సౌశీల్య ద్రౌపది – ఒక దృష్టి కోణం

0
4

[dropcap]ప[/dropcap]విత్రమైన సాహిత్యం పేరుతో భారతీయ సనాతన ధర్మాన్ని పనికిరానిదిగా చిత్రిస్తూ, చూపిస్తూ, ప్రయత్నాలు చేస్తున్న సాహితీ పుంగవులకు ‘రామ బాణం’ వంటి అద్భుత సాహితీ అస్త్రం ‘సౌశీల్య ద్రౌపది’.

పుస్తకం చేతపట్టి రచయిత ముందుమాట చదివిన తరువాత నిర్దిష్టంగా, స్పష్టంగా సాగిన అంశాలన్నీ ప్రస్తుత సమాజ సాహితీ రూపదృశ్యాన్ని కళ్ళ ముందు ఉంచుతాయి.

శ్రీ కస్తూరి మురళీకృష్ణ స్థితప్రజ్ఞత గల రచయిత. చెప్పదలచుకున్న అంశాన్ని వాత తేలేలా కొరడా ఝుళిపిస్తూనే, ప్రతీ పదం పాఠకుని హృదయపు వెండితెర  మీద హృద్యంగా ముద్రవేసేలా రాయడం వారి ప్రత్యేకత. పురాణేతిహాసాల పట్ల అచంచల విశ్వాసం, అందలి పాత్రల యొక్క ప్రవర్తనా సరళి పట్ల పరిపూర్ణ అవగాహన నరనరాన జీర్ణించుకున్న రచయిత మాత్రమే యింత సవివరంగా ఒక స్త్రీమూర్తి అంతరంగాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించగలడు.

సముద్రపు లోతునైనా కొలవగలమేమో గాని ఒక స్త్రీ మనసు లోతును సాక్షాత్తు ఆమెను సృజియించిన భగవంతుడు కూడా తెలుసుకోలేడేమో అంటూ ఉంటారు పెద్దలు. అటువంటి అత్యుత్తమ సౌశీల్యం గలిగిన మహాభారత ‘కథానాయకి’ ద్రౌపది అంతరంగ ఆవిష్కరణను మనసు పెట్టి పాఠకుడు చదువుతున్నప్పుడు కన్ను చదివించక మానదు.

నేటి సమాజంలో అవమానించడానికి కొనక్కరలేని అతి బలహీనమైన వస్తువు స్త్రీ. పురుషుడు, ప్రకృతి కలిస్తేనే సృష్టి. వారిద్దరి అనురాగ సంగమమే ఆరోగ్యకరమైన సమాజం. అయితే శారీరక బలం, స్త్రీ సహకరించినా, సహకరించకపోయినా మరో ప్రాణికి బీజం వేసే శక్తి రెండూ పురుషుడివే కావడంతో స్త్రీ కేవలం ఒక ఆటవస్తువుగా మలుగుతోంది, మిగులుతోంది. ఆనాటి స్త్రీ భర్త జాడననుసరించి మసలుకుని తన స్త్రీత్వానికి, స్త్రీ తత్వానికి ఒక అర్థం కలిపించుకునేది. కొందరు స్త్రీలు పురుషుల వల్ల ఎన్నెన్నో అవమానాలు పొందినా నిస్సహాయ స్థితిలో ఆ బాధను అనుభవించారే గాని ఎటువంటి ప్రతిఘటన చేయలేకపోయారు.

ఆనాటి స్త్రీలకు ధర్మం తెలుసు. ధర్మమెరిగి ప్రవర్తించేవారు. ధర్మాన్ని అనుసరించేవారు. పర పురుషుని ఆలోచన తలపులలోనికి కలనైనా రానివ్వకుండా మనసా, వాచా, కర్మణా భర్తకు తమను తాము పరిపూర్ణంగా అర్పించుకునేవారు. అటువంటి దాంపత్యాలు అర్ధనారీశ్వర తత్త్వంతో సుఖంగా జీవించేది.

కానీ మురళీకృష్ణ గారు తమ ముందుమాటలో చెప్పినట్లుగా ఈనాటి సమాజంలో ‘సభ్యత’ అనే పదం తలదించుకునేలా మగవారిలో ఎక్కువ శాతం దుర్యోధన, దుశ్శాసన, కీచక, రావణులే కన్పిస్తున్నారు. వావి, వరుస లేకుండా వయసు తారతమ్యం మరచి స్త్రీని తమ తుచ్ఛమైన వాంఛ తీర్చే వస్తువుగా భావించి, ఆనాటి రాక్షసులు పాటించిన కనీస నీతి కూడా లేకుండా హీనాతిహీనంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి వారి నుండి స్త్రీని కాపాడుకోవాలీ అంటే అందరూ ద్రౌపది పట్ల శ్రీకృష్ణుడు చూపిన రక్షణను చేపట్టాలంటారు ఆయన.

ఎవరో ఒకరు ఎపుడో అపుడు మొదటి అడుగు వేసి నడుం కట్టకపోతే భారతీయ సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయం కొనసాగుతూనే ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా కదం తొక్కిన వీర కిషోరంలా శ్రీ మురళీకృష్ణ కృతకృత్యులయ్యారనేది నిర్విదాంశం.

