Space MOMs – ఒక పరిచయం

0
2

[dropcap]ఈ[/dropcap] Space MOMs సినిమా గురించి మొదటి సారి విన్నది మిషన్ మంగల్ అన్న హిందీ సినిమా వచ్చినపుడు. విన్నాక మనం ఇది చూడాలి, ఆ సినిమా కాదు అని ఇక ఈ సినిమా మా ఊళ్ళో చూడ్డానికి ఎప్పుడు లభ్యమవుతుందో అని అలా ఎదురుచూడగా చివరికి గూగుల్ ప్లే లో పెట్టారు. నాకు సినిమా చాలా నచ్చింది, అలాగే ఒకటీ అరా విషయాలు కొంచెం ఇబ్బంది పెట్టాయి. ఈ వ్యాసం ద్వారా ఈ సినిమా గురించి ఒక చిన్న పరిచయం చేస్తున్నాను.

కథ/నేపథ్యం:

ఇది 2014లో భారత ప్రభుత్వం/ఇస్రో అంగారక గ్రహంపై పరిశోధనల కోసం పంపిన మంగళయాన్ ప్రాజెక్టులో పని చేసిన  అనేక మహిళా ఇంజనీర్లు/శాస్త్రవేత్తల స్ఫూర్తితో అల్లిన కథ. సినిమా పేరులోని MOM నిజానికి Mars Orbiter Mission ని సూచించేది అయినా, ఈ మహిళలని ఉద్దేశించినది కూడా.  దర్శకత్వం చేసింది కూడా ఒక మహిళే – రాధ భరద్వాజ్. ఈవిడ ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రని కూడా పోషించింది.

కథలో నాలుగు ప్రధాన పాత్రలు – మొదటి ముగ్గురు – శాంతి శ్రీవాత్సవ, విమల సుబ్రమణ్య, పొణ్ణి షణ్ముగం. భిన్న నేపథ్యాల నుండి వచ్చి, శాస్త్ర సాంకేతిక రంగాలలో అత్యున్నత స్థాయి విద్యని అభ్యసించినవారు. నాలుగో పాత్ర: తమిళనాడులో ఏదో చిన్న ఊరిలోని ముస్లిం బాలికల పాఠశాలలోని సైన్సు టీచర్ ఫర్జానా. కథ ఒక అంతరిక్ష పరిశోధనా సంస్థ అంగారక గ్రహానికి తమ సాంకేతిక పరిజ్ఞానంతో ఒక అంతరిక్ష నౌక వెళ్ళాలని నిర్ణయించుకుని దానికోసం ఒక టీం అసెంబుల్ చెయ్యడం, అందులో ముగ్గురు మహిళలకి ప్రధాన బాధ్యతలు అప్పగించడంతో మొదలవుతుంది. అక్కడనుండి ఈ టీం ప్రయత్నంలోని వివిధ దశలు, ఈ సమయంలో వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో జరిగే విశేషాలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌తో సహా అన్నీ కవర్ చేస్తూ సాగుతుంది. వీళ్ళ ప్రయోగాలని పత్రికల ద్వారా తెలుసుకుని, అంతగా చదువు మీద ఆసక్తి లేని తన విద్యార్థినులలో కూడా శాస్త్ర పరిశోధనలపై ఆసక్తి రేకెత్తించే స్ఫూర్తివంతమైన పాత్ర టీచర్ ఫర్జానాది (ఈ పాత్ర పోషించింది దర్శకురాలే!).

తీసిన విధానం:

కథ, కథనం, సంభాషణల బాధ్యతలు నిర్వహించిన రాధా భరద్వాజ్ ఈ సినిమా కన్నా ముందు కోసెట్ లాండ్, బేసిల్ అనే విభిన్నమయిన సినిమాలను నిర్మించింది. మిషన్ మంగల్‌యాన్ చిత్ర నిర్మాతలపై 2018లో వారు తన స్క్రిప్ట్ కాపీరైట్ హక్కును ఉల్లంఘించారని కేసు వేసింది. తన స్క్రిప్ట్ ఆధారంగా Space MOMs సినిమా నిర్మించింది. కథ, కథనం, సంభాషణలు అన్నీ బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సెంటిమెంటు మొదలుకుని ఇన్స్పిరేషన్ దాకా రకరకాల భావాలని కలిగించింది సినిమా ఆద్యంతం. ఎడిటింగ్ కూడా ఎక్కడా బిగి సడలకుండా నిర్వహించినట్లు అనిపించింది. అన్నట్లు ఇదంతా మామూలు వీక్షకురాలిగా చెబుతున్నదనీ, సినిమా కళ తెలిసిన మనిషిగా కాదనీ గుర్తుంచుకోవాలి అందరూ..

