స్నిగ్ధమధుసూదనం-24

0
2

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది 23వ భాగం. [/box]

[dropcap]త[/dropcap]న్మయి ఉద్యోగానికి రాజీనామా చేసింది.

తన్మయీ, తేజా కలిసి చాలా కాలం చర్చించుకుని ఒక ప్రోజక్ట్ మొదలుపెట్టారు.

అది గీతగోవింద కావ్యానికి చిత్రరూపాలని ఇవ్వడం. ప్రతి అష్టపదిలో ప్రతి శ్లోకానికీ అద్భుతంగా వర్ణ చిత్రాల్ని వెయ్యడం. చిత్రాలు చూడటంతోనే అందరికీ గీతగోవిందంలోని మాధుర్యం అర్థం అయిపోయేలా చిత్రించడం.

సంస్కృతం చదవలేదనో, పద్యాలు చదివే ఆసక్తి లేదనో ఆ రసానుభూతిని పొందే అవకాశాన్ని పోగొట్టుకోకుండా అందరికీ ఆ రాధాకృష్ణుల ప్రేమలోని మహాసౌందర్యాన్ని పరిచయం చేయడమే వారిద్దరి లక్ష్యం అయిపోయింది.

సంవత్సరాలు గడిచాయి. తన్మయీ, తేజా కలిసి చిత్రించిన వందల కొద్దీ చిత్రాలు ప్రపంచ దేశాల్లో కూడా ప్రదర్శించబడుతున్నాయి. ప్రపంచమంతా ఈ జంట పేరు మారుమ్రోగిపోతోంది. రాధాకృష్ణులే సజీవంగా ప్రేమ కలాపాలు సాగిస్తున్నట్టుగా ఉండే వారి చిత్రాలకు ఆదరణ ఎక్కువయింది. వాటి గురించి తెలియని వారు లేరు. ఆ చిత్రాల సౌందర్యానికి ముగ్ధులవనివారు లేరు. వారి చిత్రాలు ప్రదర్శించే చోట అష్టపదులను కీర్తన చేయడం మరో హైలైట్ అయింది.

ఆ చిత్రాలు చూశాక ఎంతో మంది గీతగోవింద కావ్యం చదవాలన్న కుతూహలంతో ఆ గ్రంథాన్ని కొని చదువుకున్నారు. అది చదవడం కోసం, మరింత లోతుగా తెలుసుకోవడం కోసం సంస్కృతాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టిన వారూ ఉన్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుని, చూసి, ప్రేమంటే గౌరవం పెరిగినవారూ ఉన్నారు. నిజమైన ప్రేమకు అర్థం ఏమిటో తెలుసుకున్నవారూ ఉన్నారు.

చిత్ర ప్రదర్శన జరిగేచోటే అష్టపదుల సంకీర్తన ప్రోగ్రాం, కూచిపూడి, భరత్నాట్యం, కథాకళి, ఒడిస్సీ లలో అష్టపదుల నృత్య ప్రదర్శనలు కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

తేజా, తన్మయీ పెళ్ళి చేసుకున్నారు. ఒక పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు. అక్కడ ప్రత్యేకత ఏమంటే కేవలం రాధాకృష్ణుల చిత్రాలను మాత్రమే నేర్పిస్తారు.

ఎంతో మంది దూరాల నుంచి వచ్చి వీరి వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. అలా నేర్చుకున్నవారిలో చాలా మంది వీరి వద్ద గీత గోవిందం గురించి విపులంగా తెలుసుకుని, వందల సార్లు తమకు నచ్చిన అష్టపదులు వింటూ తమ రీతిలో చిత్రంగా మలుస్తున్నారు.

తేజా, తన్మయిలిద్దరూ సెలబ్రిటీలయిన ఆ తరుణం లోనే ఒక వార్త బయటకు వచ్చింది. ఆర్కియాలజీ వాళ్ళు ఒక అడవిలో జరిపిన తవ్వకాల్లో ఒక గుహ బయటపడిందనీ, ఆ గుహ నిండా ఇప్పుడు తన్మయీ, తేజా వేస్తున్న చిత్రాలను పోలిన చిత్రాలే చిత్రింపబడి ఉన్నాయనీ. అవన్నీ కొన్ని వందల ఏళ్ళకు ముందు చిత్రింపబడినవనీ. టీ.వీ లో అన్ని ఛానల్స్ లోనూ పదే పదే చూపించారు. 

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here