ఇక ద్రౌపదీ దేవి విషయానికి వస్తే… ఈనాటి రచయితలలో ఒక స్త్రీ అంతరంగాన్వేషణ మురళీకృష్ణగారు చేసినట్టుగా మరొక రచయిత చేయలేదేమో అనిపిస్తుంది. ఆమె అవమానం పొందిన ప్రతీ సన్నివేశంలోను ఆమె హృదయపు లోప్యలో ప్రభవిస్తున్న లావా లాంటి క్రోధాగ్నిజ్వాలల వ్యాపనాన్ని రకరకాలుగా విశ్లేషించే ప్రయత్నం చేశారాయన.

ఈ నవలిక రచనలో వారిని ప్రశంసించవలసిన మరొక అద్భుత విషయం ఏ సందర్భంలో ఏ వాక్యాలు అంత్యంత విలువైనవని ఆయన భావించారో ఆ వాక్యాలను బోల్డ్ (bold) చేసిన సందర్భాలు చదువరికి మళ్ళీ మళ్ళీ చదివి అవగాహన చేసుకునేంత స్పష్టతనిస్తాయి. అవి అన్నీ మన జీవితంలో ఆచరించదగ్గ ప్రధాన సూత్రాలుగా అనిపిస్తాయి.

ఉదాహారణకు: “ఎప్పుడైతే వ్యక్తి తన జీవితానికి అర్థం లేదు అనుకుంటాడో, ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతాడో, అపుడా వ్యక్తి జీవితం అయోమయాంధకారమయం అవుతుంది. అలా కాక తన జీవితానికి అర్థం ఉంది, లక్ష్యం ఉంది – అని నమ్మిన వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఊపిరి అవుతుంది. తాత్కాలిక ప్రలోభాలు అతడిని తాకలేవు. సందిగ్ధాలు, ఆవేశాలు అతని దరిదాపులకు రావు.”

ఈ వాక్యాలు చదివి ఆకళింపు చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకుని జీవితాలను అంతం చేసుకోవాలనుకునే అనాలోచనాపరుల పాలిట సంజీవనులు అనిపిస్తాయి.

శ్రీ మురళీకృష్ణ గతంలో కథా రచనకు, నవలా రచనకు ఎంత శ్రమించారో తెలియదు గానీ తన జీవితకాపు రచనానుభవాన్ని మదుపుగా పెట్టి ఈ ‘సౌశీల్య ద్రౌపది’ని రచించారా అనిపించక మానదు. అందుకోసం స్త్రీ మనసు లోతుల్ని తరచి తరచి తవ్వుతూ, తానే ద్రౌపదిని ఆవాహన చేసుకుకున్నారా అనిపించేంటంత గొప్పగా రాయబడిన రచన ఇది.

ద్రౌపది దేవి మనోభావాలను సందర్భోచితంగా వర్ణించిన తీరు ప్రశంసనీయం. అర్జునుడి  మెడలో వరమాల వేసిన తాను అత్తగారి మాట కోసం మిగిలిన నలుగురినీ వివాహం చేసుకోవాలా అనే తత్తరపాటు, చేసుకున్న తర్వాత లోకం తనను ఏ విధంగా అవహేళన చేస్తుందో అనే ఆందోళన, ఆ బాధలో ఉండగానే ఆమె కన్నీళ్ళను తుడిచిన సందర్భంలో శ్రీకృష్ణుడి ఓదార్పు, సాటి స్త్రీగా తన భవిష్యత్తు పట్ల అత్తగారి మానసిక వేదన ఆలకించిన సమయంలో ఆమె నిర్లిప్తత, భర్తలతో సంభాషించే సమయంలో ఆమె సంభాషించిన తీరు, సుభద్రను పరిచయం చేస్తూ శ్రీకృష్ణుడు అన్న మాటలకు సమాధానంగా ఆమె ఆత్మవిశ్వాసం, మయసభలో పెదవి జారిన నవ్వు ఫలితం రేపెలా ఉండబోతోందో అన్న కలవరం, అన్నిటికీ మించి ఒక స్త్రీకి జీవితంలో ఎటువంటి ఘోర అవమానం జరుగుతుందో అంతటి ఘోర అవమానం కౌరవ సభలో పొందిన సందర్భంలో ఆమె మనసు పడిన భయాందోళనలకు పరాకాష్ట, తనను రక్షించేవాడు కేవలం శ్రీకృష్ణుడే అని ఆయనపై భారం వేసి కళ్ళు మూసుకున్న నిస్సహాయత – తనను అవమాన పరిచిన కామాంధుల సర్వనాశనాన్ని కోరుతూ క్రోధాగ్ని జ్వాలలు వెదజల్లిన ఆమె హృదయవేదనలను అవగాహన చేసుకుంటే ద్రౌపది – ‘సౌశీల్య ద్రౌపది’గా, పాండవ పట్టమహిషిగా తన సౌశీల్యానికి వన్నె తెచ్చి భారత స్త్రీ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసే విధంగా జీవించిన తీరు ఆచరణీయం – ఆదర్శనీయం. ప్రతీ భారత స్త్రీ భాషా భేదాన్ని మరిచి చదవాల్సిన మంచి రచన అని చెప్పకతప్పదు. వీటన్నింటినీ క్రోడీకరించి రాసిన మురళీకృష్ణ గారి శక్తి సామర్థ్యాలకు ప్రతీక ‘సౌశీల్య ద్రౌపది’.

***

సౌశీల్య ద్రౌపది (నవలిక)

రచన: కస్తూరి మురళీకృష్ణ

ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ,

పుటలు: 96, వెల: రూ.50/-

ప్రతులకు: సాహితీ ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ – 520004. ఫోన్: 0866-2436643

ఈబుక్ కినిగెలో లభ్యం:

http://kinige.com/book/Sowsilya+draupadi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here