[dropcap]ప్ర[/dropcap]సన్న భారతి ఆధ్వర్యంలో తేదీ 30.08.2018 నాడు స్థానిక పౌరగ్రంథాలయం, ద్వారకానగర్, విశాఖపట్నంలో సాయంకాలం 6 గం. లకు ప్రఖ్యాత కవయిత్రి ఎలిజబెత్ బెరెట్ బ్రౌనింగ్ వ్రాసిన ‘సొనెట్స్ ఫ్రం ద పోర్చుగీస్‘కి డా. రాచకొండ నరసింహశర్మ గారి ఆంధ్రానువాద గ్రంథ ఆవిష్కరణ జరిగింది.
సభకు ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు, ప్రసన్నభారతి అధ్యక్షులు డా.పొన్నుపల్లి కృష్ణయ్య గారు అధ్యక్షత వహించగా, నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి డా. వి. బాలమోహన్ దాస్ గారు ముఖ్య అతిథిగాను, పుస్తకావిష్కర్తగాను వ్యవహరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు, ఆచార్య సార్వభౌమ డా. వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విశిష్ట అతిథిగాను, విశాఖ సాహితి అధ్యక్షులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డా. కోలవెన్ను మలయవాసిని గారు ఆత్మీయ అతిథి గాను సభకు వచ్చారు. డైరెక్టర్, ప్రెస్, గీతం యూనివర్సిటీ డా. ప్రయాగ సుబ్రహ్మణ్యం గారు గ్రంథ సమీక్ష కావించారు.
వృత్తిరీత్యా డాక్టరయినా, ఆంధ్రాంగ్లాలలోని శ్రీ రాచకొండ నరసింహశర్మ గారికి ఉన్న అభిజ్ఞత ఆయన రచించిన ఎన్నో అనువాద గ్రంథాలలో ప్రస్ఫుటమవుతుందని, వయసు తొంభై ఏళ్లు దాటినా, వారు చేస్తున్న సాహితీసేవ, సాహితీవేత్తలకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహాలు కొనియాడదగ్గవని అతిథులందరూ వక్కాణించారు.
కీ.శే. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి కుటుంబ సభ్యులు, ప్రముఖ సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ సభ, ప్రసన్నభారతి కార్యదర్శి శ్రీ కొండేపూడి సర్వేశ్వరప్రసాద్ గారి వందన సమర్పణతో విజయవంతంగా ముగిసింది.