నచ్చిన అంశాలు:

  • సినిమా మొత్తం, ఆ సంభాషణలు, కథనం, అంతా ఎక్కడా పట్టు తప్పకుండా, అదే సమయంలో (నాకు) స్పూర్తిని కలిగిస్తూ సాగింది. పాత్రధారులంతా సహజంగా చేశారు. వీళ్లంతా మనం తరుచుగా చూసే కుటుంబాల వాళ్ళే – మేధావులంటే ఎక్కణ్ణుంచో ఊడి పడరు అనిపించింది. ముఖ్యంగా వాళ్ళ చిన్ననాటి నేపథ్యాల కథలని అసలు చాలా బాగా చూపించారు. వీళ్ళంతా బయట సినిమాల్లో  పెద్ద పేరున్న నటులు కాకపోవడం వల్ల నేను కూడా అంత ఊహలు లేకుండా చూశాను. అదో కారణం కావొచ్చు నాకు బాగా నచ్చడానికి.
  • కెరీర్‌ని సీరియస్‌గా తీసుకునే మహిళలంటే మన సినిమాల్లో తరుచుగా కనబడే ఇమేజ్: వీళ్ళకి ఇల్లు పట్టదనీ, అంతా అశాంతిగా ఉంటారనీ. కానీ, ఈ సినిమాలో శాంతి/విమలల భర్తల పాత్రలు నాకు చాలా నచ్చాయి. అలా భార్య ఉన్నతిని మనస్పూర్తిగా ప్రోత్సహించి, అసూయ పడ్డమో, ఫ్రస్టేట్ అవ్వడమో చేయకుండా తమ ఉద్యోగాలు తాము చేసుకుంటూనే ఇంటి బాధ్యతల్లో తామూ ఓ చెయ్యేసి, అవసరమైతే పిల్లలని చూసుకునే భర్తలు ఉంటారు. వాళ్ళని సినిమాల్లో చూపడం బాగుంది. మనకి ఇలాంటి పాత్ర ఉద్యోగస్తురాలైన భార్య భర్త ఉన్నతి కోసం సపోర్టు చేస్తున్నట్లే చూపిస్తారు కానీ ఇలా చూడ్డం నాకు కొత్త. పిల్లలు కూడా వాళ్ళమ్మలు కూల్ అనే అనుకుంటారు. ఒక పిల్లాడికి స్కూల్లో ప్రత్యేక గుర్తింపు కూడా వస్తుంది స్నేహితుల మధ్య – వాళ్ళమ్మ గురించి పేపర్లో వచ్చాక. అలాగని వీళ్ళ కుటుంబాల్లో గొడవల్లేవని కాదు. నాకు ఈ మహిళల ఆఫీసు వెలుపలి జీవితాలని కూడా సహజంగా చూపినట్లు అనిపించింది. మహిళలు దర్శకులైతే ఇలాగే సహజంగా ఉంటాయేమో సినిమాలు.
  • అంతరిక్ష పరిశోధనలపై సామాన్యుల సంభాషణలు ఆసక్తికరంగా రాశారు. ఆటో డ్రైవర్, టీకొట్టు అతను, చిన్న ఊళ్ళో స్కూలు పిల్లలు, సిటీ స్కూల్లో పిల్లలు ఇలా రకరకాల నేపథ్యాల వాళ్ళు ఈ అంతరిక్ష పరిశోధనల గురించి పేపర్లో చూసి మాట్లాడుకోడం బాగుంది. చివరలో ఈ మొత్తం ఉదంతం వల్ల పిల్లలు – ముఖ్యంగా ఆడపిల్లలు ఎంత స్పూర్తిని పొందిందీ గొప్పగా చూపించారనిపించింది.

మొత్తానికి సినిమా చివరికొచ్చేసరికి చప్పట్లు కొట్టేసుకున్నాము మేము ఇంట్లోనే చూసినా. అయితే, అలా అని సినిమా నాకు unconditional గా నచ్చిందనలేను.

