[dropcap]ఒ[/dropcap]క పెద్ద మనిషికి బెన్‌హర్ సినిమా నచ్చలేదట. ఎందుకు నచ్చలేదంటే, ఆ సినిమాలో అందరూ అత్యద్భుతమైన దృశ్యంగా ఏకగ్రీవంగా అంగీకరించే రథాల పరుగుపందెం సమయంలో ఆయనకు తెరపై ఎర్రకారు కనిపించిందట. అంత గొప్ప సినిమాలో, తెరపై అత్యద్భుతమైన దృశ్యంలో ఎర్రకారును మాత్రమే చూడగలిగిన ఆయన దృష్టికి జోహార్లు పలుకుతూ, ఆ ఎర్రకారు మోజులో మొత్తం సినిమాను సరిగా చూడలేని ఆయన దురదృష్టాన్ని, దౌర్భాగ్యాన్ని చూసి జాలిపడాల్సి వుంటుంది. ఇటీవలి కాలంలో ప్రతిభావంతుల మరణ వార్త తెలియగానే ఇలాంటి ఎర్రకారు దృష్టి వాళ్ళు బయలుదేరుతున్నారు. ఆ వ్యక్తి గొప్పతనాన్ని చూడలేని తమ చీమ దృష్టిని బయటపెట్టుకుంటూ, పొర్లుతున్న బురదనే పన్నీరని పంది భ్రమించే రీతిలో తమ భ్రమను భ్రమ అని గ్రహించలేక అభాసు పాలవుతున్నారు. తమ నైచ్యాన్ని బహిర్గతం చేసుకుని విలువను కోల్పోతున్నారు. మనిషిని మనిషిగా చూడనివ్వని తమ సంకుచితం వల్ల తాము అభాసు పాలవుతున్నామన్న ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రఖ్యాత దర్శకుడు, ఉత్తమ సినిమాల రూపకర్త అయిన విశ్వనాథ్ మరణం ఆయన అభిమానులలో విషాదాన్ని నింపి భావోద్వేగులను చేస్తూంటే, ఈ ఎర్రకారు దృష్టి చిన్నకారు ప్రవర్తన మరింత బాధకు కారణమై ఆవేశాన్ని రగిలిస్తోంది. అసహ్యం కలిగిస్తోంది. అయితే డాన్ క్విక్సోట్‍లా గాలిమరలపై చెక్కకత్తితో యుద్ధానికి ఉరుకులిడే వక్రమెదడు మనుషులను చూసి జాలిపడాలి తప్ప ఆవేశానికి వచ్చి, అనవసరంగా మనమూ వారి స్థాయికి దిగాల్సిన అవసరం లేదు. రకరకాల జీవులను సృజించిన భగవంతుడి అనంత సృజనాత్మకతకు అబ్భురపడుతూ ముందుకు సాగిపోవాలి.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అత్యంత అర్థవంతమై, మనసుకు హత్తుకునే సినిమాలు, ఉత్తమ విలువలతో నిర్మించే తరం చిట్టచివరి దర్శకుడు విశ్వనాథ్. ఆరంభం నుంచీ ఆయన సినిమాల్లో ఉత్తమ కళాదృష్టి స్పష్టంగా తెలుస్తూండేది. సాంప్రదాయాల పట్ల గౌరవం, అంధవిశ్వాసాలపట్ల ఆగ్రహంతో పాటూ, పాటలలో ఉత్తమ సాహిత్యానికి, అత్యుత్తమమూ, సున్నితమూ అయిన భావప్రకటనకు ప్రాధాన్యం ఇవ్వటం కనిపిస్తుంది. ముఖ్యంగా విశ్వనాథ్ సినిమాలలోని పాటలలో సాహిత్యం ఉర్రూతలూగిస్తుంది. సినిమా పాట సాహిత్యం కాదన్నవారికి కనువిప్పు కలిగించే శక్తి కలవి విశ్వనాథ్ సినిమాల్లో పాటలు. ఏలుకుంటే పాట, మేలుకుంటే పాట అన్నా, నర్తనమే శివ కవచం, నటరాజ పాద సుమరజం అన్నా, ఫాలనేత్ర సంప్రభవత్ జ్వాలలు ప్రసవశరుని దహియించగా అన్నా, లలితలలితపద కలిత కవిత లత అన్నా, పున్నమిచంద్రునిలోనీ ఈ చిన్నీ, వెన్నెలై విరబూస్తుంది ఈ చిన్నీ అన్నా, నడిచే మబ్బులకు నవ్వే పెదవులు, నవ్వే పెదవులకు మువ్వల వేణువులూ, పెదవి తగిలితే చేదువెదుళ్ళూ కదలిపాడతాయా? అన్నా, గిరినందిని శివరంజని భవభంజని జననీ అన్నా, మునిజన మానస మోహిని యోగిని బృందావనం, మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం అన్నా, ఆరాణి పాదాల పారాణి జిలుగులో, నీ రాజ భోగాలు పాడనీ తెలుగులో అన్నా, నరుని బ్రతుకు నటన ఈశ్వరుని తలపు ఘటన అన్నా, ఒకటా? రెండా? విశ్వనాథ్ సినిమాల పాటల సాహిత్యంపై పలు పి.హెచ్.