Site icon Sanchika

సొట్టచెంపల మనిషి

[box type=’note’ fontsize=’16’] “వొకదిక్కు నిలపెట్టుకున్న మొగులు కింద వొడిపట్టుకున్న పొలంలెక్క నేను, నా పద్యం. రెండుగింజల మాటలు దానంచెయ్యి, అమ్మీ” అని అడుగుతున్నారు శ్రీ రామోజు హరగోపాల్ ఈ కవితలో. [/box]

[dropcap]బ[/dropcap]త్తలి భూమికి
పచ్చటిగొంగడి వాన నెనరు
చిత్తడి, చిత్తడి మనసుకు
వెచ్చటి నిట్టూర్పుల పసరు
వొకదిక్కు మొత్తుకుని గాలి చెప్తున్నా
వెదురు గాయాలను మానదు
చినుకులు
మొగులునుంచో, కండ్లనుంచో

పిలిచి పువ్వులిచ్చిన చెట్టుతోని
నీడల ముచ్చట్లు
వొకతీగేదో తెగిన సవ్వడి
ట్రింగుమంటు
పూలవీణ మూర్ఛనలు పోయింది
వొకతీరుగ గుండెబరువు వొరిగింది

ఎప్పట్లెక్కనె కలవరపడే
ఉప్పసముద్రం
పెద్ద ఆందేసతోని పొర్లుతుంటది
అయితేంది కట్టదాటదు
బతుకు మోహపు కనికట్టుదాటదు
వొకపరి మూతపడిపోయె
జిందగీ దుబారా,దుబారా

శానతనం కాకపోతె
ఉట్టికొట్టలేంది
యేడికి ఎగురుకుంటపొయ్యేది
కండ్లరెప్పలతడిగీతలతోని
చూపులభావుకాలు
వొకదిక్కు నిలపెట్టుకున్న మొగులు
కింద వొడిపట్టుకున్న పొలంలెక్క
నేను, నా పద్యం
రెండుగింజల మాటలు దానంచెయ్యి, అమ్మీ

Exit mobile version