Site icon Sanchika

స్నిగ్ధమధుసూదనం-3

[box type=’note’ fontsize=’16’] అబ్బురపరిచే చిత్రాలెన్నో గీసినా తన చిత్రాల్లో ప్రాణం లేదంటుంది ఆమె. చిత్రకళలో సమస్త మెళకువలు తెలిసినా ఒక్క చిన్న గీతని కూడా గీయలేడు అతను. వారి జన్మాంతర రహస్యాలేంటో ప్రసూన రవీంద్రన్ నవల ‘స్నిగ్ధమధుసూదనం’ చెబుతుంది. ఇది మూడవ భాగం. [/box]

[dropcap]ఆ[/dropcap] పుస్తకం ఆయిల్ పెయింటింగ్ పోట్రెయిట్స్ వెయ్యడంలోని మెళకువలకు సంబందించినది. పుస్తకం ముఖ చిత్రమే కాకుండా లోపల కూడా చాలా ఆసక్తికరమైన విధంగా ఉపయోగించాల్సిన వస్తువులతో సహా ఫొటోలతో వివరణ ఇచ్చినట్టుగా ఉండి, పేజీలు తిప్పి చూస్తూనే మంచం మీద కూర్చుంది భార్గవి.

“తన్మయీ, నువ్వు పెయింటింగ్స్ వేస్తావా…” అని తన్మయి ముఖంలోకి చూడబోయినదల్లా తనకు ఎదురుగా గోడ మీదున్న పెద్ద పెయింటింగ్ వైపు నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది కాసేపు.

అతి సుందరమైన యమునా తీరంలో ఓ చెట్టును ఆనుకుని కృష్ణుడు వేణువు ఊదుతుంటే, రాధ అక్కడే ఉన్న మల్లె పొద దగ్గర నిలబడి పూలు కోస్తూ ఓరగా కృష్ణుడినే చూస్తున్నట్టు నిలబడిన చిత్రం. రాధ ఎంతగా ఆ వేణుగాన పరవశ అయిందో తెలిపేలా ఆమె ఒక చేత్తో కోస్తున్న పువ్వులు రెండో చేతిలో పట్టుకున్న బంగారు సజ్జలో పడకుండా క్రిందకే రాలిపోతున్నాయి.

ఆ పరిసరాలు, రాధాకృష్ణుల ముఖాల్లోని హావభావాలూ కూడా అత్యంత అందంగా తీర్చిదిద్దినట్టు ఉన్నాయి. ఎక్కడా లోపాన్ని కనిపెట్టలేనంత సౌందర్యం ఆ తైలవర్ణ చిత్రంలో.

భార్గవి ముగ్ధురాల్లా చేతిలో పుస్తకాన్ని మంచంపైనే పెట్టేసి, కలలో నడిచినట్టు ఆ పెయింటింగ్ వైపు కదిలింది.

పది నిముషాల తరువాత పెయింటింగ్ కుడి వైపు క్రింద ‘తన్మయి’ అన్న అందమైన సంతకం తెలుగులో.

“తన్మయీ…..”

తేరుకుని వెనక్కి తిరిగి తన్మయిని చూస్తూ తల ఒక పక్కగా వంచి సాగదీస్తూ పిలిచింది భార్గవి. ఆమె పిలుపులో భావం అర్థమయినా తన్మయి ఏంటన్నట్టుగా చూసింది.

“నీలో చాలా….. ఉంది” కొంటెగా అంటూ ప్రేమగా ఆమె మెడచుట్టూ చేతులేసింది.

“చూపించు. ఇంకా ఏమేం పెయింటింగ్స్ వేసావో. నేను వెంటనే చూడాలి. కాంట్ వెయిట్.”

“చూపిస్తాను. రా” నవ్వుతూ భార్గవి చెయ్యి పట్టుకుని అక్కడినుంచి మరో గదిలోకి తీసుకువెళ్ళింది తన్మయి.

విశాలంగా ఉన్న ఆ గదిలో దాదాపు ఓ అయిదు స్టాండ్లకి పెద్ద పెద్ద కాన్వాస్లు బిగించి ఉన్నాయి. అన్నిటి మీదా రాధాకృష్ణుల చిత్రాలే. రకరకాల భావాలు. ఓ చిత్రంలో రాధ జలకాలాడుతూ కృష్ణుడినే తలుచుకుని మైమరచిపోయి ఉన్నట్టు. వెనుక ఆకాశమంతా కృష్ణుడి ముఖారవిందం.

మరో చిత్రంలో కృష్ణుడు వెన్నెల్లో పచ్చికపై కూర్చుని వేణుగానం చేస్తుంటే, అతని వెనుక ఓ చెట్టు చాటుగా నిలబడి అతన్నే కన్నార్పకుండా చూస్తున్న రాధ.

అన్నీ ఇలాంటి అందమైన చిత్రాలు. పిచ్చెక్కిపోయింది భార్గవికి అవి చూసి.

“తన్మయీ… ఇంత గొప్ప ఆర్టిస్టువి. సాఫ్ట్‌వేర్ జాబ్ ఎందుకు చేస్తున్నావ్? ప్రదర్శనలు పెట్టావా? పెడితే నువ్వు వేసిన ఒక్కో పెయింటింగూ లక్షల్లో అమ్ముడుపోతుందేమో. అంత అద్భుతంగా ఉన్నాయ్.”

తన్మయి మాట్లాడలేదు. ఆమె ముఖంలో ఏదో దిగులు కనపడింది భార్గవికి.

“అసలెందుకు చెప్పలేదు నాకు ఇంతవరకూ నువ్వు ఇంత గొప్ప ఆర్టిస్టువి అని?” చిరుకోపంగా అంటూ చేతిలో ఉన్న సెల్ కెమేరా ఆన్ చేసి ఒక పెయింటింగ్ వైపు నడిచింది.

“భార్గవీ ప్లీజ్…” ముందుకొచ్చి ఫొటో తియ్యడానికి సిధ్ధంగా ఉన్న ఆమె చేతిని క్రిందకి నొక్కింది తన్మయి.

“సారీ. ఫొటో తియ్యకు ప్లీజ్. నాకిష్టం లేదు.”

తన్మయి చేష్టకి ఆశ్చర్యంగా చూస్తున్న భార్గవి ముఖంలోంచి చూపులు తిప్పుకుంటూ అంది తన్మయి.

“హే. ఎందుకు?” అర్థంకానట్టు చూసింది.

తన్మయి మౌనంగా గది బయటకు నడుస్తుంటే, తప్పనట్టు నిట్టూరుస్తూ తనూ బయటికి నడిచింది.

తన్మయి పెయింటింగ్స్ చూసి బయటికి వచ్చేసరికి దేవకి తన పూజ ముగించుకుని వచ్చింది. అప్పటి నుంచీ భార్గవితో మాట్లాడుతూనే ఉంది ఆవిడ. భార్గవి సొంత ఊరు, తల్లీ తండ్రీ తోబుట్టువుల గురించీ, ఆమె పెరిగిన తీరు గురించీ, చదువు గురించీ అన్నీ అలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే వంటింట్లో చక చకా వంట పూర్తి చేసింది.

మధ్యలో తన్మయి వచ్చి “అమ్మా, ఎందుకు వచ్చిన మొదటిసారే నీ ప్రశ్నాపత్రంతో భార్గవిని భయపెట్టేస్తావు?” అంటూ తన గదిలోకి తీసుకుపోవాలని చూసింది గానీ, పెద్దలంటే గౌరవమున్న భార్గవి ఆవిడ అతి ప్రశ్నలు విసుగు తెప్పించినా, అన్నీ ఓపికగా చెబుతూనే ఉంది.

దేవకితో మాట్లాడుతూనే వంటింట్లో తను చెయ్యగలిగిన సహాయం చేసింది.

కాసేపు అక్కడే ఉండి, తన గదిలోకి వెళ్ళిపోయింది తన్మయి.