డిలు చేయవచ్చు. విశ్వనాథ్ సినిమాలలో సన్నివేశ సృష్టీకరణ, దృశ్య చిత్రీకరణ, తెరపై కనబడే దృశ్యాలు, వినిపించే మాటల వెనుక దాగిన భావనలు, ఇలా అనేకానేక అంశాలను విశ్లేషించవచ్చు. ముఖ్యంగా, సినిమాల స్థాయి అన్నిరకాలుగా దిగజారుతున్న తరుణంలో, ప్రజలివే చూస్తున్నారంటూ, తమ సృజనాత్మక రాహిత్య దోషాన్ని ప్రజలపై నెట్టేస్తూ సినిమా స్థాయిని దిగజారుస్తున్న సమయంలో, ఎలాంటి రాజీ పడకుండా, తాను నమ్మిన రీతిలో ఉత్తమ విలువలు పాటిస్తూ, ఉన్నతమైన ఆలోచనలను సమాజానికి అందిస్తూ విశ్వనాథ్ విజయం సాధించిన విధానాన్ని అందుకు కారణాలనూ, విశ్లేషిస్తే, భావి తరాల కళాకారులకు చక్కని మార్గదర్శనం లభిస్తుంది. తెలుగులో విజయం సాధించిన ‘సిరిసిరిమువ్వ’ హిందీలో ‘సర్గమ్’ గా విజయం సాధించింది. కానీ, తెలుగులో ఘన విజయం సాధించిన ‘శంకరాభరణం’, హిందీలో ‘సుర్ సంగం’గా మారి అంతగా విజయం సాధించలేదు. ఇందుకు కారణాలు తరచి చూస్తే అనేక నిజాలు బోధపడతాయి.
ఈ ప్రపంచంలో ఎంతటి గొప్పవాడిపైనైనా తనముందు తరం ప్రభావం వుంటుంది. విశ్వనాథ్‌పై కూడా వున్న ప్రభావాలను చర్చించాల్సివుంటుంది. ముఖ్యంగా హిందీ సినీ దర్శకుడు వి. శాంతారాం సినిమాల ప్రభావం గురించి విశ్లేషించాల్సి వుంటుంది. శాంతారాం జాతీయవాద దృక్పథం, సంస్కృతి సాంప్రదాయాలపై అభిమానం ఏ రకంగా విశ్వనాథ్ సృజనను ప్రభావితం చేసిందో పరిశీలించాలి. ముఖ్యంగా, పాటల సన్నివేశ సృష్టీకరణలో, పాటల్లో ఉత్తమ సాహిత్యం, సాంప్రదాయ రచనాశైలిలు తప్పనిసరిగా వుంచే శాంతారాం పట్టుదలలు గమనిస్తే ఒక తరం మరో తరాన్ని ప్రభావితం చేస్తూ సాగటం తెలుస్తుంది. అయితే, అన్ని రంగాలలో వున్నట్టే, సినీ రంగంలో కూడా, విశ్వనాథ్ తరువాత, అతను కొనసాగించిన ఉద్యమాన్ని ఎవరు అందిపుచ్చుకుని కొనసాగిస్తారో చూడాలి. హిందీ సినీరంగంలో శాంతారాంతో పాటే, అతని సినీ నిర్మాణ శైలి, దృక్కోణాలు అంతరించాయి. తెలుగు సినీరంగం అదే దారి పడుతుందో లేదో చూడాలి.
తెలుగు ప్రజలపై విశ్వనాథ్ ప్రభావం, సినిమాల ద్వారా ఆయన పొందుతున్న ప్రజల ప్రేమాభిమానాలు ఆయన మరణం తరువాత తెలుగు సినీ అభిమానులలో కనిపిస్తున్నాయి. ఒక వెల్లువలా ప్రజలాయనకు అర్పిస్తున్న నీరాజనాలను గమనిస్తే ఒక కళాకారుడు నిజాయితీగా తన ప్రతిభను ప్రదర్శిస్తే, సమాజం ఆయనను ఎంతగా అభిమానిస్తుందో తెలుస్తుంది.
విశ్వనాథ్ మరణ వార్త తెలియగానే రచయితలు తమ అభిమానాన్ని రచన రూపంలో ప్రకటించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈవారం సంచికలో విశ్వనాథ్‍కు నివాళిగా ప్రచురితమయిన వ్యాసాలను చూస్తే ఒక్క సూర్యుడు ఒక్కొక్కరికొక్కొక్క పోలిక తోచినట్టు, ఒక్క విశ్వనాథ్ అనే కళాకారుడిని ఒక్కొక్కరు దర్శించిన విధానం తెలుస్తుంది. ఒక కళాకారుడిని, అతని కళను అనుభవించటంలో, కళ సార్వజనీనమైనా, ఎవరి ప్రత్యేకత వారిదే అని అర్ధమవుతుంది. ఇలా ప్రతి ఒక్కరిలో విభిన్నమయిన ఆలోచనలను, స్పందనలను కలిగించే కళలను ఒక చట్రంలో బిగించాలన్న ప్రయత్నాలు ఎంత మూర్ఖమో, ఎంత అనర్ధదాయకమో అనిపిస్తుంది. సంచికకు తమ స్పందనను పంపించిన రచయితలందరికీ బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు!