సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా – పుస్తక పరిచయం

0
2

చరిత్ర సాక్ష్యాలతో ‘యాత్రానుభవం’ – ‘భవిష్యత్ తరాలకు’ ప్రయోజనకరం

[dropcap]చా[/dropcap]లామంది ‘యాత్ర’లకు వెళుతుంటారు. అలా తాము చూసిన ప్రాంతాలలోని గొప్పదనాలని, అనుభూతులని యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత తమ స్నేహితులకో, బంధువులకో చెప్పుకొని ముచ్చట పడుతుంటారు. ఆ ముచ్చట్లు అంతటితో పరిసమాప్తమవుతుంటాయి. కొన్ని మాత్రం జ్ఞాపకాలుగా జీవితాంతం మదిలో కొలువుండి పోతాయి. అటువంటి అపురూపమైన జ్ఞాపకాలను గుర్తున్నవి… గుర్తుకొచ్చినప్పుడు మౌఖిక రూపంలో చెప్పుకోవడం తప్పించి లిఖిత రూపంలో భద్రపర్చక పోవడం వల్ల అవి భావితరాలకి అందకపోవచ్చు. ఆయా కాలాలలోని జరిగిన మార్పులు, పరిస్థితులు, చెందిన అభివృద్ధి, మంచిచెడులు వంటివి రికార్డు పర్చకపోవచ్చు. కాని ఈ గ్రంథ రచయిత గబ్బిట దుర్గాప్రసాద్ గారు తాను చూసి వచ్చిన ప్రాంతాలలోని తన అనుభూతులను మాత్రమే కాకుండా ఆ ప్రాంతాల యొక్క చరిత్రను కూడా ఎంతో ప్రయోజకరంగా ఈ గ్రంథం ద్వారా అందించి, యాత్రికుల నుండి సాధారణ పాఠకుడిలో కూడా ఆసక్తిని కలిగించే రీతిలో ఈ పుస్తకాన్ని మనకు అందించారు.

ఆ యాత్రానుభవాలు పాఠకుడితో పంచుకోవడంతోపాటు, ఆయా ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి అక్కడ లభించే భోజన వసతి సదుపాయాల వివరాలు సవివరంగా ఇందులో పొందుపర్చారు. అంతేకాకుండా చాలామంది ఆ ప్రాంతాలు చూసినప్పటికీ ఆ ప్రాంతాల యొక్క గొప్పతనం సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం కలగకపోవచ్చు. అసలు తాము వెళ్ళిన ప్రాంతాలలో చూడదగ్గవి మరెన్నో ఉన్నాయన్న సంగతీ సంపూర్ణంగా అవగాహన కలగకపోవచ్చు… కానీ ఈ గ్రంథం చదవడం వల్ల ఆ ప్రాంతాలు చూసినవారు సైతం మరెన్నో తాము చూడకుండా వచ్చేసిన ప్రాంతాల గురించి ఈ పుస్తకం ద్వారా తెలుసుకొని విస్మయానికి గురికాక తప్పదు. ఈసారి వెళ్ళినప్పుడు చూసిరావాలనే ఉబలాటమూ కలగక మానదు. అలాగే ఆ ప్రాంత ప్రజల జీవనశైలి, ప్రాంతానికీ, ప్రాంతానికి మధ్య ఉన్న తేడా, అభివృద్ధి మధ్య వ్యత్యాసాల్ని గ్రహించి మనం అక్కడి నుండి కొత్తగా అవలంభించక తగ్గ విషయాలను స్వీకరించవచ్చు. మన ప్రాంతానికి… మనం చూసొచ్చిన ప్రాంతానికి మధ్య ఉన్న తేడాను బేరీజు వేసుకొని ఇంకా అభివృద్ధి పరంగా మనం చేసుకోవాల్సిన మార్పులను ఆవళింపు చేసుకోవచ్చు. ఆ విధమైన ప్రయోజనం యాత్రా అనుభవాల వల్ల చేకూరుతుంది. ‘సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా’ అనే ఈ గ్రంథంలో అంత సంపూర్ణ, విపులాత్మక యాత్రా సమాచారం అందించారు గబ్బిట వారు.