“అదిగో చూశావామ్మా. ఇదీ వరస. సెలవు రోజైనా కాసేపు నా దగ్గర ఉండి కబుర్లు చెప్పదు. ఏదైనా అడిగితే సమాధానం చెబుతుంది. నేను ఏమయినా చెబితే వింటుంది. అది కూడా సరిగ్గా వింటుందో లేదో తెలీదు. అంతే. అలా ఒక్కతీ తన గదిలోనో, ఇక్కడో, లేకపోతే మేడ మీదో ఏ పుస్తకాలు చదువుతూనో, బొమ్మలు వేసుకుంటూనో ఏదీ లేకపోతే అలా ఆకాశాన్ని చూస్తూనో గడుపుతుంది గానీ, కాసేపైనా గల గలా మాట్లాడదు. ఏదో వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది” బాధగా చెప్పుకుంటున్న దేవకిని చూసి నవ్వింది భార్గవి.

“తన్మయీ అని పేరు పెట్టారుగా ఆంటీ. ఏదో తన్మయత్వంలో ఉంటుంది ఎప్పుడూ”

పులుసులో పోపు వేస్తున్నదల్లా అలా ఆగిపోయి భార్గవిని చూస్తూ “ఆఫీసులో కూడా అలాగే ఉంటుందామ్మా” అంది ఆశ్చర్యంగా.

భార్గవి నవ్వుతూ తలూపింది అవునన్నట్టు.

మరికాసేపట్లో వండినవన్నీ భోజనాల బల్ల మీదకి తేవడంలో దేవకికి సహాయం చేసింది భార్గవి. వాళ్ళ పిలుపు విని ప్రకాశరావూ, తన్మయీ వచ్చారు. తన్మయి అందరికీ గ్లాసుల్లో మంచినీళ్ళు పెట్టింది.

“మీరూ కూర్చుని మాతోనే తినండి ఆంటీ” తమకి వడ్డిస్తూ నిలబడిపోయిన దేవకిని చూసి భార్గవి చనువుగా అంది.

“లేదమ్మా. మీ అందరి భోజనమూ అయ్యాక నేను నెమ్మదిగా తింటాను.”

అందరూ మౌనంగా భోజనాలు ముగించే సమయానికి అడిగింది భార్గవి. “తన్మయీ, ఇప్పటికైనా చెప్పవా. అంత ప్రొఫెషనల్గా పెయింటింగ్స్ వేస్తున్నావ్. ఎందుకు ఇంతవరకూ ప్రదర్శన ఏర్పాటు చెయ్యలేదు? కనీసం మాకెవరికీ కూడా తెలీనివ్వలేదు? ఇప్పుడు నీ పెయింటింగ్స్‌కి ముగ్ధురాలినైపోయి ఒక ఫొటో తీసుకుంటానంటే వద్దన్నావు? ”

“ప్రదర్శన ఏర్పాటు చేసేంత ఆసక్తి ఇప్పట్లో లేదు భార్గవీ. అటువంటప్పుడు అందరికీ చెప్పుకోవడం ఎందుకు?”

భార్గవి అర్థం కానట్టు చూసింది.

“ఎక్కడా ఒక్క లోపం కూడా లేకుండా చిత్రాలు గీస్తూ కూడా ఇలా ఎలా ఉండగలుగుతున్నావ్?”

తన్మయి నవ్వింది. భోజనాలు ముగించాక తన్మయీ, భార్గవీ గదిలోకి వెళ్ళారు. రెండు తలగడలు గోడవైపు ఆనించింది తన్మయి. మంచంపైన ఆ దిండుని ఆనుకుని కూర్చుని భార్గవిని కూడా కూర్చోమంటూ సైగ చేసింది.

“చెప్పు తన్మయీ. నేను వదల్ను నిన్ను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత అద్భుతమైన కళ చేతిలో ఉంచుకుని ఎందుకు ఇలా మామూలు వ్యక్తిలా ఉండిపోతున్నావ్?”

సమాధానం చెప్పకుండా చిరునవ్వు నవ్వుతున్న తన్మయిని కోపంగా చూసింది భార్గవి.

“చెప్తావా లేదా? ”

“ఏమో భార్గవీ. నాకా ఆసక్తి లేదు. ప్రదర్శనలూ , పేరూ, లైమ్‌లైట్.. ఇవేవీ నేను కోరుకోవటం లేదు.”

“హ్మ్మ్. పోనీలే. మరి నన్ను ఫొటో కూడా ఎందుకు తీసుకోవద్దన్నావు? ఎవరికైనా చెప్పేస్తాననా?”

“కాదు…”

“మరి?”

(సశేషం)

Exit mobile version