[dropcap]వి[/dropcap]శాఖ సాహితి ఆధ్వర్యంలో, ఆచార్య కోలవెన్ను మలయవాసినిగారి అధ్యక్షతన 13-2-2022వ తేదీన డా. రాచకొండ నరసింహ శర్మగారి ‘సౌందర్యంలో నడుచునామె’ ఆంగ్ల కవితల తెలుగు అనువాద పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అంతర్జాల మాధ్యమంలో జరిగింది.
ఆచార్య మలయవాసినిగారు తమ అధ్యక్షోపన్యాసంలో, డా. రాచకొండ నరసింహ శర్మ గారు 98వ ఏట కూడా క్రియాశీలకంగా రచనా వ్యాసంగం కొనసాగిస్తూ తమ అనువాద కవితా సంపుటిని విశాఖ సాహితి వేదికగా ఆవిష్కరించుకోవడం అభినందనీయమని, వారి అనువాద కవితలలో మూలకవిత భావం, లయ ప్రతిబింబిస్తాయని ప్రశంసించారు.
ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తక ఆవిష్కరణ కావించిన ఆచార్య ప్రయాగ సుబ్రహ్మణ్యం గారు తమ ప్రసంగంలో, సుమారు నాలుగు శతాబ్దాల ఆంగ్ల కవుల కొన్ని కవితలను తెలుగులో అనువాదంచేసి కవితా సంకలనాన్ని వెలువరించిన డా. నరసింహ శర్మ గారిని కొనియాడి, వారి కవితలలోని అంతస్సూత్రాన్ని ఆవిష్కరించారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న ఆచార్య సార్భౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు డా. నరసింహ శర్మగారి రచనా పటిమను కొనియాడుతూ, ఈ విధంగా 98వ ఏట వారు పుస్తక ప్రచురణ కావించి ఆవిష్కరించడం విశాఖ సాహితి చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంగా నిలుస్తుందని అన్నారు.
డా. కల్లూరి శ్యామల గారు, డా. డి.వి. సూర్యారావు గారు పుస్తక సమీక్షలో డా నరసింహ శర్మ గారి రచనా వైశిష్ఠ్యాన్ని సోదాహరణంగా వివరించారు.
డా. నరసింహ శర్మ గారు తమ స్పందనలో అతిథులకు ధన్యవాదాలు తెలియజేసి, తాము 1970వ సంవత్సరంలో పదవి నుండి స్వేచ్ఛా విరమణ చెసిన తర్వాత తమకి ఎంతో ప్రియమైన షెల్లీ, కీట్స్ కవితలను రెండింటిని అనువాదం చేసి తదాదిగా బంధు మిత్రుల ప్రోత్సాహంతో ఎన్నో అనువాద కవితలు వెలువరించారని తెలియజేసారు.
డా నరసింహ శర్మ గారి సోదరి డా. నిర్మల గారు, కుమార్తె శ్రీమతి చింతా జ్యోతి, శ్రీ శేఖరమంత్రి ప్రభాకర్ తదితరులు తమ ఆత్మీయ భాషణాలలో డా శర్మ గారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు.
దేశ విదేశాల నుంచి పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ అంతర్జాల సమావేశానికి విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం సమన్వయ కర్తగా వ్యవహరించి, వందన సమర్పణ కావించారు.