్గవి.

తన్మయి మైమరచిపోతూ తేజ పక్కన నిలబడింది.

తేజ రాధ చిత్రాన్ని పూర్తిచెయ్యగానే, తను వేసిన చిత్రం సంపూర్ణమయిందన్న తృప్తి కలిగింది తన్మయికి. కాన్వాసు మీద ఎడమ పక్కగా కృష్ణుడి వద్దకు వచ్చి తన స్నేహితురాలయిన రాధ వ్యథను వివరిస్తున్న చెలికత్తె. కుడివైపు కొంచం పైన పొదరింట్లో విరహోత్కంఠిత అయిన రాధ. ఆ పొదరింటి పక్కనే మన్మథుడిని పూజించిన గుర్తులు. పెద్ద ఆకు మీద మన్మథుని చిత్రం, అక్కడే పూజ చేసినట్టుగా రాలిన పూలు. ఇప్పుడు.. రాధ. చంద్రుడినీ, వెన్నెలనీ తిడుతూ, చందనాన్ని కూడా తోసిపుచ్చుతూ విరహంతో వేగిపోతున్నట్టుగా ఉంది ఆమె ముఖం.

మైమరపుతో కళ్ళుమూసుకుంది తన్మయి.

“స్నిగ్ధ మధుసూధన రసావలయం” అన్న తేజ గొంతు వినపడి కళ్ళు తెరిచిన ఆమెకు గది మధ్యలో తను పెట్టిన రెండవ పెయింటింగ్ వద్దకు వెళ్ళి అందులో తనకి అసంతృప్తిగా అనిపించిన రాధ ముఖంలో హావభావాల్ని అలవోకగా సరిచేస్తూ కనపడ్డాడు తేజ. అతి త్వరలో ఆ చిత్రంలో రాధ ముఖాన్ని తను అనుకున్నట్టుగా మనోహరంగా తీర్చి దిద్దాడు.

నమ్మలేనట్టుగా చూస్తోంది భార్గవి. తేజ కానీ, తన్మయి కానీ ఆమెను గమనించే స్థితిలో లేరు. ఆ రెండు పెయింటింగ్స్ దగ్గరా గంట గడిపాకా గది గోడలకి తగిలించిన ప్రతి ఒక్క పెయింటింగ్ వద్దకీ వెళ్ళి ఉప్పొంగుతున్న హృదయంతో ఆనంద డోలికల్లో తేలిపోతూ చూసాడు తేజ. ఏదో కొత్త జన్మ పొందినంత ఆనందంగా ఉందతనికి. లేదనుకున్న ఆసరా ఏదో సొంతమైపోయిన భావన కలిగింది.

తన్మయి అతను పూర్తి చేసిన తన చిత్రాలనీ, అతన్నీ మార్చి మార్చి చూస్తోంది. ఆమె మనసు మబ్బులు వీడిన చంద్రబింబంలా వెలుగులు చిమ్మింది. తన జీవితం పరిపూర్ణం కావడానికి కావలసినదేదో దొరికినంత ఆనందం ఆమెలో.

అన్ని చిత్రాలనీ చూశాక తేజ తన్మయి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలే సంగీతంలా వినపడుతున్నాయి తన్మయికి. అతని కళ్ళలో చెమ్మ ఆమె కళ్ళలో మెరిసింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here