ఈ పుస్తకం చదవడం ద్వారా మరింత ప్రయోజనం కూడా ఉందని చెప్పాలి. చరిత్రలో ‘మంచి’- ‘చెడు’ అనేవి ఎంత కాలమైనా.. ఎన్ని తరాలైనా ఏ విధంగా వెంటాడి ముందుతరాలను ప్రభావిత పరుస్తాయో ఈ పుస్తకంలో చూడవచ్చు. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే విధమైన అలనాటి మన దేశాన్ని పాలించిన చక్రవర్తుల కాలంలో… శిల్పకళా సంపద ఎంతటి విశిష్టతను కలిగించి… మన దేశ శిల్పుల గొప్పతనాన్ని ఇతర దేశాలకు ఇనుమడింపజేసిందో ఈ పుస్తకం ద్వారా తేట తెల్లమవుతుంది. ఈర్యా ద్వేషాలతో ‘మంచి’పై ‘చెడు’ ఎలా దండయాత్ర చేసి విధ్వంసం చేసిందో… దానికి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి ‘చెడు’ కాలగర్భంలో కలిసిపోయి ‘మంచి’ శాశ్వతంగా నిలిచిందో, ఈనాటి ‘సోమనాథ్ దేవాలయ చరిత్ర’ను చదివితే మనకు అర్థమవుతుంది. ‘సోమనాథ్ దేవాలయ నిర్మణం ఎంత అద్భుత కట్టడంగా’ అలనాటి రాజులు తీర్చిదిద్దారో… ఆ దేవాలయాన్ని ఎంతమంది దుర్భుద్ధిగల ముష్కర రాజులు ఈర్ష్యతో ముట్టడించి నాశనపరచారో, మళ్ళీ దానిని ఎవరెవరు ఎన్ని విధాలుగా కాపాడుకుంటూ మరింత అద్భుత రీతిలో నిర్మాణాలు జరిపి ఈనాటికీ చరిత్ర సాక్ష్యాలుగా నిలిచిన సోమనాథ్ దేవాలయ వృత్తాంతం చదివితే నిజమైన ఈ దేశ పౌరుడికి పౌరుషంతో ఛాతీ పొంగి తీరుతుంది. మన చరిత్ర, సంస్కృతిని నాశనం చేసే కుట్రలో ఇతర మత ప్రభువులు ఏ విధంగా తాము నాశనమై కాలగర్భంలో చరిత్రహీనులుగా మిగిలిపోయినదీ ఈ పుస్తకం చదవడం ద్వారా తెలుసుకొని పాఠకుడు… ‘మంచి-చెడు’ అనే తారతమ్యాలను అంచనా వేసుకోగలుగుతాడు… మనలోని చెడును చెరిపేసుకొని మంచి కోసం పరితపించే ఆలోచనలకు ప్రేరేపిస్తాడు. అటువంటి చరిత్ర పాఠాలు మనకి ‘సోమనాథ్’ దేవాలయ నిర్మాణం నేర్పిస్తుంది.

చాలామంది ఉద్యోగ పదవీ విరమణ చేసినవారు తమంతా చేయగలిగింది చేసేసామని… ఇక చేయగలిగింది ఏమీ లేదని… శక్తిసామర్థ్యాలు సన్నగిల్లాయని సరిపుచ్చుకుంటుంటారు. కాని ఈ సమాజానికి ఏదోకటి తమ ఊపిరి ఉన్నంతవరకూ చేస్తూ ఉండాలనే లక్ష్యంగల వాళ్ళు చాలా తక్కువమంది మాత్రమే ఉంటారు. అనుకున్నది సాధించాలనుకునేవారికి వయస్సుతో పని లేదు. తము చివరి శ్వాస ఉన్నంతవరకూ ఏదోకటి సమాజానికి ఉపయోగపడే పనులు చేయలనుకునే వారు బహు అరుదు. అటువంటి అరుదైన వ్యక్తులలో గబ్బిట దుర్గాప్రసాద్ గారు ఒకరు. 80 ఏళ్ళ వయస్సులో కూడా అలుపెరుగని అక్షర సైనికుడిలా ఎందరికో స్ఫూర్తినిస్తూ ఆదర్శప్రాయులవుతున్నారు. తాను విన్నవి, కన్నవి, మరిన్ని అతి కష్టపడి సేకరించినవి నేటి తరానికి, భావితరాలకు ఉపయోగపడే రీతిలో అయన తన అక్షర యజ్ఞాన్ని నిబద్ధతగల గురువుగా, భాషాభిమానిగా, రచయితగా, సరసభారతి అధ్యక్షులుగా, కార్యకర్తగా.. ఇలా ఎన్నో… ఎన్నెన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారి నిరంతర కృషికి ప్రతి తెలుగువాడూ అభినందించి తీరాలి.

***

‘సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా…’ (యాత్రాచరిత్ర)
రచన: గబ్బిట దుర్గాప్రసాద్,
పుటలు:328,
వెల:రూ.200/-,
ప్రతులకు:
గబ్బిట దుర్గాప్రసాద్,
రాజాగారి కోట వద్ద,
శివాలయం వీధి,
ఉయ్యూరు, కృష్ణాజిల్లా-521 165

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here