నచ్చని అంశాలు:

  • నా అభిప్రాయంలో మతం అన్నది వ్యక్తిగతం.  శాస్త్రవేత్తలు పూజలు చేస్కోడం అన్నది నాకేం తప్పు అనిపించదు కానీ, ఆఫీసులో చేయడం ఇబ్బంది పెడుతుంది. ఈ సినిమాలో అంతా యోగా, గుళ్ళూ-గోపురాలు, మెడిటేషన్, శాస్త్రీయ నృత్యం-సంగీతం ఇలాంటి ఎన్నింటినో చూపిస్తారు ఈ శాస్త్రవేత్తల జీవితాలని చూపుతూ. వీళ్ళంతా అచ్చమైన స్వచ్ఛమైన హిందువులు అన్నమాట. మంగళయాన్ తేదీ దగ్గరికొచ్చే సరికి టెన్షన్ వల్ల పూజలు, ప్రార్థనలు పెరిగిపోతాయి. ఇదంతా సహజం – వీటితో నాకేం ఇబ్బంది లేదు. అయితే, ల్యాబులో మొత్తం అంతా లేచి భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం పెట్టడం వంటి దృశ్యాలు ఇబ్బంది పెట్టాయి నన్ను.
  • సినిమాలో అన్ని రకాల పాత్రలూ కనిపిస్తాయి కానీ, శాస్త్రవేత్తలూ, ఇంజనీర్లూ మాత్రం అగ్రవర్ణ హిందువులే. నేనీ విషయం అంత గమనించకపోదును కానీ అది అలా మనకి ప్రస్ఫుటంగా కనిపించేలా తీశారు – వేషభాషలు, అలవాట్లని చూపుతున్నపుడు. ఇది కూడా కొంచెం నన్ను ఇబ్బంది పెట్టింది. ఈ సినిమా నా దృష్టిలో  “గొప్ప” కాకుండా “మంచి” సినిమాగా మిగిలిపోడానికి ఇదే ప్రధాన కారణం. ఇది లోపమా? అంటే – నా నమ్మకాలకి/సిద్ధాంతాలకి విరుద్ధంగా ఉంది అంతే. అందుకని నాకు నచ్చలేదు. శాస్త్రానికి జాతేమిటి? మతమేమిటి? అదీ ఈకాలంలో? అంతలా మతాన్ని ప్రొజెక్ట్ చేయాలా? అనిపించింది నాకు.
  • ముగ్గురు మహిళా శాస్త్రవేత్తలో ఒకామెది తెలుగు నేపథ్యం. కానీ వాళ్ళింట్లో తెలుగు మాట్లాడే వాళ్ళకి ఎవరికీ తెలుగు యాస గానీ, కనీసం కన్నడిగుల తెలుగు యాస గానీ లేదు. భాష రాని వాళ్ళు ఇంకో భాషలో డైలాగులు రాసుకుని చదివినట్లు ఉన్నాయి ఆ కొన్ని సంభాషణలు మాత్రం.

ఇవన్నీ (ముఖ్యంగా మొదటి రెండూ) నన్ను బాగా ఇబ్బంది పెట్టిన అంశాలే అయినా, ఈ సినిమా తప్పకుండా చూడాల్సిన సినిమా అనే చెబుతాను. ఇకపోతే, ఒకటీ అరా కనెక్షన్ లేని అంశాలు లేకపోలేదు. ఉదాహరణకి పొణ్ణి ఒంటరిగా ఏదో బిల్డింగ్ లోకి పోతూంటే వాళ్ళ టీం లోని చిన్న కుర్రాడు ఈవిడ ఈ బిల్డింగ్ లోకి వెళ్ళిందేంటి అని ఆశ్చర్యపోతాడు. అదేం బిల్డింగ్? అందులోకి పోవడంలో ఏంటి వింత? అన్నది మళ్ళీ ఎక్కడా రాదు. ఇలాంటివి ఒకట్రెండు ఉన్నాయి కానీ, సినిమా అనుభవాన్ని దెబ్బతీసేవి కావు. ఏదో అలా గుర్తు వచ్చిందంతే.

మొత్తానికి ఇదొక భారతీయ సినిమా. భారతీయులు మాత్రమే తీయగల శాస్త్ర నేపథ్యపు సినిమా. మరి ఇంత ప్రత్యేకమైన సినిమా గురించి అంతర్జాలంలో లభ్యమయ్యే వివరాలు మాత్రం అతి స్వల్పం. కనీసం ఓ వికీ పేజీ కూడా కనబడలేదు నాకు. ఎందుకు అలా అయ్యిందో అంతు చిక్కకుండా ఉంది ప్రస్తుతానికి. ఇక్కడిదాకా చదివారంటే, దయచేసి సినిమా చూడండి. రాధ భరద్వాజ్ భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి సినిమాలు తీయాలని, అవి మరింతమంది జనాన్ని చేరాలనీ ఆశిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here